మీరు సంఘము కోసం వెదకుచున్నారా? ఏదైనా సంఘమా? లేక నిజంగా ఆరోగ్యకరమైనదా?
బహుశా మీరు వేరే ప్రాంతమునుండి తరలి వచ్చి ఉంటారు. ఈ ప్రాంతం గురించి మీకు తెలియకపోవచ్చు. లేదా మీరు ఆరాధించుటకు అవసరమైన స్థలం కొరకు చూస్తున్న నూతన విశ్వాసి కావచ్చు. లేదా క్రొత్త సంఘము కోసం వెదకటం కంటే, మీ ప్రస్తుత సంఘములో నూతన బలము, ఉజ్జీవము ఎలా కలిగించాలో నేర్చుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. మీ పరిస్థితి ఏమైనప్పటికీ, ఆరోగ్యకరమైన సంఘమునకు, ఆరోగ్యముకాని దానికి మధ్యనున్న వ్యత్యాసం తెలుసుకోవటంలో నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను.
సంఘములు రకరకాల రూపాలు మరియు పరిమాణాలలో వస్తాయి, ఒక్కొక్కటి దాని స్వంత స్వభావం కలిగి ఉంటాయి. వాస్తవానికి, నేను ఒకదానికంటే మరొకదానిని సిఫారసు చేయలేను ఎందుకంటే మీ అవసరాలను తీర్చగలిగేది, అలాగే ఇతరుల అవసరాలను తీర్చడానికి మీకు అవకాశం ఇవ్వగలిగేదే మీ కొరకు ఉత్తమమైన సంఘము.
కొన్ని సంఘాలు గాయపడినవారికి సేదతీరు కేంద్రాలుగాను, యింకొన్ని ఊరి నడిబొడ్డున ఒక రాజు నుండి మహాసంతోషకరమైన సువర్తమానాన్ని దూత ప్రకటించే ప్రదేశాలుగా ఉన్నాయని మీరు కనుగొంటారు. కొన్ని జబ్బుపడినవారికి ఆస్పత్రులు; యింకొన్ని అగ్నిమాపక కేంద్రాలుగా, సమాజం యొక్క సమస్యలను పరిష్కరించడానికి బయలుదేరిన వాహనాలుగా ఉన్నాయి. కొన్ని పిల్లలకు మంచి వాతావరణాన్ని అందించే కుటుంబ కేంద్రాలుగా, యింకొన్ని సంగీతానికి నాటకానికి ప్రాధాన్యతనిచ్చే థియేటర్లుగా ఉన్నాయి.
ఈ కార్యకలాపాలు విలువైనవే, అలాగే అవసరం కూడా. కానీ అవి సంఘము యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం కాదు, అవి సంఘాన్ని ఆరోగ్యంగా చేయలేవు. ఆరోగ్యకరమైన సంఘము అంటే ఆరు ముఖ్యమైన లక్షణాలను ప్రతిబింబిస్తుంది. మీరు ఆ లక్షణాలను చూడగలగాలి.
మీరు మీ యింటి నుండి అడుగు బయటపెట్టడానికి ముందు, మీ శోధనలో మిమ్మల్ని నడిపించాలని దేవుణ్ణి అడుగమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఆయన శరీరంలో భాగంగా ఆయన మీ ఆరాధనను కోరుకుంటున్నాడు. అలాగే ఆయన మీ కోసం సరైన సంఘానికే మిమ్మల్ని నడిపిస్తాడు.
ఆరోగ్యకరమైన సంఘము దేవుణ్ణి మహిమపరుస్తుంది
“మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1 కొరింథీయులకు 10:31) అని లేఖనము చెబుతోంది. దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయనను ఘనపరచడం, కీర్తించడం మరియు ఆయన తేజస్సును గూర్చి ప్రముఖంగా ప్రకటించడం. ఇది సంఘము మరియు వ్యక్తిగత క్రైస్తవుల ప్రాథమిక ఉద్దేశ్యం.
వ్యక్తిగతంగా, మన జీవితంలోని ప్రతి విభాగంలోకి ఆయనను ఆహ్వానించడం ద్వారా, ఆయన మహిమను మనకోసం లాక్కోకుండా ఇతరులకు ఆయన గొప్పతనాన్ని చెప్పడం ద్వారా మరియు ఆయనతో మన సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా దీన్ని చేస్తాము. దీన్ని మనం ఎలా చేయగలం? ఆయనను తరచూ కలవడం ద్వారా, గర్వముతో మన పోరాటాలను గూర్చి ఇతరుల దగ్గర ఒప్పుకోవడం ద్వారా మరియు నిరంతరం మనల్ని మనం, ఇది దేవునికి మహిమ తెస్తుందా లేదా నాకు మహిమ తెస్తుందా?, అని ప్రశ్నించుకోవడం ద్వారా చేయగలము.
దేవుణ్ణి మహిమపరచాలనే మీ కోరికను తీర్చగల సంఘమే ఆరోగ్యకరమైన సంఘము.
