పిల్లలు చెప్పే సమాధానాల్లో ఏదో అందం మరియు అమాయకత్వం ఉంటుంది. ఎందుకు? వారికి అర్థమైనంతలో–పిల్లలు నిజమే మాట్లాడతారు. బైబిల్ గురించిన ప్రశ్నలకు కొంతమంది పిల్లలు ఇచ్చిన ఈ సమాధానాలు నాకు చాలా ఇష్టం. ఇవి చిరునవ్వులు చిందించకపోతే నన్నడగండి:
- “నోవహు భార్యకు జోయాన్ ఆఫ్ ఆర్క్ అని పేరు పెట్టారు.”
- “ఐదవ ఆజ్ఞ ఏమిటంటే, ‘నీ తండ్రిని మరియు నీ తల్లిని నవ్వించండి.'”
- “లోతు భార్య పగలు ఉప్పు స్తంభం మరియు రాత్రి అగ్ని గోళం.”
- “ఒక క్రైస్తవుడికి ఒక్క భార్యే ఉండాలి. దీనినే విసుగు అంటారు.”
ఆ సమాధానాలు గొప్పవి కాదా? పిల్లల కంటే ఉల్లాసభరితంగా, కల్లాకపటం లేనివారుగా, అమాయకంగా, లేదా నిరాడంబరంగా ఎవరైనా ఉంటారా? వేరేవాళ్ళ బిరుదు, జీతం లేదా చదువుతో పిల్లలను ఆకట్టుకోలేరు. వారు మీరు ధరించే బట్టలు లేదా మీరు నడిపే కారును చూసి అసూయపడరు. పెద్దలు మాత్రమే ఆ విషయాలకు మైమరచిపోతారు.
పిల్లల గురించి ప్రపంచ దృష్టికోణం ఏమిటంటే వారిని చూడాలి అంతేగాని వారి మాటలు వినకూడదు. అయితే, దేవుని దృక్కోణం దీనికి విరుద్ధంగా ఉంది. ఆయన వారి విలువను మరియు వారి యోగ్యతను చూస్తాడు.
గొప్పతనం గురించిన ప్రశ్నకు సమాధానమిచ్చేటప్పుడు ప్రభువు చిన్నబిడ్డను ఉదాహరణగా ఎన్నుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ప్రశ్నను మత్తయి ఈ విధంగా రూపొందించాడు:
శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా (మత్తయి 18:1).
పన్నెండు మంది యేసును ఆ ప్రశ్న ఎందుకు అడిగారో తెలుసా? ఎందుకంటే వారు తమలో ఎవరు గొప్పవారని వాదించుకున్నారు (మార్కు 9:34). ఇప్పుడు, దీన్ని ఊహించుకోండి. వారి ప్రశ్నకు సమాధానమివ్వడానికి, యేసు యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను–మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను (మత్తయి 18:2-3).
యేసు సమాధానమిచ్చేటప్పుడు పన్నెండుమంది నోరెల్లబెట్టుకున్నట్లు మీరు ఊహించుకోగలరా? ఈ స్పందన శిష్యులు ఊహించినది కాదు. వారు పిల్లలను అముఖ్యంగా, గోల చేసే అంతరాయాలుగా మరియు అప్రధానంగా చూసారు (మార్కు 10:13-15). ఖచ్చితంగా గొప్పగా మాత్రం కాదు! యేసు ఆ ఆలోచనను తలక్రిందులు చేశాడు. “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని,” అని యేసు వారికి చెప్పాడు. మీరు చూడండి, పన్నెండు మంది తప్పు త్రోవలో వెళ్లుచున్నారు. గొప్పతనం గురించిన వారి తప్పుదారి పట్టించే ఆలోచన వారిని దేవుని రాజ్యం గురించి తప్పుడు నిర్ధారణలకు నడిపించింది. “మిమ్మల్ని మార్చడానికి మీరు నన్ను అనుమతించకపోతే, మీరు పరలోకరాజ్యమును గురించిన సత్యాన్ని మీరు చేజార్చుకుంటారు,” అని యేసు చెప్పినట్లుగా ఉంది.
వాళ్లు “బిడ్డలవంటి వారైతేనే” అని చెప్పడంలో యేసు యొక్క ఉద్దేశ్యమేమిటి? పిల్లల యొక్క లక్షణాలు అనేకం ఉన్నాయి, వాటిలోనుండి యేసు సూచించి ఉండవచ్చు. ఇవి నేను గమనించిన నాలుగు లక్షణాలు:
- పిల్లల్లో అమాయకత్వం ఉంటుంది. అంటే రాతిగుండె లేకపోవడాన్ని నేను సూచిస్తున్నాను. వారు పాపం లేనివారని నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యం ఏమిటంటే వారు నమ్ముతారు మరియు తరచుగా అమాయకులు. ప్రతి ఒక్కరినీ నమ్మకూడదని మనం వారికి నేర్పించాలి.
- పిల్లలకు ఆశ్చర్యపడే శక్తి ఉంటుంది. ఉత్సుకత మరియు సృజనాత్మకతను యుక్తవయస్సు దొంగిలించే ముందు, చిన్నబిడ్డ ప్రశ్నలతో నిండి ఉంటాడు.
