దీనిని వివరించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి: కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పడం . . . ఒకడు ఒక మైలు దూరము రమ్మని బలవంతము చేసినయెడల, వానితోకూడ రెండు మైళ్లు వెళ్లడం . . . మనలను ద్వేషించువారికి మేలుచేయడం . . . మన శత్రువులను ప్రేమించడం . . . మరొకరి తలపై నిప్పులు కుప్పగా పోయడం. మనము దీనిని అనేక రకాలుగా చెప్పవచ్చు, కానీ ఒకే పనిని ఇవి సూచించుచున్నాయి. ఊహించనిది చేయడం ద్వారా, మనము రెండు ముఖ్యమైన లక్ష్యాలను సాధిస్తాము: (1) మనము వైరమునకు ముగింపు పలుకుతాము మరియు (2) ప్రేమ బ్రహ్మండముగా జయిస్తుందనే పురాతన సిద్ధాంతం యొక్క సత్యాన్ని మనము నిరూపిస్తాము.
సొలొమోను మాట గుర్తుందా?
ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. (సామెతలు 16:7)
ఇది నిజం. ఇది పదేపదే జరగడం నేను చూశాను. ఇది పని చేయగల సందర్భాలను కూడా నేను చూశాను, కానీ ఏ పక్షమూ దీనిని ప్రయత్నించడానికి ఇష్టపడలేదు.
మనం ఎందుకు అంత సంకోచిస్తున్నాము? నమ్మశక్యముకానిది దేవుడు సాధించడం మనం చూచునట్లుగా అనర్హుల కోసం ఊహించనిది చేయకుండా మనల్ని ఏది నిరోధిస్తుంది? ఇది మన మానవ స్వభావానికి విరుద్ధమైనది. మనలను అలా పెంచలేదు. పైగా, ఇది చాలా ప్రమాదకరమైనది. సందేహం లేదు, ఇది ప్రమాదకరమైనదే. వాస్తవానికి, అటువంటప్పుడే విశ్వాసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవునియందు విశ్వాసముంచి ఆయనకు విధేయులమైతే-ఒకవేళ ఆ పని బెడిసికొట్టినా సరే-ఆయన ముఖంలో చిరునవ్వును తెస్తుంది. అయితే ఇది చదువుచున్న మీలో కొందరు చిరాకుపడుచుండవచ్చు, ఆలోచిస్తుండవచ్చు, అవును, ఇది చాలా బాగుంది, కానీ ఎవరూ దీన్ని సాధించలేరు.
యోసేపు చేసాడు. కోపంగా ఉన్న తన సోదరుల దుష్ప్రవర్తన వల్ల అనేక సంవత్సరాల పాటు పరిణామాలను అనుభవించిన తరువాత, అతను పరిస్థితులు తారుమారైన రోజును చూడటానికి బ్రతికియున్నాడు. బలహీనులుగా, అతని దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి, అవసరతల్లో ఉండి, ఆ దోషులందరూ అతని ముందు సమర్థించుకోవడానికి ఒక్క మాట కూడా లేకుండా నిలబడ్డారు. మరియు అతను యోసేపు-వారు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేసిన వారి చిరకాల తమ్ముడు అని వారు కనుగొన్నప్పుడు-వారు ఆందోళనతో నిండిపోయారు. అతను వారిని తప్పించుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేశాడని వారికి తెలుసు. శక్తివంతమైన, సంపన్నమైన, చుట్టూ అంగరక్షకులను కలిగియుండి, అధికారం యొక్క అంతిమ నమూనాగా . . . యోసేపు గౌరవనీయమైన ప్రధాన మంత్రిగా ఉన్నాడు. మరి వారు? బలహీనమైన, దివాలా తీసిన, అసురక్షితమైన, ప్రధాన దోషులుగా ఉన్నారు. ఈ సమయం యోసేపుది. ఇప్పుడు అతని ఆవేశాన్ని చూపించడానికి మరియు ప్రతి ఒక్కరినీ జీవితాంతం హింసించడానికి సమయం వచ్చింది. ఎందుకు చూపించకూడదు? ఎక్కువ మోతాదులో . . . వారు శిక్షకు అర్హులే! బదులుగా, యోసేపు ఊహించనిది చేసాడు, అది అతని మురికి సహోదరులకు అదురు పుట్టించింది. పగ లేదు. వారు చేసినట్లుగా చేద్దామని, తిరిగి కొడదానమి అనుకోలేదు. కనీసం గట్టిగా అరవనూ లేదు. మానవ ద్వేషానికి అర్హులైన వారు అసహజమైన ఆతిథ్యాన్ని పొందారు. కృప గెలిచింది. అతను వారిని క్షమించాడు . . . తరువాత మిగిలినది అందమైన చరిత్ర.
