మీ ముద్దైన కలల రాకుమారుణ్ణి పెండ్లాడి సంతోషంగా జీవిస్తూ, మీరు మీ స్వంత అద్భుత కథను జీవించాలని కోరుకున్నారు. చర్చి ఘంటల శబ్దముతో మరియు శృంగార ప్రేమ పాటలతో నిండిన అందమైన కథ ఇది. అప్పుడే మీరు మీ భర్త అశ్లీల చిత్రముల సమస్యను కనుగొన్నారు. అంతే, మీ కలలు బద్దలైపోయాయి. మీ యువరాజు దుష్ట మంత్రగత్తెతో ప్రేమలో పడ్డాడని మరియు అతనితో కలిసి జీవించడానికి ఆమెను కోటలోకి తీసుకువచ్చాడని కనుగొన్నట్లుగా ఉంది!
ఇది మీ కథలా అనిపిస్తుందా? అలా అయితే, లైంగిక పాపం బయటపడటంతో వచ్చే అధిక మరియు గందరగోళ భావోద్వేగాల వరద గురించి మీకు తెలుసే ఉంటుంది. తుఫాను మధ్యలో మీరు సమాధానం కోసం చూస్తున్నారా?
మీ వివాహం మరియు మీ విశ్వాసం బలపడటం ద్వారా దీనిని తట్టుకొని నిలబడటం సాధ్యపడుతుంది. ప్రతి భావోద్వేగాన్ని వివరంగా చూద్దాం.
వంచన బయటపడింది – ఇది నిజమని నేను నమ్మలేకపోతున్నాను!
మీ భర్త యొక్క లైంగిక పాపం గురించి తెలుసుకున్న తరువాత, మీ హృదయాన్ని పిండేసే మొదటి భావము ఏమిటంటే, అపనమ్మకము. మీ భర్త ఒప్పుకున్నప్పుడు ఇది కలుగవచ్చు. అయితే, చాలాసార్లు, మీరు అతన్ని ఇంటర్నెట్‌లో చిత్రాలను చూడటం లేదా క్రెడిట్ కార్డ్‌లో వివరించలేని ఛార్జీలను గమనించినప్పుడు లేదా గది వెనుక భాగంలో అశ్లీల చలనచిత్రాలను చూడటం కనుగొన్నప్పుడు సంభవిస్తుంది. మీకు తెలిసిన వ్యక్తి-దైవభక్తిని బాహ్యంగా ప్రదర్శించేవాడు-ఇంత రహస్య పాపానికి ఎలా పాల్పడతాడు?
చివరికి నిజం పూర్తిగా అర్థమవుతుంది. అది జరిగినప్పుడు, ద్రోహమనే ఆందోళన కలిగించే భావన కూడా ఉంటుంది. మోహపు ఆలోచనలు హృదయంలో వ్యభిచారం చేసినదానితో సమానమని క్రీస్తు చెప్పాడు (మత్తయి 5:28). మీ భర్త యొక్క అశ్లీల వ్యసనం అనేది ఒక్క శరీరమనే మీ వివాహాబంధానికి మహిళల వేశ్యాగృహమును పరిచయం చేసింది. దాని గురించి ఆలోచిస్తూ మీ కడుపు తరుక్కుపోతుంది.
స్వీయ-సందేహం ప్రారంభమవుతుంది – దీనికి నేను బాధ్యురాలనా?
మీరు భిన్నంగా ఏమి చేసి ఉండవచ్చని మీరు ఆశ్చర్యపోవటం మొదలుపెడతారు. ఇంత నమ్మకంతో ఉన్నందుకు మీరు మూర్ఖురాలిగా మీకు అనిపించవచ్చు. మీరు మీ భర్త (ఎక్కువగా దిగజారుతున్న) సెక్స్ కోసం చేసిన కోరికలను అంగీకరించినట్లయితే, అతడు మరొక ద్వారమునకు “నడపబడడు” అని ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు నిందించుకోవచ్చు.
అయితే, మీ భర్త చేసిన పాపానికి మీరు బాధ్యులు కారు. యాకోబు పత్రిక మనకు గుర్తుచేస్తుంది:
ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. (యాకోబు 1: 14–15)
పాపం లోపలినుండి వస్తుందని యాకోబు చెప్పినప్పుడు, అతను యేసు బోధను ప్రతిధ్వనిస్తున్నాడు: “దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును 20ఇవే మనుష్యుని అపవిత్రపరచును” (మత్తయి 15:19-20). మన స్వంత పాపానికి మనమే దేవునికి లెక్కచెప్పాలని లేఖనము స్పష్టంగా బోధిస్తుంది (ద్వితీయోపదేశకాండము 24:16; యిర్మీయా 31: 29-30; యెహెజ్కేలు 18: 19-20). అవును, మీ భర్తకు వ్యతిరేకంగా మీరు చేసిన ఏ పాపానికైనా మీరు జవాబుదారీగా ఉంటారు. కానీ మీరు అతని పాపానికి బాధ్యులు కాదు. ఇది మీ తప్పు కాదు.
కోపం వస్తుంది – అతను దీన్ని ఎలా చేయగలడు?
