ద్వేషం ఒక శక్తివంతమైన పదం. ద్వేషాన్ని మానుకోవాలని అలాగే అందరినీ మన శత్రువులను కూడా ప్రేమించాలనే క్రీస్తు ఆజ్ఞను పాటించాలని మనకు బాల్యము నుండే బోధించబడింది. అలాంటప్పుడు దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడని (మలాకీ 1:2–3), మలాకీ నుండి ఉటంకించిన పదాలను ప్రకటించిన పౌలు యొక్క మాటలు చదవడం ఆశ్చర్యంగా ఉంది. ప్రేమగల దేవుడు ఎలా ద్వేషించగలడు?
హీబ్రూ పదాలను పరిశీలించడం ద్వారా ఆరంభిద్దాం. “ద్వేషం” అని అనువదించగల రెండు పదాలను పాత నిబంధన ఉపయోగిస్తుంది: సానె (సాహ్-నెయ్) మరియు మాఆస్ (మా-ఆస్). అవి అర్థంలో మాత్రమే కొద్దిగా విభిన్నంగా ఉంటాయి. నిజానికి, పాత నిబంధన రచయితలు కొన్నిసార్లు వాటిని పరస్పరం మారుస్తూ ఉపయోగించేవారు. ఉదాహరణకు, ప్రవక్తయైన ఆమోసు ఇశ్రాయేలీయుల ఆరాధన పట్ల దేవుని అసహ్యతను వ్యక్తం చేయడానికి వాటిని ప్రక్కప్రక్కనే పెట్టి, ఇలా అన్నాడు, “మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను”(ఆమోసు 5:21, ఉద్ఘాటన జోడించబడింది).
సానె మరియు మాఆస్ ఏదో ఒకదానిపట్ల తీవ్రమైన భావోద్వేగ అసంతృప్తిని వ్యక్తం చేయుచుండగా–ఆదికాండము 37 లో యోసేపు యొక్క చరిత్రను చూడండి–ప్రాచీన తూర్పు దేశముల సంస్కృతులలో “ద్వేషించడం” అనేది భావోద్వేగాల కంటే ప్రాధాన్యతలతోనే ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఏశావు తన నిబంధన ఆశీర్వాదమును ఒక గిన్నెడు ఆహారం కొరకు జ్యేష్ఠత్వమును “తృణీకరించాడు” (ఆదికాండము 25:29-34). ఏశావుకు తన జ్యేష్ఠత్వమును గురించి తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలు లేవు-మనము ఈ పదాన్ని ఉపయోగిస్తున్న విధంగా అతను దానిని ఖచ్చితంగా “ద్వేషించలేదు.” వాస్తవానికి, అతను కోల్పోయినదాన్ని తిరిగి పొందుకోవడానికి అతను చాలా పోరాడాడు అయితే అతను విఫలమైనప్పుడు భరించలేకపోయాడు.
ఇంకా, క్రొత్త నిబంధనలో, తన శిష్యులు తమ ధనమును, తమ కుటుంబములను, తమ ప్రాణములను సహా “ద్వేషించాలి” అని యేసు అపేక్షించాడు (మత్తయి 6:24; లూకా 14:25; యోహాను 12:25). ఇతరులపట్ల క్రూరంగా వ్యవహరించమని ఆయన తన శిష్యులకు సూచించలేదు. మిగిలినవాటన్నిటికంటే శిష్యరికమును ఎంచుకోవడం అలాగే ఇతర సంబంధములన్నిటికంటే క్రీస్తును ఎంచుకోవడం, అంటే ప్రాధాన్యతయే అసలైన సమస్య.
కాబట్టి మలాకీ 1:2–3 మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుంది? మలాకీ గ్రంథము యూదా దేశానికి ఒక హెచ్చరిక, ఆయనకు అపవిత్రమైన బలులు అర్పించడం ద్వారా మరియు తమ కోసం శ్రేష్ఠమైన పశువులను ఉంచుకోవడం ద్వారా దేవాలయమును నీచపరచారు. ఏశావు తన జ్యేష్ఠత్వమును “తృణీకరించినట్లుగా,” యాజకులు తమ నిబంధన ఆశీర్వాదమును “తృణీకరించుచున్నారని” ఆయన ఆరోపించాడు. యాకోబు (అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది) మరియు ఏశావు (దీని వారసులు ఎదోము దేశాన్ని ఏర్పాటు చేశారు) కథను గుర్తుచేసుకోవడం ద్వారా, ప్రవక్త ఒక స్పష్టమైన సాదృశ్యాన్ని చూపించాడు:
- యాకోబు నిబంధనను ఎంతో అముల్యమైనదిగా భావించాడు. ఏశావు నిబంధనను తృణీకరించాడు.
- దేవుడు ఇశ్రాయేలును రక్షిస్తానని ప్రమాణం చేసాడు (ద్వితీయోపదేశకాండము 4:29-31; 30:1-10). దేవుడు ఇశ్రాయేలును శిక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు (యిర్మీయా 49:7–22; యెహెజ్కేలు 35).
మలాకీ కాలానికి, ఈ రెండు ప్రవచనాలు నెరవేరాయి. దేవుడు వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు యొక్క నమ్మకమైన శేషమును పునరుద్ధరించాడు; అయితే, వారు ఆత్మ సంతృప్తిగలిగి ఉండలేకపోయారు. వారి నిబంధన ఆశీర్వాదమును తృణీకరించడం ద్వారా, ఇశ్రాయేలీయులు ఏశావు యొక్క ప్రారబ్ధమును ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరో మాటలో చెప్పాలంటే, “ఇశ్రాయేలు, జాగ్రత్త వహించు. ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు గనుక ఎదోము దేవుని న్యాయమైన పరిత్యాగము పొందుకున్నది. మీరు మీ జ్యేష్ఠత్వమును తృణీకరిస్తే ఏమి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు?”
దేవుని “ద్వేషం”–ఒకరికంటే మరొకరిని ఎన్నుకునే ఆయన క్రియ-పూర్తిగా నీతిగలది మరియు పూర్తిగా న్యాయమైనది.