సరే, అది అప్పటి సంగతి, అని విరక్తితో భుజములను ఎగవేయువారిని నేను గ్రహించగలను; ఇప్పటి పరిస్థితులను చూడండి. ఈ రోజుల్లో, పనికిరానిదాన్ని ఎవరూ తీసుకొని దాన్ని మానసికంగా నిధిగా మార్చలేరు. మీరు ఎంత తప్పులో ఉన్నారు.
రబ్బీ మైఖేల్ వీసర్ చేసారు. ఇది లింకన్, నెబ్రాస్కాలో జరిగింది (వార్తల ప్రకారం). మూడు సంవత్సరాలకు పైగా, స్వీయ-ప్రకటిత నాజీ మరియు కు క్లక్స్ క్లాన్స్‌మన్‌గా లారీ ట్రాప్ తన మెయిల్‌లు మరియు అసభ్యకరమైన ఫోన్ కాల్‌ల ద్వారా ద్వేషం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. అతను తన అపార్ట్‌మెంట్ నుండి శ్వేతజాతీయుల ఆధిపత్యం, యూదు వ్యతిరేకత మరియు ఇతర పక్షపాత సందేశాలను ప్రోత్సహించాడు, దానిని అతను KKK రాష్ట్ర ప్రధాన కార్యాలయంగా-మరియు అతనే గ్రాండ్ డ్రాగన్‌గా ప్రకటించుకున్నాడు.
వీజర్ ట్రాప్ యొక్క లక్ష్యాలలో ఒకడయ్యాడు, అతను మరియు అతని భార్య లింకన్‌కు ఆ ప్రదేశానికి వెళ్ళినప్పటి నుండి అనేక ద్వేషపూరిత మెయిల్‌లను అందుకున్నాడు. మెయిల్ తరువాత అభ్యంతరకరమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. మొదట్లో, వీజర్స్ చాలా భయపడ్డారు, వారు తమ తలుపులకు తాళాలు వేసుకున్నారు మరియు వారి భద్రత మరియు ముఖ్యంగా వారి టీనేజర్ల భద్రత గురించి ఎంతో బాధపడ్డారు. ట్రాప్, 42 ఏళ్ల వ్యక్తి, వైద్యపరంగా అంధుడు, రెండుకాళ్ళు తెగవేయబడిన వ్యక్తి, వారిపై తన ద్వేషపూరిత విషాన్ని వెళ్ళగ్రక్కుతుండగా, జాతిపరమైన దూషణలు మరియు అసభ్యకరమైన వ్యాఖ్యల వేధింపులు కుటుంబాన్ని భయపెట్టాయి.
ఒకరోజు రబ్బీ వీజర్ తామ చాలా కాలం భయంతో గడిపినట్లు గ్రహించాడు. అతను ఊహించనిది చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను తన సందేశాన్ని ట్రాప్‌కు టెలిఫోన్ ద్వారా పంపించాడు. వీజర్ పదే పదే కాల్ చేసాడు, వాటికి సమాధానం లేదు, జీవితం యొక్క మరొక కోణం గురించి ట్రాప్‌తో మాట్లాడుతున్నాడు . . . ద్వేషం మరియు జాత్యహంకారం లేని జీవితం. “నేను ఇలాంటి విషయాలు చెబుతాను: ‘లారీ, అక్కడ చాలా ప్రేమ ఉంది. నువ్వు అదేదీ పొందడం లేదు. నీకు కొంచెం వద్దా?’ అలాగే కొంత సమయం గడుపుదాం.”
