పరిశుద్ధత భయానకముగా అనిపిస్తుంది. అది అలా ఉండవలసిన అవసరం లేదు, కానీ అది సగటు వ్యక్తికి అలానే అనిపిస్తుంది. మన ధోరణి ఏమిటంటే, పరిశుద్ధత ఎప్పుడూ విక్రయదారుని కార్యాలయంలోకి రాదని-ఖచ్చితంగా దూకుడు మరియు విజయవంతమైన వ్యాయామ క్రీడల శిక్షకుడికి రాదని అనుకోవడం. కాలేజీలో చదివే ఎవరోయొక విద్యార్థి లేక విద్యార్థిని గాని గొప్ప ఆర్థిక లక్ష్యాలను పెట్టుకొని తమ జీవనోపాధిమార్గాన్ని అన్వేషించేవారుగాని, లేదా బిజీగా ఉన్న ఉన్నత పాఠశాలలో చదువుచున్న యువకుడుగాని, లేదా చిన్న పిల్లల తల్లి పరిశుద్ధత గురించి ఆందోళన చెందరు. వాస్తవం మాట్లాడుకుందాం, పరిశుద్ధత అనేది ఒక మఠం యొక్క ఆశ్రమ గదులకు సంబంధించినది. దీనికి సంగీతపెట్టె నుండి సంగీతం, సుదీర్ఘ ప్రార్థనలు మరియు మతపరమైన శబ్దాలు అవసరం. ఇరవై ఒకటవ శతాబ్దం యొక్క వాస్తవ ప్రపంచంలో ఉన్నవారికి ఇది సముచితంగా అనిపించదు. రచయిత జాన్ వైట్ దీనితో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది.
మీరు ఎప్పుడైనా కలుషితమైన నదిలో చేపలు పట్టడానికి వెళ్లి పాత షూ, టీ కేటిల్ లేదా తుప్పుపట్టిన డబ్బాను బయటకు తీసారా? నా మనస్సు యొక్క మురికి లోతుల్లోకి పరిశుద్ధత అనే పదాన్ని నేను ఎరగా వేస్తే నాకు కూడా ఇలాంటివే చిక్కుతాయి. నేను ఇలాంటివారితో సహవాసం చేస్తే వచ్చేవి ఏమిటో చూసి ఆశ్చర్యపడ్డాను:
సన్నదనము
గుంటకళ్ళతో యెండుకొనిపోవుట
గడ్డము
చెప్పులు
పొడవాటి వస్త్రాలు
రాతి గదులు
కామం లేదు
హాస్యాలాడటం లేవు
వెట్రుకలతో చేయబడిన చొక్కాలు
తరచుగా చల్లని స్నానాలు
ఉపవాసం
గంటల కొద్దీ ప్రార్థనలు చేయటం
నిర్మానుష్యమైన రాతి ఎడారులు
ఉదయం 4 గంటలకే నిద్రలేవటం
శుభ్రమైన వేలుగోళ్లు
అద్దకము వేసిన అద్దం
స్వీయ అవమానం1
మీరు పవిత్రత గురించి ఆలోచించినప్పుడు ఆ మానసిక చిత్రాన్ని చూశారా? చాలా మంది చూసే ఉంటారు. పరిశుద్ధత అనేది సన్యాసులు, మిషనరీలు, ఆధ్యాత్మికవేత్తలు మరియు హతసాక్షుల ఆడంబరశూన్య సమూహం యొక్క వ్యక్తిగత సంరక్షణలా ఉంది. కానీ ఇందులో నిజమెంత మాత్రమును లేదు.
వాస్తవానికి, పరిశుద్ధత యువకుని జీవితానికి సంబంధించినదై ఉంటుంది. విక్రయదారుని కార్యాలయంలో పరిశుద్ధతకు స్థానం ఉంది. ఇది నవీనమైన, దూకుడుగా, విజయవంతమైన వ్యక్తి ప్రపంచంలోనూ తగినదే.
చక్ కోల్సన్ యొక్క ప్రకటనతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను: “పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవుడి రోజువారీ వ్యాపారం. ఇది మనం గంటకు గంటకు, రోజు రోజుకు తీసుకునే నిర్ణయాలు మరియు మనం చేసే పనులలో స్పష్టంగా సాక్ష్యమిస్తుంది.”2
పొగమంచు: నేటి నైతిక దృశ్యం యొక్క విశ్లేషణ
ఇంకాముందుకు వెళ్లేముందు, మనం కొంచెం వెనక్కి తగ్గి, ఈ రోజు నైతిక దృశ్యం గురించి మంచి అవగాహనకు వద్దాము. పొగమంచును చొచ్చుకుపోవడానికి కొంత ప్రయాసపడాలని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దపు ప్రవక్తయైన హబక్కూకు రచనలను చదివితే బహుశా మీకు సహాయపడతాయి. అతని పేరు తప్పుగా ముద్రించబడినట్లు ఉంది, కాదా? దీనికి పూర్తి భిన్నంగా, రాజీపడుతున్న రోజుల్లో ఈ మనిషి పరిశుద్ధతకు బలమైన స్వరముగా నిలిచాడు. బహుశా ఆ కాలానికి అనుకూలముకాని వ్యక్తేమో, కాని తప్పుగా ముద్రించబడినవాడు కాదు. మీరు అతని కాలంలో జీవించి ఉంటే, మీరు అతని బుద్ధి స్థిరత గురించి ఆశ్చర్యపడి ఉండేవారు! అతను “అందరితోపాటు కలిసి వెళ్లే” మనిషి కాదు. అతని ప్రపంచం భ్రష్టుపట్టిపోయింది, కాని అన్ని విషయాల్లోను వ్యక్తిగత స్వచ్ఛత ఉండాలని విశ్వసించాడు! ఎంత వింతగా ఉంది . . . అయినను ఎంత ముఖ్యమైనది! మనకు ఆయనతో పరిచయం ఉండకపోవచ్చు, కాని ఆయన కాలాలను మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటాము.
అతను నైతిక పొగమంచుతో చుట్టబడిన వ్యక్తి. అతని గ్రంథం పశ్చాత్తాపం కోసం ఒక పురాతనమైన పిలుపు. ఇది దైవిక జోక్యం కోసం దేవునికి పెట్టిన పరిశుద్ధమైన మొర. అలాగే ఇది కేవలం మొర మాత్రమే కాదు; ఇది కేక లాంటిది. అతను చెప్తున్నాడు:
యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను
నీవెన్నాళ్లు ఆలకింప కుందువు?
బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను
నీవు రక్షింపక యున్నావు. (హబక్కూకు 1:2)
అతను అనైతిక మరియు క్రూరమైన హింస చర్యలను చూశాడు. కాబట్టి, “ఎందుకు?” అని అడిగాడు. అతను “ఎంతకాలం?” అని కూడా అడిగాడు. దేవుని తక్షణ చర్య లేకపోవడంతో అతను తర్జనభర్జనపడ్డాడు. ప్రవక్త ప్రార్థించినప్పటికీ, దేవుడు అసాధారణ రీతిలో దూరమైనట్లు అనిపించింది. “ఎంతకాలం? ఎందుకు?” ఆకాశము ఇత్తడివలె ఉన్నది. “నువ్వు ఎందుకు నిర్ణయాత్మకంగా వ్యవహరించవు? మా పాత, కలుషితమైన ఈ ప్రపంచంలో నువ్వు నీ చేతులను చాచి ఏదోయొకటి ఎందుకు చేయవు? యెహోవా, నీ ప్రజలను విడిపించడానికి ఎంతకాలం పడుతుంది?” అతను ఇంకా అంటున్నాడు:
నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు?
బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు?
ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి,
జగడమును కలహమును రేగుచున్నవి.
అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను,
న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను,
భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు,
న్యాయము చెడిపోవుచున్నది. (1:3-4)
యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా,
ఆదినుండి నీవున్నవాడవు కావా?
మేము మరణమునొందము. (1:12a)
“నీవు పరిశుద్ధుడవని నేను అనుకున్నాను. నీవు పరిశుద్ధ దేవుడవు కావా? అలాంటప్పుడు నీవు చక్కగా కూర్చుని నా అపరిశుద్ధమైన ప్రపంచం గురించి యింత తక్కువ ఎలా చేస్తున్నావు?” “[హబక్కూకు] చెడ్డ ప్రపంచాన్ని పరిశుద్ధమైన దేవునితో సమాధానపరచలేకపోయాడు.”3
అతని ప్రపంచం ఎంత ఘోరంగా ఉంది? మనము ఇప్పుడే గమనించినట్లుగా, ఇది బలాత్కారముతో నిండిన ప్రపంచం (1:2). ఎంతలా అంటే ప్రవక్త మొఱ్ఱపెడుతూ ప్రార్థించాడు. ఇది దోషము మరియు బాధతో నిండిన ప్రపంచము (1:3). “నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు?” అబద్ధం, వ్యర్థము మరియు విగ్రహారాధన ఈ వాక్యంలో ఉన్నాయి. “బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు?” ఆ హీబ్రూ పదం అణచివేత, దోపిడీ మరియు దౌర్జన్యమును సూచించు అర్థమును కలిగి ఉంటుంది.
వీధుల్లో నరహత్య నేరాలు జరుగుతున్నాయి. “నీవు యూదా దేవుడవైన యెహోవా కాదా? నీవు ఈ దేశానికి దేవుడు కాదా? దేవా, నీవు ఎక్కడ ఉన్నావు?”
కలహాలు మరియు మనుష్యుల మధ్య గొడవలు జరిగాయి. ఇళ్లలో వాదనలు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య, అలాగే వైవాహిక భాగస్వాముల మధ్య పోరాటాలు, మరియు యజమానులు, ఉద్యోగుల మధ్య వివాదాలు ఉన్నాయి. మరియు మీరు మరొక సమయోచితమైన సమస్యను గమనించారా? ధర్మశాస్త్రము పాటించబడలేదు. ఒకవేళ పాటించబడినప్పటికీ, అందులో రాజీపడ్డారు. ఎలాంటి దృశ్యం! ఇది సుపరిచితముగా అనిపిస్తుంది: క్రూరమైన హింస, వ్యక్తిగత దోషము, బంధువుల మధ్య గొడవ, చట్టపరమైన రాజీ. హబక్కూకు ఏదోయొక అమెరికా మహానగరంలోని లోపలి ప్రాంతంలో నివసించారని మీరు అనుకుంటూ ఉండవచ్చు.
