దురాశ గురించి పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది
దేవుని వాక్యము మన ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక కోరికల అసహ్యమైన పరిస్థితులతో మాట్లాడుతుంది. దేవుని అచంచలమైన పరిశుద్ధత యొక్క సత్యము నైతికపరమైన విషయములలో రాజీపడటాన్ని సవాలు చేస్తుంది. లోకసంబంధమైన కోరిక నుండి విముక్తి కోసం దేవుణ్ణి విశ్వసించమని జ్ఞానము మరియు ఉపదేశములతో కూడిన వాక్యములను పరిశుద్ధ గ్రంథము అందిస్తుంది. ఈ క్రింది వాక్యభాగాలు నిరోధించలేని దురాశ యొక్క విధ్వంసక శక్తిని వెల్లడిస్తాయి, అలాగే ప్రభువు అందించిన స్వాతంత్ర్యము యొక్క మార్గాన్ని సూచిస్తాయి.
దురాశ అను పాపము
వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగా–ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
-మత్తయి 5:27-28
శరీరకార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితోకూడిన ఆటపాటలు మొదలైనవి. వీటినిగూర్చి నేనుమునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.
-గలతీయులకు 5:19-21
మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము.
-1 థెస్సలొనీకయులకు 4:3-5
శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును. మనము పోకిరిచేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితోకూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహపూజలు మొదలైనవాటియందు నడుచుకొనుచు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించినకాలమే చాలును.
-1 పేతురు 4:2-3
దురాశకు మూలం
శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు; ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు.
-రోమీయులకు 8:5-8
మీరు శరీరానుసారముగా ప్రవర్తించినయెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీర క్రియ లను చంపినయెడల జీవించెదరు.
-రోమీయులకు 8:13
అల్లరితోకూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు, కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచనచేసికొనకుడి.
-రోమీయులకు 13:13-14
నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి యొకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవిచేయ నిచ్ఛయింతురో వాటిని చేయకుందురు.
-గలతీయులకు 5:16-17
దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు–నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.
-యాకోబు 1:13-14
ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.
-1 యోహాను 2:15-17
దురాశ యొక్క నాశనకరమైన శక్తి
నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా? నీవు నన్ను లక్ష్యముచేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
-2 సమూయేలు 12:9-10
ఆమె –నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచు కొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందునుగూర్చి రాజుతో మాటలాడుము; అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతముచేసి అవమానపరచి ఆమెతో శయనించెను.
-2 సమూయేలు 13:12-14
ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. . . . అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. . . . మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. . . . ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.
-రోమీయులకు 1:24, 26, 28, 32
ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
-1 కొరింథీయులకు 5:11
అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర రని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
-1 కొరింథీయులకు 6:9-10
దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.
-యాకోబు 1:15
ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారముచేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.
-యూదా 1:7
దురాశ గురించి తెలివైన సూచన
నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము
వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
అప్పుడు నీవు బుద్ధికలిగి నడచుకొందువు
తెలివినిబట్టి నీ పెదవులు మాటలాడును.
-సామెతలు 5:1-2
నీ సొంతకుండలోని నీళ్లు పానము చేయుము
నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము.
-సామెతలు 5:15
దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును
వాడు తన పాపపాశములవలన బంధింపబడును.
శిక్షలేకయే అట్టివాడు నాశనమగును
అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.
-సామెతలు 5:22-23
దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము
అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొననియ్యకుము.
వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును.
మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును.
ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల
వాని వస్త్రములు కాలకుండునా?
ఒకడు నిప్పులమీద నడిచినయెడల
వాని పాదములు కమలకుండునా?
తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును
ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు.
-సామెతలు 6:25-29
జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు;
ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే.
-సామెతలు 6:32
అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచుకొనెను
తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొనిపోయెను.
వెంటనే పశువు వధకు పోవునట్లును
పరుల చేజిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును
తనకు ప్రాణహానికరమైనదని యెరుగక
ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును
వాని గుండెను అంబు చీల్చువరకు
వాడు దానివెంట పోయెను.
-సామెతలు 7:21-23
ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి
తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
-సామెతలు 9:6
యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును.
కుటిలవర్తనుడు బయలుపడును.
-సామెతలు 10:9
చెడుపనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగా నున్నది
వివేకికి జ్ఞానపరిశ్రమ చేయుట అట్టిదే.
-సామెతలు 10:23
మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు
యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు.
-సామెతలు 11:20
దురాశతో వ్యవహరించు మార్గములు
భక్తిహీనుల త్రోవను చేరకుము
దుష్టుల మార్గమున నడువకుము.
దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము.
దానినుండి తొలగి సాగిపొమ్ము.
-సామెతలు 4:14-15
చెడుతనము విడిచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము
తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును.
-సామెతలు 16:17
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.
-రోమీయులకు 8:1
జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడుచేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.
-1 కొరింథీయులకు 6:18-20
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.
-1 కొరింథీయులకు 10:13
మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.
-ఫిలిప్పీయులకు 1:27
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
-1 థెస్సలొనీకయులకు 5:21-23
నీవు యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
-2 తిమోతికి 2:22
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు. మరియు–నా కుమారుడా, ప్రభువుచేయు శిక్షను తృణీకరించకుము; ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి.
-హెబ్రీయులకు 12:1-6
కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును.
-యాకోబు 4:7-10
నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
-1 పేతురు 5:8-9
మనం దాని ప్రాపంచిక అధికారానికి లొంగినప్పుడే దురాశ మనపై అధికారాన్ని చెలాయిస్తుంది. ఏ విధమైన పాపాన్నైనా మన జీవితాన్ని యేలుటకు అనుమతిస్తే వినాశనాన్ని మరియు విధ్వంసాన్ని తీసుకువస్తుంది. అయితే, క్రీస్తు మన జీవితాలను యేలుచున్నందున, మన శోధనలను జయించుటకు పరిశుద్ధాత్మ మనలను బలపరుస్తాడు. మనం పందెములో ఓపికతో పరుగెత్తినప్పుడు (హెబ్రీయులకు 12:1), జీవిత ప్రమాదాల గుండా మరియు మోయలేని లైంగిక పాపభారము గుండా దేవుడు మన మార్గాన్ని నడిపిస్తాడు.