అనుదిన పరీక్షలు

శ్రీమతి మోసెస్ యొక్క వంట పుస్తకంలో ఖచ్చితంగా “మన్నాను సరిగ్గా చేయడానికి వెయ్యిన్ని-ఒక్క మార్గాలు” అనే అంశంపై ప్రత్యేక విభాగం ఉంది. నేను తప్పుగా ఊహిస్తే తప్ప, చాలాసార్లు . . . ఆమె వాటన్నింటినీ ప్రయత్నించింది. ఐర్లాండ్‌కు బంగాళదుంపలు ఏలాగో, సోమర్‌సెట్‌కు ఆపిల్‌లు ఏలాగో, గ్రిమ్స్‌బీకి గండుమీను చేప ఏలాగో, మరియు స్కాట్‌లాండ్‌కు గంజి ఏలాగో, 40 సంవత్సరాల పాటు సంచరిస్తున్న హెబ్రీయులకు మన్నా అటువంటిదే (నిర్గమకాండము 16:35). వారు దానిని ఉడకబెట్టుకున్నారు, కాల్చుకున్నారు, వండుకున్నారు, మెత్తగా చేసి, చల్లగా, వేడిగా, పచ్చిగా, వండిన, శాండ్‌విచ్‌ల కోసం ముక్కలుగా చేసి, వారి అల్పాహారములపై చల్లుకున్నారు-మీరు ఏ పేరైనా పెట్టండి, వారు అన్నిటినీ ప్రయత్నించారు! అందరూ తినడానికి వచ్చినప్పుడు, “టీలోకి ఏముంది?” అని అడగలేదు. “మీరు దీన్ని ఎలా సిద్ధం చేసారు?” అని అడిగేవారు. పెయింట్ పొడిగా అవ్వడం చూడటం . . . లేదా గత నెల సమావేశం యొక్క ముఖ్య విషయాలను వినడం వంటి ఉత్తేజకరమైనది భోజన సమయం. బల్ల చుట్టూ ఉన్న అత్యంత సుపరిచితమైన శబ్దం జుర్రటం లేదా నాకడం కాదు; గగ్గోలు పెట్టడం. ఓహ్, వారు ఆ మన్నాను ఎంతలా అసహ్యించుకున్నారో! ఆ మన్నాను చూడటం వల్ల వారు అనారోగ్యంతో ఉన్నందున వారు వాస్తవానికి ఆకలిని కోల్పోయారని సంఖ్యాకాండము చెబుతుంది (సంఖ్యాకాండము 11:6). ఐగుప్తు‌లోని చేపలను, దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు కీరకాయలను అందరూ జ్ఞాపకము చేసుకున్నారు-మరియు అలాంటి కలయికగల పళ్ళెము‌ను కోరుకునే దయనీయ స్థితిలో ఉండి ఉండాలి!

అక్కడికి ఆగండి! అప్పుడు జరిగిన తప్పు ఏమిటి? మీరు వారి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తే, మీకు పూర్తిగా భిన్నమైన చిత్రం కనబడుతుంది. నన్ను వివరించనివ్వండి. నలభై ఏళ్లుగా ఒక్కరోజు కూడా . . . వారు తమ ఆహారం లేదా బట్టల కోసం పని చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి ఉదయం, మీలాగే, నాలాగే వార్తాపత్రికను పొందడానికి బయటకు వెళ్లడానికి బదులుగా, వారు నలభై సంవత్సరాలుగా రోజువారీ సరుకులను నేల మీదనుండి సేకరించారు – వారి ఇంటి యొద్దకే పంపిణీ చేయబడినవి! నిజానికి, దేవుడు దానిని “ ఆకాశధాన్యము . . . దేవదూతల ఆహారము” అని అన్నాడు (కీర్తన 78:24-25). ఉదయపు అద్భుతానికి తోడుగా పగటిపూట నమ్మకమైన మేఘం మరియు రాత్రి ఓదార్పునిచ్చే అగ్నిస్తంభము ఉన్నవి (నిర్గమకాండము 13:21-22), ఇది వారికి దేవుని సన్నిధి మరియు రక్షణ యొక్క స్పష్టమైన హామీని ఇచ్చాయి. దాహం వేసినప్పుడు, బండలలోనుండి నదులవలె ప్రవహించే నీళ్ళతో వారి దాహమును ఆయన తీర్చాడు (కీర్తన 105:41). ఆ వ్యక్తులు ఖర్చు, పరిమితి, శ్రమ లేదా ఇబ్బంది లేకుండా శాశ్వతమైన క్యాటరింగ్ సేవను అనుభవించారు. వారు చేయాల్సిందల్లా కనిపించడం, తినడం, చక్కబెట్టుకోవడం మరియు పైకి చూడటం, అయితే వారు పరలోకంలో వండబడిన దేవదూతల ఆహారముపై ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి చేరుకున్నారు. అప్పటికే వారి దగ్గర చాలా ఉన్నప్పటికీ, వారు మరింత కోరుకున్నారు. పుష్కలంగా ఉన్నప్పటికీ, వారు వైవిధ్యాన్ని కోరుకున్నారు. మన్నాతో విసిగిపోయి, వారు మాంసాన్ని కోరుకున్నారు.