చాలా నెలల క్రితం నేను బాగా తెలిసిన పరిశుద్ధ గ్రంథ వ్యఖ్యానకర్త మాటలను వింటున్నప్పుడు నేను నవ్వుకున్నాను. అతను క్రీస్తుపూర్వం నాల్గవ, ఐదవ మరియు ఆరవ శతాబ్దాలను తీవ్రమైన అధ్యయనం పూర్తి చేశాడని చెప్పాడు. మరియు వాళ్ళు అప్పుడు యెటువంటి సమస్యలతో పోరాడారో వాటిని కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉన్నారు.
ఆ ప్రాచీన ప్రజలకు సంబంధించిన ఐదు సమస్యలను ఆయన ప్రస్తావించారు:
- అంతర్జాతీయ వైరం వ్యాపించడం ఖాయం;
- గృహాల విచ్ఛిన్నం-బలహీనమవుతున్న వివాహాలు;
- యువత యొక్క తిరుగుబాటు మరియు తల్లిదండ్రుల పట్ల లేదా వృద్ధుల పట్ల వారికి గౌరవం లేకపోవడం;
- రాజకీయాల్లోని అవినీతి-చిత్తశుద్ధిని మరుగునపడేశారు; మరియు
- రోడ్లపై గుంతలు!
ఎక్కడో వినినట్లుగా అనిపిస్తుందా? ఏదోయొకదానితో ఇది గుర్తించగలిగేదిలా ఉందని అనిపిస్తుందా? చరిత్రకు ఖచ్చితంగా పునరావృతమయ్యే సామర్థ్యము ఉంది!
అదే హబక్కూకు ఫిర్యాదును సమయానుకూలంగా చేస్తుంది. “దేవా! నీవు పరిశుద్ధుడవని నేను అనుకున్నాను! నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇది జరగడానికి నువ్వు ఎలా అనుమతించగలవు? నేను నైతిక కాలుష్యం యొక్క పొగమంచుతో చుట్టుముట్టబడ్డాను, దాన్ని పీల్చుకోలేక నేను విసిగిపోయాను. నా జీవితంలో దాని వ్యాధి ప్రభావంతో నేను విసిగిపోయాను. ఇంత అపరిశుద్ధమైన ప్రజల ప్రపంచంలో పరిశుద్ధమైన దేవుడు ఉన్నాడా అని నేను అనుమానిస్తున్నాను.” బహుశా అవి నీ మనోభావాలు కూడా కావచ్చు.
హబక్కూకు బిగ్గరగా మొఱ్ఱపెట్టాడు. యిర్మీయా అనే మరో ప్రవక్త నిశ్శబ్దంగా వెక్కివెక్కియేడ్చాడు. యిర్మీయా 6 లో నమోదు చేయబడిన అతని మాటలు నా మనస్సులో ఉన్నాయి. మరీ ఆలస్యంగా కాకపోయినా, అతను హబక్కూకు కంటే కొంచెం ఆలస్యంగా జీవించాడు. దేశ నాశనం విషయమై హబక్కూకు భయాందోళన చెందాడు గాని దేశం నాశనం కావడం చూడటానికి యిర్మీయా జీవించాడు.
అందుకే విలాపమునకు మరో పేరైన విలాపవాక్యములను అతను వ్రాశాడు. సముచితంగానే, యిర్మీయా “ఏడ్పుల ప్రవక్త” అని పిలువబడ్డాడు. అతను అరవడు. అతను పోరాడడు. అతను వాదించడు. అతను వెక్కివెక్కి యేడుస్తాడంతే. అతను తన కళ్ళ నుండి కన్నీళ్లు తుడుచుకుంటూ తన ప్రవచనాన్ని వ్రాస్తున్నాడు.
యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. (యిర్మీయా 6:8)
విందురని నేనెవరితో మాటలాడెదను?
ఎవరికి సాక్ష్య మిచ్చెదను?
వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. (6:10a)
అర్థం చేసుకోండి, పొగమంచులో నివసించినందుకు ఫలితం ఇది. వ్యవస్థ మీద దాని దుష్ప్రభావాన్ని పడుతుంది. మీ చెవులు నెమ్మదిగా మూసుకుపోతాయి, ఎంతలా అంటే, దేవుడు ఇచ్చే ఆత్మీయ సందేశాన్ని మీరు వినలేరు. “వారు వినలేరు.” యిర్మీయా చెప్పిన విధానాన్ని గమనించండి:
ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. (6:10b)
ఈ రోజుల్లో ఇది ఎలా అనిపిస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? “అయ్యో. . . ఆ విషయం నుండి బయటపడు! కాలంతోపాటు కదలవయ్యా! నాశనమును గూర్చిన ప్రవక్త మాటలు అంతా పాతకాలం నాటివి. ఇక్కడే లాభకరమైనది దొరికేది!” యిర్మీయా మాటలలో, “వారు దానియందు సంతోషములేనివారై,” అంటే పరిశుద్ధత గురించి నిజం వినడంలో సంతోషం లేదు.
కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను,
దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను. (6:11a)
“నేను ఉడికిపోతున్నాను. నేను మథనపడిపోతున్నాను . . . నేను చాలా అలసిపోయాను, ప్రభువా.”
అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు. (6:13a)
అది తెలిసినట్లుగా ఉందా?
మళ్ళీ, ఈ వాక్యాలు నైతిక పొగమంచులో నివసిస్తున్న జీవితాన్ని వివరిస్తాయి. లాభం కోసం నిరంతరం పోరాటం జరుగుచున్నది. మరింత పొందుకోవడానికి పోటీ ఉన్నది.
మరియు విషయాలను మరింత దిగజార్చడానికి:
ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు. (6:13b)
“ఇది న్యాయస్థానాలలో ఉండటం మంచిదికాదు, కానీ అది ఇప్పుడు పుల్పిట్స్‌లో ఉంది, ప్రభువా. ఈ ప్రదేశంలో నిలబడి నీ తరఫున మాట్లాడుతున్నాననేవారినే నేను నమ్మలేకపోవుచున్నాను. దేవుని కవచాన్ని ధరించుకున్నవారు ఇకపై నాకు నిజం చెబుతారని నేను ఖచ్చితంగా చెప్పలేను. వారు తప్పుగా వ్యవహరిస్తున్నారు. వారు నీ ప్రజల గాయాన్ని పైపైన మాత్రమే బాగు చేశారు,” అని యిర్మీయా విలపించాడు. అతనేమంటున్నాడో చూడండి! “సమాధానములేని సమయమున–సమాధానము సమాధానమని వారు చెప్పుచున్నారు! సమాధానము లేదు. ఏదీ సర్దుకోదు. కాని, ‘చింతించకండి. చింతించకండి. ఇది సర్దుకుంటుంది’ అని వారు అంటూనే ఉంటారు.”
మీరు ఏమీ అనుకోకపోతే, 15 వ వచనం చూడండి.
వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని
వారు ఏమాత్రమును సిగ్గుపడరు;
అవమానము నొందితిమని వారికి తోచనేలేదు.
నిజాయితీగా ఇప్పుడు, ప్రజలు అనైతిక జీవనశైలిలో చిక్కుకున్న చరిత్రలోని ఒక సమయం గురించి పరిశుద్ధ గ్రంథము మాట్లాడిందని మీకు తెలుసా? యిర్మీయా దుఃఖిస్తూ, “దేవా, సిగ్గుపడేవారు లేరని నేను గమనించాను. ఇక ఎవరూ విభ్రాంతి చెందడం లేదు.”
ఈ రోజు మనం దీనిని పరిహారం లేదా హేతుబద్ధం అని పిలుస్తాము. ప్రస్తుతం ఈ విభ్రాంతితో జాగ్రత్తగా వ్యవహరించాలంటే, విభ్రాంతినుండి విడుదల పొందటమే పరిహారం. నేను మరల చెబుతున్నాను, అది పొగమంచులో నివసించటంలో భాగమే.
