“చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనప్పుడు, సూచనలను చదవండి.”
ఆ చిన్న, ఐదు పదాల హెచ్చరిక ప్రతి ఎలక్ట్రిక్ రైలు సెట్‌మీద, ప్రతి ప్లాస్టిక్ మోడల్ మీద, రెండు-టన్నుల ప్యాకేజీలో అమర్చబడిన ప్రతి ఉయ్యాల మీద, ప్రతి హైటెక్ పరికరం మీద-విడదీయబడిన లేదా విద్యుత్ అవసరమయ్యే దేనిమీదనైనా కనిపిస్తుంది. ఇది మీకు వర్తించదని నటించే ప్రయత్నం చేయవద్దు! నాలాగే, మీరు కూడా ప్రమాదకరముకాని కిట్‌ని చూసి, కాసింత ఇంగితజ్ఞానం ఉంటే సరిపోతుందని అనుకొని, సూచనల పుస్తకాన్ని పక్కన పడేశారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. చాలా తెలివైన స్త్రీలు మరియు పురుషుల మాదిరిగానే, మీరు సూచనల సహాయం లేకుండానే దీన్ని అమర్చవచ్చని అనుకున్నారు.
నేను ఒక సాధారణ ఉయ్యాల సెట్ కిట్‌ని చూసి, అబ్బా, నా సామర్థ్యం ఉన్న వ్యక్తికి దానితో ఎలాంటి సమస్య ఉండకూడదని అనుకున్నాను. అవును, నిజం! అయితే ఒక గంట తర్వాత, ప్రాజెక్ట్ మొత్తం గజిబిజి అయిన తర్వాత, నేను సూచనల కోసం చూశాను. సహజంగానే ఒక వ్యంగ్య జ్ఞాని సూచనల పుస్తకమును సిద్ధం చేసాడు, ఎందుకంటే మొదటి పేజీ పైభాగంలో చాలా చిన్న, అప్రియముకాని విధంగా, ప్రారంభ వాక్యం ఇలా ఉంది, “ఇప్పుడు మీరు చాలా గందరగోళాన్ని సృష్టించారు, దయచేసి మళ్లీ ప్రారంభించి, ఈ సూచనలను అనుసరించండి.” రచయితకు నా గురించి వ్యక్తిగతంగా తెలుసా అలాగే నా కోసమే ఆ మాటలు రాశారా అని కొద్దిసేపు నేను ఆశ్చర్యపోయాను! నేను ఏమి చేయబోతున్నానో అతనికి ఎలా తెలిసి ఉండవచ్చు?
నిజానికి, అతనికి నేను తెలియదు. అతీంద్రియంగా ఏమీ జరగలేదు. జ్ఞాని మానవ స్వభావాన్ని అర్థం చేసుకున్నాడు. పనులను మనకిష్టమొచ్చినట్లు చేయడం మన పతనమైన మరియు గర్వించదగిన స్వభావంలో ఒక భాగం, అలాగే వైఫల్యం యొక్క పరిణామాలు అధికమైనప్పుడు మాత్రమే మనము సహాయం కోసం వెదకుతాము. అందువల్ల, తయారీదారులు ఈ మొండి ధోరణిని అంగీకరించడమే కాకుండా, సాధారణ సూచనల మాన్యువల్‌తో “త్వరిత ప్రారంభ మార్గదర్శిని” ని చేర్చడం ద్వారా వారు మన హ్రస్వ దృష్టిని ఊహించారు. ఇది సాధారణంగా సంగ్రహించబడిన, తెలుసుకోవలసిన అవసరం ఉన్న సమాచార కరపత్రం, వినియోగదారులు తమను తాము బాధించుకోకుండా లేదా ఉత్పత్తిని దెబ్బతీయకుండా ఉంచడానికి తగినంత సమాచారాన్ని యిది కలిగి ఉంటుంది.
