సరైన ఆరోగ్యానికి సరైన పోషణ అవసరం.
శారీరక పోషణ యొక్క ప్రాముఖ్యతను ఎవరూ కాదనలేరు. మన శక్తి స్థాయిలు, జీవిత సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యం మరియు మానసిక వైఖరులు కూడా సరైన మొత్తంలో సరైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవటానికి నేరుగా అనుసంధానించబడి ఉంటాయి. అసమతుల్య ఆహారం తీసుకోండి, ఎక్కువ స్వీట్లు తినండి, చాలా త్వరగా ఉక్కిరిబిక్కిరవ్వండి లేదా భోజనం దాటవేయడం ప్రారంభించండి, అప్పుడు మీరు పర్యవసానంగా పరిణామాలను భరిస్తారు. మీరు అనారోగ్యంతోనో లేదా తల తేలికగా ఉన్నట్లుగానో భావించవచ్చు. మీరు చిరాకు లేదా నిరాశకు లోనవుతారు. కొన్నిసార్లు, మీరు కొద్దిగా వణకిపోతారు; నా కుటుంబం దీనిని “కలత చెందటం” అని పిలుస్తుంది. ఈ లక్షణాలు శరీరానికి తగినంత పోషణ లేదని చెప్పే మార్గం.
ఆత్మీయ ఆరోగ్యానికి కూడా ఇది వర్తిస్తుంది. తగినంత మరియు క్రమమైన బైబిల్ పోషణ లేకపోతే మన అంతరంగ జీవితాలు బాధపడతాయి. మన ఆత్మలు లేఖనాల ద్వారా పోషించబడటానికి మరియు శక్తిని పొందుకోవటానికి ఆశిస్తాయి. ఆరోగ్యకరమైన ఆత్మీయ ఆహారాన్ని జీర్ణించుకోవడానికి స్థిరమైన సమయాన్ని కేటాయించడంలో మనము విఫలమైనప్పుడు, పర్యవసానాలు ప్రారంభమవుతాయి. . . మరియు ఇది అందమైన దృశ్యం కాదు.
మనము దేవుని ఆత్మ కంటే శరీరానుసారముగా పనిచేయడం ప్రారంభిస్తాము. మనము నిస్సారంగా మరియు స్వార్థపూరితంగా, ఎక్కువ అధికారముతో అడుగుతాము, తక్కువ సున్నితంగా ఉంటాము. మనము అసహనంతో, దారుణంగా, కోపంగా స్పందిస్తాము. ఇవన్నీ లోపలి పోషకాహార లోపానికి సూచనలని ఖచ్చితంగా చెప్పవచ్చు.
మీ ఆత్మ సరిగ్గా పోషించబడాలంటే, పాస్టర్ లేదా బోధకుడు వారానికి ఒకసారి మీ ఆత్మీయ ఆహారాన్ని అందిస్తే సరిపోదు. మీరు రోజూ మీ స్వంత ఆత్మీయ ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి.
తన వాక్యముచేత మిమ్ములను మీరే పోషించుకున్నప్పుడు దేవుడు మీలో నెరవేర్చిన మూడు అద్భుతమైన వాగ్దానాలను 119 వ కీర్తన వెల్లడిస్తుంది. 98 వ వచనం మొదటిది: “నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి.” మీకు వ్యతిరేకంగా అసహ్యకరమైన విషయాలు చెప్పేవారికి మించిన జ్ఞానం మీరు కలిగి ఉంటారు. దేవుని వాక్యం భయము మరియు బెదిరింపులను అధిగమించి జీవించడానికి మిమ్మల్ని సమర్థులనుగా చేస్తుంది.
99 వ వచనం రెండవదాన్ని అందిస్తుంది: “కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.” లేఖనము యొక్క వడపోత సత్యాన్ని గుర్తించడానికి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీ ప్రొఫెసర్లు లేదా పర్యవేక్షకుల కంటే మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. మీ విశ్వాసంపై దాడి చేయాలనుకునేవారు ఎవరైనా మిమ్మల్ని బెదిరించబడరు, భయపెట్టబడరు. జీవించడానికి మనకు అంతర్దృష్టి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు!
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి,
అవి హృదయమును సంతోషపరచును.
యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది,
అది కన్నులకు వెలుగిచ్చును. (కీర్తన 19:8)
100 వ వచనం మూడవ వాగ్దానాన్ని ఇస్తుంది: “కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.” జ్ఞానం పొందడానికి మీరు వయస్సు వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకునే విషయానికి వస్తే మనకన్నా దశాబ్దాల వయస్సు ఉన్న వ్యక్తులకంటే మనం ఒక అడుగు ముందున్నామని లేఖనాలు తెలియజేస్తున్నాయి.
ఒక మాటలో చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం వల్ల జ్ఞానం, అంతర్దృష్టి మరియు అవగాహన లభిస్తుంది. మనము తరచూ ఈ పదాలను పరస్పరం మార్చుకుంటాము, కాని అవి ఒకటి కావు.
