చాలా మంది వ్యక్తులు నాయకుడు అనే పదాన్ని విన్నప్పుడు వారు అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, పాస్టర్లు, ఉపాధ్యాయులు మరియు CEO లను గురించి ఆలోచిస్తారు. కానీ చాలా తక్కువ మంది తమ గురించి ఆలోచిస్తారు. అయితే, ఇది నిజం. నువ్వు ఒక నాయకుడవే. క్రైస్తవునిగా, నువ్వు క్రీస్తు కొరకు ప్రభావశీలునిగా, ప్రభువు కొరకు రాయబారిగా మరియు దేవుని కృపాసువార్త కొరకు మార్పు-ప్రతినిధిగా ఉన్నావు. నిజానికి, నెహెమ్యా గ్రంథంలో మీకు వర్తించే నాయకత్వానికి సంబంధించిన ఏడు సూత్రాలను నేను కనుగొన్నాను. నెహెమ్యా యొక్క ఉదాహరణ మీరు మీ ప్రభావం చూపించగల రంగానికి వెంటనే అన్వయించగల సూత్రాలను అందిస్తుంది.
మొదటి సూత్రం ప్రాజెక్ట్ పట్ల తీవ్రోత్సాహమును కలిగిస్తుంది. తీవ్రోత్సాహంలో ఊహాదృష్టి, ఉత్సాహం, ప్రేరణ, సంకల్పం మరియు సృజనాత్మకత ఉంటాయి. తీవ్రోత్సాహం ఉన్న వ్యక్తులు అన్ని వివరాలలో చిక్కుకోకుండా లేదా నిమగ్నమై ఉండకుండా విశాల దృక్పథమును గ్రహించగలరు. తాను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడాన్ని ఊహించుకున్న నెహెమ్యాకు నిద్ర పట్టి ఉండదు. అతని తీవ్రోత్సాహం విజయవంతమైంది.
ఇతరులను ప్రేరేపించే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే రెండవ సూత్రం. ఇతరులతో బాగా కలిసిపోవడం నాయకత్వంలో కీలకమైన భాగం. ఇది ఆలోచనలు, కలలు మరియు ఆందోళనలను మౌఖికీకరించడం వంటి నైపుణ్యాలను కలిగి ఉంటుంది; లక్ష్యాలను క్లుప్తంగా మరియు సరళంగా వ్యక్తీకరించడం; అలాగే ఉత్సాహం మరియు ప్రోత్సాహం యొక్క భారీ మోతాదుతో దయను ప్రదర్శించడం. ప్రేరేపించే నాయకులు ఎల్లప్పుడూ తమ వంతు కృషి చేసేందుకు ఇతరులను ప్రేరేపిస్తారు. ప్రాధాన్యము ఇవ్వవలసిన చోట ప్రాధాన్యమును ఇచ్చి వారు త్వరగా దృఢపరుస్తారు మరియు గుర్తుంచుకుంటారు. నెహెమ్యా ఆ లక్షణాలన్నింటిలో బలంగా ఉన్నాడు.
దేవునిపై అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటమే మూడవ సూత్రం. నెహెమ్యా యొక్క దినచర్య పుస్తకం ప్రార్థనలతో నిండి ఉంది-నిశ్శబ్దమైనవి, చిన్నవి మరియు నిర్దిష్టమైనవి. దేవుని సన్నిధిని మరియు కాపుదలను ప్రజలకు గుర్తు చేయడంలో అతను ఎప్పుడూ విఫలం కాలేదు. ప్రామాణికమైన నాయకులు స్థిరంగా ఇతరుల దృష్టిని శక్తికి నిజమైన మూలం వైపు–అసాధ్యమైన వాటిని సాధించగలవాని వైపు మళ్లిస్తారు. వారి విశ్వాసం సంక్రమించేదిగా ఉంటుంది. వారు అప్పుడప్పుడు వారి స్వంత సామర్థ్యాన్ని అనుమానించవచ్చు, కానీ వారు ఆయన పని పట్ల దేవుని అజేయమైన నిబద్ధతను అనుమానించరు.
వ్యతిరేకత గుండా సహనం మరియు ఓర్పు నాల్గవ సూత్రాన్ని సూచిస్తాయి. నెహెమ్యా అన్నింటినీ భరించాడు: వ్యంగ్యం, అనుమానం, గుసగుసలు, ఎగతాళి, బెదిరింపులు, అనామక వ్రాతలు, తప్పుడు ఆరోపణలు-ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలిసినట్లుగా ఉన్నాయా? అందులో ఏదీ నెహెమ్యాను కదిలించలేదు. విమర్శల గుండా ఓపికగా, దృఢంగా ఉండలేకపోతే ఏ నాయకుడూ మనుగడ సాగించలేడు. చంచలంగా, ప్రతీకారంగా లేదా నీచంగా మారకుండా లక్ష్యంలో దృఢంగా ఉండటం ముఖ్యం.
