దేవుడు, మతం మరియు రక్షణ గురించి పోటీ సిద్ధాంతాలతో ప్రపంచం నిండి ఉంది. యేసును గూర్చిన భిన్నాభిప్రాయములు ప్రతి మలుపులో మన దృష్టికి అడ్డుపడతాయి. ఎప్పటికప్పుడు మారుతున్న ఆలోచనల ఎడారిలో వేర్వేరు దేవతలకు వేర్వేరు మార్గాలు వాటంతటవే వ్యాపారం చేసుకుంటున్నాయి. అయినప్పటికీ, ఈ విరుద్ధమైన వాదనల మధ్యలో, యేసుక్రీస్తు ధైర్యంగా ఇలా చెప్పాడు: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు”(యోహాను 14: 6).
విభిన్న తత్వాలు మరియు మతాల మార్గాలను సూచించే సంకేతాలతో నిండిన గందరగోళ ప్రపంచంలో, మనము మన పాదాలను సరైన మార్గంలో నిలిపామని ఖచ్చితంగా చెప్పగలమా? ఈ ప్రశ్నకు సమాధానం, ఎక్కువ భాషలలోకి అనువదించబడి మానవ చరిత్రలో మరే ఇతర పుస్తకాన్ని చదవనంతమందిచేత చదవబడి, ఎప్పటికీ ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకం నుండి వస్తుంది. బైబిల్ నాలుగు ముఖ్యమైన సత్యాలతో దేవుని మార్గాన్ని సూచిస్తుంది.
1. మన ఆత్మీయ పరిస్థితి
మొదటి సత్యం వ్యక్తిగతమైనది. లేఖనము యొక్క అద్దంలో ఒకసారి చూసినట్లైతే మన మానవ పరిస్థితి బాధాకరంగా స్పష్టమవుతుంది:
నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు
గ్రహించువాడెవడును లేడు
దేవుని వెదకువాడెవడును లేడు
అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.
మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. (రోమా 3: 10-12)
మనమందరం పాపులము అలాగే పూర్తిగా భ్రష్టులమైపోయాము. అంటే, మానవజాతికి తెలిసిన ప్రతి దారుణానికి మనము పాల్పడ్డామని దీని అర్థం కాదు. మనం పూర్తిగా చెడిపోయి దౌర్భాగ్యులమైపోయేంత చెడ్డవారముగా అవ్వలేదు. పాపము మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, మాటలు మరియు క్రియలన్నిటి విషయమై సిగ్గుపడునట్లు చేస్తుంది.
మీరు కొంతకాలంగా ఉన్నట్లైతే, మీరు దీన్ని ఇప్పటికే నమ్ముతారు. చుట్టూ చూడండి. మన చుట్టూ ఉన్న ప్రతిదీ మన పాపపు స్వభావం యొక్క కళంకపు గుర్తులను కలిగి ఉంటుంది. పరిపూర్ణ ప్రపంచాన్ని సృష్టించడానికి మనం ఉత్తమ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, నేరాల గణాంకాలు పెరుగుతూనే ఉన్నాయి, విడాకుల రేట్లు పెరుగుతూనే ఉన్నాయి మరియు కుటుంబాలు బద్దలైపోతున్నాయి.
మన సమాజంలో మరియు మనలో ఏదో చాలా ఘోరమైనది జరిగిపోయింది, ఏదో మరణకరమైనది. ప్రపంచం ఈ పాపాన్ని క్రొత్త విధానంలో చూపించినను, “మొదట నేను” అనే జీవనం కఠినమైన వ్యక్తిత్వం మరియు స్వేచ్ఛకు సమానం కాదు; ఇది మరణానికి సమానం. పౌలు రోమీయులకు రాసిన లేఖలో చెప్పినట్లుగా, “పాపమువలన వచ్చు జీతము మరణము” (రోమా 6:23). మన ఆత్మీయ మరియు శారీరక మరణం అనేది మన పాపానికి దేవుని నీతివంతమైన తీర్పు నుండి కలుగుతుంది. దానితో పాటు అన్ని మానసిక మరియు ఆచరణాత్మక ప్రభావాలు ఈ ఎడబాటు వలన మనము రోజూ అనుభవించుచున్నాము. ఇది మనల్ని రెండవ సూచికకు తీసుకువస్తుంది: దేవుని స్వభావము.
2. దేవుని స్వభావము
పాపపు స్థితిలోనే జన్మించిన మనలను దేవుడు ఎలా తీర్పు తీర్చగలడు? మన చెడుతనమంతయు ఈ ప్రశ్నకు సగం సమాధానం మాత్రమే ఇస్తుంది. మిగిలిన సగం సమాధానం దేవుని అనంతమైన పరిశుద్ధత యిస్తుంది.
