2 కొరింథీయులకు 11:13-15; ప్రకటన 17-18
నా స్నేహితుడు ఒకరోజు సాయంత్రం కుక్క ఆహారం తిన్నాడు. లేదు, అతను విద్యార్ధుల ర్యాగింగ్‌లో లేదా ప్రవాసుల పార్టీలో లేడు. . . అతను వాస్తవానికి మయామి సమీపంలోని ఒక వైద్యుని ఇంటిలో ఒక మనోహరమైన విద్యార్థి రిసెప్షన్‌లో ఉన్నాడు. కుక్కల ఆహారాన్ని సున్నితమైన చిన్న క్రాకర్‌లపై దిగుమతి చేసుకున్న జున్ను, బేకన్ చిప్స్, ఒక ఆలివ్ మరియు దానిపైన పిమెంటో ముక్కతో వడ్డించారు. అది నిజం, స్నేహితులారా అలాగే పొరుగువారలారా; ఇది భోజనానికి ముందు తీసుకునే స్టార్టర్ లాంటిది, కుక్క ఆహారం.
ఆతిథ్యమిచ్చిన స్త్రీ చాలా అద్భుతమైన వ్యక్తి! కథను అభినందించడానికి మీరు ఆమెను గూర్చి తెలుసుకోవాలి. ఆమె ఒక నాణ్యమైన వంట కోర్సు నుండి పట్టభద్రురాలైంది, కాబట్టి తన నైపుణ్యానికి అంతిమ పరీక్ష పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆమె నిర్ణయించుకుంది. ఆమె ఎప్పుడైనా చేసిందా! ఆ బాధాకరమైన ముద్దని మార్పుచేసి, వాటిని రెండు వెండి ట్రేలలో ఉంచిన తర్వాత, అవి అయిపోవటం చూసి కపట నవ్వు నవ్వింది. నా స్నేహితునికి తగినంత అందలేదు. అతను ఇంకా తినాలని వాటికోసం తిరిగి వస్తూనే ఉన్నాడు. వారు అతనికి సమాచారము ఎలా అందించారో నాకు సరిగ్గా గుర్తు లేదు . . . కానీ అతను నిజం తెలుసుకున్నప్పుడు, అతను బహుశా మొరిగి ఆమె కాలు మీద కొరికుంటాడు! అతను ఖచ్చితంగా కొంచెం గగ్గోలు పెట్టి ఉంటాడు.
ఆ కథను విన్నప్పటి నుండి-ఇది వాస్తవంగా నిజం-ప్రతిరోజూ మరొక రంగంలో జరిగే విషయాన్ని ఎంత చక్కగా వివరించుచున్నదోనని నేను ఆలోచించాను. నేను మతపరమైన నకిలీలను సూచిస్తున్నాను . . . వృత్తి సంబంధమైన కువైద్యులు . . . మోసగాళ్ళు . . . రుచికరమైన బోధనలు మరియు ఆకట్టుకునే ప్రదర్శనతో అలంకరించబడిన మెరిసే పళ్ళెంలో తమ వస్తువులను అమ్ముకునే నకిలీ క్రైస్తవులు. మోసానికి యజమానులు కావడంతో, వారు తార్కికంగా ధ్వనించే పదబంధాల ద్వారా మభ్యపెట్టే రుచికరమైన వంటకాలను అందిస్తారు.
హే, అది తెలివైన పనే! మీరు నకిలీ డాలర్ బిల్లు చేయాలనుకుంటే, మీరు పసుపు నిర్మాణ కాగితాన్ని ఉపయోగించి, దానిని త్రిభుజం ఆకారంలో కత్తిరించి, మధ్యలో బ్యాట్‌మ్యాన్ చిత్రాన్ని ఉంచి మరియు ప్రతి మూలలో “3” అని ముద్రించరు. అది ఎవరినీ మోసం చేయలేదు. మోసం నమ్మించే తరహాలో వస్తుంది, ప్రామాణికత యొక్క దుస్తులు ధరించి, తెలివితేటలు, ప్రజాదరణ, ఆడంబరపూర్వకమైన ఆధారాలతో మద్దతు ఇస్తుంది. కొన్ని లక్షలమంది చేత, మోసపూరిత తిండిపోతులు అబద్ధాలను మ్రింగునట్లుగా మోసపరచబడ్డారు, వారు సత్యాన్ని జీర్ణించుకుంటున్నామని అనుకుంటున్నారు. వాస్తవానికి వారు ఫినియాస్ టేలర్ బార్నమ్ యొక్క బాగా ధరించిన పదాలను నొక్కిచెప్పారు:
ప్రతి నిమిషం మోసపోయేవాడు జన్మిస్తూనే ఉన్నాడు.
కానీ అది చోద్యం కాదు, విషాదకరం. మోసం దాని ఇంధనాన్ని గొయ్యి నుండి తీసుకుంటుంది. దేవుడు మనకు చెప్పేది అదే.
ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పని వారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. (2 కొరింథీయులకు 11:13-15)
వెండి పళ్ళెం వైపు ఒకసారి చూస్తే ప్రతిదీ రుచికరంగా కనిపిస్తుంది: “క్రీస్తు యొక్క అపొస్తలులు . . . వెలుగు దూతలు . . . నీతి పరిచారకులు.” మారువేషాల మేధస్సు ద్వారా, వారు మంచిగా కనిపించడమే కాదు, మంచి అనుభూతిని కలిగియుంటారు, మరియు సువాసనలు వెదజల్లుతారు! మీ ముందే మీడియా వారికి భజన చేస్తుంది.
సాక్ష్యాలు పుష్కలంగా ఉన్నాయి! కొన్నింటిని వినండి. “ఇది కొత్తది. . . అది నా జీవితాన్ని మార్చివేసింది! ” ఇతరులు ఇలా అంటారు, “అతను చెప్పినట్లు నేను చేసాను. . . మరియు ఇప్పుడు దేవుడు నాతో నేరుగా మాట్లాడుతున్నాడు. నాకు దర్శనాలు కలుగుచున్నవి. నేను దేవుడిని అనుభవించగలుగుచున్నాను.” కొన్ని లక్షలమంది చాలా స్వేచ్ఛగా ఇలా అరుస్తారు, “నిత్యత్వం ఇప్పుడే . . . భౌతికవాదం దైవికమైనది. ధనవంతులు కావడం ఆత్మీయతకు సంకేతం.” పెద్ద సంఖ్యలో అనుచరులు ఇలా పేర్కొన్నారు, “మా దగ్గర ఏమీ లేదు. అంతా గురువు వద్దకు వెళుతుంది.” మీరు వారిని ప్రతిచోటా కనుగొంటారు. చిన్న కరపత్రాలతో వీధి మూలల్లో, దేవునిపట్ల ఎప్పుడూ అంకితభావంతో ఉన్నట్లు కనిపిస్తారు. నక్షత్రాలను చూస్తూ; భవిష్యత్తును కనుగొంటారు. కొండల మీద చిన్న గుంపులుగా కూర్చొని, కొర్రల మిశ్రమాన్ని తినడం, షేవింగ్ చేయడానికి లేదా స్నానం చేయడానికి నిరాకరించపోతే వారు “దేవునితో సంబంధము” నకు అంతరాయం కలిగించినవారవుతారు. పళ్లెం రకరకాల వంటలతో నిండి ఉంది! $ 800 ఆరెంజ్ సూట్లు మరియు వజ్రాలు నిండిన బూట్లలో ఆడంబరమైన చీర్‌లీడర్ల నేతృత్వంలో కొన్ని మతపరమైన ఉత్సాహము కలిగించు ర్యాలీలకు మీరు హాజరవుతారు. మరోప్రక్క ఏకాంతాన్ని ఇష్టపడి ఆత్మీయ కలలు కంటూ నిశ్శబ్దంగా కూర్చునేవారు ఉంటారు.
వారు “క్రొత్త” రూపాన్ని, అనుభూతిని మరియు వాస్తవమైన రుచిని కలిగి ఉండవచ్చు -కానీ వారు అలాంటివారు కాదు. స్క్రూటేప్ ఒకసారి వార్మ్‌వుడ్‌కు తమ తండ్రి మాటలను ఉటంకించాడు:
క్రొత్త దుస్తులలో పాత లోపం
అయిననూ ఎప్పటికీ లోపమే
. . . కుక్క ఆహారాన్ని మీరు ఎలా అలంకరించినా కుక్క ఆహారమే అని చెప్పడానికి ఇది మరొక విధానం. లేదా పౌలు చాలా సూటిగా చెప్పినట్లుగా, “[వారు] దొంగ . . . మోసగాండ్రు . . . క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై ఉన్నారు.” వారు అలా కనిపించకపోవచ్చు, కానీ వారు పసుపు రంగులో ఉండే మూడు-డాలర్ల బిల్లు వలె నకిలీ మనుష్యులై ఉంటారు.
దురదృష్టవశాత్తు, పళ్లెం నుండి తీసుకోవడానికి చేతులు ఉన్నంత వరకు, అందంగా కనిపించే, తీపి వాసనగల చిట్కాలు అందుబాటులో ఉంటాయి. కానీ ఏదో ఒక రోజున, ఒక భయంకరమైన రోజున, కడపటి న్యాయాధిపతి ఏది తప్పో ఏది సత్యమో నిర్ణయించి ప్రకటిస్తాడు (ప్రకటన 17-18). చాలా గగ్గోలు మరియు ఉక్కిరిబిక్కిరి ఉంటుంది . . . మరియు అది ఇకపై రుచిగా ఉండదు.
నరకంలో ఏదీ రుచిగా ఉండదు.
Adapted from Charles R. Swindoll, Growing Strong in the Seasons of Life (Grand Rapids: Zondervan, 1994), 164. Used by permission