సైకియాట్రిస్ట్ కార్ల్ మెన్నింగర్ పాపము ఎక్కడుంది మరియు దానికి ఏమైయ్యింది? అనే పుస్తకం వ్రాసినప్పుడు, ఒక ప్రవక్త యొక్క కలం పట్టాడు. ఆ పరిశోధించే పుస్తకంలో అతను ఇలా అంగీకరించాడు, “కామం అనే పాపమును గూర్చిన చర్చలో గత శతాబ్దంలో సామాజిక నియమావళిలో గణనీయమైన మార్పుకు మనము అనుమతించాలి. దీనిని ఒక విప్లవం అని పిలుస్తారు, బహుశా అదే అయ్యియుండవచ్చు. శతాబ్దాలుగా లైంగిక కార్యకలాపాల యొక్క అనేక రూపాలు ఎక్కడైనా ఖండించదగినవిగా, అనైతికమైనవిగా మరియు పాపాత్మకమైనవిగా పరిగణించబడ్డాయి, మరియు వాటి బహిరంగ ప్రదర్శన కేవలం అసహ్యకరమైనది. కాని అవే ఇప్పుడు వేదికపై మరియు తెరపై మాట్లాడబడుచున్నవి మరియు వ్రాయబడుచున్నవి మరియు ప్రదర్శించబడుచున్నవి.”4
జెర్రీ వైట్ రాసిన నిజాయితీ, నైతికత మరియు మనస్సాక్షి నుండి, నేను ఇలాంటి ఆందోళనను కనుగొన్నాను:
భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు జీవనశైలి స్వేచ్ఛ యుగంలో మనం జీవిస్తున్నాం. ప్రతి నగరంలో ఎక్స్-రేటెడ్ సినిమాలు మరియు పత్రికలు అందుబాటులో ఉన్నాయి. అశ్లీల చిత్రాలను నియంత్రించే చట్టం చాలా చోట్ల విఫలమైంది. నిన్నటి లైంగిక కల్పన నేటి వాస్తవికతగా ఉన్నది. సూపర్ మార్కెట్లలో ప్రదర్శించబడే మ్యాగజైన్స్ అవివాహిత జంటలు కలిసి జీవించే కథనాలను అందిస్తాయి. లైంగిక వాంఛ వివాహేతర వ్యవహారాలను సమర్థిస్తున్నాయి. తక్కువంటే తక్కువ యువత హైస్కూలు నుండి కన్యలుగా బయటకి వస్తున్నారు. ప్రైమ్-టైమ్ టెలివిజన్ స్వలింగసంపర్కతను మరియు అవిశ్వాసాన్ని డంబముగా చూపుచున్నది.5
ప్రపంచం మండుచున్నది అనే తన పుస్తకంలో, బిల్లీ గ్రాహం హార్వర్డ్‌లో గతంలో సోషియాలజీ ప్రొఫెసర్ పిటిరిమ్ సోరోకిన్‌ను ఉటంకిస్తూ ఇలా విచారపడ్డాడు:
సాంఘికంగా మురికివారు, నమ్మకద్రోహ తల్లిదండ్రులు మరియు ప్రేమించబడని పిల్లల విరిగిన గృహాలు, వేశ్య యొక్క పడకగది, వేశ్యాగృహ కర్మాగారము, నేరస్థుల గుహ, పిచ్చివారి వార్డు, నిజాయితీ లేని రాజకీయ నాయకుల గుంపు, వీధి మూలలో యువ నేరస్థుల ముఠా, ద్వేషపూరిత జైలు, నేరపూరిత ప్రదేశం, నిజాయితీ లేని న్యాయమూర్తి యొక్క న్యాయస్థానం, పట్టణీకరణ చెందిన అనాగరికమైనవారు మరియు అత్యాచారము చేసేవారి యొక్క లైంగిక సాహసాలు, మసోకిస్టులు, శాడిస్టులు, వేశ్యలు, ఉంపుడుగత్తెలు, ఆటగాళ్ళు, వ్యభిచారులు మరియు జారుల పట్ల మన రచయితల ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తికరమైన ప్రేమలు, కోర్కెలు వెంటనే తీర్చుకోవటం, భావప్రాప్తి, మరియు కామేచ్ఛలు సమ్మోహనముగా తయారు చేయబడి చక్కగా వడ్డించబడతాయి.6
మరియు యిర్మీయా యొక్క పరిశీలనను జోడిస్తే: ఇకపై ఎవరూ సిగ్గుపడరు. ఇదంతా నైతిక కాలుష్యంలో భాగం. . . పొగమంచు. వ్యవస్థ నమ్మరానిది కావచ్చు, కానీ అది ప్రభావవంతంగా ఉంటుంది.
ఈ రోజు ప్రతి ప్రధాన నగరంలో, టెలివిజన్ రిమోట్ తో లేదా కంప్యూటర్ మౌస్ క్లిక్ తో, ఎవ్వరైనా సరే చూడటానికి అశ్లీలమైన లైంగిక వాంఛను మీ ఇంటికి మీరు తీసుకురావచ్చు. మరియు ఎవరూ సిగ్గుపడరు.
అశ్లీల చిత్రాలను కనుగొనడానికి మీరు ఇకపై “పెద్దల” పుస్తక దుకాణంలోకి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇంట్లో ఆన్‌లైన్‌లో లేదా పనులమీద బయటకు వెళ్లినప్పుడు కిరాణా దుకాణాల్లో సులభంగా కనుగొనవచ్చు. మీరు ఎంతో దూరం చూడవలసిన అవసరం లేదు, అది అక్కడే ఉంది. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, ఎవరూ సిగ్గుపడరు.
వ్యక్తిగత పరిశుద్ధత పట్ల చిన్నచూపు యొక్క అంతిమ, స్పష్టమైన సంకేతం ఏమిటంటే, మనం తప్పు కనుగొన్నప్పుడు ఇకపై సిగ్గుపడము. బదులుగా, మనము దాని గురించి పరిహాసాలాడతాము. మనము అనైతికతను క్రొత్తగా ధరిస్తాము, అది నవ్వు పుట్టించేదిగా కనిపించేట్లు చేస్తాము. మనము ఒకవేళ నవ్వకపోతే, మనము లైంగికత్వానికి భయపడువారముగా . . . మనము విచిత్రమైనవారముగా . . . మనము చిరాకు పుట్టించేవారముగా పరిగణించబడతాము.
దాని గురించి నవ్వడం ఇష్టం లేదు నాకు యిష్టములేదు. ఎందుకంటే, పరిచారకునిగా, దాని పర్యవసానాలను నేను ఎదుర్కోవలసి వస్తుంది. ఎప్పుడూ నవ్వు పుట్టించేదిగా ఉండదు. ఇంద్రియసుఖ జీవనశైలి నుండి వెనుదిరిగే వ్యక్తులు అక్రమ లైంగిక వాంఛ యొక్క శాశ్వత ఆనందాల గురించి మాట్లాడటానికి నా దగ్గరకు మరియు నా సిబ్బంది దగ్గరకు రారు. వారు తమ కుటుంబం గురించి భయపడతారు; ఈ వ్యాధి గురించి వారు ఏమి చేయాలి; ఇంటిని ముక్కలు చేసే ఈ వావివరసల్లేని సంబంధంతో వారు ఎలా వ్యవహరించగలరు; వారి తల్లిదండ్రుల హృదయాలను బద్దలు చేస్తుందని తెలిసి కూడా వారు పెళ్ళికి ముందే గర్భవతి అని వారి తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి.
ఎంత ఘోరమంటే, ఇది లోకానికే పరిమితం కాలేదు గాని, నా పరిచయంలో నేను చెప్పినట్లుగా, ఇది ఇప్పుడు సంఘములో-ఏ ప్రదేశాన్నైతే చాలా మంది ప్రజలు పరిశుద్ధత యొక్క అంతిమ కోట బురుజుగా భావిస్తారో, అందులోనికి ప్రవేశించినది.
సత్యము: క్రైస్తవుల కొరకు దేవుని కాలాతీతమైన బోధన
నైతిక స్వచ్ఛత విషయానికి వస్తే దేవుడు సూటిగా మాట్లాడుతున్నందుకు నేను కృతజ్ఞుడను. ఆయన తన స్థానమునుండి తొట్రుపడనందుకు మారనందుకు కదలనందుకు నేను కృతజ్ఞుడను. ఆయన నవ్వనందుకు నేను మరింత కృతజ్ఞుడను. ఇదేదో ఆయన తన ప్రజలను సూటిగా కళ్ళలోకి చూస్తూ ప్రేమతో, అయినను దృఢముగా, “మీరు దీన్ని చాలా స్పష్టంగా వినాలని నేను కోరుకుంటున్నాను. నేను దీన్ని క్లుప్తంగా మరియు సరళంగా చేస్తాను” అని చెప్పినట్లుగా ఉంది. వ్యక్తిగత పరిశుద్ధతకు సంబంధించి ఒక నిర్ణయమును ఆయన మనకు సెలవిస్తాడు. ఒక్క నిర్ణయం మాత్రమే ఆయనను సంతోషపెడుతుంది-విధేయత.
పంతొమ్మిదవ శతాబ్దపు స్కాటిష్ వేదాంతవేత్త జాన్ బ్రౌన్ ఒకసారి ఇలా అన్నాడు: “పరిశుద్ధత అనేది ఆత్మీయ ఊహాగానాలు, ఔత్సాహికమైన ఉత్సాహాలు లేదా ఆజ్ఞాపించబడని నిరాడంబరతలో ఉండదు; దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించడం మరియు దేవుడు కోరుకున్నట్లుగా సిద్ధపడటం ఇందులో ఉంటుంది.”7
1 థెస్సలొనీకయులకు 4 వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు పాఠకుడిని అదే అడుగుతున్నాడు. 3 వ అధ్యాయం యొక్క చివరి భాగంలో మనం “ప్రభువునందు స్థిరముగా నిలిచి” (3:8) “బ్రదకటం” ఎలా అనే దానిపై ఒక పునాది మార్గదర్శకాన్ని రూపొందించినప్పుడు అతను తన గురి చూచాడు. అందులో ఏమి ఉంది?
మన తండ్రియైన దేవుని యెదుట మీహృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభివృద్ధిపొంది వర్థిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. (3:12–13a)
“పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా”-మన జీవితాలు ఉండటం ఎంత గొప్ప భాగ్యం! నమ్మకమైన జీవనం నేరుగా “అనింద్యముగా” ఉండటంతో ముడిపడి ఉంది. పరీక్షలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం, పుష్కలంగా డబ్బు కలిగి ఉండటం లేదా అధునాతన డిగ్రీ సంపాదించడం కంటే ఇది మంచిది. నిందారహితులముగా ఉండటం కంటే భద్రత మరొకటి లేదు. మనం పరిశుద్ధతలో స్థాపించడినప్పుడు, నైతిక స్వచ్ఛత యొక్క నిందారహిత జీవితాలను గడుపుతున్నప్పుడు, మనం జీవితాన్ని చూసి చిరునవ్వు చిందించవచ్చు. మనము దాని ఒత్తిడిని భరించి దాని ఆనందాలను ఆస్వాదించవచ్చు. ఆపై వివాహం జరిగినప్పుడు, మన జీవితభాగస్వామితో ఆనందించడమేగాక, లైంగికంగా ఆనందించు సంతోషములు కూడా దానిలో ఇమిడి ఉన్నాయి.
దాని గురించి తప్పు చేయకండి. వివాహిత భాగస్వాములు వివాహంలో ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని ఆస్వాదించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన దానిని మెచ్చుకుంటాడు. ఆయన ఎందుకు మెచ్చుకోకూడదు? ఆయన దానిని సృష్టించాడు. ఆయన వాక్యం స్పష్టంగా వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను-నిందారహితముగా (హెబ్రీయులకు 13:4) ఉండాలని పేర్కొంది. కానీ సూచించబడిన హెచ్చరిక స్పష్టంగా ఉంది: దేవుడు పెట్టిన ఉద్దేశము నుండి మనం శృంగారాన్ని దాని మూలమునుండి తొలగిస్తే, అది లైంగిక అనైతికత, కామ అభిరుచి మరియు అశుద్ధత అవుతుంది.
