తండ్రుల కొరకు

నేను తరచుగా ప్రతిబంధకాలు లేకుండా పుస్తకము‌ను సిఫారసు చేయను, కాని ప్రతి పురుషుడు టామ్ ఐసెన్మాన్ రాసిన టెంప్టేషన్స్ మెన్ ఫేస్ చదవాలని అనుకుంటున్నాను. నేను దానిలోని ప్రతిదానితో అంగీకరిస్తున్నాను, లేదా మీరు అంగీకరిస్తారని నేను అనడం లేదు, కాని ఇది చదవడానికి అర్హమైన రచనలలో ఒకటి. . . ముఖ్యంగా పురుషులచే. నేను టామ్ యొక్క తెలివితేటలను మరియు ఆచరణాత్మకతను అభినందిస్తున్నాను. అతను ఎక్కడా వెనుకకు తగ్గలేదు; అతను అపరాధభావంతో మీ పేగులను పిండివేయడు. అతని పరిశీలనలు, అంతర్దృష్టి మరియు సూచనలు చొచ్చుకుపోయేవి మరియు ఉత్తేజకరమైనవి. నిజానికి . . . ఆ పుస్తకం తండ్రి ఎదుర్కొనే ప్రధానమైన శోధనలను గురించి నన్ను ఆలోచింపజేసింది.

మొదటిది, మనం మన ఉనికిని, మన వ్యక్తిగత ప్రమేయమును ఇవ్వడానికి బదులు వస్తువులను ఇవ్వాలనే శోధన.

అపార్థం చేసుకోకండి. కుటుంబాన్ని సంరక్షించాలని బైబిలు బోధించుచున్నది. తన కుటుంబ అవసరాలను తీర్చడంలో విఫలమైన వ్యక్తిని “అవిశ్వాసికన్నా చెడ్డవాడై యుండును” అని మొదటి తిమోతి 5: 8 పిలుస్తుంది. కానీ నేను సూచించే శోధన ప్రాథమిక స్థాయికి మించినది. ఇది బొమ్మలు మరియు సమయం మధ్య జరిగే సంగ్రామం: తన అవసరత ఉన్నప్పుడు అక్కడ ఉండకుండా తన కుటుంబంపై భౌతికమైన వస్తువులను కుమ్మరించడం ద్వారా తండ్రి తన పనిలో గడిపిన ఎక్కువ సమయాన్ని, అలాగే కుటుంబముతో లేకపోవడాన్ని కప్పిపుచ్చాలనుకుంటున్నాడు. అంటే మీ పిల్లలు ఫుట్‌బాల్ ఆటల సమయంలో మీరు గ్యాలరీలో ఉండటం లేదా వాళ్ళు కచేరీ యిస్తున్నప్పుడు ప్రేక్షకులుగా ఉండటం, మీ పిల్లల హోమ్ వర్క్ అనేది తండ్రిగా మీ ప్రోత్సాహకాన్ని కోరినప్పుడు వాళ్ళ ప్రక్కనే ఉండటం లేదా మీ పిల్లవాడు వాటర్‌స్కీ నేర్చుకునేటప్పుడు పడవను నడపడం వంటివి. తండ్రి స్థానాన్ని ఏదీ కూడా ఆక్రమించలేదు. ఏదీ!

రెండవది, ఉద్యోగ ప్రదేశంలో మన ఉత్తమమైనదాన్ని ఆదా చేసే శోధన.

