సంఘము యొక్క “కనిపించని రత్నము” ను కనుగొనడం

ఆరాధన . . . ఆరాధన గురించి ఆలోచిద్దాం. మీరు చివరిసారిగా “సంఘము” తో ఆడుకోవటం ఆపి నిజంగా ఆరాధించడం ప్రారంభించాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారు?

నిజం తెలియాలంటే, చాలా మంది విశ్వాసులకు ఆరాధన అంటే ఏమిటో తెలియదు. మనము ఆశ్చర్యపోతాము,

  • ఆరాధన అంటే నేను పాడేటప్పుడు మరియు ప్రార్థన చేసేటప్పుడు నా చేతులు పైకెత్తడమా, కొంతమంది క్రైస్తవులు చేస్తున్నట్లుగా?
  • ఆరాధన అంటే నేను కళ్ళు మూసుకొని పరలోక సంబంధమైనదాన్ని ఊహించుకోవడమా, నేను భూసంబంధమైన వాటితో పరధ్యానం చెందకుండా ఉండటానికి?
  • ఆరాధన అంటే నాకు కొంచెం పరవశం కలిగించే భావాలు కలగడమా, బహుశా అతీంద్రియానికి దగ్గరగా?

ఆరాధన అంటే ఏమిటి? మరి ఇది అంత అరుదైన విషయమా? 1961 లో, ఆయన కెనడాలోని అసోసియేటెడ్ గోస్పెల్ చర్చిల పాస్టర్‌లతో మాట్లాడుతున్నప్పుడు, దివంగత A.W. టోజర్ ఆరాధన “ఆధునిక సువార్త ప్రచారంలో కనిపించని రత్నము”1 అని చెప్పాడు. ఆయన ఆ కాలానికి కాదు, ఈ ఆధునిక కాలానికి చెందిన ప్రవక్త అని నేను అనుకుంటున్నాను.

నన్ను మిమ్మల్ని అడగనివ్వండి: మీరు సంఘానికి వెళ్ళే చోట మీరు ఆరాధించుచున్నారా? “అవును,” అని మీరు చెప్తారు, “మా సంఘంలో బైబిల్ బోధన నాకు చాలా ఇష్టం.” అది నా ప్రశ్న కాదు. “ఓహ్, గానం అద్భుతంగా ఉంటుంది.” అది కూడా నా ప్రశ్న కాదు. మీరు బైబిల్‌ను ఇష్టపడతారని నాకు తెలుసు. మీరు ఇష్టపడకపోతే మీరు ఈ పరిచర్యకు సహాయం చెయ్యరు. అలాగే మీరు బహుశా పాడటానికి ఇష్టపడతారు. నేను ఆ విషయాల గురించి అడగటం లేదు. నేను అడుగుచున్నదేమంటే, మీరు ఆరాధించుచున్నారా?

నాకు బాగా ఆందోళన కలిగించేది ఏమిటంటే మనము “సంఘము” తో ఆటలు ఆడుచున్నాము. మనము దుస్తులు ఎలా ధరించుకోవాలో నేర్చుకుంటాము, ఎలా కూర్చోవాలో నేర్చుకుంటాము మరియు ఎలా కనిపించాలో నేర్చుకుంటాము. మనము పాటల యొక్క మాటలను కూడా నేర్చుకుంటాము. కానీ మనము వాటిని పాడేటప్పుడు మన దృష్టి సంగతి ఏమిటి? “మా కర్త గట్టి దుర్గము” అని మనము పాడుతున్నప్పుడు, ఆమె ఎందుకు అలాంటి దుస్తులు ధరించింది? అని మనం ఆలోచిస్తూ ఉంటాము. “సముజ్వ లాయుధమ్ము.” నేను నా కారులో లైట్లు ఆపేసానా? మన ముఖవైఖరిలో ఏమాత్రం మార్పులేకుండానే మనం అలా చేయగలం. అది ఆరాధన కాదు–అది సంఘముతో ఆటలాడుకోవడం. నేను నిజంగా అద్భుతం, ప్రేమ మరియు స్తుతుల్లో మైమరచిపోయినప్పుడు, నేను మీకు చెప్పాలి, నా పేరు కూడా నాకు తెలియని సందర్భాలు ఉన్నాయి.

సరియైన మాటలు దొరకడంలేదు గాని, బలమైన, ఆయన సన్నిధి యొక్క బలముతో, నాతో సహా దేనినైనా లేదా మరెవరినైనా పట్టించుకునే శక్తి నాకు లేనటువంటి ఆరాధన జరిగిన సమావేశాలలో నేను ఉన్నాను. నా దేవుని స్తుతించటంలో నేను పూర్తిగా మైమరచిపోయాను.

మీరు కరిస్మాటిక్ లేదా నాన్-కరిస్మాటిక్ సంఘానికి వెళ్తున్నారా అనేదానికి ఇది సంబంధం లేదు. అది డినామినేషనలా లేదా నాన్-డినామినేషనలా నేను పట్టించుకోను. ఇది పట్టణమైనా, గ్రామీణమైనా, పెద్దదైనా, చిన్నదైనా నేను పట్టించుకోను. మీరు సమకాలీన సంగీతాన్ని కలిగి ఉండవచ్చు లేదా అత్యంత సాంప్రదాయక కీర్తనలను పాడవచ్చు అయినను ఇప్పటికీ ఆరాధన యొక్క అద్భుతాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆరాధన అనేది ఒక డినామినేషన్‌తో ముడిపడి ఉండదు లేదా ఒక నిర్దిష్ట శైలిపై ఆధారపడి ఉండదు. ఇది వాటన్నింటికంటే చాలా ఎక్కువ!

