ఒక యువ పాస్టర్‌గా నేను చేసిన మొదటి వివాహాలలో ఒక వివాహంలో సాఫల్యమవటానికి మీరు ఆశించేవన్నీ ఉన్నాయి. వారిద్దరూ మంచి యౌవనంలో ఉన్నారు, ఇద్దరూ విశ్వాసులే, అతను ఒక వైద్య విద్యార్థి, ఆమె ఒక నర్సు. ఇది సమాధానం మరియు ఆనందంతో నిండిన ఒక మాదిరి వివాహం అయి ఉండాలి. శ్రమలు వస్తాయనేది విశదమే, కాని శాశ్వతమైన నిరీక్షణ చీకటి రోజులను జయిస్తుంది.
అయితే నేను ఎనిమిది సంవత్సరాల తర్వాత వధువుని చూసినప్పుడు ఆమె ఇరవై ఏళ్లు పెద్దదిగా కనిపించింది. మాదకద్రవ్యాలు, వ్యభిచారం, దుఃఖము మరియు ఎడబాటు వంటి విపరీతమైన విషాదాన్ని ఆమె వివరించింది. అసలు సమాధానం మరియు ఆనందం ఎప్పుడో మాయమైపోయాయి. మరియు ఆ అలసిపోయిన ఆత్మ తన వివాహాన్ని అతి తక్కువ స్థాయి వైవాహిక దుస్థితి నుండి తీసివేయగల ఒక విషయం పోగొట్టుకుంది: ఆమె నిరీక్షణను పోగొట్టుకుంది.
మీ సంగతి ఎలా ఉంది? క్రైస్తవ జీవితంలో మీ స్వంత ఆనంద స్థాయిని మీరు ఎలా అంచనా వేస్తారు? మీరు నిరుత్సాహమునకు గురయ్యారా? క్రీస్తును తెలుసుకోవాలన్న ఆ మంట మండకుండా మెల్లగా తగ్గిపోతూ చల్లబడిపోయిందా? అనుదిన జీవితంలో ఎదురయ్యే కష్టాలు మిమ్మల్ని నిరాశకు గురి చేశాయా? నిరాశ, విచ్ఛిన్నమైన వివాహాలు, ఆందోళన, కోపం మరియు బలహీనమైన స్వీయ నియంత్రణతో పోరాడుతున్న విశ్వాసులకు నేడు పాస్టర్‌లు నిరంతరం సలహా ఇస్తున్నారు. “యోహాను 10:10 లో క్రీస్తు వాగ్దానం చేసిన సమృద్ధి కలిగిన జీవితం ఎక్కడ ఉంది?” అని వారు ఆశ్చర్యపోకుండా ఉండలేకపోవుచున్నారు.
నిశ్చయమైన నిరీక్షణ
రోమా 5:1-11 లో, పౌలు మన క్రైస్తవ విశ్వాసం యొక్క వివాహ బలిపీఠం నుండి యేసుక్రీస్తుతో ఒక క్రొత్త సంబంధానికి-సమాధానం, ఆనందం మరియు నిరీక్షణ కలిగిన సంబంధానికి తీసుకెళ్తాడు. ఈ వాక్యభాగం శోధనలు మరియు శ్రమల మధ్య కూడా క్రైస్తవ జీవితంలో శాశ్వత ఆనందాన్ని ఎలా సాధించవచ్చో బయలుపరుస్తుంది. నాతో కలిసి చూడండి.
ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. (రోమా 5:12)
పౌలు వివరించిన విమోచనము ఏమిటంటే, మీ పాపములను క్షమించుటకు మరియు మీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చుటకు మీరు క్రీస్తుపై మాత్రమే విశ్వాసం ఉంచిన క్షణం (రోమా 5:5-11). అది నాకు 1940 లలో జరిగింది. మీలో కొందరికి అది 60 ల్లో . . . లేదా 80 ల్లో . . . బహుశా ఇటీవల కూడా కావచ్చు. మీరు విశ్వాసి అయితే, మీరు యేసుక్రీస్తుతో “నేను విశ్వసిస్తున్నాను” అని చెప్పిన ఆ క్షణంలోనే, మీరు ఆయన వధువు అయ్యారు, సంఘములో, ఆయన కుటుంబ సభ్యుడైయ్యారు, ఆయనకు శాశ్వతంగా సమర్పించుకొన్నారు. ఇదే వాక్యభాగంలో పౌలు ఈ గత సంఘటన యొక్క ప్రస్తుత ప్రభావాలను కూడా వివరించాడు: మనకు సమాధానము ఉంది (5:1), మనం కృపయందు నిలిచియున్నాము (5:2), మరియు మనము నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.
