ప్రశ్న: గత నెలలో, నాకు గుండెపోటు వచ్చిందని అనుకున్నాను. నా నాడి వేగముగా కొట్టుకుంటోంది, నా అరచేతులకు చెమటలు పడుతున్నాయి, మరియు నేను అతికష్టం మీద శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాను. నేను ఆసుపత్రికి వెళ్లాను, వారు నా గుండె బాగుందని చెప్పారు-నేను అనుభవించినది తీవ్ర భయాందోళన. ఇప్పుడు నాకు దాదాపు ప్రతిరోజూ ఆందోళన ఘటనలు ఉన్నాయి. నేను నా ఉద్యోగం లేదా నా జీవితం గురించి చింతిస్తూ రాత్రి మేల్కొంటాను. నేను ఈ ఘటనలను కలిగి ఉన్నప్పుడు, ఈసారి నాకు నిజంగా గుండెపోటు రావచ్చని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. నా మనస్సు మరియు భావోద్వేగాలను నియంత్రించడానికి నేను ఏమి చేయగలను?
జవాబు: ఈ విషయాన్ని మాకు చెప్పడానికి మీరు సురక్షితంగా భావించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తరచుగా భయంతో పోరాడే వ్యక్తులు ఎవరికైనా చెప్పడానికి సంకోచిస్తారు ఎందుకంటే వారు అలాంటి భావాలను కలిగి ఉన్నందుకు విమర్శింపబడకూడదనుకుంటారు. మేము అర్థం చేసుకున్నామని మరియు మేము సహాయం చేయాలనుకుంటున్నామని దయచేసి తెలుసుకోండి.
ప్రజలు కొన్ని భావోద్వేగాలను బాగా నియంత్రించగలరు. రోజంతా పనిచేసిన తర్వాత మనం నిరుత్సాహపడినట్లు అనిపిస్తే, మనం మంచి నవల చదవవచ్చు లేదా నడవటానికి వెళ్లవచ్చు, అప్పుడు మనకు మంచి అనుభూతి కలుగుతుంది. అయితే, ఆందోళన మన హృదయాలను పట్టుకున్న తర్వాత దానిని వదిలించుకోవడం చాలా కష్టం. మన ఆలోచనలు పరుగెత్తుతాయి, మనకు భయంకరమైన విషయాలు జరుగుతున్నాయని ఊహించుకుంటాము, ఆపై మన శరీరం స్పందించడం ప్రారంభిస్తుంది. ఒత్తిడికి సంబంధించిన హార్మోన్ మన వ్యవస్థలోకి దూసుకుపోతుంది. మన నాడి వేగవంతం అవుతుంది. మన చేతులు చల్లగా మారతాయి. మనము వేగంగా శ్వాస తీసుకుంటాము మరియు భయపడతాము. మనం చనిపోతున్నట్లు కూడా మనకు అనిపించవచ్చు, ఇది నిజంగా మన భయాలకు ఆజ్యం పోస్తుంది.
మీరు వివరించిన దాని ఆధారంగా, మీరు ఈ భావోద్వేగ మరియు శారీరక ప్రతిస్పందనను అనుభవించారు. మీరు ఏమి చేయగలరు? కొంతమంది మంచి మనస్సుగల క్రైస్తవులు ఇలా అంటారు, “మీరు దేవుణ్ణి విశ్వసిస్తే, మీరు భయపడరు.” అయితే, నమ్మకం అనేది నిష్క్రియాత్మక అనుభవం. మీ భావోద్వేగాలు నియంత్రించడానికి వీలులేకుండా ఉన్నప్పుడు మరియు మీరు భయంకరమైన ప్రమాదంలో ఉన్నట్లుగా మీ శరీరం ప్రతిస్పందించినప్పుడు విశ్వసించుటకు మీకు మీరు నచ్చజెప్పుకోవటం చాలా కష్టం. ఎస్‌ప్రెస్సో తాగిన తర్వాత మిమ్మల్ని మీరు, “శరీరమా నిద్రపో. నిద్రపో, నిద్రపో, నిద్రపో!” అని ఆజ్ఞాపించి నిద్రపోవడానికి ప్రయత్నించినట్లే ఇది కూడా ఉంటుంది.