మీరు నమ్మినా నమ్మకపోయినా, జీవితం యజమాని యొక్క సూచనల పుస్తకంతో వస్తుంది. సృష్టికర్త తన సూచనలను బైబిల్‌లోని అరవై ఆరు పుస్తకాలలో తన వాక్యపు పేజీలలో వ్రాసాడు. ఆదికాండము నుండి మొదలుకొని ప్రకటనతో ముగిసే వరకు, ఆయన మన మూలాన్ని వివరించాడు, మన ఉద్దేశ్యాన్ని వివరించాడు, మన అవసరాన్ని సవాలు చేశాడు, మన నివారణను సూచించాడు, మన చర్యలను ఆదేశించాడు మరియు మన భవిష్యత్తును కూడా వెల్లడించాడు. అంతేకాకుండా, మానవాళికి తెలిసిన అత్యంత ఆకర్షణీయమైన, ప్రభావవంతమైన మరియు లోతైన కవిత్వం మరియు గద్యం–అనే సాహిత్యం రూపంలో ఆయన తన సూచనలను అందించాడు. అయినప్పటికీ, మనమందరం యజమాని సూచనల పుస్తకాన్ని పక్కన పెట్టేసి మన స్వంత ఇంగితజ్ఞానం మనకు సరిపోతుందనే ఊహతో జీవితంలో దూసుకుపోతున్నాము.
ఈ మాటలను చదివిన మీలో చాలా మంది నాతో వినయపూర్వకంగా ఏకీభవించగలరు, ఎందుకంటే నాలాగే మీరు కూడా పిల్లల ఉయ్యాల సెట్ లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ కంటే చాలా ముఖ్యమైన దాన్ని పాడుచేసి ఉంటారు. మీరు జీవితాన్ని పాడుచేసారు . . . మీ స్వంతది లేదా బహుశా వేరొకరిది . . . లేదా ఇద్దరిది పాడుచేసి ఉంటారు! కాబట్టి, కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకించి విషయాలను గందరగోళానికి గురిచేసిన తర్వాత, నాకు నిరీక్షణను కలిగించిన ప్రాథమిక సత్యంతో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను: సరైనది చేయడం ప్రారంభించడానికి సమయం ఎప్పటికీ మించిపోదు. యజమాని సూచనల పుస్తకాన్ని తీసుకోవడానికి సమయం మించిపోలేదు. నిజానికి, పాడుచేసిన తర్వాత, ఇది మాత్రమే సరైన చర్య.
మీరు మీ జీవితాన్ని సమీక్షించుకొని, ఇప్పటివరకు భూమిపై మీరు గడిపిన ఫలితాలను అంచనా వేసినప్పుడు, మీరు ఏమి చూస్తున్నారు? మీ జీవితం అనుకరించడానికి విలువైనదేనా లేదా అది పొరపాట్లు మరియు గందరగోళాల శ్రేణినా? మీతో గడిపిన సమయం ఫలితంగా ఇతరులు మెరుగ్గా ఉన్నారా లేదా మీరు పోయిన తర్వాత డబ్బులకు విక్రయించబడే ఆస్తులపై మీ సమయం మరియు శక్తి కేంద్రీకరించబడిందా? లోపల ఏముంది? పెరుగుతున్న జ్ఞానమా . . . లేక పదే పదే వ్యక్తమవుతున్న మూర్ఖత్వమా? దయా లేదా గొణుగుడా? నిజాయితీగా ఉండండి: మీ జీవితం దేనికైనా మంచిదానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారా?
ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలు నిరుత్సాహకరంగానూ, సవాలుగానూ ఉంటాయి. నిరుత్సాహానికి గురిచేస్తాయి, ఎందుకంటే మనమందరం పడిపోవుచున్నాము. సవాలు విసురుతున్నాయి, ఎందుకంటే మనం ఆలోచించే దానికంటే లేదా ఊహించే దానికంటే అత్యధికముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనంతట మనం దేని విషయమై కూడా మంచిగా ఉండగలమని మనం ఆశించలేము; అయినప్పటికీ, దేవుడు అందించిన సూచనలను మనం చదివి అనుసరించినట్లయితే, మన జీవితాలు ఆయన మహిమకు స్మారక చిహ్నాలుగా మరియు ఆయన మంచితనానికి నమూనాలుగా మారవచ్చు. అది ఆయన చేసిన వాగ్దానం (2 కొరింథీయులకు 9:8; ఎఫెసీయులకు 3:20 చూడండి).
ఇప్పుడు, నేను మీకు సూచన చేయాలనుకుంటున్నాను, నా జీవితంలో ఒక క్లిష్ట సమయంలో నేను అందుకున్న జ్ఞాని యొక్క సలహాను తెలియజేస్తాను: “ఇప్పుడు మీరు చాలా గందరగోళం చేసారు, దయచేసి మళ్లీ ప్రారంభించండి మరియు ఈ సూచనలను అనుసరించండి.”