నా జీవితం యొక్క ప్రాముఖ్యమైన క్షణాలు

63 సంవత్సరాలుగా, నేను దాదాపు ప్రతిరోజూ అదే విధంగా ప్రారంభించాను. నా భార్య, సింథియా మరియు నేను ఉదయం 5:00 గంటలకు లేస్తాము. మేము ఏ సమయానికి పడుకున్నా సరే అలారం గడియారం అవసరం లేని విధంగా మేము దీన్ని చాలా కాలంగా చేస్తూ వస్తున్నాము. మొదటిగా మేము చేసేదేమిటంటే, నేను ముందు రోజు రాత్రి సిద్ధం చేసిన కాఫీపాట్‌ని మాలో ఒకరం ఆన్ చేస్తాము. అప్పుడు మేమిద్దరం కలిసి మా మంచాన్ని సర్దుతాము, ఈలోపు కాఫీ కాగుతుంది. అది సిద్ధమైనప్పుడు, మేము రెండు పెద్ద కప్పులలో కాఫీ పోసుకొని కాఫీపాట్ శుభ్రం చేస్తాము. అప్పుడు మేము మా కుటుంబ గదిలో మాకు ఇష్టమైన, సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చొని మా రోజును ప్రారంభిస్తాము.

మేము మా యిద్దరి మనస్సుల్లో ఉన్నవాటన్నిటిని గూర్చి మాట్లాడుకోవడానికి మంచిగా, గట్టిగా ఒక గంటసేపు కేటాయిస్తాము–అంటే మా పిల్లలు మరియు మనవళ్ళు మనవరాళ్ల గురించి, మా బంధువులను గూర్చి, ఆ రోజు చేయవలసిన పనులను గూర్చి, మా సంఘ పరిచర్య మరియు ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎదుర్కొనే సవాళ్ళు మరియు సంతోషాల గురించి మాట్లాడుకుంటాము. తప్పనిసరిగా పరిష్కరించాల్సిన హృదయ వేదనలు అందులో ఉంటాయి. అలాగే ఈ రెండు పరిచర్యల్లోనున్న అత్యుత్తమ సిబ్బంది వలన కలిగిన ఆశీర్వాదాలు కూడా మా సంభాషణల్లో ఉంటాయి. కొన్నిసార్లు మేము బిగ్గరగా, ఐచ్ఛికముగా నవ్వుతాము. చాలాసార్లు మేము విరిగిన హృదయాలతో రోదిస్తాము. ఎల్లప్పుడూ, మేము వింటాము. కొన్నిసార్లు మేము ప్రార్థిస్తాము. ప్రతిసారీ, మేము మార్పు మరియు దిశానిర్దేశం కోసం దేవుని వాక్యము నుండి ఆలోచనలు, జ్ఞానం, ఓదార్పు మరియు సవాళ్లను తీసుకుంటాము.

నేను ఒకినావాలో మెరైన్‌గా సేవ చేస్తున్నప్పుడు తప్ప, మా నలుగురు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనవళ్ళు మనవరాళ్లు మరియు మునిమనవళ్ళు మునిమనవరాళ్లతో మా ఇల్లు నిండినప్పుడు . . . నెలల తరబడి మేము మా పనుల్లో మునిగిపోయి ఖాళీ లేకుండా ఉన్నప్పుడు . . . మాలో ఒకరు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చినటువంటి అలసిపోయే సమయాల్లోనూ, మేము దాదాపు ప్రతిరోజూ దీన్ని ఒక అలవాటుగా చేసుకున్నాము. మా పరిచర్య మమ్మల్ని ప్రపంచంలోని అవతలి వైపుకు తీసుకెళ్లినప్పుడు కూడా, సింథియా మా ప్యాకింగ్ లిస్ట్‌లో ఇలా రాసింది: “ఇన్సులేటెడ్ కాఫీ కప్పులు, ఇన్‌స్టంట్ కాఫీ, దాల్చిన చెక్క, చక్కెర మరియు కాఫీ-మేట్®.” కాబట్టి ఆ విలువైన సమయాన్ని కలిసి గడపకుండా ఉండటానికి ఎన్నడూ సాకులు చెప్పకూడదని, ఆమె నీటిని వేడి చేయడానికి ఒక చిన్న ఉపకరణాన్ని కూడా ప్యాక్ చేస్తుంది!

మేము పెళ్లి చేసుకున్న తర్వాత దేవుని వాక్యంతో మా ప్రేమ వ్యవహారం ప్రారంభం కాలేదు. మా చిన్ననాటి ఇళ్లలో బైబిల్ ఘనపరచబడింది మరియు బోధించబడింది. మేము యుక్తవయసులో కలుసుకున్నప్పుడు లేఖనాల యొక్క సత్యాలు మమ్మల్ని ఆకర్షించడం ప్రారంభించాయి. మేము మొదటిసారి డేటింగ్‌కి వెళ్లినప్పుడు సింథియాకి 16 మరియు నాకు 19 సంవత్సరాలు. ఒక వారం తర్వాత మేము నిశ్చితార్థం చేసుకున్నాము! వెంటనే, మేము వారానికి రెండు బైబిలు స్టడీలకు హాజరుకావడం ప్రారంభించాము. వాక్యపు జ్ఞానం మమ్మల్ని కట్టిపడేసింది.