అయితే, మీ ఆందోళనను నియంత్రించడానికి మీరు కొన్ని చురుకైన చర్యలు తీసుకోవచ్చు. మొదటి అడుగు ఆత్మీయ రంగంలో ఉంది. పౌలు ఈ విధంగా వ్రాస్తున్నాడు,
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. (ఫిలిప్పీయులకు 4:6-7)
ప్రార్థన మరియు కృతజ్ఞతాస్తుతుల ద్వారా మన దైవిక శాంతి మూలాన్ని చేరుకోవడమే ఆత్మీయపరమైన పరిష్కారం. మీరు యేసుతో కలిసి ఉండటం, ఆయనతో చేతులు కలపడం మరియు ఆయన శక్తితో ముందుకు సాగడం గురించి ఊహించండి. ఎంత గొప్ప ప్రార్థనా నైపుణ్యమండీ! ప్రార్థన మనల్ని దేవునిపై ఆధారపడే స్థితిలో ఉంచుతుంది. ప్రార్థన ద్వారా, మీరు మీ సొత్తు కాదని మీరు అంగీకరిస్తారు. దేవునికి పూర్తిగా లోబడటం ద్వారా, మీరు శాంతిని పొందవచ్చు ఎందుకంటే దేవుడు మీ జీవితాన్ని పరిపాలించుచున్నాడు మరియు మీరు నియంత్రించలేని విషయాలపై ఆయన అధికారం కలిగియున్నాడు.
ఈ వచనాలలో ఒక ముఖ్యమైన భాగం సులభంగా విస్మరించబడింది. “కృతజ్ఞతాస్తుతులతో,” అనే పౌలు యొక్క ప్రకటనను గూర్చి నేను సూచించుచున్నాను. మనము తరచుగా విజ్ఞాపన దశలోనే ఆగిపోతాము. దేవునికి మొఱ్ఱపెట్టుకొని, మనకు ఉపశమనం కలిగించమని వేడుకోవడంలో నేర్పుగలవారమే. కానీ కృతజ్ఞతలు చెల్లించడం ప్రార్థనను ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది.
ఆయన మిమ్మల్ని ఏమాత్రమూ విడువనని అన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (హెబ్రీయులకు 13:5-6). మీ జీవితంలో మీరు సహించలేనిది ఏదీ కూడా జరగడానికి ఆయన అనుమతించనందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (1 కొరింథీయులకు 10:13). మీరు బలహీనంగా ఉన్నప్పుడు, ఆయన కృప చాలునని మరియు ఆయన శక్తి మరింత స్పష్టంగా కనబడుతుందని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (2 కొరింథీయులకు 12:9). మీరు ఎంత అనారోగ్యంతో ఉన్నా మీపై ఆయన ప్రేమ ఎన్నటికీ ఆగనందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (కీర్తన 13:5-6). మీ జీవితంలోని ప్రతి రోజు ఆయన చేతుల్లో ఉన్నదని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (కీర్తన 31:15; కీర్తన 139:16). బ్రతుకు మూలముగా క్రీస్తుకు మహిమ వస్తుందని మరియు మరణించడం వలన మీ ఊహలకు అతీతంగా సంతోషాలు మరియు ఆనందాలలోకి ప్రవేశించవచ్చని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (ఫిలిప్పీయులకు 1:21). నిస్సందేహముగా మీకు నిత్యజీవం లభించిందని మీకు తెలుసు గనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి (1 యోహాను 5:13-15). ఈ విషయాలన్నింటికీ ఇంకా మరెన్నో వాటికి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనకు మళ్లీ మళ్లీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, మరియు కాలక్రమేణా, మీ భయం దేవుని అద్భుతమైన శాంతితో భర్తీ చేయబడుతుందని మీరు కనుగొంటారు.