మీ నడకలో, అభివృద్ధినొందుడి!
1 థెస్సలొనీకయులకు 4:1-2
కాగా మీరేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. (4:2)
ఈ రోజు “అభివృద్ధి నొందుడి” అని చెప్పడానికి మనకు ఇతర మార్గాలు ఉన్నాయి: “దాన్ని ఎలాగైనా సాధించండి. మీ శక్తివంచన లేకుండా ప్రయత్నించండి. గాలికి ఎగరగొట్టబడినట్లు ఉండొద్దు; వెంబడించండి!” లేదా, చాలా మంది తల్లిదండ్రులు తరచూ చెప్పినట్లుగా, “కష్టపడండి!” పౌలు ఇలా అంటాడు, “మేము మీకు వ్రాసినట్లుగా మరియు మీ ముందు మాదిరిగా పనిచేసినట్లుగా, మీ నడకలో అభివృద్ధి నొందమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. కష్టపడండి! మీ జీవితంలో విజయాన్ని పొందండి. మధ్యస్థత యొక్క పొగమంచుతో పాటు కొట్టుకొనిపోవద్దు. ఇంకా ఎక్కువ చేయండి. అభివృద్ధి నొందుడి!”
మీరు సి గ్రేడ్ విద్యార్థి అయితే, బి గ్రేడ్ కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. మీరు జీవితంలో వెనుకబడి ఉండటానికి మొగ్గు చూపినట్లైతే, ఇప్పుడు మీ సాధారణ స్థాయికి మించి వెళ్ళే సమయం ఆసన్నమైంది. మీరు ఉత్సుకతను తెచ్చుకోవాలని నేను హెచ్చరించుచున్నాను. సోమరితనం వైపు ఉన్న ధోరణిని అధిగమించండి. అభివృద్ధి చెందాలంటే యింతేగాక ఇంకా చాలా ఉంది.
అభివృద్ధిచెందిన జీవనశైలిని సమర్థించేటప్పుడు, పౌలు నిరంతరం శ్రద్ధ వహించాల్సిన ఒక నిర్దిష్ట విభాగము మీద దృష్టి పెట్టాడు: నైతిక పరిశుద్ధత.
మీ నడతల్లో, దూరముగా ఉండండి!
1 థెస్సలొనీకయులకు 4:3-6
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము (4:3).
పౌలు మన ఆత్మీయ నడకకు సంబంధించి బలమైన మరియు భావోద్వేగమైన మాటలు రాశాడు. మనం అందులో అభివృద్ది చెందాలి. ఇప్పుడు అతను మన నైతిక జీవితాన్ని నిర్దేశిస్తాడు. ఎవరైతే తమ ఆత్మీయ నడకలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వారు వాస్తవికమైన అంతర్గత యుద్ధాన్ని అంగీకరించాలి: లైంగిక దురాశ. అవును, ఇది ఒక యుద్ధం . . . మనము యాభై ఏళ్ళు నిండినప్పుడు అకస్మాత్తుగా ఆగని దుర్మార్గమైన, శక్తివంతమైన, కనికరంలేని పోరాటం. మరియు మనము మన సహచరుడిని కోల్పోవచ్చు కాబట్టి ఇది అంతం కాదు. మన భౌగోళిక మార్పుల వల్ల లేదా మనం బాగా చదువుకున్నందువల్ల లేదా జైలు గోడల వెనుక మనం ఒంటరిగా ఉండడం వల్ల లేదా మనం పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల లేదా మనం పరిచర్యలో ప్రవేశించినందున అది తగ్గదు. నైతికంగా పరిశుద్ధంగా ఉండటానికి జరిగే పోరాటంలో ఎవ్వరూ మినహాయింపు కాదు. మీరు కూడా! దేవుడు ఇక్కడ ఏమి చెబుతున్నాడో మనం అర్థం చేసుకుందాం.
“ఇది దేవుని చిత్తం.” చాలా అరుదుగా అలా సూటిగా మాట్లాడటం మీరు లేఖనంలో కనుగొంటారు. నైతికంగా పరిశుద్ధంగా ఉండటానికి, అది దేవుని చిత్తమేనా అని దాని విషయమై మీరు ప్రార్థన చేసి అడగాల్సిన అవసరం లేదు. “జారత్వమునకు దూరముగా ఉండుట . . . దేవుని చిత్తము.” జారత్వము అనే పదం పోర్నియా అనే గ్రీకు పదం నుండి అనువదించబడింది. సహజంగానే, పోర్నోగ్రఫీ లేదా పోర్నోగ్రఫిక్ అనే పదాలు ఈ గ్రీకు మూల పదం నుండి వచ్చింది. ఇది ఒకరి వైవాహిక భాగస్వామిని కాకుండా వేరే వ్యక్తిని ఏ విధమైన సన్నిహిత, లైంగికంగా కలుసుకోవడాన్ని సూచిస్తుంది. ఇది వ్యతిరేక లింగానికి లేదా స్వలింగానికి సన్నిహితంగా ఉండటాన్ని తప్పక సూచిస్తుంది. వివాహేతర సంబంధం, వ్యభిచారం లేదా స్వలింగ సంపర్కం పోర్నియాలో చేర్చబడతాయి. దూరంగా ఉండాలనే ఆదేశం స్పష్టంగా మనకివ్వబడింది. దూరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏమిటంటే-దూరంగా ఉండాలి. వివాహమునకు వెలుపల, ఇతరులతో లైంగిక సంబంధాలు కలిగియుండవద్దు.
ఇప్పుడు మానవ స్థాయి పొగమంచులో, మీకు ఎన్నో ప్రత్యామ్నాయములు ఉంటాయి. మీరు విచక్షణ కలిగి ఉండాలని కొందరు చెబుతారు, కాని ఖచ్చితంగా మానుకోండి అని చెప్పరు. “నా ఉద్దేశ్యమేమంటే, దీని గురించి మరీ అత్యాశ కలిగియుండవద్దు.” కొంతమంది ఈ విధంగా మీకు సలహా ఇవ్వవచ్చు, “మీరు వేరొకరి సహచరుడితో ఆడుకోవడం ప్రమాదకరం, కాబట్టి అలా చేయవద్దు. మరియు, ఖచ్చితంగా, మీరు వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించాలి.”
ఒక్కసారి ఆగండి. దూరంగా ఉండుడని లేఖనములో ఉన్నదంటే, దానికి “జాగ్రత్తగా ఉండండి” లేదా “విచక్షణ కలిగి ఉండండి” అని అర్థం కాదు. దానితో “సంబంధమేమియు లేదు” అని అర్థం. ఇతరుల సలహా కొనసాగుతుంది: “మీరు మీ కుటుంబంలోని వ్యక్తితో సహజీవనం చేయడం అవివేకం. అది అశ్లీలత.” (ఇది అనారోగ్యమే కాదు, చట్టవిరుద్ధం కూడా.) “మీరు ఉపాధ్యాయులైతే, మీరు మీ విద్యార్థులతో సన్నిహితంగా ఉండకూడదు. ఇది వృత్తిపరంగా తెలివైనది కాదు, కాబట్టి అలా చేయవద్దు ”అని కొందరు హెచ్చరిస్తారు. కానీ మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను: మనం దూరంగా ఉండటం దేవుని చిత్తమని లేఖనము స్పష్టంగా చెబుతుంది. నైతిక పరిశుద్ధత అనేది జాగ్రత్తగా ఉండటమే కాదు, దూరంగా ఉండటం.
మన పరిశుద్ధ దేవుని దృష్టిలో మనం ఎక్కడ నిలబడ్డామో తెలుసుకోవడం ఎంత ఉపశమనం కలిగిస్తుంది! ఇప్పుడు, చాలా నిర్దిష్టంగా ఉందాం: మీరు వివాహం చేసుకోకపోతే, మీకు లైంగిక మినహాయింపులు లేవు. వివాహం వరకు మీరు మరే వ్యక్తితోనూ లైంగిక సంబంధం కలిగి ఉండకూడదనేది దేవుని చిత్తం. ఇక్కడ మరియు ఇతర చోట్ల లేఖనం యిదే బోధిస్తుంది. ఇలానే మనం విధేయతతో నడవాలి. ఇది దేవుని మీకొరకు ఏర్పరచబడిన ఉత్తమమైనది. ఇంకా, ఇది మన మంచి కోసమే, అలాగే అది దేవుని మహిమను పెంచుతుంది.
మనం కేవలం ఆజ్ఞతో మాత్రమే విడిచిపెట్టబడలేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 4 మరియు 5 వ వచనాలలో విపులీకరించబడిన బోధన ఉన్నది:
మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
నైతిక అపరిశుద్ధతకు దూరంగా ఉండటం దేవుని చిత్తం. అది ఎలా చేయాలో మనం తెలుసుకోవడం అనేది కూడా ఆయన చిత్తమే. లైంగిక కామంతో మీ యుద్ధాన్ని ఎలా నిర్వహించాలో తెలుసుకోవటానికి మీకు మీరే విద్యార్థి కావాలని నేను సూచిస్తున్నాను. తమను తాము తెలుసుకోవడంలో విఫలమైన వారు యుద్ధంలో ఓడిపోతారు మరియు చివరికి కామానికి బానిస అవుతారు. ఒకరు “తన సొంత ఘటమును కాపాడుకోటానికి,” ఒకరి స్వంత ధోరణుల గురించి ఆచరణాత్మక, పని యొక్క పరిజ్ఞానం ఉండాలి.
కోర్సులో ఉత్తీర్ణత సాధించడానికి విద్యాపరంగా మీరు ఏ విధమైన విద్యార్థి అని మీకు తెలుసు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, కోర్సును పూర్తిచేయడానికి మరియు డిగ్రీ లేదా డిప్లొమా పొందటానికి మీకు తెలిసిన వాటిని మీరు అనువర్తించుకోవాలి, అంతేకదా? మీ సన్నిహిత జీవితంలో, జ్ఞానం యొక్క మరొక సమాన శ్రద్ధగల అనువర్తనం ఉండాలి. మనలో ప్రతి ఒక్కరూ “తన సొంత ఘటమును ఎలా కాపాడుకోవాలో” తెలుసుకోవడం లేదా ఒకరి స్వంత శరీరంలో పరిశుద్ధతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవాలి.