కానీ లేఖనాలను అధ్యయనం చేయడానికి నాకు క్రమబద్ధమైన, నమ్మదగిన విధానం లేదు . . . మరియు నేను నిలకడగా ఉండి ప్రయోజనాలను పొందడం లేదు. 1955 జూన్‌లో నా కలల అమ్మాయి నా కళ్లలోకి చూస్తూ, “నేను అంగీకరిస్తున్నాను” అన్నప్పుడు అది మారడం ప్రారంభమైంది. మా ఇద్దరికీ జీవితం గురించి, వివాహం గురించి చాలా తక్కువ తెలుసు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామని మరియు మా మిగిలిన సంవత్సరాలను వేరొకరితో గడపాలనే ఆలోచనను భరించలేమనేది మాత్రం మాకు తెలుసు.

కాబట్టి, మేము చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నాము. మేమిద్దరం కలిసి పెరిగాం. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ, మేము కూడా ఒకరికొకరము అలాగే ప్రభువుకు సన్నిహితంగా పెరిగాము.

అది అంత తేలికగా జరగలేదు. వ్యక్తులు చిన్నవయస్సులో వివాహం చేసుకోరు మరియు ప్రమాదవశాత్తు 63 సంవత్సరాల తర్వాత ప్రేమలో మునిగిపోయి ఉండరు . . . మరియు ప్రజలు క్రైస్తవులుగా మారడం ద్వారా ప్రభువుకు సన్నిహితంగా ఎదగరు. మేము ఉద్దేశపూర్వకంగా ఒకరితో ఒకరము మరియు ప్రభువుతో ఉండటానికి సమయం కేటాయించడం వల్లనే ఈ రెండూ జరిగాయి. మేము ఈ రోజు వరకు అది చేస్తున్నాము.

ఆరు దశాబ్దాలకు పైగా వివాహ జీవితం మాకు నేర్పింది ఏమిటంటే, మీరు ఒకరికొకరు సమయాన్ని పెట్టడంలో సోమరితనం ఉండకూడదు. మీరు వృద్ధి చెందాలనుకునే ఏ సంబంధానికైనా ఇది వర్తిస్తుంది. యథార్థముగా ఉండటానికి మరియు పంచుకోవడానికి సమయం పడుతుంది అలాగే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. వినడం, నిజంగా వినడం, ఇంకా కష్టం. (స్విండోల్స్‌కు నిశ్శబ్దంగా ఉండటం గురించి తెలియదు!)

కానీ మేము మా కుటుంబ గదిలో కలిసి గడిపిన క్షణాలు మా జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన క్షణాలుగా మారాయి. ఒకరికొకరం మరియు మా గురించి మేము ఎన్నటికీ తెలుసుకోలేని విషయాలను చూడగలిగాము మరియు అర్థం చేసుకున్నాము. తరచుగా ఇతరులను విడదీసే సవాళ్లతో మేము కలిసి పోరాడాము. మా జీవితాలను మరియు మా పరిచర్యను రూపొందించిన పెద్ద నిర్ణయాలు మరియు రోజువారీ నిర్ణయాల కోసం మేము దేవుని వాక్యం నుండి దిశానిర్దేశం పొందుకున్నాము. మేము మా భయాలను పంచుకోవడం మరియు మా ఆలోచనలను గూర్చి మాట్లాడుకోవడం వలన గందరగోళం మరియు అనిశ్చితి అనేవి స్పష్టత మరియు విశ్వాసముగా మారిపోయాయి.

మేము ఒకరితో ఒకరు పెంచుకున్న బంధం లోతైనది, అర్థవంతమైనది మరియు విడదీయరానిది. మా ఇద్దరికీ మరియు ప్రభువుకు మధ్యనున్న బంధం విషయంలోనూ ఇదే నిజం.

ఆ బంధం కొరకు మా పసికందుల కంటే ముందు లేవడానికి నిద్రను చెడగొట్టుకున్న ప్రతి నిమిషం విలువైనదే . . . ఒకరితో ఒకరం నిజాయితీగా పంచుకునేటప్పుడు కొన్నిసార్లు వచ్చే ప్రతి గుండె నొప్పి విలువైనదే . . . మేము ఎప్పుడైనా వెనక్కి నెట్టవలసి వచ్చిన ప్రతి గడువు విలువైనదే. ముఖ్యమైనది చేయడానికి అత్యవసరమైన పనిని నిలిపివేయాలని నేను బాగా నమ్ముతాను. నా ప్రభువుతో మరియు నా భార్యతో కలవడం మరియు మాట్లాడడం ప్రతిరోజు నేను చేయవలసిన పనుల జాబితాలో అగ్రస్థానంలో ఉండాలని నేను చాలా కాలం క్రితమే నిర్ణయించుకున్నాను. నేను పెద్దవాడనవుతున్న కొద్దీ, ఆ నిర్ణయం తీసుకువచ్చిన వ్యత్యాసమును నేను బాగా అర్థం చేసుకున్నాను.

