ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన నేను ఎలా జీవించగలను?

ప్రశ్న: నా భార్య రెండు నెలల క్రితం కారు ప్రమాదంలో మరణించింది, నేను నిజంగా యిబ్బందిపడుతున్నాను. సంఘము సహాయకరంగా ఉంది, కానీ ఇటీవలి వారాల్లో ఫోన్ మ్రోగటం ఆగిపోయింది మరియు భోజనాలు రావడం ఆగిపోయాయి. నేను పిల్లలతో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, నేను ఆమెను ఎంతగా మిస్ అవుతున్నాను అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచించగలను. ప్రత్యేకించి నేను ఇతర పురుషులను తమ భార్యలతో చూసినప్పుడు, కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది. ఈ దుఃఖం నుండి నాకు సహాయం చేయగలిగేది ఏమిటి?

జవాబు: మీరు ఇష్టపడే వ్యక్తిని కోల్పోయినప్పుడు కలిగే గుండెనొప్పిలాగా మరి ఏ ఇతర నొప్పి ఉండదు. మీరు ప్రతిరోజూ అనుభవిస్తున్న అనేక నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే మేము మీతో ఏడ్చుచున్నాము. ఇకపై మీరు మీ ప్రియమైన భార్య సహవాసాన్ని ఆస్వాదించలేరు, ఆమె ఆలింగనాన్ని అనుభవించలేరు లేదా ఆమె స్వరాన్ని వినలేరు. ఇక మీ పిల్లలకు తమ తల్లి పెంపకము గూర్చి తెలియదు. ఇప్పుడు మీరు ఒంటరిగా పెంపకపు పనిని ఎదుర్కోవాలి, అంతేగాక కుటుంబ చిత్రపటంలో ఎవరోయొకరు తప్పిపోయినట్లు ఎప్పుడూ యెరిగే ఉంటారు. అయ్యో, మీ హృదయం చాలా భారముగా ఉండి ఉంటుంది.

ప్రియమైన వారిని కోల్పోయిన వ్యక్తులు తమ నష్టాన్ని పూర్తిగా అధిగమించలేరని చెప్తారు. వివిధ సమయాల్లో వివిధ మార్గాల్లో శోకం వారిని తాకుతుంది, ఆ రకంగా దుఃఖం వారి జీవితాంతం అలాగే ఉంటుంది. మీ లక్ష్యం మీ జీవితాన్ని బాధ నుండి విముక్తి చేయడం కాదు, దానితో జీవించడం. కాలక్రమేణా, దుఃఖం యొక్క తరంగాల తీవ్రత మరియు తరచుదనం తగ్గుతాయి అలాగే మీరు మీ భావాలను మరింత బాగా నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. మీ పరిస్థితిలో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో పెద్ద మార్పులు లేదా జీవితాన్ని మార్చే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని తరచుగా చెబుతుంటారు. మీ పరిస్థితులను మార్చడం లేదా పారిపోవడం ద్వారా మీరు బాధను పరిష్కరించలేరు. దుఃఖం అనేది మీరు తప్పక ఏ రోజుకు ఆ రోజు చేయవలసిన ప్రయాణం.

ఈ దశలో, మీరు విచారమును స్వేచ్ఛగా అనుభవించే సమయం మరియు స్థలాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. ఉద్యోగానికి వెళ్లడం మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం వంటివి, అనగా పగటిపూట మీరు తప్పక చేయవలసిన పనులు ఉన్నాయి. మీరు దుఃఖించుట కొరకు జీవితాన్ని వదిలివేయలేరు. కానీ బహుశా మీరు పని త్వరగా ముగించడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు, తద్వారా మీరు పార్కులో లేదా ఇంట్లో విచారించడానికి మరియు ఏడవటానికి సమయం గడపవచ్చు. మీ భావోద్వేగాలు ప్రవహించడానికి మీరు పగటిపూట కొంత సమయాన్ని కేటాయించండి.

మీరు కిరాణా దుకాణంలో ఉన్నప్పుడు,విచిత్రమైన సమయాల్లో అనగా మీ భార్య ఇష్టపడే పాట విన్నప్పుడు లేదా మీరు మీ పిల్లల బూట్లు కడుతున్నప్పుడు లేదా మీ భార్య వాడే అత్తరు యొక్క సువాసన వచ్చినప్పుడు దుఃఖం అమాంతము రావచ్చు. ఈ క్షణాలు ఎదురైనప్పుడు, మీరు చేస్తున్నదానిని ఆపివేసి ఏడుపు కోసం నిశ్శబ్ద స్థలాన్ని కనుగొనాలి. మీ జీవితాన్ని తీరికలేకుండా నింపుకోవడం మానుకోండి. మీ షెడ్యూల్‌ని సడలించడానికి ప్రయత్నించండి మరియు పనులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం కేటాయించండి-ఎందుకంటే మీకు ఇది అవసరం.