విషయం ఏమిటి? పోర్నీయాకు దూరంగా ఉండటానికి, మన శరీరాల గురించి మనం అప్రమత్తంగా మరియు క్రమశిక్షణతో కూడిన విద్యార్థులుగా తయారవ్వాలి-అవి ఎలా పనిచేస్తాయి, వాటికి ఏవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి మరియు వాటిని ఏవి బలహీనపరుస్తాయి అలాగే బలపరుస్తాయో తెలుసుకోవాలి. మన అంతర్గత కోరికను ఎలా నియంత్రించాలో, దానిపై జయము ఎలా పొందాలో మరియు కామ కోరికలకు లొంగకుండా స్వచ్ఛమైన జీవితంలో మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకోవాలి.
ఆచరణాత్మక మాటలలో పెట్టడం ద్వారా ఎవరూ తప్పుగా అర్థం చేసుకోలేని విధముగా నన్ను విపులీకరించనివ్వండి. మీడియాలో, మీరు నేను నియంత్రించలేని కొన్ని విషయాలు ఉన్నాయి. దానిని అంగీకరించడానికి మరియు ఇంద్రియ సుఖాన్ని రేకెత్తించేవి కొన్ని మనల్ని బలహీనపరుస్తాయనే వాస్తవాన్ని ఎదుర్కోవటానికి మనల్ని మనం బాగా తెలుసుకోవాలి. మేము ఆ విషయాలను సహించి స్వచ్ఛంగా ఉండలేము. స్పష్టమైన ముగింపు ఇది: వాటిలో నడిస్తే మనం తప్పు చేసినట్లే. మీరు మరియు నేను చదవకూడని కొన్ని పత్రికలు ఉన్నాయి. మేము సందర్శించకూడని కొన్ని వెబ్ సైట్లు ఉన్నాయి. కొన్ని సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు మరియు అర్ధరాత్రి ఛానెల్‌లు ఉన్నాయి, వాటితో మనకు యెటువంటి సంబంధం లేదు. తమ అసభ్యకరమైన సంభాషణ ద్వారా మనల్ని బలహీనపరిచే కొంతమంది వ్యక్తులు ఉంటారు. మనల్ని బాగా శోధించే పరిసరాలు, మరీ లోతైన స్పర్శలు, మరియు మనం నియంత్రించలేని స్వేచ్ఛలు ఉన్నాయి. వాటితో పరాచకములాడితే మనం మూర్ఖులమే. అవి మనం నియంత్రించలేని ఆకర్షణీయమైన ప్రలోభాలను సృష్టిస్తాయి. కాబట్టి, మనము దూరంగా ఉండటానికి కట్టుబడి ఉంటే, మనము వాటికి దూరంగా ఉంటాము.
ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టం మరియు అమలు చేయడం మరింత కష్టం, కానీ “పరిశుద్ధతయందును ఘనతయందును [మన ఘటములను] ఎలా కాపాడుకోవాలో” మనం తెలుసుకోవడం దీనిలో భాగమే. దీన్ని గుర్తుంచుకోండి: ఎవరూ స్వతస్సిద్ధంగా నైతికమైన స్వచ్ఛతతో ఉండరు. లైంగిక అనైతికతకు దూరంగా ఉండటం కష్టం. అది ఎన్నడూ తేలికగా రాదు, వస్తే అంత తేలికగా పోదు. నేను ఇంతకు ముందే చెప్పినట్లు, ఇది ఒక యుద్ధం. మనము యుద్ధమును గూర్చి మాట్లాడుతున్నాము!
లైంగికంగా ఉత్తేజపరిచే కార్యకలాపాల రంగంలో యుద్ధం రేగుతుంది. కొన్ని పార్టీలు, ప్రదేశాలు, కొన్ని రకాల సంగీతం మరియు కాలక్షేపాలు కూడా మనల్ని బలహీనపరుస్తాయి. మనము ఆ విషయాలను సహిస్తే మూర్ఖులమే. మద్యపానం నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి బార్ పైన రెండవ అంతస్తులో నివసించడానికి ఎంచుకుంటే అతను ఓడిపోయిన యుద్ధంలో పోరాడుతున్నాడని తెలుసుకుంటాడు. దాని గురించి వేరే ప్రశ్నే లేదు, అది వైఫల్యానికి దారి తీస్తుంది. ఇంకా చాలా ఉంది:
ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు. (4:6)
కొంతమంది లైంగికంగా దూరంగా ఉండటాన్ని గూర్చి యుక్తిగా ఇలా అంటారు: “సరే, మనం దీన్ని కుటుంబంలో దాచి ఉంచడమే మనం చేయగలిగినది. ఇది ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య లేదా క్రైస్తవుల మధ్య ఉంటే ఫర్వాలేదు.” కానీ అతను ఇక్కడ కూడా మనల్ని కదలనివ్వకుండా బలవంతం చేస్తాడు. “ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు,” అని అతను జోడిస్తాడు.
ఈ వచనం దేవుని కుటుంబంలోని సభ్యులను మాత్రమే కాకుండా వ్యక్తిగత కుటుంబ సభ్యులను కూడా సూచిస్తుంది-ఒకరి కుమార్తె లేదా కోడలు, కొడుకు లేదా అల్లుడు, తల్లి, సవతి తల్లి, తండ్రి, సవతి తండ్రి, మరియు అశ్లీలత యొక్క మొత్తం రంగాన్ని కవర్ చేస్తుంది. ఇలాంటి అసభ్యకరమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మన కుటుంబ సభ్యులను మోసం చేస్తాయి!
ఇప్పుడు దానిని బాధాకరంగా సూటిగా చెప్పాలంటే: వివాహేతర సంబంధం, స్వలింగ సంపర్కం మరియు వివాహానికి వెలుపల ఉన్న వ్యక్తులతో లైంగిక సంపర్కానికి వ్యతిరేకంగా దేవుడు స్పష్టంగా మరియు నిస్సందేహంగా నిలుస్తాడు. నేను పునరావృతం చేస్తున్నాను, ఆజ్ఞ సూటిగా ఉన్నది మరియు నిశ్చితాభిప్రాయంగలది: “జారత్వమునకు దూరంగా ఉండుడి.”
నేను దీనిని వ్రాస్తున్నప్పుడు, నేను మాత్రమే ఈ విషయాలు చెప్పడం లేదని నేను గ్రహించాను. కానీ, నేను అంగీకరిస్తున్నాను, కొన్నిసార్లు నేను మా రోజులో ఒంటరి గొంతులా భావిస్తాను. మరియు కొన్ని దృష్టాంతాలు పుకార్లుగా కనబడటం వలన, నేను వేరొకరివి ఉపయోగించకూడదని అనుకున్నాను, కాని నన్ను నేను ఒక ఉదాహరణగా ఎంచుకుంటాను. నా కథ మీకు చెప్పడానికి నన్ను అనుమతించండి.
నా భార్య మరియు నేను 1955 జూన్‌లో వివాహం చేసుకున్నాము. మేమిద్దరం చాలా చిన్నవాళ్ళం. నేను నా పాఠశాల విద్యను పూర్తి చేసి, ఆపై నా సైనిక బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరాన్ని ఎదుర్కొన్నాను. 1950 లలో, మిలిటరీ ఎంచుకోవడానికి ఒక కోరిక కాదు, కానీ నెరవేర్చవలసిన ఆవశ్యకత ఉంది. వారికి అందుబాటులో ఉండవలసిన సమయం నా ప్రత్యేక పరిస్థితులకు బాగా సరిపోతుంది కాబట్టి, నేను మెరైన్ కార్ప్స్ ను ఎంచుకున్నాను . . . నైతిక స్వచ్ఛత ఆ దుస్తులకు తెలియదు.
నేను చేరితే విదేశాలలో నా మిలటరీ డ్యూటీకి సేవ చేయనవసరం లేదని నా నియామక అధికారి నుండి వాగ్దానం అందుకున్నాను. నేను వివాహం చేసుకున్నాను గనుక, అది ఖచ్చితంగా నాకు ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే నేను నా వధువుతో జీవితాన్ని ఆనందిస్తున్నాను, మరియు ఒకరినొకరం బలవంతంగా వేరుచేయబడటం మా చివరి కోరిక. నేను నిజంగా ఆమెతో ఉండాలని కోరుకున్నాను. కానీ, వివరించడానికి సుదీర్ఘముగా ఉన్న సంఘటనల పర్యవసానాల వలన, నేను ఇంటి నుండి ఎనిమిది వేల మైళ్ళ దూరానికి వెళ్లవలసి వచ్చింది. ఒక సంవత్సరానికి పైగా తూర్పు తీరంలో బస చేశాను, నాకు తెలియని విధంగా అకస్మాత్తుగా లైంగిక ప్రలోభాలకు గురయ్యాను.
ఒకినావా ద్వీపంలో నేను నా సామాను సంచిని భుజం మీద నుండి పడవేసే ముందు, నేను కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి బలవంతపెట్టబడ్డాను. నేను పాపిష్ఠియైన జీవనశైలితో వర్గీకరించబడిన బారక్‌లో నేను జీవించబోతున్నాను. సుఖ వ్యాధులు ద్వీపంలో ఉన్నవారిలో సర్వసాధారణం. గ్రామంలో ఒక మహిళతో నివసించడం దక్షిణ కాలిఫోర్నియాలో పొగమంచు పీల్చినంత సాధారణం. మీరు ఒకినావాలో నివసించినట్లయితే, మీరు శయనించినట్లే. స్వచ్ఛత గురించి క్రొత్తగా నియమించబడిన మెరైన్స్ కు ఉపన్యాసం చేయాల్సిన చాప్లిన్ చివరికి మొత్తం అంతా చెప్పి ఎగతాళి చేయడం మరియు పెన్సిలిన్ షాట్లు పొందడానికి ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్పడం అసాధారణం కాదు. వాస్తవ ప్రపంచానికి స్వాగతం, స్విన్డాల్.