- జ్ఞానం అంటే జీవితాన్ని దేవుడు చూసినట్లుగా చూడగల సామర్థ్యం.
- అంతర్దృష్టి అనేది జీవిత పరిస్థితుల గుండా చూడగల సామర్థ్యం-స్పష్టమైనదాన్ని లేదా విశదమైనదాన్ని దాటి చూడటం.
- అర్థం చేసుకోవడమనే, శ్రేష్టమైన ఆశీర్వాదం, జీవితానికి సరిగ్గా స్పందించే సామర్థ్యం కలిగియుండటం.
మీ ఆత్మీయ ఆరోగ్యం మీ స్వంత ఆత్మీయ భోజనాన్ని సిద్ధపరచుకోవడం మరియు దేవుని సత్యాలను రుచిచూడటంపై ఆధారపడి ఉంటుంది. మీ శరీరములోకి దేవుని వాక్యాన్ని పంపడానికి కనీసం ఐదు మార్గాలు ఉన్నాయి మరియు వాటిని గుర్తుంచుకోవడానికి సులభమైన మార్గం మీ చేతిని దృష్టాంతంగా ఉపయోగించడం. కాబట్టి, కాగితపు ముక్కను తీసుకుని, మీ చేతి జాడను గుర్తించి, మీ ఐదు వేళ్ళపై ఈ క్రింది అంశాలను రాయండి.
- వినండి. మీ చిటికనవ్రేలు వివరణాత్మక బోధన ద్వారా లేఖనమును వినడాన్ని సూచిస్తుంది. వినడం అనేది వాక్యమును తీసుకోవడానికి సరళమైన మార్గం. “వినుటవలన విశ్వాసము కలుగును” అని అపొస్తలుడైన పౌలు రాశాడు (రోమా 10:17).
- చదవండి. మీ ఉంగరపు వ్రేలు బైబిలు చదవడాన్ని సూచిస్తుంది. మీరు కేవలం వాక్యం వినేవారిగా మాత్రమేగాక పాఠకులుగా మారినప్పుడు మీరు ముందుకు దూసుకుపోతారు. కాబట్టి, బైబిలు చదివే ప్రణాళికను కనుగొని దానికి కట్టుబడి ఉండండి!
- అధ్యయనం. మీ మధ్య వ్రేలు లేఖనాలను అధ్యయనం చేయడాన్ని సూచిస్తుంది. అధ్యయనం అంటే పెన్సిల్ మరియు కాగితంతో చదవడం. అధ్యయనం అంటే మీ పరిశీలనలను వ్రాయడం, వచనం యొక్క అర్థాన్ని గుర్తించడం, సంబంధిత వాక్యాలను చూడటం మరియు దేవుని వాక్యాన్ని ఎలా ఆచరణలో పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారో పొందుపరచడం.
- కంఠస్థము చేయండి. మీ చూపుడు వ్రేలు లేఖనాన్ని కంఠస్థం చేసుకోవడాన్ని సూచిస్తుంది. మీరు లేఖనాన్ని మీ హృదయంలో దాచుకున్నప్పుడు మీరు నిజంగా వినియోగించటం ప్రారంభిస్తారు.
- ధ్యానించండి. చివరగా, మీ బొటనవ్రేలు-మిగిలిన వాటి చుట్టూ చుట్టబడి ఉండేది-ఇది లేఖనం గురించి ధ్యానం చేయడాన్ని సూచిస్తుంది. కీర్తనాకారుడు ఇలా వ్రాశాడు, “నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను” (కీర్తన 119:15). ధ్యానమంటే ఇదే: దేవుని వాక్యాన్ని విచారించుటకు సమయాన్ని తీసుకోవడం మరియు అది మీ హృదయం లోపలికి చేరనివ్వండి.
ఈ సంవత్సరాన్ని మీరు ఆత్మీయ కలతలను పొందని సంవత్సరంగా చేసుకోండి! దేవుని వాక్యమును ప్రతిరోజూ భుజించండి. మీరు విన్న, చదివిన, అధ్యయనం చేసిన, కంఠస్థం చేసిన మరియు ధ్యానం చేసిన వాటితో మీ మనస్సును నింపుకోండి. ఇంటి పనులను చేసేటప్పుడు, ఉద్యోగ రాకపోకలప్పుడు లేదా నడిచేటప్పుడు లేఖనము గురించి ఆలోచించండి. మీరు రాత్రి నిద్రించడానికి ఉపక్రమించేటప్పుడు సత్యం మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. దేవుని వాక్యాన్ని మీ కడుపులో వేయండి మరియు మీ యొక్క ప్రతి నరము దాన్ని గ్రహించునట్లుగా చేయండి. అప్పుడది ఎంత ఆరోగ్యకరమైన మరియు పరిపూర్ణమైన సంవత్సరం అవుతుందో కదండీ!