ఆరోగ్యకరమైన సంఘము నిజమైన ఆత్మ సమర్పణతో దేవుణ్ణి ఆరాధిస్తుంది
ప్రారంభ క్రైస్తవులు దీనికి గొప్ప ఉదాహరణను ఇస్తారు: “వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను”(అపొస్తలుల కార్యములు 2: 42–43).
ఈ ప్రజలు వాక్యాన్ని విన్నారు, అలాగే సహవాసము మరియు ప్రార్థన ద్వారా వారు ఒకరితో ఒకరు మరియు ప్రభువుతో సంభాషించారు. వారు కలిసినప్పుడు, బలము మరియు పూర్ణ హృదయ భక్తి ఉద్వేగభరితమైన నిబద్ధతతో మిళితం అయ్యాయి. తండ్రి హెచ్చింపబడ్డాడు, కుమారుడు పైకెత్తబడ్డాడు, మరియు పరిశుద్ధాత్మ స్వేచ్ఛ యొక్క నవీనమైన వ్యక్తీకరణలను తీసుకువచ్చాడు.
క్రైస్తవులు కూడుకున్నప్పుడల్లా ఇది ఒక సాధారణ అనుభవంగా ఉండాలి, కానీ, విచారించవలసిన విషయమేమంటే, ఇది ఎల్లప్పుడూ అలా జరగటంలేదు. తరచుగా, పాటలు పాడబడుచున్నవి, లేఖనము చదువబడుచున్నది, ప్రకటనలు చేయబడుచున్నవి- కాని ఆరాధన లోపిస్తున్నది. సంఘ ఆరాధన యొక్క ఆరోగ్యాన్ని నిర్ణయించడానికి, మీరే ప్రశ్నించుకోండి, నా ఆత్మ ప్రభువు సన్నిధికి ఎగురుతూ వెళ్ళుచున్నదా? నేను ఆయనకు తగిన స్తుతి చెల్లించడంలోను విస్మయమొందటంలోను మునిగిపోయానా?
అర్థవంతమైన ఆరాధనకు మార్గం తెరిచే సంఘమే ఆరోగ్యకరమైన సంఘము.
ఆరోగ్యకరమైన సంఘము వ్యక్తిగత అనువర్తనంతో బైబిల్ సూచనలను సమతుల్యం చేస్తుంది
ప్రారంభ సంఘము బైబిల్ బోధనను నొక్కిచెప్పింది, ఎందుకంటే దేవుని వాక్యం నుండి దృఢమైన, స్థిరమైన బోధన అనేక విధాలుగా పెరగడానికి మనకు సహాయపడుతుంది:
- ఇది శోధన సమయాల్లో మన విశ్వాసాన్ని పరిపక్వం చేస్తుంది మరియు స్థిరపరుస్తుంది.
- ఇది లోపాన్ని గుర్తించి ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది.
- ఇది మనకు జ్ఞానమును ఇస్తుంది.
సిద్ధాంతానికే పరిమితమైన బోధన అసమాన్యతను లేదా అహంకారాన్ని పెంచుతుంది. అలాగే, బోధనను ప్రేమతో మరియు దయతో సమతుల్యం చేయడంలో విఫలమయ్యే ఉపదేశము అసహనాన్ని ప్రతిబింబిస్తుంది. చివరకు, బైబిల్ జ్ఞానం సంపాదించడమే పరమావధి అయినప్పుడు, దాని రచయితయైన యేసుక్రీస్తును మించి ఆరాధించడం అవుతుంది గనుక, అది విగ్రహారాధనకు దగ్గరగా ప్రమాదకరంగా ఉంటుంది.
కాబట్టి, కారుణ్య అనువర్తనంతో పాటు ఆరాధన మరియు బోధన కోసం చూడండి; ఇది ఆరోగ్యకరమైన సంఘమును తెలియజేస్తుంది.
ఆరోగ్యకరమైన సంఘము ఆత్మీయతను వెలువరుస్తుంది
ప్రారంభ సంఘము ఆరాధన, ప్రభువు పట్ల వ్యక్తిగత భక్తి, మరియు వాక్య బోధనలో నిమగ్నమవడమే కాక, “వీరు సహవాసమందు . . . ఎడతెగక యుండిరి” (అపొస్తలుల కార్యములు 2: 42). వారు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకున్నారు.
ఒక వ్యక్తి రెండు విధాలుగా నిజమైన సహవాసమును అనుభవిస్తాడు: అతను లేదా ఆమె అవసరతలోనున్న వ్యక్తితో తమ దగ్గర ఉన్నది పంచుకున్నప్పుడు, అలాగే అతను లేదా ఆమె ఎవరితోనైనా ఏదైనా పంచుకున్నప్పుడు- అంటే ఒక వ్యక్తి యొక్క దుఃఖం లేదా ఆనందం విషయంలో సానుభూతి చూపడం.
ఆరోగ్యకరమైన సంఘము అనేది ఒకరికొకరు నిజమైన చింతను ప్రత్యక్షంగా చూపించే విశ్వాసుల సంఘం.