వివాహంలో సాన్నిహిత్యం యొక్క ఆనందాలను నేను తెలుసుకున్నందున, ఆ ప్రలోభం చాలా బలంగా ఉంటుందని నేను గ్రహించాను. నా ఇంటి నుండి దూరంగా మరియు నా భార్య మరియు నా కుటుంబానికి శారీరక జవాబుదారీతనం లేకుండా, దేవుని విషయాల గురించి తక్కువ శ్రద్ధ వహించిన పురుషుల చేత చుట్టబడి, నేను త్వరలోనే ఓకినావన్ గ్రామాల వెనుక వీధుల్లో పేరులేని మరో మెరైన్ అవుతాను. కానీ నేను క్రైస్తవుడిని. “జారత్వమునకు దూరంగా ఉండాలని” నేను అప్పుడే అక్కడే నిశ్చయించుకున్నాను. నా ప్రభువు యొక్క నిరంతర బలం కోసం నేను ఆయనను ఎలా స్తుతించుదును!
దేవుని దయవల్ల, 1950 ల చివరలో నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఆత్మవిశ్వాసంతో మాట్లాడటానికి మరియు వ్రాయడానికి నన్ను అనుమతిస్తుంది. నేను నమ్మకద్రోహం నుండి రక్షించబడకపోతే, ఈ వాక్యభాగం మరియు లేఖనములోని సారూప్య విభాగాలను నేను తొందరపడి మరియు ఇబ్బందికరంగా దాటివేయవలసి వచ్చింది. నేను లైంగిక కామంలో పడి ఉంటే నేను పరిచర్యను కొనసాగిస్తానని అస్సలు అనుకోలేదు.
నిజాయితీగా, నా మీద నేను కఠినంగా ఉండాల్సి వచ్చింది. నా భావోద్వేగాలతో నేను క్రూరంగా ఉండాల్సిన సందర్భాలు ఉన్నాయి. నేను కొన్ని కఠినమైన, స్పార్టన్ నిర్ణయాలు . . . నన్ను ప్రలోభపెట్టడానికి పుస్తకంలోని ప్రతిదాన్ని ప్రయత్నించిన కుర్రాళ్ళలో జనాదరణ లేని నిర్ణయాలు తీసుకోవలసి వచ్చింది. చిత్తశుద్ధి ఉన్న సందేశంతో ఆ తోటి మెరైన్‌లను చేరుకోవడానికి నేను భిన్నంగా ఉండాలని నిశ్చయించుకున్నాను.
మీరు తప్పుగా అర్ధం చేసుకోకుండా ఉండుటకు ఒక విషయం నన్ను స్పష్టం చేయనివ్వండి. బంగారు చేప గిన్నెను శుభ్రం చేయడం నా పని కాదని దేవుడు నాకు చూపించాడు; చేపలు పట్టడం నా పని. తూర్పు తీరానంతటా నైతిక స్వచ్ఛత కోసం జెండా ఊపుతూ మత యుద్ధానికి నాయకత్వం వహించడానికి నన్ను పిలవలేదు. మరెవరైనా చేసినా, చేయకపోయినా శుభ్రంగా జీవించడం నా పని. పచ్చిగా చెప్పాలంటే, నా భార్య కాని వ్యక్తిపై చేయి వేయకూడదు. నేను అలాంటి విషయాల గురించి మాట్లాడకూడదు. ఈ రోజు నేను ఈ మాటలు వ్రాసేటప్పుడు అనుభవం నుండి మాట్లాడగలను: జారత్వమునకు దూరంగా ఉండటం పనిచేస్తుంది. ఇది గొప్ప మరియు సంతృప్తికరమైన లాభాన్ని తెచ్చిపెడుతుంది. యువ, ఎర్రటి నెత్తురు కలిగిన మెరైన్ జీవితంలో కూడా ఫలితం ఇవ్వడానికి అంతులేని అవకాశాలతో . . . ఇది పనిచేస్తుంది.
నేను జారత్వమునకు దూరంగా ఉంటే, ఆయన దానిని ఘనపరుస్తాడని దేవుడు నాకు స్పష్టం చేశాడు. మరియు ఆయన ఆత్మ పదే పదే నన్ను రక్షించటానికి వచ్చాడు. నాకు బలం మీద నియంత్రణ లేదు. ఈ మాటలు చదువుచున్న ఎవరికైనా ఇప్పుడే అర్థమవుతున్నట్లు నేను తరచూ శోధన మార్గంలో ఉన్నాను, కాని నేను లొంగడానికి నిరాకరించాను. అవి దాదాపు పద్దెనిమిది నెలలు ఇంటి నుండి దూరంగా ఉన్న ఒంటరి రోజులు. నా భార్య కొరకైన కోరికతో నేను తరచూ మండిపోయాను. నేను జారత్వమునకు దూరంగా ఉండటానికి కట్టుబడి ఉన్నాను. అందుకు దేవునికి వందనములు.
నేను అది ఎలా చేయగలిగాను? ఆరోగ్యకరమైన విషయాలు, జయకరమైన విషయాలు, నన్ను బిజీగా, చురుకుగా మరియు సంపూర్ణముగా ఉంచే విషయాలలో నేను పాల్గొన్నాను. నేను అనేక వాయిద్యాలలో మరింత నైపుణ్యం పొందడం ద్వారా నా సంగీత సామర్థ్యాలను పెంచుకున్నాను. నేను కూడా దూకుడుగా క్రీడా సంబంధ కార్యక్రమంలో పాల్గొన్నాను, నా ఖాళీ సమయాన్ని ఎక్కువ సమయం అదే ఆరోగ్యకరమైన లక్ష్యాలకు కట్టుబడి ఉన్న పురుషులతో గడిపాను. నా మనస్సులో, గ్రామం నా దరిదాపుల్లో లేదు. నేను పల్లెటూరి సారాకొట్టులో శీతల పానీయం కూడా తీసుకోలేదు. అది నావల్ల కాదు. నన్ను నా గమ్యస్థానానికి తీసుకెళ్లిన బస్సు దిగినప్పుడు, నేను సూటిగా చూస్తూ వేగంగా నడిచాను. ఆ చిన్న ద్వీపంలో శారీరకంగా ఆకర్షణీయమైన మహిళలు మరియు ఐదువేలకు పైగా వ్యభిచార ప్రదేశాలు ఉన్నాయి. నేను వారిలో ఒక్కరిని కూడా తాకలేదు. సహజంగానే, నేను వారిని చూశాను. . . కానీ నేను లొంగడానికి నిరాకరించాను.
ఒకసారి నేను విరిగిపోతే, ఒకసారి నేను ఆ ఇంద్రియ సుఖ ప్రపంచంలోకి అడుగుపెడితే, నేను ఆగనని నా హృదయంలో నాకు తెలుసు. ఒకసారి నేను లొంగితే నాలో ఉన్న కోరికను ఆపలేనని నాకు తెలుసు. మరియు నేను దానిని ఆపడానికి కూడా ఇష్టపడను. ఇది ప్రత్యేకమైన ఆహారాన్ని అతిక్రమించడం లాంటిది. మీరు సంయమనాన్ని తొలగించిన తర్వాత, “ఎవరు పట్టించుకుంటారు?” అని చెప్పడం చాలా సులభం. భోజనం తర్వాత మీరు కొద్దిగా చాక్లెట్ కేక్ తింటే, ఆ రాత్రికి అది సరిమైన ప్రణాళిక కాదు!
బహుశా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, “అది నన్ను ఎగతాళి చేస్తుంది, ఎందుకంటే నా జీవనశైలి అలా లేదు. నేను లైంగికంగా రాజీ పడ్డాను. . . నేను స్వచ్ఛతతో నడవడం లేదు.” ఉండండి! మీకు నా సందేశం సంక్లిష్టమైనదిగా ఉండదు-ఈ రోజే ప్రారంభించండి! నా క్రైస్తవ మిత్రుడా, బాధ్యతలు స్వీకరించే సమయం ఇది. ఇది సాధ్యం కాదని మీకు మీరే సర్దిచెప్పుకోవడమే నైతిక స్వచ్ఛత కలిగిన జీవితం మరియు దాని ప్రతిఫలాల నుండి మిమ్మల్ని నివారించేది. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు! మీరు పైనుండి జన్మించినవారైతే, మీరు దేవుని బిడ్డ అయితే, ఈ వాక్యభాగం మీకు సంబోధించబడుతుంది. ఈ వచనాల ప్రారంభంలో మీ పేరే ఉండాల్సింది.
1 థెస్సలొనీకయులకు 4 వ అధ్యాయం 1 వచనం చూడండి? “మెట్టుకు, సహోదరులారా. . . ” మీ పేరు అక్కడ పెట్టుకోండి. దేవుని బిడ్డయైన నీకు యిది ప్రత్యేకమైన సూచన. మరెవరికీ శక్తి లేదు. మీతో చాలా స్పష్టంగా చెప్పాలంటే, రక్షింపబడని వ్యక్తి నైతికంగా స్వచ్ఛంగా ఎలా ఉండగలడో అది నా తలకు మించినది. సజీవుడైన క్రీస్తు మరియు ఆయన ఆత్మ యొక్క శక్తి ద్వారా మాత్రమే ఈ రకమైన జీవితాన్ని నిర్వహించవచ్చు. మీరు నిజంగా నైతిక స్వచ్ఛతతో జీవించాలనుకుంటే, మీరు క్రైస్తవుడు కాకపోతే, మొదట మీరు చేయవలసిన వాటిని చెయ్యండి. మీరు క్రీస్తు నొద్దకు రావాలి. క్రైస్తవునిగా మారడమంటే ముందు మీ నైతిక చర్యను శుభ్రపరచుకోవాలి. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. అప్పుడే మీరు వ్యక్తిగత పరిశుద్ధతలో నడవటానికి అవసరమైన శక్తి కొరకు ప్రార్థిస్తారు.