ఒకరోజు వీజర్ కాల్ చేసాడు మరియు ట్రాప్ సమాధానం చెప్పాడు. “[వీజర్] ఇలా అన్నాడు: ‘నువ్వు అంగవైకల్యంగలవాడవని నేను విన్నాను. నువ్వు పచారీకొట్టికి వెళ్లడానికి ఎవరి సహాయమైన అవసరమని నేను అనుకున్నాను.’” ట్రాప్ ఆశ్చర్యపోయాడు. దయ మరియు మర్యాదతో నిరాయుధుడైన అతను ఆలోచించడం ప్రారంభించాడు.
క్రూరమైన వ్యక్తి నెమ్మదిగా మెత్తబడటం ప్రారంభించాడు. రబ్బీ వీజర్ చెప్పినట్లుగా, అతను ఒక రాత్రి వీజర్లకు కాల్ చేసి ఇలా అన్నాడు, “నేను ఏమి చేస్తున్నానో దాని నుండి బయటపడాలనుకుంటున్నాను అయితే అది ఎలాగో నాకు తెలియదు.”1 వీజర్ మరియు అతని భార్య ఆ రాత్రి ట్రాప్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి గంటల తరబడి అతనితో మాట్లాడారు. కొద్దిసేపటికే వారు ఒక ఒప్పందం చేసుకున్నారు: వారి ప్రేమకు ప్రతిగా, ట్రాప్ వారికి తన స్వస్తిక ఉంగరాలు మరియు ద్వేషపూరిత కరపత్రాలు మరియు క్లాన్ వస్త్రాలు మరియు హుడ్‌లను ఇచ్చాడు. అదే రోజు, ట్రాప్ తన రిక్రూటింగ్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు మరియు తన మిగిలిన ప్రచారాన్ని మూలన పడవేశాడు. చివరికి, వీజర్స్ గృహం మిస్టర్ ట్రాప్‌కు ధర్మశాలగా (hospice) మారింది. అతని ఆరోగ్యం క్షీణించడంతో అతను వారి బెడ్‌రూమ్‌లలో ఒకదానిలోనికి వెళ్లాడు . . . అతని మరణం వరకు ఆ జంట అతడిని సంరక్షించారు.
క్రిస్మస్ దగ్గరలోనే ఉంది. మీ ఉత్తమ బహుమతిని రంగురంగుల కాగితంలో చుట్టకుండా మిమ్మల్ని ప్రేమించేవారికి ఇవ్వకూడదా? ఎవరికైనా క్షమాపణ అనే బహుమతిని ఇస్తే ఎలా ఉంటుంది? స్నేహాన్ని పునరుద్ధరించుకొని నింపుకుంటే ఎలా ఉంటుంది? ఎటువంటి అరమరికలు లేకుండా . . . మీనుండి ఫోన్ వస్తుందని ఎన్నడూ ఊహించని వ్యక్తికి మర్యదపూర్వకంగా ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? అర్హత లేని వ్యక్తికి ప్రేమను నిజంగా పంచడమే అవుతుంది. ఎప్పటికీ మరచిపోలేని క్రిస్మస్ బహుమతి కోసం ఇప్పుడు క్రొత్త ఆలోచన వచ్చింది.
అవును, ఇది ప్రమాదకరమే . . . కానీ దీన్ని ప్రయత్నించిన మొదటి వ్యక్తి మీరు అవ్వరు. మిమ్మల్ని క్రియలోకి నెట్టడానికి మీకు అదనపు ప్రోత్సాహం అవసరమైతే, బేత్లెహేముకు తిరిగి వెళ్లి, దయతో కూడిన తొట్టిలో పరుండి, ప్రేమతో కూడిన వస్త్రాలతో చుట్టబడిన దేవుని వరమును కనుగొనండి.
అనర్హులకు ఊహించనిది చేయడం గురించి మాట్లాడండి!
- Manny Fernandez, “Lessons on Love, from a Rabbi Who Knows Hate and Forgiveness,” The New York Times, January 4, 2009, http://www.nytimes.com/2009/01/05/nyregion/05rabbi.html?_r=2&pagewanted=1 (accessed September 17, 2010).
Copyright © 2010 by Charles R. Swindoll. All rights reserved worldwide.