గాయమును మించిన నిరీక్షణ

ఒక చల్లని ఫిబ్రవరి మధ్యాహ్నం నాకు కాల్ వచ్చింది. “కుమారుడా, నీ తల్లి వెళ్లిపోయిందని నేను అనుకుంటున్నాను,” అని మా నాన్న చెప్పాడు. ఈ వార్త నన్ను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. “వెళ్లిపోయిందా? చనిపోయిందనా మీ అర్థం?” అని నేను అడిగాను. “అవును, ఆమె చనిపోయిందని నేను అనుకుంటున్నాను.”

నేను డల్లాస్‌లోని నా తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. నా సోదరి నా కంటే ముందే వచ్చింది మరియు నేను లోపలికి వచ్చే సరికి నాన్నతో మాట్లాడుతోంది. నా తల్లి సోఫాలో చలనం లేకుండా పడుకుంది, అక్కడ ఆమె నిద్రలోనే తుది శ్వాస విడిచింది.

అది 1971 లో జరిగింది. ఆమె వయసు కేవలం 63. అయితే ఏది కష్టమైనదో నాకు తెలియలేదు; ఒకటి, నా తల్లిని హఠాత్తుగా కోల్పోవడం లేదా రెండు, నా తండ్రి తర్వాతి తొమ్మిదేళ్లలో నెమ్మదిగా చనిపోవడం చూడటం. రెండోదే అని నేను నమ్ముతున్నాను. ఆ సమయంలో ఆయన మాతో ఉండటానికి వచ్చారు, కాబట్టి నేను దుఃఖం గురించి చాలా నేర్చుకున్నాను -స్వస్థత కోసం ఇది ఎంత అవసరమో, అలాగే అది ఎంత సులభంగా నెమ్మదిగా మరణానికి దారితీస్తుందో నేర్చుకున్నాను.

తన బాధను తాను పూర్తిగా అనుభవించడానికి మరియు వ్యక్తం చేయడానికి అనుమతించుకోకుండా ఎవరూ పూర్తిగా లోటు నుండి కోలుకోలేరని నేను నమ్ముతున్నాను. ఏ ఇద్దరి బాధ ఒక రకంగా ఉండదు. కొంతమంది కొన్ని వారాలలో పెద్ద లోటునుండి బయటపడటం నేను చూశాను, మరికొందరు చాలా, చాలా నెలలు తీసుకున్నారు. ఒక వ్యక్తి కోలుకునే వ్యవధి అతని ఆత్మీయ స్థితిని గురించి ఏమీ తెలియజేయదు. సంతాప ప్రక్రియ అనేది వేలిముద్ర వలె వ్యక్తిగతమైనది మరియు ప్రత్యేకమైనది. మీరు దీన్ని చదవడం కొనసాగించేముందు నేను దాని గురించి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.

దుఃఖం మన అంతర్నిర్మిత స్వస్థత ప్రక్రియలో భాగం అయితే, ఒక వ్యక్తి దుఃఖాన్ని పెంపొందించడం మరియు పోషించడం కూడా సాధ్యమే, ఎంతలా పోషిస్తారంటే అది అతను లేదా ఆమె ఆ దుఃఖాన్ని విలువైన పెంపుడు జంతువులా సజీవంగా ఉంచుతారు. కాలక్రమేణా, ఆ వ్యక్తి దృక్పథాన్ని కోల్పోవచ్చు, నిరాశ చెందవచ్చు మరియు ఒక రకంగా, చనిపోకముందే చనిపోతారు. అంటే చనిపోయిన శవంలా ఉంటారు.

నా తల్లి నా తండ్రి జీవితంలో ఒక మెరుపు. ఆమె మా ఇంటిలో వినోదం, సృజనాత్మకత మరియు నవ్వును ప్రేరేపించింది. ఆమె మాకు గొప్ప సంగీతాన్ని పరిచయం చేసింది మరియు వాయిద్యాలు వాయించడానికి మరియు పాడటానికి మమ్మల్ని ప్రోత్సహించింది. నా తండ్రి జీవితంలో ఏదైనా ఆనందం లేదా సంతోషం ఉందంటే, అందులో ఎక్కువ భాగం ఆమె నుండి వచ్చినదే. కాబట్టి నా తల్లి మొదట మరణించినప్పుడు, ఆయన జీవితంలో వెలుగు ఆరిపోయినట్లుగా అనిపించింది. ఆయనకు ఎలాంటి అభిరుచులు లేవు, అతి కొద్ది మంది స్నేహితులు మరియు టెలివిజన్ చూడటం తప్ప ఇతర ఆసక్తులు లేవు. ఆయనకు ఎప్పుడూ పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదు. ఆయన ప్రపంచం మా ఇంట్లోని గదులకు పరిమితమయ్యింది, కిటికీలు మరియు తలుపులు మూసివేసుకొని ఉండేవారు. అయితే, మేము ఆ పరిస్థతిని అలాగే ఉండనివ్వలేదు. ఒక కుటుంబంగా, నా తల్లి మరణం తర్వాత ఆయనకి జీవితాన్ని కనుగొనడంలో మేము మా వంతు కృషి చేసాము, కానీ ఆమె మెరుపులాంటి స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేకపోయింది.

