దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు!

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు!

నేను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని జియాంగ్సు నుండి పాస్టర్ల ప్రతినిధి బృందంతో సమావేశమై ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ప్రతి సంవత్సరం తమ ప్రాంతం‌లో 109,000 మంది ప్రజలు క్రీస్తును తమ రక్షకునిగా విశ్వసిస్తున్నారని వారు నాకు చెప్పారు!

ఆ సంఖ్యను మీ దగ్గరనుండి దాటనియ్యవద్దు. సగటున, సుమారు 300 మంది సువార్త విని క్రీస్తులో క్రొత్త జీవితానికి “అవును!” అంటున్నారు . . . ప్రతి రోజూ. . . కేవలం ఒక ప్రాంతం‌లోనే! ప్రతివారం, క్రొత్త సంఘాలు ఏర్పడుచున్నాయి. వారి తలుపులు తెరిచిన వెంటనే, క్రొత్త, మొదటి తరం క్రైస్తవులతో సీట్లు నిండిపోతున్నాయి. వీళ్లల్లో చాలామంది సంఘములోనికి యెన్నడూ అడుగు పెట్టలేదు! వాస్తవానికి, చైనాలో క్రైస్తవుడిగా ఉండటం చాలా కాలం క్రితం సురక్షితం కాదు.

1960 ల చివరలో, కమ్యూనిస్ట్ నాయకుడు మావో సే-తుంగ్ యొక్క శక్తివంతమైన భార్య జియాంగ్ క్వింగ్, మూడు నెలల్లో చైనాలో క్రైస్తవ మతాన్ని నాశనం చేస్తానని ధైర్యంగా ప్రకటించారు. చైనాలో క్రీస్తు పేరును చెరిపేయడానికి ఒక క్రమమైన కార్యక్రమం అనుసరించింది.

మావో కోసం తమ జీవితాలను అంకితం చేసిన ప్రజల గుంపులు బైబిళ్లు మరియు పాటల పుస్తకాలను కాల్చాయి. పోలీసులు సంఘ నాయకులను అరెస్టు చేసి కార్మిక శిబిరాలకు శిక్ష విధించారు. క్రైస్తవులు క్రీస్తును ఖండించవలసి వచ్చింది మరియు మావోకు విధేయత చూపించవలసి వచ్చింది. తమ విశ్వాసానికి కట్టుబడియున్న వృద్ధ మహిళలను బహిరంగంగా అవమానించారు, కొందరిని చావగొట్టారు. ప్రతిఘటించిన క్రైస్తవుల పేర్లను పోస్టర్లపై వేసి వ్రేలాడదీయబడ్డాయి. జంతువుల వలె పొలాలలో నివసించడానికి వారు తమ ఇళ్ళల్లోనుండి బలవంతముగా బయటకు పంపివేయబడ్డారు లేదా విసర్జింపబడ్డారు.

ఆత్మీయ ప్రదేశాన్ని బూడిదె చేస్తూ, హింసా జ్వాలలు చైనా అంతటా వ్యాపించాయి. చివరికి, మావో భార్య చైనాలో క్రైస్తవ ఉద్యమం పూర్తయిందని ప్రపంచానికి ప్రకటించింది. సంఘానికి ఉన్న ఏకైక ప్రదేశం చారిత్రక ప్రదర్శనశాల అని చెప్పింది.

అయితే, మావో మరియు అతని భార్య గెలవలేదు.

క్రైస్తవ మతాన్ని నాశనం చేయకపోగా, హింస సంఘాన్ని బలపరచింది. బూడిద నుండి క్రైస్తవ సాక్ష్యము యొక్క ప్రేమగల, సువాసనగల పువ్వు పెరిగింది. నలభై సంవత్సరాల క్రితం బైబిళ్లు వాస్తవంగా లేని దేశంలో, క్రైస్తవ సంఘాలు “సిల్క్ రోడ్” వెంట సువార్తను ప్రకటించడానికి మిషనరీలను పంపుచూ,“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను.”
(మత్తయి 28: 19-20)

క్రీస్తునందు మన చైనీస్ సోదరులు మరియు సోదరీమణులు తమ వంతు కృషి చేస్తున్నారు! మీరు చేస్తున్నారా?

