వాస్తవానికి, అమెరికాలోని స్థిరనివాసులు తమ ఎకరాల మొత్తం మధ్యలో తమ ఇళ్ళను నిర్మించుకున్నారు. తరువాత, వారిలో చాలామంది తమ పొరుగువారికి దగ్గరగా ఉండటానికి లోపలి మూలలకు జరిగారు.
అర్థం చేసుకోండి, నేను అప్పటికి జీవించిలేను, కానీ నేను చదివిన దాని ప్రకారం వాస్తవానికి అదే జరిగింది. “యువకుడా, పశ్చిమానికి వెళ్ళు!” అనేది అమెరికా యొక్క సవాలు అయినప్పుడు . . . కుటుంబాలను విడిగావుంచి పరిశీలించడానికి మరియు గుర్రపు బండిలో బయటి ప్రపంచాన్ని చూచి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని నిలబడటానికి ఆక్రమణదారుల హక్కులు అత్యంత ప్రయోజనకరమైన మార్గంగా అనిపించినప్పుడు యిది జరిగింది.
రద్దీగానున్న, మసి ఉక్కిరిబిక్కిరియైన తూర్పు పారిశ్రామిక నగరాలకు ప్రతిగా బహిరంగ మైదానాలకు, నీలాకాశానికి, మరియు సారవంతమైన, మిట్టపల్లాలైన, పశ్చిమ వ్యవసాయ భూములకు మార్పిడి చేసుకున్నారు.
ముందస్తుగా స్థిరపడినవారు తమ క్యాబిన్లను లేదా పచ్చిక గుడిసెలను ఖచ్చితంగా తమ ఇంటి స్థలం, సమీప కుటుంబం నుండి ఎకరాల (తరచుగా మైళ్ళు) మధ్యలో నిర్మించుకున్నారు. యాజమాన్యం యొక్క అహంకారం ధైర్యానికి చిహ్నంగా మారినందున బలమైన, దృఢమైన నిర్మాణంగల కంచెలు ఆస్తి రేఖలుగా గుర్తించబడ్డాయి. స్వాతంత్ర్యం మరియు సొంత ఆస్తి వంటి పదాలు సాధారణ సంభాషణ అయిపోయింది, ఎందుకంటే యువత మనుగడ కోసం ఎలా పోరాడాలో నేర్పించారు.
కానీ సమయం గడిచేకొద్దీ అంతా మారడం ప్రారంభమైంది. ఆ ఒంటరి ఇళ్ల నుండి ఫోటోగ్రాఫర్‌లు తిరిగి వచ్చినప్పుడు, వారు భయంకరమైన కన్నులుగల స్త్రీలను, వంగిన, భయంకరమైన, అకాల వృద్ధులను, మరియు వెంటాడే చూపులుగల పిల్లల చిత్రాలను చూపించారు. జీవితాన్ని చాలా దుర్భరముగా తామే చేసుకున్నారు. శీతాకాలంలో, వ్యాధి మరియు ఆకలితో పోరాడుతూ చాలా కష్టంగా బ్రతుకును వెళ్లబుచ్చారు.
వారు నేర్చుకున్న పాఠాలు
మధ్యలో కాకుండా తమ ఆస్తి మూలలో ఒకదానికొకటి సమీపంలో తమ ఇళ్లను నిర్మించుకుంటే వారు మంచిగా జీవించడానికి అవకాశం ఉందని ఎక్కువ మంది స్థిరనివాసులు తెలుసుకున్నారు. స్వాతంత్ర్యంపై తమ పట్టును వదులుకుంటే, వారి కంచెలో ఒక ద్వారం నిర్మించి, గోప్యతపై తమ అధిక ప్రాధాన్యతని వదులుకుంటే నాలుగు కుటుంబాలు చాలా తేలికగా మనుగడను సాగించగలవు. మరో మూడు కుటుంబాలు మీకు నడక దూరంలో ఉంటే శీతాకాలపు దెబ్బ లేదా సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడటం అంత ఘోరమైనది కాదు. ఒంటరితనం, వేరుగా ఉండటం, నా జోలికి రావద్దు అనే ఒంటరి జీవితాలకు బదులుగా కలిసివుండటం చాలా సరదాగా ఉందని నిరూపించబడింది.