భావోద్వేగాలు ఎక్కువ కాలం కట్టిపడేసి ఉంచలేనంత శక్తివంతమైనవి. మీరు వాటిని బలవంతం యెటువంటి పాత్రల్లోనైనా పెట్టడానికి ప్రయత్నించినా వాటిని విచ్ఛిన్నం చేసుకుంటూ తలనొప్పి లేదా అల్సర్ వంటి ఒత్తిడి సంబంధిత లక్షణాలుగా బయటకు వస్తాయి. అణచివేయబడిన భావోద్వేగాలు మీ శరీరాన్ని చీల్చి వేయగలవు. మీరు బాధపడుతున్నప్పుడు మీ శరీరంలో ఏర్పడిన ఒత్తిడిని అధిగమించడానికి సహాయపడులాగున, ఆరోగ్యకరమైన భోజనం తినండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

దుఃఖించే ప్రక్రియను తొందరపెట్టలేము. దీనికి సమయం పడుతుంది, అలాగే ఇతర మనుష్యులు ఎవరైతే దుఃఖిస్తూ మీ భావాలను అర్థం చేసుకోగలరో అటువంటి సమాజంలో ఈ ప్రక్రియ మంచిగా జరుగుతుంది. రోమా 12:15 లో, “ఏడ్చువారితో ఏడువుడి” అని పౌలు చెప్పాడు. మన బాధను ఇతరులతో పంచుకున్నప్పుడు స్వస్థత సులభమవుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఆధారపడండి. మీకు ఏమి కావాలో వారికి చెప్పండి, ఒకవేళ మీరు వారితో ఒకే గదిలో కొన్ని గంటలు ఉండటం కావచ్చు. మిమ్మల్ని ఓదార్చడానికి దేవుడు ఇతరులను ఉపయోగించనివ్వండి. GriefShare సమూహంలో చేరాలని మేము సిఫార్సు చేస్తున్నాము. www.griefshare.org. కి లాగిన్ అవటం ద్వారా మీరు ఇంటర్నెట్‌లో ఈ సమూహాల గురించి మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.

చివరిగా, ముఖ్యంగా, ప్రభువునందు మీ శక్తిని పొందుకొనండి. మీరు దుఃఖిస్తున్నప్పుడు కీర్తనలలో సమయం గడపండి. దావీదు మరియు ఇతరుల నిజాయితీగల ప్రార్ధనలు శతాబ్దాలుగా, బాధపడుచున్న ప్రజలు తమ భారమైన హృదయాలను వ్యక్తపరచడంలో సహాయపడ్డాయి. ప్రారంభించడానికి ఈ ఉదాహరణలు మీకు సహాయపడవచ్చు:

నేను ఏకాకిని, బాధపడువాడను
నావైపు తిరిగి నన్ను కరుణింపుము.
నా హృదయవేదనలు అతివిస్తారములు
ఇక్కట్టులోనుండి నన్ను విడిపింపుము.
నా బాధను నా వేదనను కనుగొనుము
నా పాపములన్నిటిని క్షమింపుము. (కీర్తన 25:16-18)

నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును
వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు
నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును. (కీర్తన 34:17-18)

పౌలు ఈ ధైర్యాన్ని ఇస్తున్నాడు: “సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు” (1 థెస్సలొనీకయులకు 4:13). తరువాత అతను క్రీస్తునందు నిద్రించినవారు లేచెదరనియు మరియు మనమందరమూ ఏకముగా ప్రభువును కలిసికొనుటకు ఆకాశమండలమునకు కొనిపోబడే క్షణాన్ని వివరించాడు. మనము మన ప్రియమైనవారితో ఎప్పటికీ కలిసి ఉంటాము. ఎంత అద్భుతమైన నిరీక్షణ! “దుఃఖించవద్దు,” అని పౌలు చెప్పడంలేదు; దానికి బదులుగా అతను చెప్పినదేమంటే, “నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుడి.” దుఃఖించడం సరైనదే, కానీ మీ దుఃఖం నిరాశకు దారితీయవలసిన అవసరంలేదు. మీ దుఃఖంలో, క్రీస్తు యొక్క వాగ్దానలపై నిరీక్షణను కలిగియుండుడి, ఆయన మరణమును జయించి మీకు ఇష్టమైన వారితో శాశ్వతమైన పునఃకలయికను వాగ్దానం చేసాడు.

Copyright  2012 by Insight for Living.

Posted in Crisis-Telugu, Death-Telugu, Encouragement & Healing-Telugu.

Biblical Counselling Ministry

View posts by Biblical Counselling Ministry

The Insight for Living Biblical Counselling department comprises seminary-trained pastors and women’s counsellors who help meet the spiritual needs of Insight for Living’s listeners around the world through biblical counselling and training others for ministry. Our confidential biblical counselling includes a ministry of prayer, comfort, spiritual direction, and instruction to promote growth in Christ. We accomplish that mission by developing educational and counselling content that is fashioned into letters, Web articles, and other printed products.

ఇన్సైట్ ఫర్ లివింగ్ బైబిల్ కౌన్సెలింగ్ విభాగంలో సెమినరీ-శిక్షణ పొందిన పాస్టర్లు మరియు మహిళా సలహాదారులు ఉన్నారు. బైబిల్ కౌన్సెలింగ్ ద్వారా మరియు పరిచర్య కోసం ఇతరులకు శిక్షణ ఇచ్చుట ద్వారా వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్సైట్ ఫర్ లివింగ్ శ్రోతల యొక్క ఆత్మీయ అవసరాలను తీర్చడంలో సహాయపడుతున్నారు. మా విశ్వసనీయమైన బైబిల్ కౌన్సెలింగ్‌లో ప్రార్థన, ఆదరణ, ఆత్మీయ మార్గము మరియు క్రీస్తులో వృద్ధిని ప్రోత్సహించడానికి సూచనలు ఉన్నాయి. ఉత్తరాలు, వెబ్ వ్యాసాలు మరియు ఇతర ముద్రిత ఉత్పత్తులుగా రూపొందించబడిన విద్యా మరియు కౌన్సిలింగ్ కంటెంట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మేము ఆ లక్ష్యాన్ని సాధిస్తాము.