విషయాలు ఉండవలసిన విధముగా లేవనే వాస్తవాలను మనం గ్రహించినప్పుడు, అవి మనలను మించిన మంచితనము వైపు సూచించుచున్నవి. నిత్యత్వం యొక్క ఈ వైపున మన జీవితంలో అన్యాయం యొక్క భావన మన వాస్తవికతకు మించిన న్యాయము యొక్క ఖచ్చితమైన ప్రమాణాన్ని సూచిస్తుంది. ఆ ప్రమాణం మరియు మూలం దేవుడే. మరియు దేవుని పరిశుద్ధత యొక్క ప్రమాణం మన పాపపు స్థితికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
“దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” (1 యోహాను 1: 5) అని లేఖనము చెబుతోంది. దేవుడు ఖచ్చితంగా పరిశుద్దుడు-ఇది మనకు సమస్యను సృష్టిస్తుంది. ఆయన అంత పరిశుద్దుడైతే, అంత అపవిత్రులమైన మనం ఆయనతో ఎలా సంబంధం కలిగి ఉండగలము?
ఒకవేళ మనం మంచి వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నించవచ్చు, మన మంచి పనుల వైపు మొగ్గు చూపడానికి అనుకూలంగా సమతుల్యతను ప్రయత్నించవచ్చు లేదా స్వీయ-అభివృద్ధి కోసం వివేచన మరియు జ్ఞానాన్ని వెదకవచ్చు. చరిత్ర అంతటా, ప్రజలు పది ఆజ్ఞలను పాటించడం ద్వారా లేదా వారి స్వంత నీతి నియమావళిని పాటించడం ద్వారా దేవుని ప్రమాణాలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించారు. దౌర్భాగ్యముగా, దేవుని ధర్మశాస్త్రము యొక్క కోరికలను తీర్చడానికి ఎవరూ దరిదాపుల్లోకి కూడా రాలేరు. “ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది,” అని రోమా 3:20 చెబుతోంది.
3. మన అవసరత
ఇదిగో, మనం స్వభావసిద్ధముగా పాపులము, అలాగే బుద్ధిపూర్వకముగా పాపులము. అలాంటి మనం మన పరిశుద్ధ సృష్టికర్తతో సంబంధాన్ని సాధించడానికి ఎవరి సహాయం లేకుండ మనంతట మనమే పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మనము ప్రయత్నించిన ప్రతిసారీ, మనం స్పష్టమైన ఇబ్బందిపెట్టు పరిస్థితుల్లో పడిపోతాము. మన పాపాన్ని కప్పిపుచ్చడానికి మనం మంచి జీవితాన్ని జీవించలేము, ఎందుకంటే దేవుని ప్రమాణం “సరిపెట్టుకునేది” కాదు – ఇది పరిపూర్ణమైనది. మన పాపం సృష్టించిన నేరానికి చనిపోకుండా మనం సవరణలు చేయలేము.
ఈ గందరగోళం నుండి మనల్ని ఎవరు బయట పడవేయగలరు?
ఎవరైనా సంపూర్ణంగా జీవించగలిగితే, దేవుని ధర్మశాస్త్రమును గౌరవిస్తూ, పాపం యొక్క మరణశిక్షను మన స్థానంలో-మన స్థానంలో భరిస్తే, అప్పుడు మన దుస్థితి నుండి మనము రక్షింపబడతాము. అయితే అలాంటి వ్యక్తి ఉన్నారా? స్తోత్రం, అవును ఉన్నారు!
మీకు మారుగానుంచబడినవాడైన—యేసుక్రీస్తును కలవండి. మీకోసం మరణం యొక్క స్థానమును ఆయన తీసుకున్నాడు!
ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని [యేసుక్రీస్తును] మనకోసము [దేవుడు] పాపముగా చేసెను. (2 కొరింథీయులకు 5:21)
4. దేవుని ఏర్పాటు
మన పాపముల కొరకు సిలువపై చనిపోయేలా దేవుడు తన కుమారుడైన యేసును పంపించి మనల్ని రక్షించాడు (1 యోహాను 4: 9-10). యేసు పూర్తిగా మానవుడు మరియు పూర్తిగా దైవవంతుడు (యోహాను 1: 1, 18). ఈ సత్యము ఆయన మన బలహీనతల గురించి అర్థం చేసుకుంటాడని, క్షమించే శక్తిగలవాడని మరియు దేవునికి మనకి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చే సామర్థ్యంగలవాడని నిర్ధారిస్తుంది (రోమా 5: 6-11). సంక్షిప్తంగా, మనము “ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నాము” (రోమా 3:24). ఈ వచనంలోని రెండు పదాలకు మరింత వివరణ అవసరమైయున్నది: నీతి మరియు విమోచన.