వీటన్నిటి నుండి ఒక సామెత ఉద్భవించింది:
“పంచుకున్న ఆనందం రెట్టింపు ఆనందం అవుతుంది, పంచుకున్న దుఃఖం సగం దుఃఖం అవుతుంది.”
సంవత్సరానికి ఋతువులు మరింత రంగురంగులుగా, మరింత ఆశాజనకంగా మారాయి. వ్యవసాయం, పంటకోత, నిల్వచేయటం మరియు వధించటం సమూహ ప్రాజెక్టులుగా మారాయి. నిజమైన జీవనమునకు వట్టి ఉనికి మార్పబడటంతో వివాహాలు మరియు ఆరాధన, లాభాలు మరియు నష్టాలు, జననాలు మరియు మరణాలు పంచుకున్న అనుభవాలు అయ్యాయి . . . ఒకరికొకరు ఆనందాలు మరియు దుఃఖాల్లో పాలుపొందారు, పొరుగువారు స్నేహితులు అయ్యారు (ఆ తరువాత బంధువులు!) . . . “జీవనం” అని పిలువబడే అనేక కోణాల ఆభరణంలో భాగస్వాములయ్యారు.
ఆ పాత స్థిరనివాసులు ఈ రోజు మనం మరచిపోయినది నేర్చుకున్నారు: దగ్గరగా ఉండటం దూరంగా ఉండటంకంటే మంచిది. దూరంగా ఉండటానికంటే పాలుపొందుకోవటానికే ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రమాదాలు మరియు ఆవర్తన ఇబ్బందులు ఉన్నప్పటికీ, మధ్యలో ఒకరు కంటే ఒక మూలలో నలుగురు మెరుగ్గా ఉంటారు. ఇదే ప్రసంగి 4: 9-10, 12 యొక్క ముఖ్య విషయమని నేను ఖచ్చితంగా చెప్పగలను:
ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును . . . . ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?
మనం నేర్చుకోవలసిన పాఠాలు
మీ క్రొత్త నిబంధన యొక్క చివరి భాగంలో “ఒకరినొకరు” అనే పదాన్ని వెంబడించండి. అప్పుడు నేను ఏమంటున్నానో మీరు చూడగలరు. మనకు నిజంగా ఒకరి అవసరం మరొకరికి ఉన్నది. మనం గ్రహించలేనంతగా ఎంతో ఎక్కువగా ఉన్నది. వాస్తవానికి, శరీరమునకు ప్రభువు చేత మనము ఒకరికొకరం అప్పగించబడ్డాము, ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనదేదో యొకటి తోడ్పడటానికి ఉన్నది-భూమి మీద మరెవరూ యివ్వలేని దైవిక పజిల్ యొక్క భాగం (ఎఫెసీయులకు 4 చూడండి).
మీ పచ్చిక గుడిసె ఎక్కడ ఉంది? ఎక్కడో మధ్యలో ఒంటరిగా, బలమైన గాలులు వీస్తున్న మైదానంలో ఉన్నదా? మీరు స్థానిక సంఘములోని వ్యక్తులతో కొంత ముఖ్యమైన, బహిరంగ హృదయపూర్వక, కంచెలు తీసివేసి పరస్పరం మాట్లాడుకొని ఎంతకాలం అయ్యింది? చాలా కాలమయ్యిందా? మీరు మీ గుడిసెను మీ మైదానం మూలకు తరలించే సమయం యిదే కావచ్చు. కంచెను నిషేధించే ఆ ఎత్తైన ప్రదేశానికి మీరు ద్వారాన్ని పెట్టే సమయం యిదే కావచ్చు. ఇది మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది.
మీలో కొంతమందికి, ఇది మనుగడ అవుతుంది.
Adapted from Charles R. Swindoll, “Hope for Survival,” Insights (November 1998): 1. Copyright © 1998 by Insight for Living. All rights reserved worldwide.