గొప్పతనం యొక్క చీకటి కోణం

“ప్రపంచం చూసిన మనుషుల్లో
అత్యంత పరిపూర్ణమైన పాలకుడు అక్కడ ఉన్నాడు . . . [మరియు]
ఇప్పుడు అతను వేరే లోకానికి చెందినవాడు.”

ఇది ఎవరి గురించి చెప్పబడింది?

కైసరుల గురించా? కాదు. నెపోలియన్? కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్? కాదు. ఐసెన్‌హోవర్? పాటన్? మాక్‌ఆర్థర్. . . లేదా గ్రాంట్ లేదా లీ లేదా పెర్షింగ్ వంటి మునుపటి సైనిక వ్యూహకర్తా? కాదు, వీళ్లెవరూ కాదు. రాక్నే లేదా లోంబార్డి గురించా? కాదు. లేక లూథర్? కాల్విన్? నాక్స్? వెస్లీ? స్పర్జన్? మళ్ళీ, కాదు అనే సమాధానం వస్తుంది.

సరే, నిస్సందేహంగా గొప్ప, శక్తివంతమైన మరియు ఒప్పించే వ్యక్తిత్వం కలిగిన నాయకుని గురించి చెప్పబడింది, కాదా? ఖచ్చితంగా తన విజయాన్నిబట్టి మెచ్చుకోబడినవాడై ఉంటాడు. చెప్పలేమని నేను అనుకుంటున్నాను.

అతను ఏడు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుటుంబం చట్టపరమైన సాంకేతికత కారణంగా వారి ఇంటి నుండి బలవంతంగా బయటకు పంపివేయబడ్డారు. వారిని ఆదుకోవడానికి అతను పని చేయాల్సి వచ్చింది.

తొమ్మిదేళ్ల వయసులో, వెనుకబడిన, సిగ్గుపడే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, అతని తల్లి మరణించింది.

22 సంవత్సరాల వయస్సులో, అతను స్టోర్ క్లర్క్‌గా ఉద్యోగం కోల్పోయాడు. అతను లా స్కూల్‌కి వెళ్లాలనుకున్నాడు, కానీ అతని చదువు సరిపోలేదు.

23 సంవత్సరాల వయస్సులో, అతను ఒక చిన్న దుకాణంలో భాగస్వామి కావడానికి అప్పులు చేశాడు. మూడు సంవత్సరాల తరువాత అతని వ్యాపార భాగస్వామి మరణించాడు, తిరిగి చెల్లించడానికి సంవత్సరాలు పట్టిన భారీ అప్పును అతనికి మిగిల్చాడు.

28 సంవత్సరాల వయస్సులో, ఒక యువతితో నాలుగు సంవత్సరాలు శృంగార సంబంధాన్ని పెంచుకున్న తరువాత, అతను తనను వివాహం చేసుకోమని ఆమెను కోరాడు. ఆమె కాదని చెప్పింది. అంతకుముందు ఒక అందమైన అమ్మాయితో పంచుకున్న తన యవ్వన ప్రేమ ఆమె మరణంతో గుండె కోతను మిగిల్చింది.

37 సంవత్సరాల వయస్సులో, తన మూడవ ప్రయత్నంలో, అతను చివరకు కాంగ్రెస్‌కు ఎన్నికయ్యాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ పోటీ చేసి మళ్లీ ఎన్నికవ్వడంలో విఫలమయ్యాడు. ఈ సమయంలోనే మానసిక ఒత్తిడితో బాధపడ్డాడు.

41 సంవత్సరాల వయస్సులో, అప్పటికే సంతోషంగా లేని వివాహానికి అదనపు హృదయ వేదన తోడైనట్లుగా, అతని నాలుగు సంవత్సరాల కుమారుడు మరణించాడు.

మరుసటి సంవత్సరం అతను రెవెన్యూ ఆఫీసర్ పదివికి తిరస్కరించబడ్డాడు.

45 సంవత్సరాల వయస్సులో, అతను సెనేట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు.

రెండు సంవత్సరాల తరువాత, అతను ఉపరాష్ట్రపతి నామినేషన్ వేసి ఓడిపోయాడు.

49 ఏళ్ళ వయసులో, అతను మళ్లీ సెనేట్‌కు పోటీ చేశాడు . . . మళ్ళీ ఓడిపోయాడు.

