చక్ స్విన్డాల్ మరియు డేవ్ కార్డర్‌తో సమావేశము
లైంగిక వేధింపులు చాలా కఠినమైన మరియు నాశనంచేసే అనుభవాలు. పిల్లల లైంగిక వేధింపుల కేసులలో చాలావరకు, ఆ వేధించినవాడు పిల్లవానికి తెలిసినవాడవటమేగాక, పిల్లవాడు ఆ వ్యక్తిని విశ్వసిస్తాడు కూడా. అందువల్ల పిల్లలు తరచుగా దీని గురించి ఎవరికీ చెప్పరు. ఇతర సందర్భాల్లో, పిల్లలు నిశ్శబ్దంగా ఉంటారు, ఎందుకంటే ఏమి జరిగిందో లేదా వారికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి లేదా చెప్పడానికి వారు చాలా చిన్నవారై ఉంటారు. ఇంకొందరు వేధించేవారి చేత బెదిరింపబడతారు లేదా నోరుమూయించబడతారు. లేదా వారు తమ కథను చెప్పిన తర్వాత ఎవరూ తమను నమ్మరని వారు భయపడుతున్నారు. చాలా మంది పిల్లలు తాము చెడ్డవారైనందుకు ఈ వేధింపు ఒక శిక్ష అని నమ్ముతారు లేదా తమను తాము నిందించుకుంటారు. లేదా తాము మాట్లాడితే ఇబ్బందుల్లో పడతామేమోననో లేదా మరొకరిని ఇబ్బందుల్లో పడవేస్తామేమోననో ఆందోళన చెందుతారు. ఆపై అవమానం కలుగుతుంది. పిల్లలు యుక్తవయస్సులోకి వచ్చిన తర్వాత ఎవరితోనైనా, వారి తల్లిదండ్రులతోనైనా లేదా వారి జీవిత భాగస్వాములతోనైనా చెప్పడానికి చాలా అవమానంగా భావిస్తారు.
నిశ్శబ్దం లైంగిక వేధింపులను కొనసాగించడానికి అనుమతిస్తుంది. ఇది నేరస్థుడిని కాపాడుతుంది మరియు వేధింపును పెంచుతుంది. ఊహింప శక్యముకాని సంఘటనలు జరిగినప్పుడు నిశ్శబ్దాన్ని చీల్చుకొని, పిల్లల లైంగిక వేధింపులను వెలుగులోకి తెచ్చే సమయం ఇది. అప్పుడే వేధింపులకు గురైన వారు స్వస్థత పొందుతారు.
కాలిఫోర్నియాలోని ఫుల్లెర్టన్‌లోని ఫస్ట్ ఎవాంజెలికల్ ఫ్రీ చర్చిలో లైసెన్స్ పొందిన ప్రొఫెషనల్ కౌన్సెలర్ డేవ్ కార్డర్‌తో చక్ స్విన్డాల్ తీవ్రమైన మరియు గుండెను పిండివేసే అంశంపై చర్చించారు. అటువంటి అనుభవానికి ఎలా స్పందించాలో కొన్ని మార్గదర్శకాలను అందించే కొన్ని సూటి ప్రశ్నలను చక్ డేవ్‌ను అడిగాడు.
చక్: డేవ్, వేధింపులకు కొన్ని సంకేతాలు ఏమిటి?
డేవ్: వారి వయస్సుకి మించిన లైంగిక భాషకు సంబంధించిన మాటలు మాట్లాడటం. పిల్లలు వారి వయస్సుకు మించిన జ్ఞానాన్ని బహిర్గతం చేసే శారీరక భాగాలకు లేదా పనితీరుకు లేదా లైంగిక చర్యలకు సంబంధించిన పదాలను ఉపయోగించవచ్చు. మానసిక స్థితిలో మార్పులు, పీడకలల సంఘటనలు అకస్మాత్తుగా పెరగడం లేదా ఏడుపు లేదా అతుక్కొని ఉండటం వంటి వాటిని గమనించండి. పిల్లల కోపం, ద్వేషము, జగడమాడటం లేదా తమను తాము బాధపరచుకోవడం గురించి అవగాహన కలిగి ఉండండి.
చక్: మీ బిడ్డ వేధింపులకు గురైనట్లు మీరు అనుమానిస్తే మీరు ఏమి చేస్తారు?
