చాలా కాలంగా, కొత్త కార్ల పరిశ్రమ గురించి నాకు అర్థం కాలేదు. ఒక వ్యక్తికి ఆటోమొబైల్ కావాలనుకున్నప్పుడు, అతను లేదా ఆమె స్థానిక డీలర్‌షిప్‌కి వెళ్లి, కొంత పరిశీలనచేసిన తర్వాత అమ్మకందారుని వద్ద ఆర్డర్ ఇస్తారని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. ప్రధాన కార్యాలయానికి వివరాలు వెళ్లినప్పుడు, వారు సరైన స్టీరింగ్ వీల్, క్రోమ్ స్ట్రిప్స్ మరియు నావిగేషన్ సిస్టమ్‌ను కనుగొని, అన్నింటినీ కలిపి ఉంచడానికి దుకాణంలో హడావిడి చేస్తారని నేను గుర్తించాను. మీకు తెలుసా, వంటగదిలో చివరి నిమిషంలో భోజనాన్ని ఉద్రేకముతో తయారుచేయటం లాంటిది. చాలా సుళువుగా ఉంది, కదా? తప్పు.
ఆశ్చర్యకరముగా, డీలర్ నుండి కారును ఆర్డర్ చేసిన తర్వాత, కంప్యూటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్దీ కాంటాక్ట్‌లను సంప్రదించడం ఆరంభిస్తుందని నేను కనుగొన్నాను. ఒక ప్రదేశం ఇంజిన్‌లను మాత్రమే చేస్తుంది; మరొకటి గాజు మరియు ప్లాస్టిక్ భాగాలను అందిస్తుంది. ఇంకొక బృందం స్టీరింగ్ వీల్స్‌ను చేస్తుంది, అలాగే మరొకటి కార్పెట్ మరియు లెదర్ ఇంటీరియర్‌ను తయారు చేస్తుంది. మరియు-ఆశాజనకంగా-సరైన సమయంలో, ప్రతిదీ అసెంబ్లీ ప్లాంట్‌కు చేరుకుంటుంది. వెంటనే, మెరిసే కొత్త కారు రవాణా లారీపైకి దూసుకెళ్లింది మరియు వెంటనే దాని సరైన గమ్యస్థానానికి అది చేరుకుంటుంది.
ఎంత విశేషమైన ఏర్పాటు! దీనికి ఒక ప్రణాళిక ఉంటుంది.
అయితే ఇప్పుడు-ప్రజలు అన్నిటికంటే సంక్లిష్టమైన సంస్థాగత ప్రణాళికతో ముందుకు రాగలిగితే, దేవుని ఏర్పాటు ఎంత సమర్థవంతంగా ఉందో ఊహించండి . . . రెండు వేల సంవత్సరాల క్రితం. నేను మన రక్షకుని పుట్టుకకు సంబంధించి సంపూర్ణంగా సమకాలీకరించబడిన సంఘటనలను సూచిస్తున్నాను. ఖచ్చితంగా, ఇది తర్వాత వచ్చిన ఆలోచన కాదు.
దేవునికి ఒక ప్రణాళిక ఉండెను. లేఖనము దాని గురించి మనకు రూఢిపరచుచున్నది:
అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. (గలతీయులకు 4:4)
ఏమి ప్రకటన! కాలము పరిపూర్ణమైనప్పుడు, సరిగ్గా దేవుడు ఏర్పాటు చేసిన విధంగా, జగత్తు పునాది వేయబడకమునుపే తాను రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా, మెస్సీయ మానవాళి యొక్క నాటకశాలలోకి ప్రవేశించాడు (యోహాను 17:24; ప్రకటన 13:8; 17:8).
వందల సంవత్సరాల క్రితం, మెస్సీయ యూదాలోని బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ఆయన అక్కడే జన్మించాడు. అయితే యోసేపు మరియలు గలిలయలోని నజరేతులో నివసించారని నేను అనుకున్నాను. వారు అక్కడ నివసించారు. ఆ ప్రదేశాల మధ్య మైళ్ల దూరం లేదా? అవును, ఆ కాలంలో, బేత్లెహేము మరియు నజరేతు మధ్య ప్రయాణం అంటే-అక్షరాలా-రోజులు పట్టేది. మరి . . . ఎలా? సరే, చూడండి, ప్రత్యేకించి మరియ తన గర్భధారణలో “ప్రసవించే” సమయం సమీపిస్తోందని మీరు పరిగణించినప్పుడు-ఇది ప్రణాళికలో ఒక చిన్న భాగం మాత్రమే. మరియ మరియు యోసేపులను సరైన సమయానికి బేత్లెహేముకు చేరాలంటే, వారిచేత బలవంతంగా ప్రయాణం చేయిస్తేనే అది జరుగుతుంది. సమస్యే లేదు. కైసరు ఔగుస్తు ఆజ్ఞనుబట్టి చేయవలసిన జనాభా గణన కొరకు యోసేపు తన కుటుంబ మూలాలు ఉన్న నగరంలో వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలి. ఆ ఊరి పేరేమిటో మళ్ళీ చెప్పండి, మీకా? అవును-బేత్లెహేము (మీకా 5:2; మత్తయి 2:5; లూకా 2:1-4).