నీతి అనేది కనికరముతో కూడిన దేవుని కార్యము. మనమింకను పాపపు స్థితిలో ఉండగానే విశ్వసించు పాపులను ఆయన నీతిమంతులుగా తీర్చుతాడు. నీతి అంటే మనం యింకెన్నడూ పాపము చేయకుండా ఉంటామని మనలను నీతిమంతులుగా ఆయన తీర్చలేదుగాని ఒక న్యాయాధిపతి దోషిగా ఉన్న నేరస్థుడిని క్షమించినట్లు ఆయన మనలను నీతిమంతులుగా ప్రకటించాడు. యేసు మన పాపాన్ని తనపై వేసుకొని, సిలువపై మన తీర్పును అనుభవించినందున, దేవుడు మన రుణాన్ని క్షమించి, మనం క్షమించబడ్డామని ఆయన ప్రకటించాడు.
విమోచన అనేది పాపం యొక్క బానిసత్వం నుండి మనలను విడిపించడానికి పూర్తి వెల చెల్లించే క్రీస్తు కార్యము. మన భూత, వర్తమాన, మరియు భవిష్యత్తు పాపాలన్నిటి కొరకు తన ఉగ్రతను భరించడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు (రోమా 3: 24-26; 2 కొరింథీయులకు 5:21). వినయపూర్వకమైన విధేయత చూపినవాడై, క్రీస్తు మన కొరకు సిలువ యొక్క అవమానమును ఇష్టపూర్వకంగా సహించాడు (మార్కు 10:45; రోమా 5: 6-8; ఫిలిప్పీయులకు 2: 8). క్రీస్తు మరణం దేవుని నీతి కోరికలను తృప్తిపరచింది. ఆయన ఇకపై మన పాపములనుబట్టి మనలను అసహ్యించుకోడు, ఎందుకంటే ఆయన సొంత కుమారుడు వాటికి పరిహారం చెల్లించాడు. మనం మరలా బానిసలుగా ఉండకూడదని పాపము యొక్క బానిస అంగట్లో నుండి మనం విడుదల పొందాము.
క్రీస్తునందు మీ విశ్వాసముంచడం
యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనకు ఎలా ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నాడో ఈ నాలుగు సత్యాలు వివరిస్తున్నాయి. దేవుడు పూర్తిగా వెల చెల్లించినందున, మనలను కాపాడటానికి ఆయన నిత్యజీవము యొక్క ఉచిత బహుమానమునకు సంపూర్ణ విశ్వాసముతోను ధైర్యముతోను ప్రత్యుత్తరమివ్వాలి. మంచి పనులు చేయడం ద్వారా లేదా మంచి వ్యక్తిగా ఉండడం ద్వారా కాకుండా, ఉన్నపళంగా ఆయన వద్దకు రావడం ద్వారా, అలాగే విశ్వాసం ద్వారా ఆయన నీతిని మరియు విమోచనని అంగీకరించడం ద్వారా ఆయన మన కోసం సిద్ధం చేసిన దేవునితో ఉన్న సంబంధంలోకి మనం ముందుకు సాగాలి.
మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. (ఎఫెసీయులకు 2: 8-9)
మన పాప క్షమాపణ కోసం కేవలం క్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని రక్షణ బహుమానమును పొందుకుంటాము. మీ రక్షకునిగా క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మీ సృష్టికర్తతో సంబంధములోనికి ప్రవేశించాలని అనుకుంటున్నారా? అలా అయితే, మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మీరు ఉపయోగించదగ్గ సరళమైన ప్రార్థన ఇక్కడ ఉంది:
ప్రియమైన దేవా,
నా పాపం మీకు, నాకు మధ్య అడ్డుగోడగా నిలిచిందని నాకు తెలుసు. నా స్థానంలో చనిపోవడానికి మీ కుమారుడైన యేసును పంపించినందుకు వందనాలు. నా పాపములు క్షమించబడటానికి నేను యేసునందు మాత్రమే విశ్వాసముంచుచున్నాను, మరియు నిత్యజీవమను ఆయన బహుమానమును నేను స్వీకరించుచున్నాను. నేను యేసును నా స్వంత రక్షకునిగా మరియు నా జీవితానికి ప్రభువుగా ఉండుమని వేడుకొనుచున్నాను. వందనములు. యేసు నామంలో, ఆమేన్.
మీరు ఈ ప్రార్థన లేదా ఇలాంటిదే ప్రార్థించినట్లయితే, అలాగే బైబిల్లో దేవుని గురించి మరియు మీ కొరకు ఆయన ప్రణాళిక గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, ఇన్సైట్ ఫర్ లివింగ్ నందు మమ్మల్ని సంప్రదించండి. మీరు మా సిబ్బందిలోని బైబిల్ సలహాదారుని సంప్రదించవచ్చు.