మీరు ఎలాగైనా చెప్పండి; అజ్ఞానం ఆనందించదగినది కాదు. మీకు నచ్చిన విధంగా దాన్ని అలంకరించండి; అజ్ఞానం ఆకర్షణీయమైనది కాదు. ఇది వినయానికి గుర్తు గానీ లేదా ఆధ్యాత్మికతకు మార్గం గానీ కాదు. ఇది ఖచ్చితంగా జ్ఞానానికి చెలికాడు కాదు.
దీనికి పూర్తి విరుద్ధంగా, అజ్ఞానం భయాన్ని, పక్షపాతాన్ని, మరియు మూఢనమ్మకాలకు పుట్టినిల్లుగా . . . ఆలోచించని జంతువుల కొరకైన దాణా తొట్టిలాగా . . . బానిసలకు శిక్షణా స్థలములాగా ఉంటుంది. ఇది గుడ్డిది మరియు నగ్నంగా ఉంది (టెన్నిసన్), మొండితనమునకు తల్లి (స్పర్జన్); ఇది నిరాశ కలిగించే చీకటిని తెస్తుంది (షేక్స్పియర్), ఎన్నడూ ఒక ప్రశ్నను పరిష్కరించదు (డిస్రేలీ), లేదా అమాయకత్వాన్ని ప్రోత్సహించదు (బ్రౌనింగ్). అయితే ఇది అపరాధికి ఇష్టమైన విన్నపంగా, సోమరి యొక్క సాకుగా, క్రైస్తవుని యొక్క అపరిపక్వత కొరకు హేతుబద్ధీకరణగా కూడా మిగిలిపోతుంది.
మనము ఆ ఉచ్చులో పడే సాహసం చేయకూడదు! మన ఆత్మీయ పూర్వికులు అందులో పడలేదు. వెనక్కి తిరిగి మోషే దగ్గర మీ వారసత్వాన్ని గుర్తుపట్టండి, అలాగే వెంబడించాల్సిన సరైన మార్గాన్ని వారు తెలుసుకొనులాగున మరియు వారి పిల్లలు తెలుసుకొనులాగున ప్రజలకు దేవుని గూర్చిన సత్యము వ్రాతపూర్వకంగా ఇవ్వబడినదని మీరు కనుగొంటారు. సమూయేలు రోజుల్లో, ప్రజలలో అజ్ఞానాన్ని తొలగించడానికి “ప్రవక్తల పాఠశాల” స్థాపించబడింది. తన శ్రోతలు జీవించడానికి అంతర్లీనంగా దాగియున్న సూత్రాలను చదువలేదని, తెలుసుకోలేదని యేసు తరచుగా మందలించడంతో ఈ తత్వశాస్త్రం క్రొత్త నిబంధనలోకి తీసుకువెళ్లబడింది. పౌలు ఇలాంటి బలమైన మాటలతో ఎంత తరచుగా ఇలాంటి నమ్మకాలను వ్యక్తం చేసాడు, “యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు” (రోమా 11:25; 1 కొరింథీయులకు 10:1; 12:1; 15:34; 1 థెస్సలొనీకయులకు 4:13). డాక్టర్ లూకా బెరియాలోని సంఘానికి గొప్ప ప్రశంసలను పొందుపరచాడు, ఎందుకంటే వారు “పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి” (అపొస్తలుల కార్యములు 17:11).
తెలివితో, అధికారముతో మరియు నమ్మకంతో దేవుని సందేశాన్ని ప్రకటించగల విద్యావంతులైన, బాగా శిక్షణ పొందిన దైవభక్తిగల వ్యక్తుల యొక్క సంస్థను నిరంతరీకరించుట కొరకు . . . చాలా దేశాలు జ్ఞానం కలిగి ఉండవలసిన అవసరాన్ని చూశాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న పురాతన ఉన్నత విద్యాసంస్థలు అటువంటి ప్రయోజనం కొరకే స్థాపించబడ్డాయి. ఆక్స్‌ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్, పారిస్‌లోని సోర్బోన్ గురించి ఆలోచించండి; అవి అజ్ఞానాన్ని తొలగించడానికి స్థాపించబడ్డాయి. అమెరికాలో కూడా లోతైన ఆలోచన యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదిగా ఉండేది. మీరు ఇప్పటికీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెళ్లటానికి తెరుచుకునే ఇనుప గేటు దగ్గర రాతితో చెక్కబడి ఉన్నదాన్ని చూడవచ్చు:
దేవుడు మమ్మల్ని న్యూ ఇంగ్లాండ్‌కు సురక్షితంగా తీసుకెళ్లిన తర్వాత
మరియు మేము మా ఇళ్లను నిర్మించుకొన్న తర్వాత
మా దైనందిన జీవితం కోసం అవసరమైన వాటిని పొందుకున్న తర్వాత