అయినప్పటికీ, నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఇది సులభంగా అప్రయత్నంగా ఉండదు. స్వచ్ఛతకు మీ నిబద్ధతను కొనసాగించడానికి నేను పేర్కొన్న పద్ధతులను మీరు ఇంకా వర్తింపజేసుకోవాలి. శోధన చాలా భయంకరంగా ఉన్న సందర్భాలు ఉన్నాయని నేను కనుగొన్నాను, నేను ఆ స్త్రీతో దాదాపు కఠినంగా ఉండాల్సి వచ్చేది. అది బాగుండకపోవచ్చు, కాని మూల్యం చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది అమూల్యమైనది, నన్ను నమ్మండి.
మీలో కొందరు భర్తలు మరియు తండ్రులు. మీరు ఏర్పరుస్తున్న విశ్వసనీయత అలవాట్లు ఇంట్లో మీ భార్య మరియు పిల్లలను నేరుగా ప్రభావితం చేస్తాయి. వ్యక్తిగత పరిశుద్ధత విషయమై మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నారు? ఎంత స్థిరంగా ఉన్నారు? మీ మీద మీరు ఎంత కఠినంగా ఉన్నారు? మీకు నైతిక ప్రమాణాన్ని అందించడానికి మీరు వేరే ఎవరిపైనా ఆధారపడలేరు. మీ నైతిక ప్రమాణం మిమ్మల్ని స్వచ్ఛంగా ఉంచబోతోంది. . . లేదా మిమ్మల్ని దారితప్పిస్తుంది. నైతిక స్వచ్ఛత గురించి మీరు తీవ్రంగా ఆలోచించే సమయం యిది కాదా?
మీరు ఒంటరిగా, ఆకర్షణీయముగా మరియు సమర్థులుగా ఉండవచ్చు. మీరు చక్కని వృత్తిలోకి ప్రవేశించి ఉండవచ్చు. మంచిది . . . కానీ మీరు మీ నైతికతతో రాజీ పడటం కూడా సాధ్యమే. “ఇది చాలా బాగుంది, నేను ఒంటరిగా ఉన్నాను, అలాగే ఇది అందుబాటులో ఉంది, రహస్యంగా ఉంది” అని మీకు మీరు చెప్పుకోవడం మీరు గమనించవచ్చు. ఉండండి . . . ఇది రహస్యం కాదు! దేవుని యెదుట “రహస్య పాపం” లేదు. అంతేగాక, ఇది భూమి మీద ఎప్పటికీ రహస్యంగా ఉండదు.
6 వ వచనం ఏమి చెబుతుందో చూడండి? దేవుడు తనను తాను ప్రతిదండన చేయువానిగా తరచూ పిలుచుకోలేదు, కానీ ఆయన ఈ సందర్భంలో చేశాడు. దాని అర్థం? “తప్పు చేసినవారిని శిక్షించడం లేదా క్రమశిక్షణ చేయడం ద్వారా న్యాయం సంతృప్తిపరిచేవాడు.” ఆ ప్రతిదండన అంతా తీర్పు దినము వరకు వేచి ఉండదు. వాటిలో కొన్ని ఇప్పుడు ఆందోళన, సంఘర్షణ, అపరాధం, వ్యాధి, పిచ్చితనం రూపంలో జరుగుతాయి. . . మరణం కూడా.
అది సరేగాని, 1 కొరింథీయులకు 6:18 చాలా ముఖ్యమైన వచనం. మనం పరిశీలిస్తున్న సందర్భంలానే, రచయిత నైతికంగా రాజీ పడవద్దని పాఠకుడిని ప్రోత్సహించాడు. వచనం ఇలా అంటోంది:
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు.
ఆచరణాత్మకంగా చెప్పాలంటే, మిగతా అన్ని పాపాలను నిష్పాక్షికంగా చక్కగా నిర్వహించవచ్చు. కానీ ఇది మీమీద పరిహాసము చేస్తుంది. మన మాటల్లో చెప్పాలంటే, ఇది “యింటి దొంగ పని.” అనేక విధాలుగా, లైంగిక పాపాలు బాధితులకు వ్యక్తిగత నష్టాన్ని కలిగిస్తాయి, వ్యక్తిని బానిసత్వానికి గురిచేస్తాయి, తక్కువ సంతృప్తినిస్తాయి మరియు క్రిందకు దిగజార్చి ఎక్కువ విషాదాన్ని పర్యవసానంగా ఇస్తాయి. సువార్తికుడు బిల్లీ గ్రాహం కంటే బాగా దీనిగూర్చి చెప్పినవారు చాలా తక్కువమంది:
మన సాంఘిక జీవితంలోని ప్రతి ప్రాంతంలో, సెక్స్ తో పట్టిపీడించబడితే నష్టము జరగటం ఖాయం. చాలామంది పులకరింత కోసం ఏదో చేస్తారు, అదే పులకరింతను మరల పొందుకోవడానికి వారు మోతాదును పెంచాలి. మైకం వదిలినప్పుడు, వారు క్రొత్త మార్గాల కోసం, విభిన్న అనుభవాల కోసం సమానమైన మైకమును ఉత్పత్తి చేయడానికి నడపబడతారు. అధిక మోతాదులో సెక్స్ లో పాలుపొందేవాడు అపరాధం మరియు పశ్చాత్తాపం యొక్క భావాలతో బాధపడతాడు. అతని జీవన విధానం తీవ్రమైన ఒత్తిడి, అసహజ భావోద్వేగాలు మరియు అంతర్గత సంఘర్షణలతో పూర్తిగా నిండిపోతుంది. అతని వ్యక్తిత్వ వికాసం కోసమైన అన్వేషణలో ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. అతని కోరికలు అదుపు తప్పి చివరకు నిరాశ మిగులుతుంది. దేవుని ధర్మశాస్త్రమును మరియు సమాజ నియమావళిని ధిక్కరించి, అతను తన ఆత్మ మీద మరణంతో వ్యవహరించే ఒత్తిడిని పెడతాడు. క్రొత్త పులకరింతల కోసం, క్రొత్త మైకముల కోసం, ఉత్తేజకరమైన అనుభవాల కోసం అతను చేసిన అన్వేషణ అతన్ని భయం, అభద్రత, సందేహం మరియు వ్యర్థం యొక్క పట్టులో ఉంచుతుంది. డాక్టర్ సోరోకిన్ ఇలా అంటాడు: “అధిక మోతాదులో సెక్స్ లో పాలుపొందేవాని యొక్క బలహీనమైన శారీరక, భావోద్వేగ మరియు ఆత్మీయ స్థితి సాధారణంగా దానితో పాటు వచ్చే ఒత్తిళ్లను అడ్డుకోలేకపోతుంది, చివరికి అతను వాటి బరువు క్రింద చితికిపోతాడు. అతను తరచుగా మతిస్థిమితం లేనివాడుగా ఉండిపోతాడు లేదా ఆత్మహత్య చేసికొని తన జీవితాన్ని ముగిస్తాడు.”8
చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఈ క్రింది వాటిని కంఠత పట్టడం నాకు గుర్తుంది:
ఒక ఆలోచన విత్తండి, అప్పుడు మీరు ఒక చర్యను పొందుతారు;
ఒక చర్య విత్తండి, అప్పుడు మీరు ఒక అలవాటును పొందుతారు;
ఒక అలవాటు విత్తండి, అప్పుడు మీరు ఒక స్వభావమును పొందుతారు;
ఒక స్వభావమును విత్తండి, అప్పుడు మీరు గమ్యాన్ని పొందుతారు.
ఎంత నిజం! మరియు విత్తడం-కోయడం ప్రక్రియను నిలిపివేయగల ప్రదేశానికి మనము ఎప్పుడూ రాలేము. తన ఎనభైలలో ఉన్న ఒక ప్రముఖ మిషనరీని ఇంటర్వ్యూ చేసిన ఒక క్రైస్తవ నాయకుడి గురించి నేను విన్నాను. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇలా అడిగాడు, “నాకు చెప్పండి, మీరు ఎప్పుడు లైంగిక వాంఛ సమస్యను అధిగమించారు?” నిజాయితీగా దైవభక్తిగల పెద్దమనిషి ఇలా జవాబిచ్చాడు, “అది ఇంకా జరగలేదు. యుద్ధం ఇంకా కొనసాగుతోంది!” మీరు యుద్ధాన్ని అధిగమించడానికి వేచి ఉన్నట్లైతే అదెన్నటికీ జరుగదు.
మీ తర్కములో, గుర్తుంచుకోండి!
1 థెస్సలొనీకయులకు 4:7–8
పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు (4:7).
ఈ వాక్యభాగములో పౌలు మూడవసారి పరిశుద్ధతను ఉపయోగించాడు. ఇది మన యాత్రను, భూమి నుండి పరలోకానికి మన ప్రయాణాన్ని సూచించే వేదాంత పదం. బహుశా మనము దీనిని మన వృద్ధి నమూనా అని పిలుస్తాము.
దీన్ని గుర్తుంచుకోండి: ఆత్మీయ పురోగతి రంగంలో పనిచేయడానికి మీరూ నేనూ పిలువబడ్డాము. దేవుడు మనలను ఆత్మీయ వృద్ధి విధానంలో ఉండాలని పిలిచాడు. కొన్నిసార్లు మనము సిద్ధంగా ఉంటాము . . . కొన్నిసార్లు ఉండము. కొన్నిసార్లు మనము ఇతర సమయాల్లో కంటే ఎక్కువ విజయం సాధిస్తాము. కానీ ప్రయాణం ముందుకు ఎత్తుకు సాగిపోతుంది. నైతిక పొగమంచుతో చిక్కుకున్న ప్రపంచంలో మనం జీవించడం కొనసాగిస్తున్నప్పటికీ, దేవుడు ఖచ్చితంగా అపరిశుద్ధత కోసం మనల్ని పిలవలేదు.
కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. (4:8)
గుర్తుంచుకోవలసిన రెండవ విషయం ఏమిటంటే: పరిశుద్ధత యొక్క జీవనశైలిని తిరస్కరించడం అంటే, దాన్ని జీవించడానికి మీకు అధికారం ఇచ్చే దేవుణ్ణి తిరస్కరించడమే. పరిశుద్ధమైన దేవుణ్ణి విశ్వసించడంలో విడదీయరాని అనుసంధానంగా పరిశుద్ధ జీవనం ఉంది.