భావోద్వేగ శక్తి, సృజనాత్మకత, ఉత్సాహం, ఆలోచనలు, హాస్యం, నాయకత్వ నడిపింపు మరియు జీవితానికి అభిరుచిని అంతులేకుండా యివ్వడం ఎవరికీ సాధ్యం కాదు. వీటన్నిటినీ పని దగ్గర ఉపయోగించడం తండ్రులకు ఎంతో సులభం, రోజు చివరికి వచ్చేసరికి వాటిల్లో ఏదీ మిగల్చరు. తత్ఫలితంగా, భార్య మరియు పిల్లలు మిగిలిపోయిన వాటిని మాత్రమే పొందుతారు. తండ్రులారా, మన కుటుంబాలు యింతకంటే మంచివాటికి అర్హులు! మనం వేగం పుంజుకోవడంలో విఫలమవడం ద్వారా, మన సృజనాత్మక శక్తిని ఉద్దేశపూర్వకంగా ఇంటి కోసం ఆదా చేయకుండా, మనము ఇంటి చుట్టూ నిర్లక్ష్యంగా, ప్రతికూలంగా, విసుగుగా మరియు ఊహించదగిన విధంగా ఉంటాము. ముందు ఆలోచనతో, సరైన ప్రాధాన్యతలను కొనసాగిస్తూ, వారి కుటుంబాలను ఆనందంతో ఆశ్చర్యపరిచే నిస్వార్థ పురుషులు ఎంత అరుదు.

మూడవది, వినడం మరియు నేర్చుకోవడం ద్వారా గౌరవం సంపాదించడం కంటే ఉపన్యాసాలు ఇవ్వాలనే శోధన.

తండ్రుల‌కు జ్ఞానం కొరకు యాకోబు 1:19 ని చూడటం విలువైనది: “నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతిమనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను.” ఇంట్లో పరిస్థితులు మన చేయి దాటిపోయినప్పుడు, యాకోబు సూచించిన క్రమానికి విరుద్ధంగా వెళ్ళటం మన సాధారణ ధోరణిగా ఉంటుంది. ముందు, మనకు పిచ్చి ఎక్కుతుంది. అప్పుడు, మనము అరుస్తాము (ఇది 38 వ సారి . . . లేదా 39 వ సారి చెప్పటం?). ఆఖరిగా, మనం వింటాము. అది జరిగినప్పుడు, మనము శృతి తప్పుతాము (కఠినమైన మార్గము గుండా అది నేను తెలుసుకున్నాను). మన కుటుంబ సభ్యులు ఆగిపోవచ్చు. వారు చూడవచ్చు. కానీ వారు వినడం లేదు. వారు నెమ్మదిగా రగులుతూ ఉంటారు. తండ్రులారా, యిది గంభీరమైన నిజం, ఏమిటంటే, మన ఇల్లు ఆఫీసు యొక్క పొడిగింపు కాదు . . . అలాగే మన భార్య మరియు పిల్లలు ఉద్యోగులు కాదు. మనం పనిచేసే చోట అప్రయత్నపూర్వకంగా గౌరవం పొందవచ్చు, కాని ఇంట్లో మనం దానిని పాత పద్ధతిలోనే సంపాదించాలి. దాని కోసం మనం తప్పక పనిచేయాలి.

నాల్గవది, మన నీడ క్రింద ఉన్నవారి నుండి పరిపూర్ణతను కోరే శోధన.

తండ్రులమైన మనం చాలా అవాస్తవంగా ఉండవచ్చు, కాదా? టెస్ట్ క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ సగటు 50 ఉంటే అగ్రస్థానంలో ఉన్నట్లేనని గుర్తుంచుకోవడం నాకు చాలా మంచిది. అంటే ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్స్ మన్ సగటున క్రీజులో ఉన్నప్పుడు ఒక్కో మ్యాచ్లో 50 పరుగులు మాత్రమే చేస్తాడు. అయినను సగటు 50 అంటే అతను ఇప్పటికీ బ్యాటింగ్ దిగ్గజంగా పరిగణించబడతాడు. వాస్తవానికి, అతను దానిని ఎక్కువకాలం కొనసాగించితే, అతను హాల్ ఆఫ్ ఫేమ్‌కు చేర్చబడేవాడు. భార్య మరియు పిల్లలు వెయ్యి పరుగులు బ్యాటింగ్ చేయ్యాలని ఆశిస్తూ, మన అంచనాలను ఏర్పరచడం ఖచ్చితంగా సులభం. తండ్రులు తమ పిల్లలకు కోపము రేపకూడదని ఆజ్ఞాపించబడ్డారు (ఎఫెసీయులు 6: 4), ఇది కోపం, చికాకు, దుఃఖాన్ని కలిగిస్తుంది. ఉద్రేకపూరితమైన పిల్లవాడు తగినంత ఎత్తుకు ఎగరలేడు, మంచి శిక్షణ అంటే ఎల్లప్పుడూ అంచనా‌ను పెంచడం అని తప్పుగా భావించే కఠినమైన తండ్రికి నమస్కారములు.