మరి, ఆరాధన అంటే ఏమిటి? డాక్టర్ రాన్ అలెన్, సెమినరీ సమయంలో నా క్లాస్‌మేట్ మరియు ఇప్పుడు డల్లాస్ థియోలాజికల్ సెమినరీలో ప్రొఫెసర్, ఆయన వ్రాసేటప్పుడు లోతుగా త్రవ్వాడు,

“ఆరాధన అనేది దేవునికి క్రియాశీల ప్రతిస్పందన, తద్వారా మనం ఆయన శ్రేష్ఠతను ప్రకటిస్తాము. ఆరాధన స్తబ్ధముగా ఉండేది కాదు; కానీ పాల్గొంటుంది. ఆరాధన అంటే కేవలం మానసిక స్థితి కాదు; అది ప్రతిస్పందన. ఆరాధన అనేది కేవలం ఒక భావన కాదు; అది ఒక ప్రకటన . . . .

ఆరాధన అనే ఆంగ్ల పదం అది వివరించే చర్యను అద్భుతంగా వ్యక్తపరుస్తుంది. ఈ పదం ఆంగ్లో-సాక్సన్ weorthscipe నుండి వచ్చింది, తర్వాత అది worthship గా మార్చబడింది మరియు చివరకు ఆరాధన (worship) గా మార్చబడింది. ఆరాధన అంటే ఏదైనా లేదా ఎవరికైనా ‘శ్రేష్ఠతను ఆపాదించటం.'”2

“అతను తన కారును ఆరాధిస్తున్నాడు” లేదా “ఆమె తన పిల్లలను ఆరాధిస్తున్నది” అని చెప్పినప్పుడు మనము ఆ పదాన్ని చాలా తేలికగా ఉపయోగిస్తున్నామని ఆయన వివరించుచున్నాడు. అతని కారు అతని జీవితంలో అత్యున్నత విలువను కలిగి ఉండకపోతే లేదా ఆమె పిల్లలు ఆమెకు అత్యంత విలువైనవారు కాకపోతే, మనము ఈ పదాన్ని సరిగా ఉపయోగించడం లేదు.

అదే కనిపించని రత్నము–దేవునికి అత్యున్నత శ్రేష్ఠతను ఆపాదించడం ద్వారా ఆరాధించడం, ఎందుకంటే ఆయన మాత్రమే యోగ్యమైనవాడు. గమనించండి,“పాడటం ద్వారా ఆయనను ఆరాధించండి . . . బోధించడం ద్వారా ఆయన్ని ఆరాధించండి,” అని నేను చెప్పలేదు. మన బోధనలో, మన పాటలలో, మరియు మన ప్రార్థనలలో మనం ఆయనకు శ్రేష్ఠతను ఆపాదిస్తాము. ఆయన మాత్రమే సంభ్రమాన్ని కలిగించేవాడు. మానవ చేతుల ద్వారా నిర్మితమైన వస్తువులకు జోడించడం ద్వారా మనము చౌకగా తీసుకున్న మరొక పదం ఇది. కారు సంభ్రమాన్ని కలిగించేది కాదు. ఏ సినిమా సంభ్రమాన్ని కలిగించదు. దేవుడు మాత్రమే సంభ్రమాన్ని కలిగించేవాడు. ఆయన నాలోని ఆశ్చర్యాన్ని బయటికి తీస్తాడు, ఇది ఆయన శ్రేష్ఠతను వ్యక్తీకరించడానికి గల మార్గాలను వెతకడానికి నన్ను ప్రేరేపిస్తుంది.

దౌర్భాగ్యంగా మనలో చాలామంది మన దేవుణ్ణి స్తుతించడం కంటే బోధకుడినే ఎక్కువగా స్తుతిస్తారు. దేవుడు మాత్రమే మన స్తుతులకు పాత్రుడు మరియు మన ఆరాధనకు లక్ష్యము. మనము దీనిని పోగొట్టుకొన్నాము. మన దృష్టి నిలువుగా-దేవుని మీద కాకుండా అడ్డముగా వ్యక్తులపై మరియు వస్తువులపై మళ్లినప్పుడు మనం దానిని పోగొట్టుకుంటాము. మనం ఆరాధన కంటే ఆందోళనతో నిండిన ప్రజలముగా మారడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అమెరికన్లు తమ పని కోసం అంతా సమర్పించడం సర్వసాధారణంగా మారింది. . . కానీ మన ప్రాణాలను కాపాడటానికి తన ప్రాణాన్ని ఇచ్చిన వానిని ఆరాధించడంలో ఎటువంటి త్యాగం చేయము. ఆగి ఆలోచించండి. అది నువ్వేనా?

ఎంత విచిత్రమైన తరము! ఆరాధనతో ఆడుకునే జనము. అది మన దేవుని హృదయాన్ని బాధపెట్టాలి. సరదాగా ఉండటానికి ఇష్టపడే మరియు నవ్వడాన్ని ఇష్టపడే వ్యక్తి నుండి మీరు వింటున్నారు. కానీ సరదాగా ఉండటం మరియు నవ్వడం ప్రక్కన పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను మరియు ఆరాధనలో, మనం పూర్తిగా ఆయనపై దృష్టి పెడతాము. అటువంటి సమయాలు “కనిపించని రత్నమును” తిరిగి కనుగొనడంలో మనకు సహాయపడతాయి.

  1. A. W. Tozer in The Best of A. W. Tozer, as quoted in Making New Discoveries (Anaheim, Calif.: Insight for Living, 1996), 29.
  2. Ron Allen and Gordon Borror, Worship: Rediscovering the Missing Jewel, as quoted in Making New Discoveries (Anaheim, Calif.: Insight for Living, 1996), 30.

Adapted from Charles R. Swindoll, Insights (August 2003), 1-2. Copyright © 2003 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide

Posted in Worship-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.