అది సరేగాని, మీరు ప్రార్థన ప్రారంభించే ముందు తీవ్ర భయాందోళనల కోసం వేచి ఉండకండి. వ్యాయామం లాగా-ప్రార్థన మరియు ధ్యానమును నివారణ మార్గముగా ఆలోచించండి. ప్రార్థన అంతర్గత కండరాలను పెంచుతుంది, తద్వారా మీకు భయం కలిగినప్పుడు, మిమ్మల్ని మీరు శాంతింపజేసుకోవడానికి బలం కలిగియుంటారు.
రెండవ దశ భౌతిక అంశానికి సంబంధించినది. భయాందోళనలు తరచుగా మనం ఒత్తిడిని సరిగా నిర్వహించటం లేదనటానికి సంకేతం. ఎడ్మండ్ జె. బోర్న్ రాసిన అద్భుతమైన పుస్తకం, ది ఏంగ్జైటీ అండ్ ఫోబియా వర్క్‌బుక్, మీ ఆందోళన పెరిగినప్పుడు మీ శరీరానికి ఎలా విశ్రాంతినివ్వాలో నేర్పుతుంది. ఈ పుస్తకం ప్రత్యేకముగా క్రైస్తవ సంబంధమైనది కానప్పటికీ, మీరు దీన్ని చాలా సహాయకరంగా మరియు ఆచరణాత్మకంగా ఉపయోగించుకోవచ్చు. మీ ఆందోళన కోసం సరైన మోతాదులో సరైన మందులను సూచించడానికి మీరు మనోరోగ వైద్యుడు లేదా మామూలు వైద్యునితో కూడా సంప్రదించవచ్చు. ఔషధప్రయోగం మీ తీవ్ర భయాందోళనల తీవ్రతను నిరోధించవచ్చు లేదా తగ్గించి, మీ ఆందోళన యొక్క ఆత్మీయ, మానసిక మరియు భావోద్వేగ అంశాలపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మూడవది, మీరు మానసిక కోణాన్ని పరిగణించాలి. భయపడే సమయాల్లో మీకు మీరే భరోసా ఇచ్చుకోవడానికి కొన్ని వాక్యాలను సంకలనం చేయండి మరియు వాటిని రోజుకు కనీసం రెండుసార్లు బిగ్గరగా చదవండి. మీరు ఇలా చేస్తున్నప్పుడు, అవి కనబరచిన సత్యాలను ధ్యానించడానికి కొంత సమయం కేటాయించండి. దేవుని వాక్యం గొప్ప శక్తిని కలిగి ఉంది, మరియు మీరు ఈ లేఖనాలను క్రమం తప్పకుండా చదివినప్పుడు మీరు బలాన్ని పొందుతారు.
లేఖనముతో పాటు, డేవిడ్ స్టూప్ యొక్క పుస్తకమైన సెల్ఫ్ టాక్: కీ టు పర్సనల్ గ్రోత్ చదవడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. మనము అనుభవించే ఆందోళన చాలామట్టుకు “అహేతుక” భయాలు లేదా “అపనమ్మకాలు” అని పిలిచే వాటికి సంబంధించినదని స్టూప్ అన్నాడు. హేతుబద్ధమైన మరియు నిజమైన దాని మీద దృష్టి పెట్టడం ద్వారా, మీరు మీ భయాలను నియంత్రించడం నేర్చుకోవచ్చు.