దేవుని ఆరాధన కొరకు అనుకూలమైన ప్రదేశాలను నిలువబెట్టుకున్న తర్వాత
మరియు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత
మా ప్రస్తుత పరిచారకులు మట్టిలో కలిసిపోయిన పిమ్మట
సంఘములకు నిరక్షరాస్య పరిచర్యను విడిచిపెట్టడానికి భయపడి
చదువును అభివృద్ధి చేయాలని
మరియు దానిని తరువాతి తరాలకు నిరంతరాయంగా అందించాలని
మేము వెనువెంటనే కోరుకున్న విషయాలలో ఒకటి
న్యూ ఇంగ్లాండ్ యొక్క ప్రథమ ఫలములు
కాలక్రమేణా, మానవతావాదం యొక్క సూక్ష్మ మత్తుమందు వేదాంత ఆలోచన యొక్క నాడీ కేంద్రాలను స్తంభింపజేయడం మరియు విద్యాతత్వాన్ని బలహీనపరచడం ప్రారంభించింది. సందేహం మరియు నిరాశ అనేవి నిశ్చయత మరియు నిరీక్షణను భర్తీ చేశాయి. ఖచ్చితమైన విద్యా అవసరాలు మరియు మేధో సమగ్రత యొక్క చక్రంపై మెరుగుపరచబడిన మానసిక క్రమశిక్షణ, వెనుకబడటం ప్రారంభించింది. మితిమీరిన స్వాతంత్ర్యము ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇది పోస్ట్ మాడర్న్ మనస్తత్వంగా పరిణామం చెందింది, ఇది ఇప్పుడు సత్యమునకు సమర్పించుకోవడాన్ని మరియు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడాన్ని ఒక వేళాకోళంగా భావిస్తుంది. దేవునికి వందనాలు, కొన్ని మినహాయింపులు ఉన్నాయి. కానీ ఆ విలువైనవి కొన్ని మాత్రమే . . . ముఖ్యంగా స్పష్టంగా ఆలోచించే సాధువులలో విలువైనవిగా ఉన్నాయి.
ఖచ్చితంగా చెప్పాలంటే, జ్ఞానం కలిగి ఉండటంతో ప్రమాదాలు ముడిపడి ఉన్నాయి. ప్రసంగిలో సొలొమోను చాలా ఘోరమైన దానిగురించి హెచ్చరించాడు–గర్వము–అలసిపోతూ, నిరర్థకముగా జ్ఞానమును అన్వేషించుట, మనస్సును మించిపోయే బుద్ధికి కారణమయ్యే శరీర పొరపాటు అవుతుంది. కేవలం మేధోసంపత్తి “గాలికై ప్రయాసపడుటయే” అవుతుంది (ప్రసంగి 1:17).
మా పరిచర్యకు ఉద్దేశ్యపూర్వకంగా ఇన్‌సైట్ ఫర్ లివింగ్ అని పేరు పెట్టాము ఎందుకంటే జ్ఞానం–ఆచరించడానికి, జీవితానికి అన్వయించుకోవడానికి ఉపయోగించబడుతుంది. మా నానా విధములైన పరిచర్యల కొరకు ప్రార్థించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. పరిచర్యలోని ప్రతి రంగము విస్తృతమైన వాస్తవ అవసరాలను చూపిస్తుంది . . . అలాగే ఈ అవసరాలను నేరుగా దేవుని వాక్యమునుండి ఆచరణాత్మక జ్ఞానంతో ఎలా తీరుస్తారో చూపిస్తుంది.
అది సరేగాని, మీ బైబిల్‌కు మంచి విద్యార్థిగా మీరు మారాలని నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ప్రోత్సహించవచ్చా? దాని గురించి బాగా తెలుసుకోండి. ఈనాటి కష్ట సమయాలను దానిలోని విషయాల గుండా చూడండి. మీరు దేవుని వాక్యాన్ని ఎంత బాగా తెలుసుకుంటే, మన పోస్ట్ మాడర్న్ పొగమంచును దాటుకొని మీ మార్గాన్ని కనుగొనడంలో మీకు సహాయపడే త్రోవను మీరు అంత త్వరగా గుర్తిస్తారు.
జ్ఞానము, విశ్వాసమునకు శత్రువుగా కాకుండా, మిత్రునిగా . . . బహుశా మన బలమైన మిత్రుడు అనే భావనను సమర్ధించాలనేది నా ఏకైక కోరిక. మీరు ఖచ్చితంగా చేయవచ్చు; బైబిల్ సత్యాన్ని తెలియబరచడంలో . . . అలాగే దాన్ని అన్వయించడంలో మేము ఎప్పటికీ శ్రేష్ఠతకు కట్టుబడి ఉన్నాము. అదే ఇన్‌సైట్ ఫర్ లివింగ్ యొక్క పరిచర్య.