స్వస్థత కలగాలంటే దుఃఖాన్ని స్వీకరించడం అవసరం. దుఃఖానికి ముగింపు పలికే నిర్ణయం కూడా అంతే ముఖ్యం. దుఃఖించే ప్రక్రియను ఎవరూ త్వరపెట్టలేరు, కానీ దానిని ఒకరోజు ఆపేయాలనే సంకల్పంతో మనం అందులో ప్రవేశించడం చాలా ముఖ్యం. అందుకే స్వస్థత ప్రక్రియ అవసరమైన దానికంటే ఎక్కువ కాలం ఉండకుండా చూసుకోవడానికి మనం నిర్దిష్ట మార్గాలను వెతకాలి.

సంవత్సరాలుగా నా స్వంత విషాదం మరియు దుఃఖాన్ని ఎదుర్కొన్న నేను రెండు కోణాలు చాలా సహాయకారకంగా గుర్తించాను. ఒకటి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోవటం, రెండు భవిష్యత్తు కోసం ఎదురు చూడటం-మరో మాటలో చెప్పాలంటే, తగిలిన గాయము పట్ల ఆరోగ్యకరమైన చింతనము కలిగియుండటం, అలాగే ఖచ్చితంగా నిరీక్షణ లభిస్తుందనే ఆశ కలిగియుండటం. వ్యక్తిగత విషయాలను డైరీలో పొందుపరచుకునే అలవాటు ఉత్తమమైనదని నేను కనుగొన్నాను. వాస్తవానికి, ఇది చాలా ప్రభావవంతమైనది, చాలా మంది శోకానికి సంబంధించిన కౌన్సెలర్లు తమ దగ్గరకు వచ్చే వారిని ఈ విధంగా డైరీ వ్రాసే అలవాటు చేసుకోమని సూచిస్తారు.

నేను సంవత్సరాలుగా వ్రాసుకున్న డైరీలను చదవడం ద్వారా నేను వెనక్కి తిరిగి చూస్తాను. పాత శ్రమల ద్వారా దేవుని విశ్వాస్యత యొక్క స్థిరమైన నమూనాను చూడటానికి ఇది తరచుగా నాకు సహాయపడుతుంది, ఇది నేను ఎదుర్కొనే ఏ కొత్త పోరాటమైనా సరే అంతే కష్టమైనది మరియు అంతే తాత్కాలికమైనది అని నాకు విశ్వాసం ఇస్తుంది. ఫలితంగా, నేను చాలా తక్కువ భయంతో బాధను భరిస్తున్నాను. పెద్ద మరియు చిన్న గాయాలను తిరిగి తెరవకుండానే అనివార్యమైన గుండె కోతలకు బాధపడటానికి డైరీలో వ్రాసుకోవడం నన్ను సన్నద్ధం చేసింది.

భవిష్యత్ పరిచర్యలో నా ప్రస్తుత శ్రమను నేను ఎలా ఉపయోగించబోతున్నాను అనేదానిపై కొన్ని నిర్ణయాలు -తీర్మానాలు చేయుటకు నేను ఎదురుచూస్తున్నాను. విక్టర్ ఫ్రాంక్ల్ నాజీ మరణ శిబిరం యొక్క భయానక పరిస్థితుల నుండి బయటపడటానికి చేసిన పోరాటంలో ఇది చేసాడు. యుద్ధం తర్వాత తన అభ్యాసం మరియు మనస్తత్వశాస్త్రం బోధనలో తన కష్టాలు ఎలా ఉపయోగపడతాయో అతను ఊహించాడు, అయినప్పటికీ అతను మనుగడ సాగిస్తాడని ఆశించడానికి ఎటువంటి కారణం లేదు.