ఆయన మాటల్లోని అర్థమేమిటో తెలుసుకోవడానికి క్రీస్తు యొక్క చివరి మాటలను జాగ్రత్తగా పరిశీలిద్దాం.

యేసు సాధారణ ప్రజలతో మాట్లాడాడు

యేసు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయనను వ్యక్తిగతంగా తెలిసిన సాధారణ ప్రజలతో. ఒక అద్భుతం చేయటానికి సరైన సాధనాన్ని బయటకు తీయటానికి శిష్యుల దగ్గర సామానుల పెట్టె లేదు. వారి వెనుక కాంతి వలయం లేదు, యూనిఫాం ధరించలేదు. వారు బైబిల్ పాఠశాలలకు వెళ్ళలేదు, కాని చాలామంది తమ మత పాఠశాలలను కలిగి ఉన్న సునగోగులకు హాజరయ్యారు. పరిశుద్ధాత్మ వారిపైకి వచ్చే వరకు వారు యెటువంటి శక్తిని పొందుకోలేదు.

వారు ఎలా ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అద్దంలో చూడండి! వారు మనలాంటి వారే. వారు పాపాత్మకమైనవారు, కల్లాకపటం లేనివారు, భయముగలవారు మరియు తరువాత ఏమి చేయాలో అనిశ్చితంగా ఉండేవారు. వారు సాధారణమైనవారు.

యేసు సంక్షిప్త, సరళమైన మరియు స్పష్టమైన ప్రణాళికను ముందుంచాడు

గొప్ప ఆజ్ఞలోని ప్రధాన క్రియ చేయుడి. ఏమి చేయాలి? శిష్యులనుగా చేయాలి. ఎలా? వెళ్ళి, బాప్తిస్మమివ్వడం, మరియు బోధించడం ద్వారా. దయచేసి గమనించండి: ఇది సాధారణమైన సూచన కాదు. గొప్ప ఆజ్ఞ ఒక దృఢమైన ఆదేశం, మరియు పరిమితి విషయమై యేసు యెటువంటి సందేహాలను వదిలిపెట్టలేదు-సమస్త జనులను.

యేసు లక్ష్యం గురించి తీవ్రంగా ఉన్నాడు కాని పద్ధతి గురించి మృదువుగా ఉన్నాడు

లక్ష్యం ఎక్కడ నెరవేర్చాలో యేసు పేర్కొన్నాడు, కానీ ఎలా నెరవేర్చాలో కాదు. లోకం మరియు దాని సంస్కృతులు నిరంతరం పెరుగుతున్నాయని మరియు మారుతున్నాయని ఆయనకు తెలుసు. . . ఆయన అనుచరులకు అందుబాటులో ఉన్న సాధనాలు కూడా ఇలానే మారతాయని ఆయనకు తెలుసు. ప్రింటింగ్ ప్రెస్, రేడియో, ఇంటర్నెట్ లేదా మైక్రోఫోన్ సహాయం లేకుండా, ఆ శిష్యులు ప్రపంచాన్ని తలక్రిందులుగా చేశారు. ఈ రోజు విశ్వాసులందరూ యేసు చివరి మాటలను ప్రారంభ శిష్యుల మాదిరిగానే తీవ్రంగా తీసుకుంటే ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి!

ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ చేస్తాయని నేను మీకు భరోసా ఇవ్వగలను. ప్రపంచవ్యాప్తంగా బైబిల్ సత్యాన్ని మరియు దాని అనువర్తనాన్ని తెలియపరచాలనే మా లక్ష్యం గురించి మేము తీవ్రంగా ఉన్నాము, ఎందుకంటే బోధన ద్వారా శిష్యులను చేయాలనే యేసు లక్ష్యం దాని మూలాధారమై ఉంది.