కోపం తరచుగా ఈ తుఫాను యొక్క ఉపరితలంపైకి వచ్చే తదుపరి అనుభూతి. ద్రోహం మరియు స్వీయ-నింద ఆలోచన యొక్క భావన తాత్కాలికంగా కోపాన్ని కొంత దూరం పెడుతుంది. కానీ కోపం వస్తుంది, మరియు అది ప్రారంభమైనప్పుడు, మీ భర్త మీపై మరియు మీ వివాహంపై కలుగజేసిన బాధకు మీరు అతన్ని గాయపరచాలని కోరుకుంటారు. వారి తండ్రి ఒక వక్రబుద్ధిగలవాడని మీ పిల్లలకు చెప్పడానికి మీరు శోధింపబడవచ్చు. మీమధ్య ఉన్న సంబంధాన్ని వదిలివేయడాన్ని కూడా మీరు పరిగణించవచ్చు. కోపంగా ఉండటం సులభం, ఎందుకంటే కోపం బలంగా మరియు శక్తివంతంగా అనిపిస్తుంది; ఇది సురక్షితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా, మరొకరిని గాయపరచాలని కోరుకునే కోపము ఎప్పటికీ సహాయపడదు.
నియంత్రణ లేని కోపంతో జరిగిన నష్టం గురించి పౌలు ఎఫెసీయులకు 4:26, 31 లో హెచ్చరించాడు. (సామెతలు 29:11 మరియు యాకోబు 1: 19-20 కూడా చూడండి.) ధర్మబద్ధమైన కోపం తగినది అయినప్పటికి, మనం జాగ్రత్తగా ఉండాలి. మీ భర్త మీకు మరియు దేవునికి వ్యతిరేకంగా చాలా ఘోర పాపం చేసాడు. కానీ మీ భర్తను సరైన మార్గంలో పెట్టే శక్తి మాత్రం కోపానికి లేదు. మీ కోపం మీ వివాహం కోసం పోరాడటానికి ఒక అభిరుచిని రేకెత్తించనివ్వండి, కాని కోపం మీ భర్త గుండెలో మార్పును ఎప్పటికీ తీసుకురాలేదని గుర్తుంచుకోండి.
మీరు విశ్రాంతి స్థలానికి వస్తారు – జరిగినదానికి నేను దుఃఖిస్తున్నాను.
అటువంటి తీవ్రమైన బాధ నడుమ విశ్రాంతి స్థలమున్నది. జరిగినదానికి మీరు దుఃఖిస్తారు మరియు మీ భర్త చేసిన ద్రోహంపై ఎంతో బాధతో ఉంటారు. అయినప్పటికి విచారకరమైన హృదయం నిశ్చలమైన హృదయం కావచ్చు. క్రీస్తులో స్థాపితమైన హృదయం నుండి సమాధానం ప్రవహిస్తుంది. మీ వివాహం కోసం ప్రార్థనలో ఆయన వైపు తిరగండి. ఆయన సత్యవాక్యంలో మీ హృదయాన్ని స్థాపించుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. ఉద్వేగభరితమైన భావోద్వేగం తగ్గుతున్నప్పుడు, మీ విచారం నుండి వసంతకాలపు తుఫాను తర్వాత వికసించిన పువ్వులాగా పునరుద్ధరణ కొరకు ఆశ వికసిస్తుంది.
ఈ తుఫానులో మీ ప్రతి భావోద్వేగాన్ని గుర్తించడం అంత తేలికైన పని కాదు. మీరు వాటిని స్పష్టంగా చూడగలిగినప్పుడు, ఇంకా ఎక్కువ స్వస్థత కార్యం జరగాల్సి ఉంది. మీరు తీసుకోగల కొన్ని క్రియాశీల అడుగులు ఇక్కడ ఉన్నాయి:
- భావోద్వేగాల పత్రికను ప్రారంభించండి. మీ కోపం, విచారం, భయపడే ఆలోచనలను పొందుపరచండి మరియు మీరు మీ భావాలను కుమ్మరించేటప్పుడు మీ హృదయానికి పరిచర్య చేయుమని ప్రభువును అడగండి.
- ప్రార్థన భాగస్వామితో క్రమం తప్పకుండా సమావేశమవ్వండి. మీ సమస్యలను వినగల మరియు మీ భర్త కోలుకునే సమయంలో మీకు అండగా నిలబడగలిగే మంచి స్నేహితురాలిని కనుగొనండి.
- సలహాదారునితో సమావేశమవ్వండి. మీ గురించి మరియు మీ వివాహం గురించి మీ లోతైన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, దైవభక్తిగల, క్రైస్తవ సలహాదారుని సంప్రదించడం మీకు సహాయకరంగా ఉంటుంది.
అలాగే, చాలా ముఖ్యమైనది, నిరీక్షణను అభ్యసించండి. అశ్లీలత మీ భర్తను విడదీయలేని మంత్రకట్టులో ఉంచి, మీ వివాహాన్ని నాశనం చేసే “దుష్ట మంత్రగత్తె” గా ఉండవలసిన అవసరం లేదు. మన దేవుడు విమోచన దయచేసే దేవుడు. దేవుని పరిశుద్ధత యొక్క ప్రమాణం నుండి దూరమై మనలో ప్రతిఒక్కరం పడిపోయినవారమే. అయినప్పటికీ ఆయన మనలను మార్చాడు మరియు యింకా ఆ పనిని కొనసాగిస్తున్నాడు. ఆయన మీ కంటే మీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన మీ వివాహానికి మీకన్నా ఎక్కువ విలువ ఇస్తున్నాడు.
ఈ రెండింటి విషయమై మీరు ఆయనను విశ్వసించవచ్చు.
Copyright 2011 by Insight for Living.