నిర్గమకాండము 16:4 తరచుగా పట్టించుకోని అదనపు అంతర్దృష్టిని అందిస్తుంది:

యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను . . . నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.

“నేను వారిని పరీక్షించునట్లు” అనే మూడు పదాలను జాగ్రత్తగా గమనించండి. మన్నా వెనుక చాలానే దాగి ఉంది-ప్రాథమికంగా, ఇది ఒక పరీక్ష. ఇది దేవుని పరీక్ష, జాగ్రత్తగా ప్రణాళిక చేయబడింది, తెలివిగా అమలు చేయబడింది, ప్రతిరోజూ నిర్వహించబడుతుంది. (వచనంలోని ఆనాడు అనే పదాన్ని గమనించండి.) మన్నా ఏకరీతిగా ఉన్నప్పటికీ, దేవుడు వారి విధేయత, వారి సహనం మరియు వారి దృఢ నిశ్చయం స్థిరత్వముతో ఉండటానికి రోజువారీ, వారం-వారం పరీక్షగా ఈ ఆహారాన్ని రూపొందించాడు.

వారు పరీక్షలో ఓడిపోయారు.

నేను బాలునిగా ఉన్నప్పుడు, దక్షిణ టెక్సాస్‌లోని గల్ఫ్‌కు సమీపంలో ఉన్న మా తాతగారి బే కాటేజ్‌లో స్విండాల్స్ అప్పుడప్పుడు కుటుంబ కలయికను ఆనందించేవారు. జనాలు చాలా ఎక్కువగా ఉన్నందున, మేము వంటలో సహాయం చేయడానికి ప్రతిసారీ అదే వ్యక్తిని తీసుకునేవారము. అతని పేరు కోట్స్. అతని చురుకైన చిరునవ్వు మరియు విచిత్రమైన వ్యాఖ్యలు నాకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండిపోయాయి. ఒక సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో కోట్స్ దగ్గర నిలబడి, బొగ్గుల పొయ్యిపై నెమ్మదిగా వండుతున్న మాంసం ముక్కలపై అతను సాస్‌ను పూయడం నాకు గుర్తుంది. కష్టాలు, విషాదాలతో కొట్టుమిట్టాడుతున్న తన జీవితం గురించి నాకు చెబుతున్నాడు. అతను నా ఎత్తుకు దిగి మోకరించి తన పెద్ద, దృఢమైన చేతిని నా తెల్ల జుట్టు గుండా రుద్దుతూ ఇలా అన్నాడు:

చిన్నవాడివైన చార్లెస్-జీవితంలో కష్టతరమైన విషయం ఏమిటంటే అది అనుదినమూ ఉంటుంది.

ఇది అనుదినమూ ఉంటుంది . . . చెప్పడానికి ఎంత సులభంగా ఉంది కానీ ఎంత భయంకరమైన నిజం! అలా వచ్చి ఇలా తాకే పరీక్షలు ఎంతోసేపు నిలువక, చాలా అరుదుగా చిన్న ప్రమాదంకంటే ఎక్కువగా ఏమీ జరుగదు. కానీ మనలను వదలని దీర్ఘకాలిక పరీక్షలు-కనికరంలేని, ఎడతెగని, స్థిరమైన, పట్టువిడువని, నిరంతర పరీక్షలు-ఆహ్, ఇవి గాయపరుస్తాయి కానీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. సద్గుణం వంశపారంపర్యమైనది కానందున, పరలోకపు ఆహారాన్ని స్వీకరించడానికి పరలోకపు ఆకలి ఉంటుందా అని చూస్తూ, దేవుడు ప్రతి తరంలోని ప్రతి పరిశుద్ధునికి తన “మన్నా పరీక్ష” ను నిర్వహిస్తాడు. కానీ చాలా తరచుగా, థామస్ పైన్ యొక్క ది అమెరికన్ క్రైసిస్ నుండి మాటలను స్వీకరిస్తే, “అవసరమైనప్పుడు వెనుదిరిగే సైనికులు” ఇటువంటి డిమాండ్ల క్రింద నలిగిపోతారు. మనం చాలా చౌకగా పొందేదాన్ని మనం చాలా తేలికగా తీసుకుంటామని దేవునికి తెలుసు.

మీ పరిస్థితి ఏమైనప్పటికీ-మరియు అది ఎంతకాలం కొనసాగినప్పటికీ-ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా, నేను ఇది జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను: గాలులు ఎంత బలంగా వీస్తే, వేరులు అంత లోతుగా ఉంటాయి . . . మరియు గాలులు ఎక్కువసేపు వీస్తే, చెట్టు మరింత అందంగా ఉంటుంది.

Copyright © 2011 by Charles R. Swindoll, Inc.
Posted in Encouragement & Healing-Telugu, Special Needs-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.