మా లక్ష్యం మారదు. విజన్ 195-బైబిలును ఎలా అధ్యయనం చేయాలో మరియు ఎలా పంచుకోవాలో క్రైస్తవులకు నేర్పించడం ద్వారా మొత్తం 195 దేశాలలో శిష్యులను చేయాలనే మా వ్యూహం స్పష్టంగా ఉంది. కానీ మా పద్ధతి సరళంగా ఉంటుంది, వివిధ సంస్కృతులలోని ప్రజలను కలవడానికి అనుగుణంగా ఉంటుంది మరియు ప్రభువు అందించి, నిర్దేశించిన క్రొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది.

మా వ్యూహానికి ప్రధానముగా నేను రాసిన Searching the Scriptures: Find the Nourishment Your Soul Needs అనే పుస్తకం ఉన్నది. నేను చేసినట్లుగా దేవుని వాక్యము నుండి ఆత్మీయంగా పోషించే భోజనాన్ని తయారుచేయడం ఎలాగో నేర్చుకోవటానికిగాను విశ్వాసులకు సహాయపడటానికి మాత్రమే ఈ పుస్తకం ఉంది. . . మరియు వారు నైపుణ్యాన్ని సాధించిన తర్వాత ఇతరులకు నేర్పించవచ్చు. ఎవరికీ కూడా నోటికి అందించడం నా లక్ష్యం కాదు! ఆత్మీయంగా స్వయం సమృద్ధిగా మారడానికి ఇది ఎల్లప్పుడూ మీకు సహాయపడాలనేదే నా లక్ష్యం. ఇతరులు తమకోసం దేవుని వాక్యాన్ని త్రవ్వుకోవాలని మరియు నేను కనుగొన్న అదే ఆనందం, నిరీక్షణ, సహాయం మరియు సంతృప్తిని వారు పొందకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను.

మన ప్రపంచంలో 6,875 మాతృ భాషలు ఉన్నాయని మీకు తెలుసా? ప్రతి సంవత్సరం, వాటిలో ఎక్కువ భాషల్లో లేఖనాలు అందుబాటులోకి వస్తున్నాయి. క్రొత్త అనువాదాలు పూర్తయిన తరువాత, ప్రభువు ద్వారములు తెరిచిన వెంటనే ఆ భాషా సమూహాల కోసం Searching the Scriptures అనువదిస్తాము. అది జరిగినప్పుడు, Searching the Scriptures ఆ సమూహాలలో విశ్వాసులను శిష్యులుగా చేయడానికి మరియు దేశీయ పాస్టర్లకు దేవుని సత్యాన్ని అధ్యయనం చేయడానికి మరియు వారి సమూహములకు అందించడానికి శిక్షణ ఇచ్చే “పాఠ్య పుస్తకం” అవుతుంది. ఆ విధంగా, మనము సమస్త జనులను శిష్యులనుగా చేస్తాము.

కానీ ఇది ఇంట్లో ఇక్కడే ప్రారంభమవుతుంది.

యేసు తన అనుచరులందరి నుండి విధేయత క్రియను ఆశించాడు

నేను సూటిగా చెప్పబోతున్నాను: మీరు విశ్వాసియైయుండి గొప్ప ఆజ్ఞను నెరవేర్చడంలో మీరు చురుకుగా పాల్గొనకపోతే, మీ జీవితం పట్ల ప్రభువు యొక్క పిలుపుకు మీరు విధేయత చూపించడం లేదు. ఏ ఒక్కరూ తప్పించుకోలేరు! యేసు కవాతు ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి, అవి రాజీపడవలసిన అంశాలు కావు మరియు మనలో ప్రతి ఒక్కరి నుండి విధేయతగల చర్యను ఆయన ఆశిస్తున్నాడు.

