ఇరవై ఒకటవ శతాబ్దపు సంఘము దాని నైతిక నిద్ర నుండి మేల్కొనాలి. ఈ “జ్ఞానోదయ” యుగంలో మనం సహనంతో ఉండాలని నేర్పించబడ్డాము. మనము లేఖనాల వివరణలో కాస్త రాజీపడ్డాము. పాపంతో వ్యవహరించడం కంటే దాన్ని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాం. దేవుని కృప ఏదో ఒకవిధంగా ఐహిక సంబంధమైన జీవనశైలిని మరుగుపరుస్తుందనే లోపభూయిష్ట భావనను మనము స్వీకరించాము. కృప గురించి ఎంత ఘోరముగా అపార్థం చేసుకున్నాము!
నన్ను సూటిగా చెప్పనివ్వండి. క్రైస్తవ గృహంలో చాలా తరచుగా, భార్యలు కొట్టబడుచున్నారు, భర్తలు నిర్లక్ష్యం చేయబడుచున్నారు, పిల్లలు దూషింపబడుచున్నారు మరియు లైంగిక భ్రష్టత్వం యొక్క చీకటి, అవమానకరమైన రూపాలు బయటకొస్తాయి. ప్రవక్త యిర్మీయా యూదా ప్రజల గురించి ఇలా అన్నాడు: “వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు” (యిర్మీయా 6:15).
ఇంటిలో ఆశకు ఒక్క గురుతు అమాయకపు శిశువు. కానీ ఇప్పుడు పిల్లలు కూడా సురక్షితంగా లేరు. చాలామంది లైంగికంగా దోచుకొనబడుచున్నారు. పిల్లలపై బంధువులు అత్యాచారం చేస్తున్నారు . . . బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు . . . వావివరుసతప్పి ప్రవర్తించేవారి చేతుల్లో అబ్బాయిలు బలి అవుతున్నారు. అలాగే వారిని రక్షించాల్సిన వారిచేతనే–వారి స్వంత ఇళ్లల్లో, నిస్సహాయ బిడ్డలు వేధించబడుచున్నారు!
లేఖనము కూడా దేవుని ప్రజలలో అటువంటి భయంకరమైన ఐహిక సంబంధాన్ని బయలుపరుస్తుంది. బత్షెబతో దావీదు రాజు వ్యభిచారం చేసిన తర్వాత, దావీదు కుమారుడు అమ్నోను తన సవతి సోదరి తామారును మోహించాడు. అమ్నోను అనారోగ్యమున్నట్లు నటించి, తన పడకగదిలోనికి ఆహారం తీసుకురమ్మని తామారును అభ్యర్థించాడు. ఆమె వచ్చినప్పుడు, అతను ఆమెను పట్టుకున్నాడు మరియు-అతను బలంగా ఉన్నందున-ఆమె ప్రతిఘటించినప్పటికీ ఆమెపై అత్యాచారం చేశాడు (2 సమూయేలు 13:6-14).
ఈ అసహ్యకరమైన చర్య తరువాత, ఈ ప్రియమైన అమ్మాయి తన దుఃఖంలో మునిగిపోయింది. “అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని . . . నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోయెను” (2 సమూయేలు 13:19). ఆమె తండ్రి దావీదు దీని గురించి విన్నప్పుడు, “అతడు బహురౌద్రము తెచ్చుకొనెను” (13:21). అయితే అంతే! అతనికి రౌద్రము మాత్రమే వచ్చింది. దావీదు ఎన్నడూ ఈ సంక్షోభంలో చిక్కుకోలేదు.
తామారు మరో సోదరుడైన అబ్షాలోము దీని గురించి విని ఆమెతో ఇలా అన్నాడు: “నా చెల్లీ నీవు ఊరకుండుము; అతడు [అమ్నోను] నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను.” (13:20). ఆ మాటలు మీరు నమ్మగలరా? ఎంత తెలివితక్కువ సలహా! ఏమీ అనవద్దా? అమ్నోనును రాళ్లతో కొట్టి చంపాలని దేవుని ధర్మశాస్త్రము చెప్పుచున్నప్పుడు మౌనంగా ఉండాలా? కానీ ఆమె ఏమి చేయగలదు? ఆమె సోదరుడు ఊరుకోమని అన్నాడు, అలాగే ఆమె తండ్రి దీని విషయమై ఏమీ చేయలేదు. తామారు తన బాధను చెప్పకోవడానికి తామారుకు ఏ ఒక్కరూ లేరు.
అప్పుడు మరియు ఇప్పుడు, అటువంటి ఉల్లంఘనలు సంభవించినప్పుడు-నిస్సహాయులను రక్షించడానికి ఎవరూ లేకపోతే–శిశువు నైతిక గందరగోళం, వ్యక్తిగత అవమానం, ఆధ్యాత్మిక భ్రమలు, భావోద్వేగ గాయాలు మరియు కుటుంబం మీద కోపం వంటి భయానక భవిష్యత్తును ఎదుర్కొంటాడు.
