క్షమించే స్వాతంత్ర్యము

మీరు బాధ చేత చిక్కుకొని మనస్సు తీవ్రంగా నొచ్చుకుందా? మిమ్మల్ని బాధపరచి ద్రోహముచేసినవారి జ్ఞాపకాలతో జీవించడం మీకు ఒక బలమైన పెద్ద కోటలో బంధింపబడినట్లుగా అనిపిస్తుంది. అంధకారమయమైన గదుల్లో తిరుగుతూ, చుట్టూ ఎటుచూసినా ఆ గోడల మీద మసకగా కనిపించు ద్రోహము యొక్క రూపముల నుండి తప్పించుకోవడానికి మీరు వెదకుకున్నారు. బయటపడే మార్గం కనిపించదు, ఒక్కటే రక్షిస్తుంది-క్షమించే మార్గం.

మీరు క్షమించాలనుకుంటున్నారు. మీరు దేవుని ఘనపరచే సంబంధాలు కలిగి, విరోధ భావమును జయించాలని కోరుకుంటున్నారు. కానీ మీలో ఎక్కడో ఒకచోట ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉంది. “ఇది సరైంది కాదు!” అని మీ అంతరాత్మ అరుస్తుంది. కోపంలో, మిమ్మల్ని బాధపెట్టినవారిని బాధపెట్టాలని మీరు కోరుకుంటారు. మీకు హాని తలపెట్టినవానికి హాని తలపెట్టడం సబబే అనుకుంటారు. కాబట్టి ఈ ఒంటరి, నిర్జన ప్రదేశంలో బంధింపబడి మీరు బాధను అనుభవించుచున్న ఖైదీగా జీవిస్తున్నారు. మీరు స్వాతంత్ర్యమును ఎలా కనుగొనగలరు?

విడిచిపెట్టడానికి నిర్ణయించుకొనుట

క్షమాపణ ప్రక్రియ ఒక నిర్ణయంతో మొదలవుతుంది. మీరు చాలా కాలం పాటు విరోధముతో యాతనపడ్డ ఇంట్లో బంధించబడ్డారని మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మంచి కోసం విడిచిపెట్టడానికి, మీ బ్యాగ్‌లను సర్దుకోవడానికి మరియు క్రొత్త ఇంటికి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది. క్షమించాలనే మీ నిర్ణయం తప్పనిసరిగా మీ వెనుక తలుపును గట్టిగా మూసివేయడం మరియు తిరిగి వెళ్లకూడదనే సంకల్పంతో ప్రారంభించాలి.

మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, ఈ ప్రక్రియ గుండా దేవుడు మీతో నడుస్తాడని మీరు తెలుసుకోవచ్చు, మరియు ఆయన నమ్మదగిన మార్గదర్శకుడు (కీర్తన 32:8-9 చూడండి). ఆదరణ దయచేయు ఆయన హస్తం మీకు కావాలి ఎందుకంటే క్షమాపణ దిశగా తదుపరి చర్యలు చాలా కష్టంగా ఉంటాయి.

కోల్పోయిన దానికొరకు దుఃఖించుట

క్షమాపణ అంటే మీరు అనుభవించిన బాధను తిరస్కరించడం కాదు. బాధను తిరస్కరించడం లేదా తగ్గించడం అంటే సమస్యను పైపైన మాత్రమే చూడటం అలాగే క్షమాపణ ప్రక్రియను శీఘ్రతరం చేయటం. అలాంటప్పుడు ఫలితాలు శాశ్వత మార్పును అందించవు.