నేను ఇంత ధైర్యంగా ఉండగలను ఎందుకంటే గొప్ప ఆజ్ఞ నన్ను అలా చేయమని బలవంతం చేస్తుంది. నా వారంలోని ప్రతి రోజు, నేను క్రీస్తు యిచ్చిన ఈ ఆజ్ఞమీద ధ్యానముంచుచున్నాను. పగలు రాత్రి దానిచేత నేను ప్రేరేపించబడుచున్నాను. వెనక్కి తిరిగి చూస్తే, నేను పరిచర్యలోకి వెళ్ళక ముందు కూడా అది నిజం. ముందుకు చూస్తే, ఆయన గొప్ప ఆజ్ఞ నన్ను ఎప్పుడూ పదవీ విరమణ చేయకుండా చేస్తుంది. నేను దీన్ని సమర్థవంతంగా చేయగలిగినంత కాలం దీన్ని చేయబోతున్నాను. నేను చేయాలని క్రీస్తు ఆశిస్తున్నాడు!

నేను ఎప్పటికీ వదలను! నేను ఒంటరి ప్రయాణంలో లేను. మనమందరం దీనిలో ఉన్నాము! అన్నింటికన్నా ఉత్తమమైనది, క్రీస్తు మనతో మార్గమంతటను ఉన్నాడు. ఆయన ఆరోహణమవటానికి ముందు ఆయన చివరి ప్రకటన మీకు గుర్తుందా?

ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నాను.(మత్తయి 28:20)

అది గొప్పది కాదా? నా చిన్నతనంలో క్రీస్తు నాతో ఎక్కువ లేడు, అలాగే పదేళ్ళ తర్వాత నాతో ఉండేదానికంటే ఎక్కువగా యిప్పుడు నాతో లేడు. ఆయన ఎప్పటినుంచో ఉన్నాడు, స్థిరంగా నిమగ్నమై ఉన్నాడు, నిరంతరం తనను తాను అందుబాటులో ఉంచుకున్నాడు మరియు మనం చేయాలనుకున్నది చేయటానికి నమ్మకంగా శక్తినిస్తున్నాడు.

ప్రశ్న ఏమిటంటే, “మనము అది చేస్తున్నామా?”

చైనాలో క్రొత్త విశ్వాసుల ఆశ్చర్యకరమైన సంఖ్య మనల్ని ప్రోత్సహిస్తుంది. . .మరియు మనకు సవాలు చేస్తుంది. అక్కడ సరైన విద్యార్హతలేని పాస్టర్లకు మరియు సంఘ నాయకులకు శిక్షణ ఇవ్వడానికి మరియు శిష్యులనుగా చేయటానికి చైనా అంతటా ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ కోసం దేవుడు తలుపులు తెరుస్తున్నాడు. ఇటీవల మాతో కలిసిన పాస్టర్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నాము మరియు వారు చైనా క్రిస్టియన్ కౌన్సిల్ అని పిలువబడే ప్రభుత్వం మంజూరు చేసిన సంస్థలో భాగమైయున్నారు. కానీ మా ప్రణాళికలు విస్తరిస్తున్నాయి-దేవుడు ప్రపంచంలోని మరెన్నో ప్రదేశాలలో ఇలాంటి తలుపులు తెరుస్తున్నాడు! యువ విశ్వాసులు మరియు క్రొత్త పాస్టర్లు దేవుని వాక్య సంపదను కనుగొనటానికి ఆకలితో ఉన్నారు. . . మరియు ఎలా సమర్థవంతంగా చేయాలో వారికి నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము.

దేవుడు గొప్ప ఆజ్ఞ‌ను నెరవేరుస్తున్నాడు. . . మరియు మేము దానిలో ఒక ముఖ్యమైన భాగం అయ్యాము! మీరు మాతో కలవరా?

మళ్ళీ, నేను యిది సూటిగా చెబుతాను: మీ నమ్మకమైన ప్రార్థనలు మరియు ఆర్థిక ప్రమేయం లేకుండా, విజన్ 195 జరగదు. కలిసికట్టుగా మాత్రమే మన ప్రభువు కవాతు ఆదేశాలను పాటించగలము మరియు ఆయనను తెలుసుకోవాలనుకునే దేశాలకు చేరుకోగలము! దయచేసి తీవ్రంగా ప్రార్థించండి! దయచేసి ధారాళముగా పాలుపొందండి!

Copyright © 2018 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.

Posted in Church History-Telugu, Church-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.