అయిదవది, ఏకస్వామ్య బంధాల వెలుపల సన్నిహిత నెరవేర్పును పొందుకోవాలనే శోధన.

హేతుబద్ధీకరించే మన సామర్థ్యానికి ధన్యవాదాలు, పురుషులమైన మనం హాస్యాస్పదమైన ఊహాజనిత పరిస్థితులలో ఉండటాన్ని నచ్చజెప్పుకుంటాము. ఇలాంటివి నేను చాలా వాటిని విన్నాను. నేను వ్యభిచారం చేసినవారి పిల్లలకు చెవియొగ్గాను, వారు ఎన్నడూ అర్థం చేసుకోలేరు, వారు వర్ణనాతీతమైన బాధను అనుభవించారు, ఆ గాయపు గుర్తులను నిరవధికంగా మోస్తున్నారు. దుర్బుద్ధి గుణము యొక్క ఆకర్షణ చాలా బలంగా ఉంటుంది, అది దైవభక్తి కలిగినవారిని కూడా అంధులను చేస్తుంది. ఒక మనిషి క్షణికావేశంలో తన కుటుంబాన్ని మరచిపోయేలా చేయటానికి మరియు నిర్వీర్యం చేయు అతని పాపం యొక్క పరిణామాలను విస్మరించడానికి ఈ శోధన శక్తివంతమైనది. అందుకే తండ్రులు తమ సంతానం యొక్క చిత్రాన్ని ఎల్లప్పుడు తమతోపాటు తీసుకువెళ్ళాలని మరియు తరచూ దానిని చూడాలని నేను సూచిస్తాను. మీ కుటుంబం యొక్క నవ్వుతున్న, నమ్మదగిన ముఖాలను చూసేటప్పుడు శారీరకమైన కామాన్ని అద్భుతంగా చూడటం అసాధ్యం.

ఆరవది, మీ కుటుంబం యొక్క ఆత్మీయ తృష్ణను పెంపొందించే ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేసే శోధన.

అవును, మీరు దాన్ని సేద్యపరుస్తున్నారు. తండ్రులారా, వినండి: మీరు వారి ఆత్మీయ గమనాన్ని దృఢపరచాలని మీ భార్యాపిల్లలు కోరుకుంటారు. తమ తండ్రి దేవుణ్ణి ప్రేమిస్తున్నారని, దేవునితో నడుస్తారని, దేవుని గురించి మాట్లాడుతారని తెలుసుకోవడం పిల్లలు ఇష్టపడతారు. ఆత్మీయ అధిపతిగా మీ పాత్రను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఈ విషయంలో మీ భార్య మీకంటే ముందు ఉన్నట్లైతే, అది ఆమె గురించి కాకుండా మీ గురించి నాకు చాలా ఎక్కువ చెబుతుంది. పిల్లలు గమనించరని, ఆశ్చర్యపోరని అనుకోకండి.

ఒక సవాలుకు సిద్ధంగా ఉన్నారా? దేవునితో సమయాన్ని గడపడం ప్రారంభించండి, ప్రార్థన చేసే వ్యక్తిగా తయారవ్వండి, మీరు క్రీస్తును ఎంత లోతుగా ప్రేమిస్తున్నారో, ఆయనను ఘనపరచాలని కోరుకుంటున్నారో మీ కుటుంబ సభ్యులు తెలుసుకొనునట్లు సహాయం చేయండి.

ఈ రోజే ఎందుకు ప్రారంభించకూడదు? రండి పురుషులారా . . . ఏ తండ్రి అయినా కుటుంబానికి ఇవ్వగల గొప్ప బహుమతులలో ఇది ఒకటి.

Adapted from Charles R. Swindoll, “For Dads” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 282-284. Copyright © 1994, Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.

Posted in Men-Telugu, Parenting-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.