వాస్తవాన్ని అంగీకరిద్దాం; మనలో చాలామంది పరిశుద్ధాత్మ పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. చిమ్మటలు లాగా, మనం ఆయన అగ్ని యొక్క వెచ్చదనం మరియు కాంతికి ఆకర్షితులవుతాము. ఆయనకు సమీపముగా ఉండాలని . . . ఆయన దగ్గరకు రావాలని, ఆయనను పరిపూర్ణంగా మరియు సన్నిహితంగా తెలుసుకోవాలని, ఆయన క్రియల యొక్క క్రొత్త మరియు ఉత్తేజపరిచే పరిస్థితుల్లోనికి ప్రవేశించాలనేది మన కోరిక . . . మానసికంగా క్రుంగిపోకుండా. ఇది నా విషయంలో నిజమని నాకు తెలుసు, మరియు మీరు తరచుగా అదే భావన కలిగియున్నారని నేను అనుమానిస్తున్నాను.
ఆత్మ మనలను పరిపూర్ణముగా మార్చడానికి ఆసక్తి కలిగియున్నాడు. అగ్నికి దగ్గరగా ఎగిరినప్పుడు అది ఆరంభమవుతుంది. ఆయన డజన్ల కొద్దీ వివిధ మార్గాల్లో పని చేస్తున్నాడు, వాటిలో కొన్ని అతీంద్రియమైనవి. అగ్నికి దగ్గరగా ఎగరడం వల్ల మనకు దాని గురించి బాగా తెలుస్తుంది. ఆయన తండ్రి చిత్తాన్ని తెలియజేయడానికి మరియు మనం యెటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ సంతృప్తి, ఆనందం, శాంతి మరియు సంతుష్టిని అనుభవించడానికి అవసరమైన శక్తిని అందించడంలో ఆసక్తి కలిగియున్నాడు. అగ్నికి దగ్గరగా ఎగరటం ఆ (మరియు అనేక ఇతర) అనుభవాలలోకి ప్రవేశించడానికి మనకు సరైన దృక్పథాన్ని ఇస్తుంది. మనము అగ్నికి దగ్గరగా వెళ్లే సమయం యిది కాదా?
ఇదేయని నేను అనుకుంటున్నాను, కానీ మనం అది చేసే ముందు మనం ఆత్మతో తిరిగి సాన్నిహిత్యం పొందుకోవాలి ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఆయన పని మరియు పరిచర్య గురించి అస్పష్టమైన భావన కలిగి ఉన్నారు. చాలామందికి, ఆత్మ ఇప్పటికీ దైవికమైనది “ఇది.” ఆయన “అది” కాదు; ఆయన ప్రతి విశ్వాసి జీవితంలో చురుకుగా పనిచేసే వ్యక్తి. ఆత్మ గురించి కొన్ని వాడిగల వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి:
- ఆయన దేవుడు – తండ్రి మరియు కుమారుడితో సమానమైనవాడు, సమానముగా ఉన్నవాడు మరియు సమనిత్యత్వముగలవాడు.
- ఆయన దైవత్వము యొక్క అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు.
- ఆయన విశ్వసించుచున్న పాపిని పునరుజ్జీవింప జేస్తాడు.
- ఆయన మనల్ని సార్వత్రిక క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మం ఇస్తాడు.
- ఆయన మారుమనస్సు పొందిన వారందరిలో నివసిస్తాడు.
- దేవుని కుటుంబంలో ప్రతి విశ్వాసిని సురక్షితంగా ఉంచుతూ ఆయన మనకు ముద్ర వేస్తాడు.
ఆత్మ నిరంతరం పనిచేస్తున్నప్పటికీ, చాలామంది (అవును, చాలామంది) మీకు మరియు నాకు తెలిసిన క్రైస్తవుల జీవితాలలో శక్తి లేదా ఆనందం చాలా తక్కువగా ఉన్నాయి. వారిని ఊరికే అడగండి. వారు భావాలు లేని పదాలు మరియు స్వస్థత లేని పోరాటాలతో కూడిన దేవునితో పైపై సంబంధానికి బదులుగా గంభీరత, ఆతురత, సంతృప్తికరమైన శాంతి మరియు స్థిరత్వం కోరుకుంటారు. సంఘ సమావేశాలు, బైబిల్ అధ్యయనం, మతపరమైన పదజాలం మరియు నియమితకాలిక ప్రార్థనల కంటే ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఇంకా ఏదో ఉంది. ఖచ్చితంగా దేవుని అద్భుతమైన ఆత్మ ప్రస్తుతం జరుగుతున్న దానికంటే మనలో ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాడు! ఆయన తొలగించాలనుకుంటున్న మచ్చలు ఉన్నాయి. ఆయన స్వస్థపరచాలనుకుంటున్న విరిగిన భావాలు ఉన్నాయి. ఆయన వెల్లడించాలని కోరుకునే అంతర్దృష్టులు ఉన్నాయి. ఆయన తెరవడానికి చాలా ఇష్టపడే జీవితం యొక్క లోతైన పరిమాణములు ఉన్నాయి.
ఆత్మ ఆదరించే సహాయకుడు. ఆయన సత్య-బోధకుడు, తండ్రి చిత్తమును బయలుపరచువాడు, బహుమానము ఇచ్చేవాడు, బాధను నయం చేసేవాడు. నా స్నేహితుడా, ఆయన దేవుని ఆర్పజాలని అగ్ని. ఆయన దేవుడు. ఆయనకు దూరంగా ఉండటం తప్పు కంటే ఘోరమైనది; ఇది పూర్తిగా విషాదకరమైనది. కాబట్టి, అగ్ని దగ్గరకు ఎగరటం, ఎంతో మంచిది; ఇది ఖచ్చితంగా అద్భుతమైనది.