మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము కలిగి యుండునట్లు చూచుకొనవలెను.
-ఎఫెసీయులకు 5:33
వివాహ బంధంలో దేవుని కృప ఎంత ఎక్కువగా ఉంటే, భర్తలు అంత తక్కువగా నియంత్రించడానికి మరియు పరిమితం చేయడానికి ప్రయత్నిస్తారు, అలాగే భార్యలు “ఎలాగైనా సరే సంతోషపెట్టాలి” అనే భావన తక్కువగా కలిగి ఉంటారు. ఇటువంటి దృక్పథం వివాహ బంధాన్ని సాఫీగా కొనసాగింపజేస్తుంది.
కృప స్వేచ్ఛనిస్తుంది మరియు దృఢపరుస్తుంది. ఇది అణచివేయదు.
కృప వ్యక్తులను గొప్పగా ఎంచుతుంది. ఇది నాశనం చేయదు.
కృప బలపరుస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది. ఇది అసూయ లేదా అనుమానం కలిగి ఉండదు.
నేను దేనిగురించి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. ఎంతోకాలంగా, అసూయ నన్ను దహించివేసింది. నేను ఎంత అపనమ్మకంతోను భయముతోను ఉన్నానంటే, సింథియా మీద అనవసరమైన అపనిందలు వేసి-సూటిపోటి ప్రశ్నలతో గుచ్చిగుచ్చి అడగటం సర్వసాధారణమైపోయింది. ఆమె యిది సహించటం ఆశ్చర్యాన్ని కలిగించింది. చివరగా, ప్రతి వివాహిత దంపతులు ఎదుర్కొని తేల్చుకోవలసిన గొడవ మాకు కూడా ఎదురైయ్యింది. దీన్ని పునరావృతం చేయవలసిన అవసరం లేదు, కానీ నేను ఆమెను అణచివేస్తున్నానని ఆమె బాధాకరంగా స్పష్టం చేసింది; ఆమె ఎప్పుడూ చేయాలని అనుకోని విషయాలను ఆమె చేస్తున్నట్లుగా నేను ఊహించుకున్నాను . . . అది ఆగాలి. ఆమె మాటలు బాధించాయి, కానీ ఆమె సరైన పని చేసింది. నేను ఆమె పట్ల శ్రద్ధ వహించాను.
నా జీవితంలోని చీకటి కోణంతో నేను పనికి వెళ్లాను. నా అసూయను సింథియాతో ఒప్పుకున్నాను. అలాంటి అపనమ్మకంతో నేను యింకెప్పటికీ ఆమె పట్ల ప్రవర్తించనని ఆమెకు హామీ ఇచ్చాను. కృప కోసం, నేను ఏర్పరచుకున్న విధ్వంసక అలవాటు నుండి ఉపశమనం కోసం, అన్ని ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు లేకుండా ఈ స్త్రీని ప్రేమించే మరియు నన్ను నేను అర్పించుకునే సామర్థ్యం కోసం సహాయం చేయుమని దేవుణ్ణి అడిగాను. కృపపై నా అవగాహన ఎంతవరకు సహాయపడిందో నేను స్పష్టంగా గుర్తుచేసుకున్నాను. చివరికి కృప నా జీవితంలో “మేల్కొని” ఉన్నట్లుగా ఉంది, మరియు నేను దాని శక్తిని మొదటిసారిగా సముచితంగా ఉపయోగించగలిగాను. మొదట అది చిన్న విషయాల్లో, ఆ తర్వాత పెద్ద విషయాల్లో నన్ను విడిపించినట్లు అనిపించింది. నేను ఈర్ష్యతో కూడిన ఒక్క ఆలోచనను కూడా అలరించటంలేదని నిజాయితీగా ఈ రోజు నేను చెప్పగలను. కృప నిజంగా గతకాలపు సంగతులను మరచిపోయి, నూతనంగా ఆరంభించేట్లు చేస్తుంది.
Taken from Charles R. Swindoll, Day by Day with Charles Swindoll (Nashville: W Publishing Group, 2000), 157-158. Copyright © 2000 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.