వినయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించుటకు ఒక ప్రత్యేకమైన కాలము

అది వచ్చేసింది!

కొన్ని వందల సంవత్సరాలుగా వస్తున్న క్రిస్టమస్‌ సమయం మరోసారి మన గడపలోకి ప్రవేశించనుంది. అరవకుండా ఉంటే మంచిది, మూతి ముడుచుకోకుండా ఉంటే మంచిది, ఎందుకంటే షాపింగ్ ఆవరణ ఇప్పుడు మరియు డిసెంబర్ 25 మధ్య అనేక వేలసార్లు “జింగిల్ బెల్స్” పాట మోగిస్తానే ఉంటారు. మీరు జాగ్రత్తగా లేకపోతే, క్రిస్మస్ విందులో కడుపు నింపుకోవడానికి నాల్గవసారి సహాయం చేసి మీ కడుపును హింసించినట్లు ఈ జనాల రద్దీ మరియు వ్యాపార సంస్థలు మిమ్మల్ని హింసిస్తాయి. మరియు ఈ కాలము యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిఘటించే అలసిపోయిన వైఖరి కంటే అధ్వాన్నమైనది మరొకటి ఉండదు.

ఇది అనేక విధాలుగా సవాలుతో కూడిన సంవత్సరం అయినప్పటికీ, మనలో ప్రతి ఒక్కరికీ దేవుని కాపుదల మరియు కృప పట్ల కృతజ్ఞతతో దీనిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి మనకు ఆచరణీయ కారణం ఉంది. మనలను రాబోయే వారములగుండా తీసుకెళ్ళడానికి అనువైన మానసిక వైఖరిని ఈ చింతన చలనంలోనికి తెస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, వినయపూర్వకమైన కృతజ్ఞతా భావంతో పోషింపబడుచున్న ఆత్మ డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ వేడుకలో అంతర్భాగమైపోతుంది గాని, చివరికొచ్చేసరికి చిరాకు కలిగించే సహనానికి పరీక్షవలె ఉండదు.

మనము చెడుతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్నాము-అందులో అమాయక ప్రజలు తమ పని తాము చేసుకునేటప్పుడు కాల్చి చంపబడుచున్నారు, ఇక్కడ ప్రపంచ ప్రభుత్వాలు భయం ద్వారా నియంత్రించాలనే ఉద్దేశం ఉన్నవారిని ఆపడానికి శక్తిహీనముగా కనిపిస్తున్నాయి. కానీ మనం నిరుత్సాహముతో సంవత్సరాన్ని ముగించటం భరించలేము. నేనూ-మీలాగే-కష్టమైన క్షణాలలో కూడా దేవుని రక్షణ మరియు దయ యొక్క హస్తమును చూశాను మరియు అనుభవించాను.

క్రిస్మస్ కాలములో, కృతజ్ఞతాలేమి మన మత సిద్ధాంతాలను గూర్చిన ప్రధాన సూత్రంగాను లేదా సంశయవాదం మనకు అడ్డురాయిగా ఉండకూడదని మనం ప్రతిజ్ఞ చేద్దాం. మన జీవితాల్లో మరియు మనం ప్రేమించేవారి జీవితాలలో దేవుని సదుపాయాన్ని మనం నిరంతరం గుర్తుచేసుకుంటే, ఈ కాలం ఆత్మీయ సుసంపన్నం, వ్యక్తిగత పునరుద్ధరణ మరియు నిజమైన కృతజ్ఞత యొక్క ప్రత్యేక సమయం అవుతుంది.

కొన్నిసార్లు, దేవుని ప్రేమ మరియు విశ్వాస్యత యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నప్పటికీ, దేవునికి అనుదినము కృతజ్ఞతలు చెల్లించడం మరియు ఆయన హస్తమును వెతకడం ఒక సవాలుగా ఉండవచ్చు. మీరు ఈ పరిస్థితిలో మిమ్మల్ని కనుగొంటే, మిమ్మల్ని తిరిగి దారిలోనికి తీసుకురావడానికి తరచూ కీర్తనలు గొప్ప మూలంగా ఉన్నాయి.

116 వ కీర్తన ప్రేమ యొక్క అసాధారణ వ్యక్తీకరణ-దేవునికి సంబోధించబడింది! “దేవా, నేను నిన్ను ఎలా ప్రేమించను?” అని కీర్తనాకారుడు అడిగినట్లు ఉంది. తన సమాధానాలలో, అతను దేవుని మంచితనం మరియు విమోచన గురించి అనేక అద్భుతమైన సత్యాలను పేర్కొన్నాడు.

యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించియున్నాడు.
కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
ఆయన నాకు చెవియొగ్గెను
కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱపెట్టుదును
మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను
పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను
శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
అప్పుడు–యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని
యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
యెహోవా దయాళుడు నీతిమంతుడు
మన దేవుడు వాత్సల్యతగలవాడు.
యెహోవా సాధువులను కాపాడువాడు.
నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసియున్నాడు.
తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. (116:1-7)

మన దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తాము? ఆయన మన పట్ల మంచిగా ఉన్న అనేక సందర్భాలను లెక్కించడం ద్వారా మరియు కీర్తనాకారుడు చేసినట్లుగా, ఆయన మంచితనాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తాము. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మన వినయపూర్వకమైన ధన్యవాదాలు. మన హృదయపూర్వక కృతజ్ఞతలు. మనం జీవితం పట్ల బలమైన కోరిక కలిగియుండాలని, ఆయన మనకు అప్పగించిన ప్రతిదినమునూ ప్రశస్తముగా నెంచి భద్రపరచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మీకు నిశ్శబ్ద క్షణం దొరికినప్పుడు, మన ప్రేమగల ప్రభువునకు మీ స్వంత హృదయపూర్వక కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ, మొత్తం కీర్తనను చదవండి.

ఈ అద్భుతకాలం మరల మీపై బలమైన లోతైన ప్రభావాన్ని చూపనివ్వండి. ఆయన మనకు చాలా ఉత్తమమైన బహుమతిని ఇచ్చేంతగా, దేవుడు నిన్ను మరియు నన్ను అన్ని విధములుగా తన హృదయంతో ప్రేమిస్తున్నాడు: జీవము, తన కుమారుని రూపంలో చుట్టబడింది. ఈ జీవమునే-సమృద్ధిగా ఉన్న జీవమును-యేసు వాగ్దానం చేసినది. ఈ కాలము యొక్క నిజమైన స్పూర్తి ఇదే.
వినయంగా కృతజ్ఞత కలిగి జీవిద్దాం.

Copyright © 2011 by Charles R. Swindoll, Inc.

Posted in Christian Living-Telugu, Christmas-Telugu, Prayer-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.