డేవ్: ప్రార్థన చేయండి. ఆపై ప్రొఫెషనల్ సలహా తీసుకోండి. మీరు మీ పిల్లలతో మాట్లాడినప్పుడు, అతిగా స్పందించకండి; ప్రశాంతంగా ఉండండి మరియు ఎవరైనా అతనిని లేదా ఆమెను అనుచితంగా తాకారేమో అడగండి. మీ పిల్లల భావాలను సమర్థించండి. మాటలతో మరియు వ్రాతపూర్వక గమనికలతో మీరు అతనికి లేదా ఆమెకు బేషరతుగా మద్దతు మరియు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని నిశ్చయించుకోండి. అలాగే సమయాలు సముచితంగా అనిపించినప్పుడు, అతనికి లేదా ఆమెకు విస్తారమైన కౌగిలింతలు ఇవ్వండి.
చక్: మీరు వేధింపులకు గురై నెలలు లేదా సంవత్సరాలు గడిచిపోయి మీరు ఎవరికీ చెప్పకపోతే మీరు ఏమి చేయవచ్చు?
డేవ్: మీరు దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టే వరకు మీరు నిజంగా స్వస్థత పొందుకోవడం ప్రారంభించరు. జరిగినది మీ కథలో ఒక భాగం. దాన్ని తిరస్కరించవద్దు, దాచవద్దు లేదా పాతిపెట్టడానికి ప్రయత్నించవద్దు. దీన్ని వెలుగులోకి తీసుకురండి మరియు మీకు నిజంగా ఏమి జరిగిందో పరిశీలించండి. అది ఎలా జరిగింది? అప్పుడు మీ భావాలు ఏమిటి, ఇప్పుడు మీ భావాలు ఏమిటి? మరియు మీరు దాని గురించి ఏమి చేయాలనుకుంటున్నారు? స్వస్థత ప్రక్రియ సమయం తీసుకుంటుంది-చాలా సమయం-కానీ వేధింపును రహస్యంగా ఉంచడంవల్ల అది లోపల సజీవముగాను బాధాకరముగాను ఉంటుంది. మీరు పెద్దవారైతే మరియు మీరు దాని గురించి ఎప్పుడూ మాట్లాడకపోతే, ఇప్పుడు అది చేయండి. అలాగే మీ జీవిత భాగస్వామికి చెప్పండి.
చక్: సంవత్సరాలు గడిచినప్పటికీ, నేరస్థుడిని ప్రతిఘటించడం మంచి ఆలోచన అని మీరు నమ్ముతున్నారా?
డేవ్: ఇది సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా మంది బాధితులు మూడు విషయాలు కోరుకుంటారు. మొదటిది, వారు హేతుబద్ధీకరణ లేకుండా క్షమాపణ కోరుకుంటారు. రెండవది, మరొక వ్యక్తికి ఇది ఎప్పటికీ జరగదని వారు అభయమును లేదా హామీని కోరుకుంటారు. మూడవది, వారు తమ సొంత కౌన్సెలింగ్ కోసం చెల్లించి రెండుసార్లు బాధితులవ్వాలని వారు కోరుకొనరు.
మీ కథనాన్ని సురక్షితమైన వ్యక్తితో పంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇన్సైట్ ఫర్ లివింగ్ మీకు సహాయం చేయడానికే ఇక్కడ ఉందని మేము భరోసా ఇవ్వాలనుకుంటున్నాము. మీరు లైంగిక వేధింపులకు గురైనట్లయితే లేదా వేధించినవారై ఉంటే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా లేదా అవమానించకుండా మేము మీకు పరిచర్య చేస్తాము. ఈ ప్రచురణలో మీకు ఇతర ఉపయోగకరమైన వనరులు కనిపిస్తాయి. కీర్తన 40:1-2 నుండి ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి:
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని;
ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగఊబిలోనుండియు ఆయన నన్ను పైకెత్తెను,
నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను.
లైంగిక వేధింపులను అనుభవించిన వారందరికీ స్వస్థత అందుబాటులో ఉంది. దేవుడు జిగటగల దొంగ ఊబిలోనుండి మిమ్మల్ని పైకెత్తి, మీ పాదములను స్థిరమైన నేలమీద ఉంచగలడు.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.