లోలోతున, మనల్ని మనం పాట్రిక్ హెన్రీ, డేవి క్రోకెట్, జాన్ వేన్ మరియు ప్రవక్తయైన దానియేలు యొక్క మిశ్రమంగా ఊహించుకుంటాము! కానీ వాస్తవం ఏమిటంటే, మనలో చాలామంది భిన్నంగా ఉండకుండా ఉండటానికి ఏదైనా చేస్తాము. మనం అందరిలో కలిసిపోవడానికే ఇష్టపడతాము. మనకున్న గొప్ప భయాలలో ఒకటి బహిష్కరించబడటం, “గుంపు” చేత తిరస్కరించబడటం.
ఇతర భయాలు కూడా ఉన్నాయి- మూర్ఖంగా చూపించబడతామనే భయం, మన గురించే మాట్లాడి తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం. దృఢచిత్తముగల వ్యక్తివాదుల కంటే, మనం పాత కాలపు గలివర్ లాగా ఉంటాము, నిజమైన లేదా ఊహించిన భయం యొక్క చిన్న తంతువులతో కట్టివేయబడి కదలకుండా ఉంచబడ్డాము. ఫలితం ఊహించదగినది మరియు విషాదకరమైనది: ధైర్యం కోల్పోవడం.
ఒంటరిగా ఆలోచించడానికి, ఒంటరిగా ప్రతిఘటించడానికి, ఒంటరిగా నిలబడడానికి–ముఖ్యంగా గుంపు చాలా సురక్షితంగా, చాలా సరైనదిగా అనిపించినప్పుడు ధైర్యం అవసరం.
మీ ధైర్యాన్ని పెంపొందించడానికి నాలుగు ఆలోచనలను సూచించనివ్వండి:
- “నేనే బాధ్యుడను.” మెరైన్ కార్ప్స్‌లో నేనే ఈ మాట చాలాసార్లు చెప్పాను, అది నేనే చెప్పడం విని నాకే నీరసం వచ్చింది! ఈ రోజు కూడా నేను ఆ మూడు పదాలను పునరావృతం చేస్తున్నాను.
- “నేను మరచిపోకూడదు.” మన దేవుడైన యెహోవాను, ఆయన మనకు చేసిన వాటిని మనం మరచిపోకూడదు.
- “నేనే జవాబుదారీని.” నేను ఆసియాలో ఉన్నా, దక్షిణ అమెరికా కొనలో ఉన్నా, ఉత్తర ధ్రువంలో ఉన్నా దేవునికి నేనే జవాబుదారీని.
- “నేను దేవుని నుండి నా జీవన ప్రమాణం మరియు భద్రతను పొందుతాను.” నా స్నేహితుడి నుండి కాదు, నా వ్యాపారం నుండి కాదు, నాలో నుండి కూడా కాదు. క్రీస్తే నా పూటకాపు.
గుర్తుంచుకోండి. “ప్రతి ఒక్కరూ దీన్ని చేస్తున్నారు” గనుక అది సురక్షితమైనది లేదా సరైనది అని కాదు. మీరు గుంపు కంటే ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉండండి. అక్కడ పైన సురక్షితంగా మరియు సరైనదిగా అనిపించదు, అయితే అదే సురక్షితమైనది మరియు సరైనది.
Taken from Charles R. Swindoll, The Strength of Character: 7 Essential Traits of a Remarkable Life (Nashville: J. Countryman, 2007), 20-21. Copyright © 2007 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.