నిస్సహాయుల రక్షణ కోసం మనం మాట్లాడాల్సిన సమయం ఇది. లైంగిక వేధింపులకు గురైన అమాయక బాధితులు తమ కథనాలను పంచుకోవడానికి సురక్షితమైన స్థలం కావాలి. . . మరియు యేసుక్రీస్తులో కనిపించే భావోద్వేగ మరియు ఆత్మీయ స్వస్థత వైపు వారికి దిశానిర్దేశం చేయడం అవసరమైయున్నది.
పిల్లలను లైంగికంగా దూషించేవారి నుండి ప్రపంచం ఎప్పుడూ సురక్షితమైన మరియు భద్రమైన స్థలాన్ని అందించలేదు. అందుకే సంఘము ఆ స్థలంగా ఉండాలి. అవును, ప్రతికూల ముఖ్యాంశాలు ఉన్నప్పటికీ ఇది సాధ్యమే. దేవుని సంఘం నమ్మకత మరియు ఘనత యొక్క ప్రదేశంగా ఉండేలా చూసుకోవడం సంఘ నాయకుల బాధ్యత. ఎవరూ అనుచితంగా తాకని ఆశ్రయముగా ఉండాలి. గాయపడ్డ వ్యక్తులు బోధకునిలో, సంఘ పెద్దలో, కాపరిలో లేదా పాత స్నేహితుడిలో నమ్మకముంచే ఆశ్రయంగా ఉండాలి. కాపరులు గొర్రెలను కాపాడాలి.
కొన్ని కారణాల వల్ల మీ సంఘము (లేదా మీ ఇల్లు) సురక్షితమైన స్థలం కానట్లయితే, మేము మీ కోసం ఇన్‌సైట్ ఫర్ లివింగ్‌లో ఉన్నామని మీరు తెలుసుకోవాలి. మేము మీకు సలహాను అందిస్తాము మరియు మీ నిర్దిష్ట పరిస్థితిలో మీరు తీసుకోగల దశలను ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయం చేస్తాము. మీ పరిస్థితి చాలా కష్టంగా ఉండవచ్చు. . . కాని అది నిస్సహాయమైనది కాదు.
మీరు లైంగికంగా దూషించబడిన వారి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు అయినట్లైతే, ఈ వ్యక్తితో పాటుగా వచ్చి పరిస్థితిని ఎలా పరిష్కరించాలో మీకు మార్గదర్శకత్వం అవసరమైతే, మేము మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. మీ పరిస్థితి ఏమైనప్పటికీ, అంతర్దృష్టి మరియు దిశతో పాటు కృప మరియు కరుణను అందించాలని మేము నమ్ముచున్నాము. ఎంత కష్టమైనా, నేరం పునరావృతం కాకుండా ఉండాలంటే నేరస్థుడు నేరారోపణలను ఎదుర్కోవలసి ఉంటుంది. మేము న్యాయ సలహాను అందించలేనప్పటికీ, మీ ప్రాంతంలో సహాయం చేయగల వారికి మేము మిమ్మల్ని మళ్లించగలము.
మీరు లైంగిక వేధింపులకు బాధితులైతే, మీరు మాట్లాడటానికి భయపడితే మరియు వినే దయగల హృదయం అవసరమైతే, మేము మందంగా ఉండము లేదా తీర్పు తీర్చము. మేము మిమ్మల్ని నమ్ముతాము . . . మరియు మీకు సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తాము.
ఇండియాలోని మా పాస్టర్, కోమల్ సుభధీర్ వేంపాటి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరియు అతను లైంగిక వేధింపులకు సంబంధించిన సంఘర్షణల గురించి కుటుంబాలు మరియు బాధితులతో ఫోన్‌లో లేదా కరస్పాండెన్స్ ద్వారా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. అతనిని సంప్రదించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. అదనంగా, మేము లైంగిక వేధింపుల విషయముకు సంబంధించిన పేజీని సృష్టించాము, ఇది త్వరలో మీ కోసం వనరులను సిఫార్సు చేస్తుంది.
ఈరోజు చాలా మంది తామారులా బ్రతుకుచున్నారు, తమ తలలపై ఆశాభంగము మరియు అవమానాల బూడిదతో, ఏ ఒక్కరూ వినకుండా బిగ్గరగా ఏడుస్తున్నారు.
సహాయం కోసం ఎవరినో ఒకరిని సంప్రదించడం మీ కోసం ఒక క్రొత్త అధ్యాయానికి నాంది కావాలని నా ప్రార్థన. మీరు ఇంతకు ముందెన్నడూ పట్టించుకోబడనట్లైతే, ఇప్పుడు మీరు పట్టించుకోబడతారు. మీ కొరకు మా దగ్గర ఒక ఉత్తరవాది ఉన్నాడు.
Copyright © 2010 by Charles R. Swindoll, Inc.