బదులుగా, నిజమైన క్షమాపణకు బాధను అనుభవించడం అవసరం. మీ భావాలను అంగీకరించడం ద్వారా మీ బాధ యొక్క మూలానికి వెళ్లండి. గాయపరచు మాటలు, కోపంతో కూడిన స్వరములు మరియు పరిత్యాగం కూడా సులభంగా గుర్తించవచ్చు. కానీ మీ హృదయం కలిగి ఉన్న చెప్పని అంచనాల గురించి ఏమిటి? మీరు ఎన్నడూ లేని సంబంధాన్ని కోల్పోయినందుకు, కోల్పోయిన సమయం, చెదరిన అంచనాలకు విచారించండి. మరియు, సంతాపంలో, దేవుని వైపు తిరగండి, ఆయన సన్నిధితో మిమ్మల్ని ఆదరించడానికి అనుమతించండి (2 కొరింథీయులకు 1:3-4).

మీ హృదయాన్ని కుమ్మరించడం అనేది శోకం ఉద్భవించడంలో సహాయపడుతుంది, ఇది స్వస్థత ప్రక్రియలో ముఖ్యమైన భాగం. మీరు మీ భావాలను దినచర్య పుస్తకం‌లో వ్రాయవచ్చు, విశ్వసనీయ స్నేహితుడు లేదా కౌన్సెలర్‌తో మాట్లాడటానికి సమయం కేటాయించవచ్చు మరియు ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడవచ్చు. దినచర్య పుస్తకమనేది బయటకు వెళ్లడానికి ప్రత్యేకంగా మంచి మార్గము, ఎందుకంటే మీరు మీ ఆలోచనలు మరియు ప్రార్థనలను నమోదు చేయవచ్చు, మీకు గుర్తు చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు వాటి దగ్గరకు తిరిగి రావచ్చు. ఈ అనుభవ సమయంలో దేవుని విశ్వాస్యతను గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.

రుణాన్ని రద్దు చేయడం

మీ భావాలను ఎదుర్కొన్న తరువాత, మీరు సంపూర్ణంగా క్షమించడానికి బాగా సన్నద్ధమయ్యారు. కానీ మీకు చెల్లించాల్సిన రుణాన్ని మీరు రద్దు చేసే వరకు క్షమాపణ సాధ్యం కాదు. మీరు పట్టుకొనియున్న నెరవేరని ప్రతిజ్ఞలు ఏమిటి? నమ్మకమైన జీవితకాల వివాహం మీకు వాగ్దానం చేయబడి ఉండవచ్చు. బహుశా మీరు లోతైన స్నేహంలో వెచ్చించి ఉండవచ్చు అయితే ఇప్పుడు అది ముగిసింది. బహుశా మీ విరోధి మీకు హాని లేని బాల్యానికి రుణపడి ఉండవచ్చు. లేదా భద్రతతో కూడిన స్థిరమైన నివాసము. లేదా మీ తల్లిదండ్రులలో ఎవరోయొకరిపై మీ నమ్మకం మోసపోయి ఉండవచ్చు. క్షమాపణ కోరుకునేది ఏమిటంటే మీకు చెల్లించాల్సిన రుణాన్ని రద్దు చేయటం. ఆ ప్రక్రియలో, మీరు దేవుని చేతుల్లోకి ఆ వ్యక్తిని వదిలివేస్తారు. మీరు కోపాన్ని దేవునికి వదిలివేసి, మీ విరోధి పట్ల న్యాయం తీర్చుతాడని ఆయనను విశ్వసించాలి (రోమా 12:18-19).

క్షమించే దేవుడు

మీకు ఇవ్వాల్సిన రుణాన్ని రద్దు చేయడానికి మీరు పూర్తిగా సిద్ధంగా లేకుంటే, క్షమాపణ గురించి బోధించే బైబిల్ వాక్యభాగాలపై ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించండి. మీరు నీతిమంతుడైన న్యాయాధిపతికి దగ్గరై ఆయన వాక్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు, మీ విరోధిని ఆయన కళ్ళ ద్వారా చూడటానికి మీరు మీ దృష్టిని సర్దుబాటు చేసుకోగలుగుతారు. తనకు వ్యతిరేకంగా పాపం చేసిన వారి పట్ల దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? దావీదు రాజుకు తెలుసు:

యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు
దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు.
ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు
ఆయన నిత్యము కోపించువాడు కాడు.
మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు
మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు.
భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో
ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగాఉన్నది.
పడమటికి తూర్పు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు.
(కీర్తన 103:8-12)

క్షమించే దేవుని హృదయం సిలువ యొద్ద స్పష్టంగా చూపబడింది. అక్కడ, మనుష్యులు దేవుని కుమారుని సిలువ వేసినప్పుడు, యేసు ఇలా స్పందించాడు, “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము” (లూకా 23:34). మన పట్ల ఆయన హృదయం సరిగ్గా అదే విధంగా ఉంటుంది, ఎందుకంటే “అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. . . . ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినాము” (రోమా 5:8, 10). క్రీస్తు ద్వారా, మనం ఆయనకు చెల్లించాల్సిన రుణాన్ని ఆయన రద్దు చేసాడు (కొలొస్సయులకు 2:14).

దేవుని క్షమాపణ ఘోర నేరస్థులకు మరియు దానిని స్వీకరించాలనుకునేవారికి ఎవరికైనా ఇవ్వబడుతుంది-మనం ఏమైయున్నామో అందునుబట్టిగాక, ఆయన ఏమైయున్నాడో అందునుబట్టి.

మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యోహాను 1:9, నొక్కిచెప్పబడింది)

మనం క్షమించేలా దేవుడు శక్తి కలుగజేస్తాడు

మనం క్షమించబడ్డామనే వార్త ఎంత బాగుంటుందో, అది మాత్రమే శుభవార్త కాదు. మనల్ని బాధపెట్టిన వారిని కూడా క్షమించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. అప్పుడే ఆయన ఉద్దేశించినట్లు జీవమును అనుభవించడానికి మనం స్వాతంత్ర్యమును పొందుకొనగలము (యోహాను 10:10).

అయితే అది ఎలా సాధ్యమవుతుంది? మనల్ని నిజంగా బాధపెట్టిన వారిని మనం ఎలా క్షమించగలం? అది సాధ్యమేనని మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు, ఎందుకంటే దేవుడు దీన్ని చేయమని ఆదేశించాడు. తన సహోదరుని ఏడుసార్లు క్షమించాలా అని శిష్యుడైన పేతురు యేసును అడిగినప్పుడు, అతను డెబ్భై ఏడు సార్లు క్షమించవలసి ఉందని యేసు చెప్పాడు-మరో మాటలో చెప్పాలంటే, క్షమించడాన్ని ఎప్పటికీ ఆపవద్దు (మత్తయి 18:21-22). అప్పుడు యేసు ఒక దాసుని గురించి ఒక ఉపమానం చెప్పాడు, అతని యజమాని అతనికి భారీ రుణాన్ని క్షమించాడు, కానీ తన తోడిదాసుని చిన్న రుణాన్ని కూడా క్షమించడానికి ఇష్టపడలేదు. యజమానుడు, దీని గురించి తెలుసుకున్న తర్వాత, కోపంతో, క్షమించబడిన దాసునని, “నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా?” మరో మాటలో చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎంతో క్షమించాడు గనుక, మనం కూడా ఇతరులను క్షమించాలి (మత్తయి 18:23-35).

దేవుడు మనకు ఏమి చేయమని ఆజ్ఞాపించాడో, తన ఆత్మ ద్వారా చేయమని ఆయన మనకు అధికారం ఇచ్చాడు. నిజమైన క్షమాపణ ప్రపంచానికి పరాయిది, కానీ క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడిన వారికి కాదు (2 కొరింథీయులకు 5:17). దేవుడు తన ప్రేమను మన హృదయాలలో తన ఆత్మ ద్వారా కుమ్మరించాడు (రోమా 5:5), కాబట్టి మన హృదయాలు నిజంగా ఇతరుల రుణాలను రద్దు చేయడంలో సంతోషించగలవు.

కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. (కొలొస్సయులకు 3:12-13)

మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి యొక్క రుణాన్ని రద్దు చేయాలని మీరు కోరుకున్నప్పుడు, మీ ఆందోళనలను దేవునికి తెలియజేయండి. మీ హృదయాన్ని స్వస్థపరచడానికి ఆయనను అనుమతించండి. ఈ ప్రక్రియలో మీరు మీ ప్రార్థనలను వ్రాయాలనుకోవచ్చు లేదా వారి రుణాన్ని రద్దు చేసే వ్యక్తికి క్షమాపణ లేఖ రాయవచ్చు. మీరు పంపినా, పంపకపోయినా, లేదా ఒకవేళ అది స్వీకరించబడుతుందా, అది సమస్య కాదు. ఈ అభ్యాసము మీకు రుణం మాఫీ చేయబడిందని స్పష్టమైన జ్ఞాపికగా ఉంటుంది. దేవునిపట్ల విధేయతతో, మీరు రుణాన్ని రద్దు చేయడానికి ఎంచుకున్నారు.

సమాధానము: ప్రక్రియను పూర్తి చేయడం

క్షమాపణ ప్రక్రియ స్వీయ పరీక్ష జరుగకుండా పూర్తి కాదు. మీ స్వంత హృదయంలో మీరు ఏమైనా పాపమునకు ఆశ్రయమిచ్చారా? క్షమించకపోవడం అనే పాపము ఉన్నదా? అపరాధి పట్ల మన వైరము మరియు కోపం తరచుగా పాపం లేకుండా అతనితో లేదా ఆమెతో సంబంధం కలిగి ఉండటాన్ని అసాధ్యం చేస్తాయి.

ఎవరైనా మీకు కలిగించిన బాధను మీరు గుర్తించి ఉండవచ్చు మరియు మీ పాపముతో కూడిన ప్రతిస్పందనను మీరు గుర్తించవచ్చు. మీరు ఏమి చేయగలరు? ముందుగా, మీ పాపానికి సంబంధించి దేవునితో ఒప్పుకోండి (యాకోబు 5:16; 1 యోహాను 1:9). మీ నేరాలను స్పష్టంగా నిర్వచించడంలో సహాయపడటానికి మీరు వాటిని జాబితా చేయాలనుకోవచ్చు. అప్పుడు, సముచితమైతే, ఆ వ్యక్తి వద్దకు వెళ్లి వారి క్షమాపణ కోరండి (మత్తయి 5:23-24). ఇది మీకు విరోధముగా వారు చేసిన నేరాలకు వారి మీద నింద వేయడానికి సమయం కాదు, మీ తప్పును ఒప్పుకునే సమయం.

ఒకవేళ ఆ వ్యక్తి సమాధానపడటానికి నిరాకరిస్తే?

మిమ్మును బాధించినవారు తమ స్వంత గుండె చుట్టూ నిర్మించుకున్న దృఢమైన సమర్థనలను మీ దుర్బలత్వం బలహీనపరుస్తుందని తరచుగా మీరు కనుగొంటారు. అలా అయితే, మీ మధ్య సమాధానము సహజంగా ప్రవహించవచ్చు. కానీ ఒకవేళ ఆ వ్యక్తి సంబంధాన్ని పునరుద్ధరించకూడదనుకుంటే? క్షమించడం మరియు క్షమాపణ కోరడం మాత్రమే సమాధానమునకు తలుపులు తెరుస్తుంది. నేరమును ఒప్పుకోవడానికి బాధించినవాడు నిరాకరిస్తే, సంబంధాన్ని పునరుద్ధరించడం అసంభవం.

దేవుడు కోరుకున్నది మీరు పూర్తి చేసారు. సమాధానమును నెలకొల్పడానికి మీరు చేయగలిగినదంతా చేసారు (రోమా 12:18). మిగిలినదంతా దేవుని చేతిలో ఉన్నది.

Posted in Encouragement & Healing-Telugu, Forgiveness-Telugu, Sexual Abuse-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.