- పిల్లలు నిజంగా క్షమిస్తారు. వారిపట్ల కఠినంగా ప్రవర్తించినప్పటికీ, తరచుగా విస్మరించబడినప్పటికీ మరియు అప్పుడప్పుడు దూషించబడినప్పటికీ, ప్రేమచేత అవమానాలను కప్పిపుచ్చే అద్భుతమైన సామర్థ్యాన్ని పిల్లలు కలిగి ఉంటారు.
- పిల్లలు వాళ్ళు వాళ్ళలా ఉంటారు. నటన లేదు, ప్రదర్శన లేదు, మోసం లేదు.
మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? నిజమైన గొప్పతనానికి అవసరమైన పిల్లల వంటి లక్షణాలలో పైన చెప్పబడిన వాటిలోనుండి దేనినీ యేసు ఎన్నుకోలేదు. యేసు ఇలా కొనసాగిస్తున్నాడు: “కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:4)
యేసు తగ్గింపును గొప్పతనం యొక్క ప్రాథమిక లక్షణంగా ఎంచుకున్నాడు.
నన్ను మిమ్మల్ని అడగనివ్వండి: పరలోకరాజ్యంలో తగ్గింపు కలిగిన బిడ్డను మీరు గొప్ప వ్యక్తిగా చూస్తున్నారా? నేను నిజం చెబుతున్నాను. ఆ దృక్పథాన్ని నేను నిరంతరం గుర్తుపెట్టుకోవాలి–రోజూ. ఎందుకు? మీలాగే, నేనూ అధికారం, గర్వం, డబ్బు, మరియు తెలివికి విలువనిచ్చే ప్రపంచంలో జీవిస్తున్నాను.
మీరు గొప్పగా ఉండాలనుకుంటున్నారా? మీరు శాశ్వత ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారా? మీరు గణనీయమైన సహకారం అందించాలనుకుంటున్నారా? మనం నిజమైన గొప్పతనం గురించి మాట్లాడుతున్నట్లయితే-అది చెడ్డ ఆశయం అని నేను అనుకోను. ఇక్కడ రెండు సూచనలు ఉన్నాయి, ఎక్కడ ప్రారంభించాలని యేసు చెప్పాడో అక్కడ నుండి ప్రారంభించండి:
మొదటిది, పిల్లలతో సన్నిహితంగా ఉండండి. పిల్లలను మీ జీవితం నుండి దూరం చేసుకోవద్దు. నేను తాతగా మరియు ముత్తాతగా మారినందున, పిల్లల జీవితాలపై నేను చూపగల ప్రభావం-అలాగే వారు నాపై చూపగల ప్రభావాన్ని గతంలో కంటే ఎక్కువగా నేను గ్రహించాను. ఎవరైనా గొప్పవారితో లేదా చిన్నవారితో సాయంత్రం గడిపే సందర్భం మీకు వస్తే, రెండోదాన్నే ఎంచుకోండి. మీరు ఆ బిడ్డ నుండి ఎంతో నేర్చుకుంటారు అలాగే మీరు కూడా అతని లేదా ఆమెలో ఎంతో పెట్టుబడి పెడతారు.
రెండవది, మీలో నిజమైన, పిల్లలలాంటి వినయాన్ని పెంపొందించమని దేవుడిని అడగండి. మీ అహాన్ని తగ్గించమని, తీవ్రమైన పోటీతత్వంపై మీ పట్టును విడిచిపెట్టమని మరియు మీ కఠినమైన మాటలను మృదువుగా చేయమని ఆయనను అడగండి. పిల్లలు చెప్పేది చెప్పడం ప్రారంభించండి (మరియు అదే ఉద్దేశం కలిగియుండండి)-ఇదిగో ఇలాంటి మాటలు చెప్పండి: ప్లీజ్, నేను చేయవచ్చా? ధన్యవాదాలు, నన్ను క్షమించండి, నేను నిన్ను క్షమించాను, మరియు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బిడ్డలవంటి లక్షణాలు వినయానికి లక్షణాలు. అవి క్రీస్తు లక్షణాలు.
మనమేమీ కారణం లేకుండా దేవుని పిల్లలమని పిలువబడలేదు. దేవుని వద్దకు వచ్చిన మనమందరం వినయపూర్వకమైన ఒప్పుకోలు ద్వారానే వచ్చాము:
ప్రభువైన యేసుక్రీస్తు, నేను చిన్నబిడ్డగా వచ్చాను. నేను మెప్పుపొందుకోవడానికి ఏమీ తీసుకురాలేదు. మీకు అర్పించదగిన విలువైన విజయాలు నా వద్ద లేవు. మీరు నా కోసం చనిపోయిన సిలువ యొద్దకు నేను విశ్వాసం ద్వారా మాత్రమే వచ్చాను.
నేను నా హృదయాన్ని, నా చిత్తాన్ని, నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను.
వినయమంటే అది, నా మిత్రమా.
మన అధునాతనమైన, వేగంగా కదిలే, ఒత్తిడితో కూడిన ప్రపంచంలో, మనం నిజంగా ముఖ్యమైనదానికి-బిడ్డల వంటి తగ్గింపు లక్షణాలకు తిరిగి రావాలి. మనం లోకం దృష్టిలో గొప్పతనాన్ని కోల్పోయి, పరలోక రాజ్యంలో నిజంగా గొప్పవాళ్లం కావాలి.