నేను ప్రతిరోజూ మరియు గంటగంటకు, అలాంటి చిన్నవిషయాల గురించి మాత్రమే ఆలోచించాల్సిన పరిస్థితులపై నాకు అసహ్యం కలిగింది. నేను నా ఆలోచనలను మరొక అంశం వైపు మళ్లించడానికి బలవంతం చేసాను. అకస్మాత్తుగా నేను ధగధగ మెరిసే, ఉత్తేజపరిచే మరియు ఆహ్లాదకరమైన ఉపన్యాస గది వేదికపై నిలబడి ఉండడం చూసాను. నా ముందు సౌకర్యవంతమైన మెత్తని సీట్లపై శ్రద్ధగల ప్రేక్షకులు కూర్చున్నారు. నేను జైలు శిబిరం యొక్క మనస్తత్వశాస్త్రంపై ఉపన్యాసం ఇస్తున్నాను! ఆ క్షణంలో నన్ను అణచివేసినవన్నీ నిష్పాక్షికంగా మారాయి, విజ్ఞానశాస్త్రం ద్వారా మనస్సుతో అవగాహన చేసుకునే కోణం నుండి చూడబడ్డాయి మరియు వివరించబడ్డాయి. ఈ పద్ధతి ద్వారా నేను పరిస్థితిని, ఆ క్షణంలో ఉండే బాధలను అధిగమించడంలో ఏదో ఒకవిధంగా విజయం సాధించాను మరియు అవి గతానికి సంబంధించినవిగా నేను చూశాను . . . . భవిష్యత్తుపై విశ్వాసం కోల్పోయిన ఖైదీ -అతని భవిష్యత్తు-నాశనమైంది.1

ఒక మంచి భవిష్యత్తులో ప్రస్తుత పోరాటాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించుకోవడం వలన అణచివేతకు గురయ్యే పరిస్థితులపై నాకు నైపుణ్యం లభిస్తుంది. పౌలు పరిశుద్ధాత్మ వలన, ఎటువంటి శ్రమ అయినా అతనిపై ఆధిపత్యం చెలాయించలేదని ధృవీకరించడంలో వ్యక్తిగత అనుభవాన్ని ఎక్కువగా ఉపయోగించాడు.

అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది. (రోమా 5:3-5)

నేటి అంధకారంలో చర్య తీసుకోవడానికి పూనుకున్నప్పుడు నేను ప్రకాశవంతమైన రేపటి దినము దిశగా వేగిరపడుచున్నప్పుడు లేఖనము వాగ్దానం చేసిన నిరీక్షణను హక్కుగా కోరుకోవడానికి నాకు సహాయపడుతుందని నేను కనుగొన్నాను.

విషాదాన్ని తట్టుకునే వ్యక్తులకు తరచుగా నొప్పిని అధిగమించడానికి సహాయం కావాలి. గాయమును మించిన నిరీక్షణను చూసే సామర్థ్యం వారికి ఉండకపోవచ్చు. వారికి తరచుగా తమకు ప్రియమైనవారి ఆరోగ్యకరమైన దృక్పథం అవసరం. దేవుడు తన విశ్వాస్యతను చూపించిన గత కాలాలను గుర్తుచేయడానికి వారికి ఎవరైనా అవసరం కావచ్చు. ఇంకా, వారి బాధను మించిన భవిష్యత్తును ఊహించుకోవడానికి వారు ఇతరుల ఊహపై ఆధారపడాల్సి రావచ్చు. గాయపడిన చాలామంది తమ ఆలోచనలను స్వస్థత ప్రక్రియలో భాగంగా డైరీ‌లో వ్రాసుకోవడాన్ని ఎవరోయొకరు ప్రేరేపించకుండా పరిగణించకపోవచ్చు.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:

  • నాకు తెలిసినవారు ఎవరైనా తమ భుజాలపై ఒక పెద్ద దుఃఖాన్ని మోస్తున్నారా?
  • ఆరోగ్యకరమైన దృక్పథాన్ని పొందడంలో నా సహాయాన్ని ఉపయోగించుకోగలిగే ఒక మైలురాయి లేదా జీవితంలో ముఖ్యమైన మార్పును చూస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
  • చాలా సవాలుతో కూడిన భవిష్యత్తులో ఎవరు నిలబడి ఉండవచ్చు?

బహుశా ఈ స్నేహితుడు లేదా ప్రియమైన వ్యక్తి ఆ క్షణానికి ముద్ర వేయాలని అనుకోలేదు. గతాన్ని ఒకసారి పరిశీలించి, భవిష్యత్తును వాస్తవికంగా చూడటం ద్వారా, బహుశా మీరు అతడికి లేదా ఆమెకు ఈ వర్తమాన గాయమును మించిన నిరీక్షణను చూసేందుకు సహాయపడవచ్చు. ఇది అతను లేదా ఆమె ఏడాది పొడవునా అందుకునే ఉత్తమ బహుమానం కావచ్చు.

  1. Viktor Frankl, Man’s Search for Meaning: An Introduction to Logotherapy, rev. ed. (New York: Simon & Schuster, 1962), 73-74. Used by permission of Beacon Press.

Adapted from Charles R. Swindoll, “Hope Beyond the Hurt,” Insights (November 2004): 2, 5. Copyright © 2004 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Death-Telugu, Encouragement & Healing-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.