సింథియా మరియు నా యొక్క ప్రాతఃకాలపు సంభాషణలే శుభోదయం, దేవా . . . మనం మాట్లాడుకోవచ్చా? అనే పుస్తకానికి మూలం. ఈ భక్తిరచనలో, సింథియా మరియు నేను ప్రతిరోజు ప్రత్యేకపరచుకున్న సమయంలో సంవత్సరాల తరబడి మేము చర్చించుకున్న అనేక విషయాలను నేను చేర్చాను. ఈ పుస్తకం ద్వారా మీరు కూడా ప్రతిరోజూ ప్రభువుతో మీ సంబంధాన్ని పెంపొందించుకోవాలనేది నా ఆశ. మీరు ప్రత్యేకంగా ఏమీ చేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజు ఆయనతో సమయం గడపండి అంతే. ఆయన వాక్యాన్ని చదవండి. ఆయనతో మాట్లాడండి. మీకు కావలసినప్పుడు నవ్వండి. అవసరమైనప్పుడు మీరు ఏడవండి. మరియు వినడం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి.

జీవితం బిజీగా ఉందని నాకు తెలుసు. మీరు ప్రతిరోజూ నిశ్చలంగా కూర్చునే సమయాన్ని ఎలా కేటాయించగలరు? ఇదిగో ఇలా: అత్యవసరమైనదాన్ని ప్రక్కన పెట్టండి. ముందుగా ముఖ్యమైనది చేయండి. అత్యవసరమైనది ఎప్పుడూ ఉండేదే. మీరు ముందుగా ముఖ్యమైనది చేస్తే, అత్యవసరమైనదాన్ని చేయడానికి మీరు బాగా సన్నద్ధం చేయబడతారు. (కొన్ని అత్యవసర విషయాలు ఇకపై “అత్యవసరం” కావని కూడా మీరు కనుగొనవచ్చు.)

మీ జీవితాన్ని మార్చడానికి మీతో సంబంధం కలిగియుండటానికి దేవుడు తన వాక్యాన్ని మీకు ఇచ్చాడు. నేనే అందుకు సజీవ సాక్ష్యం! ప్రభువు నన్ను పాస్టర్‌గా ఉండమని పిలిచినందున నాకు ఆయనతో విడదీయరాని బంధం లేదు. నేను పాస్టర్‌ని కాబట్టి నా భార్యతో నాకు లోతైన, అర్థవంతమైన సంబంధం లేదు. దేవుని శక్తివంతమైన వాక్యం నా జీవితాన్ని మార్చినందున నాకు ఈ రెండూ ఉన్నాయి! ఈ రోజు వరకు, నాకు కంఠత వచ్చిన వాక్యభాగాల నుండి ప్రవహిస్తూ, దేవుని వాక్యం నా ఆత్మకు కొత్త అంతర్దృష్టి, జ్ఞానం మరియు ఆనందాన్ని అందిస్తుంది. నేను ప్రతిరోజూ లేఖనము కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను కాబట్టి, నన్ను నిస్సహాయునిగా వదిలేసిన దుఃఖాన్ని లేదా సవాలును ఎదుర్కొనే పరిస్థితి నాకు ఇంకా రాలేదు. దేవుని కాలాతీత వాక్యం ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. ఏమి వచ్చినా, లేఖనాలు వాటన్నిటి గుండా నాకు సహాయం చేయగలవు.

ఆ రకమైన విశ్వాసం, సర్వశక్తిమంతుడితో ఆ రకమైన జీవితాన్ని మార్చే సంబంధం, కేవలం పాస్టర్‌లు లేదా మిషనరీలు లేదా ఎంపిక చేసుకున్న కొంతమందికి మాత్రమే కాదు. యేసుక్రీస్తు యొక్క రక్షణార్థమైన కృప అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తి మరియు ఆయన వాక్యము యొక్క శక్తి ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉండేలా దేవుడు మనలో ప్రతి ఒక్కరినీ సృజించాడు.

కాబట్టి ఉదయాన్నే లేచి,“శుభోదయం, దేవా . . . మనం మాట్లాడుకోవచ్చా?” అని చెప్పడానికి మీరు ఈ రోజు సమర్పించుకోండి. నేను మాట ఇస్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా ఇది సులభం అవుతుంది మరియు మీరు ఎప్పటికీ చింతించరు. మీ రక్షకునితో సమయం గడపడం ద్వారా మీరు ఆయనతో పెంపొందించుకునే లోతైన, అర్థవంతమైన బంధం విడదీయరానిదిగా మారుతుంది. ఇది ప్రతి ఉదయం మిమ్మల్ని దగ్గరకు చేర్చే విలువైన, ప్రతిఫలదాయకమైన ఆనందం, ఆదరణ మరియు సంతృప్తిగా ఉంటుంది.

లో మొట్టమొదటిగా పోస్ట్ చేయబడింది. readthearc.com.

Copyright © 2018 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.

Posted in Bible-Telugu, Christian Living-Telugu, Marriage-Telugu, Pastors-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.