ఉత్తమమైనది: మీరు మాత్రమే తీసుకోగల నిర్ణయం
మీ కోరికలను సరళీకృతం చేయడం ద్వారా నా ఆలోచనలను ముగించనివ్వండి. నిజానికి, మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది, మీరు మీ జీవితాన్ని లోకపరమైన పొగమంచుతో గడపడానికి ఎంచుకోవచ్చు. అది మీ కోరిక అయితే, ఫలితాలు ఊహించదగినవే. మీరు నైతిక అనిశ్చితుల పొగమంచులో ప్రవహిస్తూనే ఉంటారు. మీ అవిధేయత మిమ్మల్ని నిరర్థకం చేసే హేతుబద్ధీకరణల శ్రేణికి దారితీస్తుంది. అపరాధం మరియు దుఃఖం మీ సహచరులు అవుతాయి. మీరు అలా జీవించడానికి ఎంచుకోవచ్చు. మీరు అలా చేస్తే, మీరు మీ కోసం కష్టాల తలుపులు తెరచినట్లే. మీరు నిష్కపటముగా సంఘానికి రారు. మీరు ఏవో కొన్ని మతపరమైన పదాలు మాట్లాడతారు. కానీ ఎంతో దూరం సాగకముందే, మీ జీవనశైలి మీ చుట్టూ ఉన్న వాతావరణానికి సరిపోతుంది. మీ కళ్ళల్లో ఇకపై నీళ్ళు కనిపించవు. మీ మనస్సాక్షి ఇకపై బాధపడదు. మీ గుండె వేగంగా కొట్టుకోదు. మీరు సిగ్గుపడటం కూడా ఆపివేయవచ్చు. అలసిపోయి, క్షీణించిపోయిన, ఈ లోకపరమైన జీవన విధానం ఒక ఎంపిక. కానీ అది ఆ పరిణామాలను కలిగి ఉంది. . . ఆ భయంకరమైన పరిణామాలు.
ఎందుకు? ప్రతిదండన చేయువాడు. దేవుడు తన పిల్లలను గాయపడకుండా ట్రాఫిక్‌లో ఆడటానికి అనుమతించడు. మీ అవిధేయత వల్ల వ్యక్తిగత కష్టాలు పెరుగుతాయి.
రెండవది, మీరు పైనున్న వాటిమీదనే లక్ష్యముంచి మీ జీవితాన్ని జీవించడానికి ఎంచుకోవచ్చు. ప్రయోజనాలు? నైతిక విలువలు గల దేవుణ్ణి మీరు ఘనపరుస్తారు. మరియు మీ విధేయత వల్ల వ్యక్తిగత విశ్వాసం మరియు పరిశుద్ధత యొక్క అలవాట్లు పెరుగుతాయి. ఇది అతీంద్రియంగా ఉద్భవించడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన స్వీయ-రూపము కలిగి ఉన్న మీరు బలంగా, మరింత సురక్షితంగా మిమ్మల్ని మీరు కనుగొంటారు. అంతర్గతంగా, మనము కారు లాగా ఉన్నాము. మనలను సృజించిన దేవుడు మన అంతర్గత డాష్‌బోర్డ్‌లో సరైన లైట్లతో నిర్మించాడు. ఒక విచిత్రమైన దృశ్యాన్ని ఊహించుకుందాం. ఇద్దరు పురుషులు ప్రయాణిస్తున్నప్పుడు, డాష్‌బోర్డ్‌లోని లైట్లలో ఒకటి ఎరుపు రంగులో మెరవటం మొదలైంది. డ్రైవర్ తన స్నేహితుడితో, “గ్లోవ్ కంపార్ట్మెంట్లో ఆ సుత్తిని నాకు ఇవ్వు, ఫర్వాలేదుగా? ధన్యవాదాలు.” టప్ . . . టప్ . . . బూమ్ . . . బూమ్ . . . పుస్! “అది! ఇప్పుడు మనము ఆ లైటుని వదిలించుకున్నాము.” బోనెట్ నుండి పొగ వస్తోంది, అయినప్పటికీ ఆ వ్యక్తి కారు తోలుతూనే ఉన్నాడు.
ఎంత మూర్ఖత్వం! ఇంకా, సుత్తులను అందించే వ్యక్తులను కనుగొనడం కష్టమేమీ కాదు. వారు చేస్తున్నట్లుగా, వారు ఏమంటారంటే, “అయ్యో, అది అనవసరమైన అపరాధం. అపరాధం ఇకపై ముఖ్యమైనదిగా భావించని యుగంలో మనము ఉన్నాము. మీరు అటువంటి విషయాలను వదిలించుకోవాలి.” అయితే ఉండండి . . . అది అవసరమైన అపరాధం! అది లేనప్పుడు దేవుడు మనకు సహాయం చేయునుగాక! మన మనస్సాక్షి మనలో లోతుగా కొరుకుతుంది మరియు మనం నైతిక స్వచ్ఛతలో రాజీ పడినప్పుడు మనలను గుచ్చుతుంది. మనం పాపము చేసినప్పుడు, అది బాధ కలిగించాలి. మనం నైతికంగా రాజీపడినప్పుడు మనం దయనీయంగా ఉండాలి. ఇది లోపల మెరుస్తున్న ఎరుపు లైటు. ఇది దేవుని మార్గం, “పక్కకు తీసుకురండి . . . ఆపండి. బోనెట్ ఎత్తండి. అసలు సమస్యతో వ్యవహరించండి.”
ప్రారంభ అమెరికన్ చరిత్ర యొక్క గొప్ప బోధకులలో ఒకరైన జోనాథన్ ఎడ్వర్డ్స్ ఒకసారి ఈ తీర్మానాన్ని చేశారు: “పరిష్కరించబడింది, ఎప్పుడూ ఏమీ చేయకూడదు, ఇది నా జీవితంలో చివరి గంట అయితే నేను చేయటానికి భయపడే దానిని ఎప్పటికీ చేయకూడదు.”9
మీ జీవితంలోని నిజమైన సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన శక్తి మీకు అందుబాటులో ఉంది. ఆయన యేసుక్రీస్తు. మీరు రక్షకుడిని కలిగి ఉంటే, మీరు పరిశుద్ధాత్మను కూడా కలిగియున్నారు. మీకు సహాయం చేయడానికే గాని మిమ్మల్ని ఎగతాళి చేయడానికి మీలోనికి రాడు; మీ బలమైన శోధనల్లో మీతో కూడా దుఃఖించడానికే కాదు, దాన్ని అధిగమించడానికి మీకు బలమిచ్చుటకు ఆయన మీలో ఉన్నాడు. తన శక్తిని మీలో కుమ్మరిస్తున్న వానియందు మీరు సమస్తమును చేయగలరు. మీరు మీ జీవితంలో ఎప్పుడూ చేయకపోయినా, మీరు ఈ రోజు శక్తి జీవితాన్ని ప్రారంభించవచ్చు. చెక్‌లిస్ట్ లేదు. పరిశీలన కాలం లేదు. దేవుడు మీకు శక్తినిచ్చే ముందు మీరు తప్పక నెరవేర్చాల్సిన బాధ్యతల జాబితా ఏమీలేదు. మీరు రక్షకుడిని ఎప్పుడూ కలవకపోతే, పరిశుద్ధత సిలువ వద్ద ప్రారంభమవుతుంది, అక్కడ క్రీస్తు పాపానికి ప్రాయశ్చిత్తము చెల్లించాడు. ఇప్పుడే ఆయనను స్వీకరించండి.
పరలోకమందున్న తండ్రీ, మా ప్రపంచం జీవించడానికి కష్టతరమైనది. పొగమంచు మందంగా ఉంది, దాని వేడి ఊపిరాడకుండా చేయుచున్నది. అది కష్టంగా ఉంది . . . కానీ అసాధ్యం కాదు. మీ శక్తి మాకు నిరీక్షణను అందిస్తున్నందుకు వందనములు . . . మేము విఫలమైనప్పటికీ, కొత్తగా ప్రారంభించాలని నిరీక్షిస్తున్నాము; మేము భయపడుతున్నప్పటికీ, ముందుకు కదలాలని నిరీక్షిస్తున్నాము; మేము బలహీనంగా ఉన్నప్పటికీ, నైతిక స్వచ్ఛతతో నడవాలని నిరీక్షిస్తున్నాము.
ఈ వ్యాసం చదివిన వారందరికొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి హృదయాలను మీ వైపుకు తిప్పడానికి . . . అనైతికత లక్షణాలను విచ్ఛిన్నం చేసి వారికి సహాయం చేయడానికి, మీ వాక్యాన్ని వినడం ద్వారా, మీ బోధనను పాటించడం ద్వారా మరియు మీ సత్యంలో నడవడం ద్వారా నిజమైన స్వాతంత్ర్యము, ఆనందం మరియు పరిశుద్ధతను కనుగొనడానికి మీరు దీనిని ఉపయోగించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క అజేయమైన నామంలో. ఆమేన్.
- John White, The Fight (Downers Grove, Ill.: InterVarsity Press, 1976), 179.
- Charles W. Colson, Loving God (Grand Rapids, Mich.: Zondervan Publishing House, 1983), 131.
- Kyle Yates, Preaching from the Prophets (North Nashville: Broadman Press, 1953), 152.
- Karl Menninger, Whatever Became of Sin? (New York: Bantam Books, Inc., 1978), 138.
- Jerry White, Honesty, Morality, and Conscience (Colorado Springs: NavPress, 1979), 184.
- Pitirim Sorokin, The American Sex Revolution (Boston: Porter Sargent, 1956), as quoted in Billy Graham, World Aflame (New York: Doubleday & Co., Inc., 1965), 21–22.
- John Brown, Expository Discourses on 1 Peter (Edinburgh: Banner of Truth Trust, reprint edition, 1848), 1:106. Italics in original.
- Graham, World Aflame, 23.
- The Works of Jonathan Edwards, 2 vols., revised and corrected by Edward Hickman (Carlisle, Penn.: The Banner of Truth Trust, reprint edition, 1976), 1 :XX. Italics in original.
Copyright © 1985, 1986, 1995, 2011 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.