దీనికి తోడు అంతులేని విమర్శలు, అపార్థాలు, అసహ్యకరమైన మరియు తప్పుడు పుకార్లు మరియు తీవ్ర నిరాశా నిస్పృహలు మరియు అతను తన సహచరులచే అవమానించబడ్డాడు మరియు అనేకమంది ప్రజలచే తృణీకరించబడ్డాడు, అతని కాలంలో ఎవరూ అతని చూసి అసూయపడలేదనటంలో ఎటువంటి ఆశ్చర్యంలేదని మీరు గ్రహించగలరు.

51 ఏళ్ళ వయసులో, అతను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు . . . కానీ అతని రెండవ పదవీకాలం అతని హత్యతో కుదించబడింది. అతను కాల్చి చంపబడిన ప్రదేశానికి ఎదురుగా ఉన్న ఒక చిన్న గదిలో చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు, ఒక మాజీ వ్యతిరేకి (ఎడ్విన్ స్టాంటన్), ఈ వ్యాసం ఎగువన నేను ఉల్లేఖించినది తగిన నివాళిగా ఉన్నది. ఇది అమెరికన్ చరిత్రలో అత్యంత స్ఫూర్తిదాయకమైన మరియు అత్యంత గౌరవనీయమైన అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గురించి మాట్లాడబడిందని మీకు తెలుసు, ఆయన పుట్టినరోజును మనము త్వరలో జరుపుకోబోతున్నాము.

మనం ఎంత విచిత్రమైన మనుష్యులం! మిరుమిట్లు గొలిపే లైట్లు, ప్రజల చంచలమైన చప్పట్లు, విజయంతో త్రుళ్ళిపడి ఆకర్షితులై, మనము ఆ బలహీనమైన మరియు నశ్వరమైన పరాకాష్టకు దారితీసిన పరిస్థితులను గుర్తిస్తాము. కఠినమైన కష్టాలు. అన్యాయమైన మరియు అనర్హమైన వేధింపులు. ఒంటరితనం మరియు నష్టం. అవమానకరమైన వైఫల్యాలు. బలహీనపరిచే నిరాశలు. పైనుంచి క్రింది వరకు కొండ సందులలో మరియు లోయలలో అగోచరమైన వేదన అనుభవించటం.

ఎంత హ్రస్వదృష్టి! నొప్పి, వేదన, వైఫల్యం ద్వారా పట్టుదల లేకుండా నడిపించే హక్కు ఎవరికీ లేదనే వాస్తవాన్ని అంగీకరించడానికి బదులు, మనము ఆ చొరబాటుదారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాము. మనము వాటిని శత్రువులుగా పరిగణిస్తాము, స్నేహితులుగా కాదు. గొప్పతనం యొక్క గుర్తులు చంచలమైన దేవుళ్లచే కాగితపు సంచిలో అందించబడవని మనం మరచిపోతాము. వారు పచ్చబొట్టువలె చర్మంపై తొందరపడి అంటుకోరు.

లేదు, నిజంగా అనుసరింపదగినవారు ఎంతో ప్రయాసముతో ఈ స్థితికి వచ్చి ఉంటారు. వారు కొలిమిలో కరిగి, కొట్టబడి, పునర్నిర్మించబడి, మిళితం చేయబడి వచ్చారు. తార్సు నుండి వచ్చిన బోధకుని మాటలను ఉపయోగిస్తే, వారు తమ శరీరాలలో “యేసు యొక్క ముద్రలు” కలిగి ఉన్నారు (గలతీయులకు 6:17). లేదా, ఒకరు దానిని వివరించినట్లుగా, వారు “కొరడా దెబ్బలు మరియు గాయాల మచ్చలను” మోస్తారు . . . యివి మానవజాతి మొత్తానికి సంబంధించినవి.

అలాంటి వ్యక్తులు కాలానుగుణంగా నిత్యత్వానికి మారినప్పుడు వారిని “చిరస్మరణీయులు” అని అనడంలో ఆశ్చర్యమేమియు లేదు.

Taken from Charles R. Swindoll, Growing Strong in the Seasons of Life (Grand Rapids, Mich.: Zondervan Publishing House, 1983) 100. Copyright © 1983 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.

Posted in Leadership-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.