కానీ రక్షకుడు పుట్టకముందే, ఈ వార్తను త్వరగా వ్యాప్తి చేయగల సుపరిచితమైన భాష-సాధారణ సంభాషణకు ఏదోయొక సహజమైన మార్గము కూడా ఉండాలి. చక్కగా సరిపోతుంది. శతాబ్దాల క్రితం అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని హెలెనైజేషన్ చేసినందుకు ధన్యవాదాలు, కోయినె గ్రీకు సార్వత్రిక భాషను అందించింది, దీని ద్వారా సువార్త సందేశాన్ని సువార్తికులు మరియు అపొస్తలుల కలముల ద్వారా వేగంగా వ్యాప్తి చేయగలరు. ప్రపంచవ్యాప్తంగా ఆ ముఖ్యమైన సందేశాన్ని పొందడానికి రోమా సామ్రాజ్యం ద్వారా అంతర్జాతీయ రహదారి వ్యవస్థ కూడా అవసరం-రోమీయులు స్వాధీనం చేసుకోవడానికి ముందు ఇది లేదు. అసౌకర్య జనాభా గణన, సార్వత్రిక భాష మరియు చాలా మెరుగైన రహదారులకు ధన్యవాదాలు, మెస్సీయ సరైన స్థలం మరియు సమయంలో జన్మించాడు.
ఈ పసిబాలుడిని ప్రపంచం గమనించలేదు. మొత్తానికి, రోమీయులు నిర్మించడంలో మరియు జయించడంలో చాలా బిజీగా ఉన్నారు. మరియు కైసరు ఔగుస్తు తన జనాభా గణన లెక్కించే పనిలో ఉన్నాడు. వాస్తవానికి, ఈ ప్రపంచ పాలకులు చరిత్ర యొక్క ప్రవచనాత్మక పేజీలో మెత్తటి నారపీచు కట్టల కంటే ప్రాముఖ్యమైనవారేమీ కాదు-సార్వభౌముడైన దేవుని యొక్క ఏర్పాటులో పావులు మాత్రమే. దేవునికి ఒక ప్రణాళిక ఉండెను-అలాగే ఆయనకి ఇప్పటికీ ఉన్నది.
ప్రతి డిసెంబర్‌లో, గత పన్నెండు నెలల్లో దేవుడు మన జీవితాలను నడిపించిన విధానాన్ని గూర్చి నేను ఆలోచిస్తాను. పెరుగుతున్న ఉత్సాహంతో, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో మేము ఆయన సార్వభౌమ హస్తం ఎప్పుడో 2021 కంటే పూర్వమే ఆయన ఏర్పాటు చేసిన దిశలో మమ్మల్ని నడిపించడాన్ని చూస్తున్నాము! దేవుని కృపచేత, మేమందరం కలిసి ముందుకు కొనసాగుతాము.
క్రిస్మస్ ప్రతి సంవత్సరం నన్ను ఆకర్షిస్తుంది. ఇరవై ఒక్క శతాబ్దాల క్రితం సరైన సమయంలో తన కుమారుని సరైన స్థలానికి పంపించడానికి దేవుడు నెరవేర్చిన విషయాలతో మన ఆధునిక ఆటోమొబైల్ పరిశ్రమను పోల్చిచూస్తే, ఈ పరిశ్రమ పిల్లవాడు ఆడుకునే గురుగుల డబ్బాలా ఉంది.
దాని గురించి ఆలోచించండి, అదే శ్రేష్ఠమైన ఏర్పాటు మన ప్రతి ఒక్కరి జీవితానికి వర్తిస్తుంది, కాదా? దేవునికి ఒక ప్రణాళిక ఉండెను-అలాగే ఆయనకి ఇప్పటికీ ఉన్నది. దేవుడు అలానే పని చేస్తాడు.
Copyright © Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.