చివరగా, భావోద్వేగ అంశాన్ని గుర్తించాలి. హాస్యాస్పద విషయమేమంటే, భయంతో పోరాడుతున్నప్పుడు చాలామంది తమ భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోవడం మర్చిపోతారు. ఇదంతా నా మనసులో ఉంది, అని వారు అనుకుంటున్నారు. కానీ ఆగ్రహం లేదా యెడబాటు భావనలతో భయాలు ముడిపడి ఉండవచ్చు, ఈ భయాలు బాల్యమునకు సంబంధించినవై కూడా ఉండవచ్చు. చాలాసార్లు భయపడటం వలన పరిష్కరించబడని బాధ లేదా భావోద్వేగ సమస్యలు చాలా లోతుగా పాతిపెట్టబడి ఉంటాయి, అవి చివరకు బయటపడినప్పుడు, ఆందోళన రూపంలో ముసుగు వేసుకొని ఉంటాయి. మీ ఆందోళనకుగల మొదటి కారణం ఏమిటో తెలుసుకోవడానికి లోతుగా వెళ్లడమే కీలకం (మీ ఆందోళనను నియంత్రించడం నేర్చుకోవడం). మరియు మీరు నిజమైన సమస్యను కనుగొనే ముందు తరచుగా అనేక పొరలను తీసివేయాలి.
మీరు కొన్ని దాచబడిన భావాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉందా? అలా అయితే, నిర్లక్ష్యం చేయబడిన కొన్ని భావోద్వేగాలను తెరవడంలో మీకు సహాయపడే ఒక క్రైస్తవ సలహాదారుని చూడడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. కనీసం, మీరు మీ భావాలను పరిశోధించేటప్పుడు వినడానికి ఇష్టపడే వ్యక్తితో-ఒక స్నేహితునితో, కుటుంబ సభ్యునితో లేదా మీ పాస్టర్‌తో వారపు సమావేశాలను ఏర్పాటు చేసుకోండి. మీ గురించి నిజంగా శ్రద్ధ వహించే పూర్తిగా నమ్మదగిన వ్యక్తితో మీ భావాలను మీరు పంచుకున్నప్పుడు, మీరు మీ జీవితంలో కొంత మానసిక ఒత్తిడిని విడిచిపెడతారని మీరు తెలుసుకోవచ్చు.
మీ ఆందోళన నిజమైనది మరియు బాధ లోతైనది. ఆ లక్షణాల నుంచి ఉపశమనం పొందాలనుకోవడం సహజం. అయితే మీ ఆందోళనను నివారించాల్సిన విషయంగా భావించే బదులు, మీ జీవితంలో విలువ ఉన్నదిగా భావించండి. గర్భిణీ స్త్రీ ప్రసవానికి వెళ్లినప్పుడు అనుభవించే నొప్పిగా దానిని భావించండి. ఆమె కండరాలు ముడుచుకుపోవడం ప్రారంభమైనప్పుడు, ఆమె సాధారణంగా వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది మరియు యిబ్బందిపడుతుంది, ఉద్రిక్తత చెందుతుంది మరియు వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏదో ఒక సమయంలో, ఆమె నొప్పికి విలువ ఉందని ఆమె గ్రహిస్తుంది. అది లేకుండా ఆమె బిడ్డ పుట్టదు. కాబట్టి ఆమె దానితో పోరాడటానికి బదులుగా, ఆమె నొప్పిని అంగీకరిస్తుంది మరియు దానిని నియంత్రించడం మరియు విలువైన క్రొత్త జీవితాన్ని ఉత్పత్తి చేయడానికి దానిని ఉపయోగించడం నేర్చుకుంటుంది.
భావోద్వేగ బాధ గొప్ప విలువను ఉత్పత్తి చేయగలదు. ఇది మీ జీవితంలో ఒక ఉద్దేశాన్ని అందిస్తుంది. సాధారణంగా ఆ ఉద్దేశ్యం దేవుడు మీకు తెలియజేయాలనుకుంటున్న కొన్ని విలువైన సత్యాలతో సంబంధం కలిగి ఉంటుంది. బాధనుండి పారిపోవద్దు లేదా దాక్కోవద్దు, కానీ మునుపెన్నడూ లేనంతగా ప్రభువుకు దగ్గరవ్వడానికి-దానిని అంగీకరించండి, నియంత్రించండి మరియు మీ ప్రయోజనం కోసం ఉపయోగించండి.