నిరీక్షణ అనే పదాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ప్రజలు సాధారణంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు-“పరిస్థితులు మెరుగుపడతాయని నేను ఆశిస్తున్నాను” . . . “నాకు ఆ క్రొత్త ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాను” . . . “నాకు జబ్బు రాదని ఆశిస్తున్నాను.” చాలా సందర్భాల్లో ఈ ఆశలు వ్యక్తిగత కోరికల ఆధారంగా కలిగే ఇచ్ఛలై ఉంటాయి. కోపముతోనున్న ఎద్దు వలె వాస్తవం చొచ్చుకొని వచ్చినప్పుడు ఇటువంటి ఆశలు సులభంగా చెదిరిపోతాయి. శోధనలు మనపై పడతాయి. నిరాశలు మిగులుతాయి. మరియు అనివార్యంగా ఆనందం క్షీణిస్తుంది.
కానీ రోమా 5 లో, పౌలు విశ్వాసులను తమ గత విమోచనమును వెనక్కి తిరిగి చూసుకోవటమే కాకుండా తమ తక్షణ కష్టాలు మరియు నిరాశలకు అతీతంగా ముందుకు చూడమని కోరాడు. అతను ఇలా వ్రాశాడు, “కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము” (5:9). జాగ్రత్తగా చదవండి: “మనము రక్షింపబడుదుము.” ఇది భవిష్యత్తులో జరిగేది. ఇదే నిరీక్షణ. మనం నిత్యత్వం పరలోకములో గడుపుదమని తెలుసు గనుక, మనం ఈ లోకపరమైన ఎటువంటి శ్రమనైనా ఎదుర్కోవచ్చు-మరణమును కూడా (8:35-39). అదే మన నిశ్చయమైన నిరీక్షణ!
మీరు ఈ రోజు అలాంటి నిరీక్షణను అనుభవిస్తున్నారా? లేనిచో, ఎందుకు?
ఆర్పజాలని నిరీక్షణ
నిరాశ యొక్క చెత్త దాడులను కూడా తట్టుకునే ఆర్పజాలని నిరీక్షణ మనం ఎలా కలిగియుండవచ్చు? వాటి గుండా మనం వెళుతున్నప్పుడు అతిశయిస్తాము! పౌలు అతిశయము యొక్క మూడు స్థాయిలను ఎత్తి చూపాడు: దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము (రోమా 5:2), మన శ్రమల్లో అతిశయపడుచున్నాము (5:3), మరియు దేవునియందు అతిశయపడుచున్నాము (5:11). శ్రమల మూలంగా మనం అతిశయపడటం లేదని గమనించండి. వాటి నడుమ మనం అతిశయపడుచున్నాము. అవి ఉన్నప్పటికీ మనం అతిశయపడుచున్నాము ఎందుకంటే మనకు తెలుసు “శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు” (5:3-5). దీని విషయమై ఈ విధంగా ఆలోచించండి: వ్యక్తిత్వములో ఎదుగుటకు మీరు దేవుని వ్యక్తిగత ప్రణాళిక. అంటే దేవుడు తన ప్రణాళికను ఎన్నటికీ వదులుకోడు కాబట్టి మీరు మరింత అతిశయపడవచ్చు (ఫిలిప్పీయులకు 1:6). శ్రమల ద్వారా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తూ, మీ పై ఆయన దృష్టి ఎల్లప్పుడూ ఉన్నది.
పరీక్షల యొక్క విపరీతమైన వేడిలో ఆత్మఫలము వాడిపోయినట్లు మీకు అనిపిస్తోందా? పౌలు సమాధానం స్పష్టంగా ఉంది: శ్రమలు వచ్చినప్పుడు, ఈ పరీక్షలు అద్భుతమైన ముగింపునకు సాధనాలని మనం గుర్తుంచుకోవాలి. నా అద్భుతమైన గమ్యస్థానానికి వెళ్లే రహదారి వదులుగా ఉన్న రాళ్లు మరియు గుంతలతో నిండిపోయిందని నాకు చెబితే, దారిలో ఉన్న ప్రతి కుదుపు నేను సరైన దారిలో ఉన్నానని గుర్తు చేస్తుంది. కానీ ఈ ప్రయాణంలో దేవుడు నాతో పాటు ఉన్నాడని నేను ఎప్పటికీ మరచిపోకూడదు. మన ప్రేమగల తండ్రిగా ఆయన కీర్తి ప్రమాదంలో పడుతుంది. మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు ఎల్లప్పుడూ తెలియదు, కానీ ఆయనకు తెలుసు.
మీ గత విమోచనమును మీ స్థిరమైన పునాదిగా మరియు మీ భవిష్యత్ నిరీక్షణను మీ ఇంధనంగా చేసుకొని, మీరు మీ ఆనందాన్ని మరియు సమాధానాన్ని కోల్పోకుండా పరీక్షలు మరియు శ్రమల ద్వారా ప్రస్తుత ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు. అవును, అది సాధ్యమే! మీ నిరీక్షణ ఓర్పునకు దారితీస్తుంది, యిది మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది, ఇది అధికమైన నిరీక్షణలోనికి నడిపిస్తుంది (రోమా 5:4). అది కేవలం కోరికతో కూడిన ఆలోచన కాదు.
అది ఆర్పజాలని నిరీక్షణ.
Adapted from Charles R. Swindoll, “Unquenchable Hope,” Insights (March 2006): 1-2. Copyright © 2006, Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.