ఆరోగ్యకరమైన సంఘము ఇతరులకు సహాయం చేస్తుంది
మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ చింతను ఒక అడుగు ముందుకు వేసి, యేసు గురించి తమకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకున్నారు. వారు తమ గోడలను దాటి వెళ్ళటానికి సాహసించినప్పుడు, జీవితాలు మార్చబడ్డాయి: “మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను” (అపొస్తలుల కార్యములు 2: 47).
ఆరోగ్యకరమైన మార్గంలో సహాయం చేసే సంఘములు తమ సంఘ సేవలను విశ్వాసి యొక్క పెరుగుదలపై కేంద్రీకరిస్తాయి, అంతేగాని అవిశ్వాసికి సువార్త ప్రకటించడం మీద కాదు. దేవుని ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తీసుకెళ్లడానికి ఆరాధన, బోధన మరియు సహవాసమును ఉపయోగించి సంఘము క్రైస్తవులను సన్నద్ధం చేస్తుంది. ఆరోగ్యకరమైన సంఘాలు సువార్త ప్రకటనలో చమత్కారము మరియు బలాత్కారము ఉపయోగించకుండా ఉంటాయి. బదులుగా, వారు ఇతరులను గౌరవంతో మరియు మర్యాదతో ఆదరించాలని ప్రోత్సహిస్తారు, తద్వారా పరిశుద్ధాత్మ తన మార్గంలో, తన సమయములో పనిచేయడానికి అంగీకరిస్తారు.
ఆరోగ్యకరమైన సంఘము ప్రజలు తాము నివసించే లేదా పనిచేసే చోట తమ విశ్వాసాన్ని తగిన విధంగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది.
ఆరోగ్యకరమైన సంఘమునకు వ్యాపింపజేసే ధోరణి ఉంటుంది
అయస్కాంతం వలె, వ్యాపింపజేసే శైలి కలిగిన సంఘము ప్రజలను దాని దగ్గరకు ఆకర్షిస్తుంది. నాలుగు లక్షణాలు ఈ శైలిని కలిగి ఉంటాయి:
- ఇది పరిశుద్ధ గ్రంథము యొక్క సారమును కలిగి ఉంటుంది. బోధకుని అభిప్రాయాలు లేదా ఆసక్తులపై కాకుండా, సందేశాలు దేవుని వాక్యంపై ఆధారపడి ఉంటాయి.
- ఇది ప్రామాణికమైన స్వభావం కలిగియుంటుంది. ఇది తాను చెప్పేది నమ్మే సంఘమై ఉంటుంది.
- ఇది వైఖరిలో దయ కలిగి ఉంటుంది. చర్చి తనను తాను ఒక సంస్థగా కాకుండా ఒక కుటుంబముగా చూసుకుంటుంది.
- ఇది వర్తించదగిన విధానములో ఉంటుంది. నేటి అవసరాలు, సమస్యలు మరియు ఆందోళనలకు దేవుని వాక్యం ఎలా వర్తిస్తుందో ఈ సంఘము చూపిస్తుంది.
మీరు దేవుని మహిమపరిచే సంఘాన్ని కనుగొన్నప్పుడు, ప్రభువు పట్ల భక్తి స్ఫూర్తిని పెంపొందించుకున్నప్పుడు, సంబంధిత అనువర్తనంతో పాటు దేవుని వాక్యాన్ని అందించినప్పుడు, వ్యక్తిగత ఆత్మీయతను వృద్ధి చేసినప్పుడు, బయటి వ్యక్తులను యేసు యొక్క అద్భుతమైన సువార్తతో తాకినప్పుడు, అవన్నీ వ్యాపింపజేసే శైలితో చేసినప్పుడు, మీరు ఆరోగ్యకరమైన సంఘమును కనుగొన్నట్లే.
అప్పుడు ఏ సంఘ వ్యక్తిత్వం మీకు సరైనదో నిర్ణయించుకొనే సమయం ఆసన్నమైనది. కుటుంబ కేంద్రమా? గాయపడినవారికి సేదతీరు స్థలమా? సంఘం అవసరాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న అగ్నిమాపక విభాగమా? గుర్తుంచుకోండి, మీ అవసరాలను తీర్చగలిగేది, అలాగే ఇతరుల అవసరాలను తీర్చడానికి మీకు అవకాశం ఇవ్వగలిగేదే మీ కొరకు ఉత్తమమైన సంఘము.
మీరు విశ్వాసుల యొక్క నిజమైన ఆరోగ్యకరమైన శరీరంలో ఒకటైనందున మీ శోధనకు ఫలితం ప్రభువు పట్ల నూతన నిబద్ధతకు దారితీయునుగాక.
ఈ ఆరు మార్గదర్శకాలకు సంబంధించి మరింత లేఖనాత్మక అధ్యయనం కోసం, దయచేసి కీర్తన 119: 9–16, 97–104; యోహాను 4: 23–24, 13: 34–35; అపొస్తలుల కార్యములు 2; రోమీయులకు 12; 2 కొరింథీయులకు 1: 3–4; 10: 17–18; ఎఫెసీయులకు 1: 22–23; 3: 14–21; 1 థెస్సలొనీకయులకు 2: 3-13; హెబ్రీయులకు 13:16 చూడండి.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.