అనుసరించాల్సిన ఐదవ సూత్రం ఏమిటంటే వాస్తవికతపై ఆచరణాత్మక, సమతుల్య పట్టు. మంచి నాయకుడికి కలలు మరియు ఆలోచనలు ఉండవచ్చు, అయితే అతను లేదా ఆమె ఆదర్శాల కలల ప్రపంచంలో జీవించరు. అసలైన వాస్తవాలు-కఠినమైన సాక్ష్యాలు-స్పష్టముగా కనబడుచున్నాయి. యెరూషలేము గోడను పునర్నిర్మిస్తున్న పనివారిని తమ పనుల్లో ఉండమని నెహెమ్యా చెప్పాడు. అతను, అదే సమయంలో, దాడి నుండి గోడను కాపాడటానికి తెలివిగా ఇతరులను నిలబెట్టాడు. తెలివైనవాడు. వివేచనాపరుడు. కఠినమైనవాడు. అతిగా స్పందించకుండా పనిచేసాడు. మంచి నాయకులు సానుకూలంగా ఉండటం మరియు ప్రతికూలత గురించి తెలుసుకోవడం మధ్య అవసరమైన సమతుల్యతను కలిగి ఉంటారు.
ఆరవది ఏమిటంటే కష్టపడి పనిచేయడానికి మరియు నిస్వార్థంగా ఉండటానికి ఇష్టపడటం. చాలా మంది క్రైస్తవ నాయకులలో ఒక సాధారణమైన విషయం: శ్రద్ధ. పని ముగించడం యొక్క విలువ కూడా వారికి తెలుసు. (శ్రద్ధ మరియు అతిగా పనిచేయడం పర్యాయపదాలు కావు.) అతని కృషి కారణంగా, గోడ పునర్నిర్మించబడక ముందే, నెహెమ్యా “యూదా అధిపతి” (నెహెమ్యా 5:14)గా నియమించబడ్డాడు. అతను తన నియామకాన్ని వినయంగా అంగీకరించాడు, ప్రత్యేక ఉపచారమును తిరస్కరించాడు మరియు ప్రజల మంచి కోసం ఇష్టపూర్వకంగా త్యాగం చేశాడు. సేవకుని నాయకత్వంపై నెహెమ్యా ఒక క్లినిక్‌ని నడిపించి ఉండవచ్చు.
చివరగా, నాయకులు పనిని పూర్తి చేయడానికి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మంచి నాయకులు పని పూర్తిచేసేవారై ఉంటారు. సర్వోత్కృష్టమైన వివరాలు మార్గాన్ని అడ్డుకోవడానికి అనుమతించకుండా అవసరమైన వాటిపై ఎలా దృష్టి పెట్టాలో వారికి తెలుసు. కొన్ని గోడ రాళ్లు కొంచెం వంకరగా ఉన్నాయని మరియు కొన్ని కీళ్ళు వదులుగా ఉండవచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. బహుశా ఒకటో లేదా రెండో ద్వారములు సరైన స్థాయిలో లేకపోవచ్చు మరియు ఒకటో లేదా రెండో ఆధారములు మొతవస్తున్నాయి . . . కానీ వాడు ఆ పనిని పూర్తిచేసాడు. మిషన్ నెరవేరింది. సమాప్తము. పూర్తైయ్యింది! (నేను ఈ పదాన్ని ప్రేమిస్తున్నాను.)
మరియు పని పూర్తయినప్పుడు, మంచి నాయకులు పండగ చేసుకుంటారు . . . వారు ఆనందిస్తారు! నెహెమ్యా విషయంలో, వారు గోడపై నడవడం, కవాతు చేయడం మరియు నృత్యం చేయడం, కేకలు వేయడం మరియు పాడడం వంటివి చేశారు. ఎంత గొప్ప మరియు అద్భుతమైన విందు!
మంచి స్వభావం ఉన్న క్రైస్తవ నాయకులు అవసరమైయున్నారు. “దేశమును పాడుచేయకుండునట్లు [నీతిగల] ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును” నాయకుల కొరకు దేవుడు వెదకినట్లు యెహెజ్కేలు నమోదు చేసాడు, కానీ, విషాదకరంగా, ఆయనకి “ఒకడైనను కనబడలేదు” (యెహెజ్కేలు 22:30). దేవుని అన్వేషణ నేటికీ కొనసాగుతుంది. బద్దలైన సందులలో నిలబడటానికి దేవుడు వెదకుచున్న స్త్రీపురుషులముగా ఉండుటకు నిర్ణయించుకుందాం. ఈ తరానికి చెందిన నెహెమ్యాలుగా ఉందాం–నాయకత్వపు నిశ్చలమైన సూత్రాలపై బలంగా నిలబడి, దేవుని మహిమ కోసం పనులు చేసే క్రైస్తవులుగా ఉందాం.
Copyright © 2015 by Insight for Living. All rights reserved worldwide.