మనలను అణచివేసేవి

యేసు అద్భుతమైన వక్త. జనాలను ఉద్దేశించి మాట్లాడటానికి అవసరమైన వస్తువుల సహాయం లేకుండా లేదా అందమైన సంగీతం, మృదువైన సీట్లు మరియు ఎయిర్ కండిషనింగ్ సౌకర్యం లేకుండా, ఆయన ప్రేక్షకులు నిమగ్నమై శ్రద్ధతో విన్నారు. మరియు ఆయన బోధలో ఎక్కువ భాగం ప్రకృతి యొక్క కల్లోలము మధ్య లేదా రద్దీగా ఉండే నగర వీధుల సందడి మధ్య బయట జరిగింది. కానీ అవేవీ ప్రధానమైనవిగా అనిపించలేదు. ఆయన మాట్లాడినప్పుడు, జనులు విన్నారు.

ఇటీవల మార్కు సువార్త చదువుతున్నప్పుడు, నేను 4వ అధ్యాయంలోని ఒక సన్నివేశంలోకి లాగబడ్డాను. మీకు అది తెలుసు; ఆ సమయంలో ఆయన సముద్రతీరంలో ఒక చిన్న పడవలో కూర్చుని విత్తనాలను మట్టిలో వేసిన రైతు గురించి మాట్లాడాడు. సాధారణ కథే. మీరు చిన్న పిల్లలైనా సరే, గుర్తుంచుకోవడం సులభం. అదే విత్తనం, భిన్నమైన నేల. విత్తబడే సమయం ఒకటే, కానీ ఫలితాలు భిన్నంగా ఉన్నాయి. సరిగ్గా చెప్పాలంటే నాలుగు.

కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడిపోయాయి. . . పక్షులు వాటిని మ్రింగివేసాయి.

కొన్ని విత్తనాలు రాతి నేలపై పడ్డాయి. . . సూర్యుని యొక్క తీక్ష్ణమైన కిరణాలు వేర్లులేని ఎదుగుదలను కాల్చివేసాయి మరియు అవి వాడిపోయి చనిపోయాయి.

కొన్ని విత్తనాలు ముండ్లపొదల్లో పడ్డాయి . . . ఇవి ఎదుగుదలను అణచివేసాయి కాబట్టి కోతకాలానికి పంట లేదు.

మరికొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి . . . అద్భుతమైన పంట.

ఆసక్తికరంగా, “వినుటకు చెవులుగలవాడు వినునుగాక” (మార్కు 4:9) అనే సుపరిచితమైన వాక్యముతో యేసు తన సంక్షిప్త ప్రసంగాన్ని ముగించాడు. అతను దాదాపుగా ఊహించినట్లుగా, “ఈ విషయాలు మీలో చొచ్చుకుపోకపోతే నేను చెప్పేది మీరు మిస్ అవుతారు . . . వాటిని బాగా వినండి. . . వాటి ప్రాముఖ్యతను గ్రహించండి. . . నా స్వరాన్ని ఏదీ మరుగుపరచనివ్వవద్దు!”

నేను చదువుతూనే ఉన్నాను, అధ్యాయాన్ని పూర్తి చేయాలనే నా లక్ష్యంతో కొంత నిమగ్నమై ఉన్నాను, ఆ “వినడానికి చెవులు” అనే పదముచేత మరలా మరలా పట్టుబడ్డాను.

కాబట్టి నేను ప్రభువు చెప్పిన కథ దగ్గరకు తిరిగి వచ్చాను మరియు దానిని మళ్ళీ చదివాను. నేను చదువగా, ప్రత్యేకించి నేను ఆయన తదుపరి వివరణను జీర్ణించుకోవడం ప్రారంభించగా, నా హ్రస్వదృష్టి విషయమై నేను మందలించబడ్డాను. ఎందుకంటే, ఆయన చెప్పిన చాలా ఉపమానాల మాదిరిగా కాకుండా, యేసు దీనిలో ఒక్కొక్క విషయాన్ని క్షుణ్ణంగా మరలా చెప్పాడు, సందేహం లేదా అపార్థానికి చోటు లేకుండా చేశాడు.

మొదటిగా, విత్తనం “వాక్యాన్ని” సూచిస్తుందని ఆయన చెప్పాడు. “వాక్యము” సత్యాన్ని సూచిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నేను నమ్ముతున్నాను. దేవుని సత్యం. జీవించడానికి సత్యం. మన దేవుడైన యెహోవా చేత మనకు ఇవ్వబడిన జీవాన్ని ఇచ్చే మాటలు. అవును, లేఖనాలు, అలాగే విత్తనం వేళ్ళూనుకున్నప్పుడు మనలో పెరిగే వివేచన, దృక్పథం మరియు జ్ఞానం.

రెండవది, రకరకాల నేలలు ఆ “వాక్యానికి” ప్రజల నుండి వచ్చే వైవిధ్యమైన ప్రతిస్పందనలను సూచిస్తాయి. నలుగురూ, దయచేసి గమనించండి, “విన్నారు”, కానీ అందరూ పంటను కోయలేదు. అది ముఖ్యమైనది. వినటం వలన దేనికీ గ్యారంటీ లేదు. దీని అర్థమేమంటే విత్తనం వేయబడింది: “వాక్యము” అందుబాటులోకి వచ్చింది.

తరువాత, ఫలితాలు నేరుగా నేల యొక్క స్థితినిబట్టి ఆధారపడ్డాయి . . . విత్తనం యొక్క నాణ్యతనుబట్టి కాదు. అదే విత్తనం, గుర్తుంచుకోండి, కానీ నేల మాత్రమే తేడా. కొన్నింటిలో అది వృధాగా పడిపోయింది, మరికొన్నింటిలో త్వరగా వాడిపోయింది, కొన్నింటిలో అణచివేయబడింది, మరికొన్నింటిలో బాగా పెరుగుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మొదటి రెండు గుంపులకు వేర్లు లేవని మీరు చూడగలరు. చివరి రెండు గుంపులతో మాత్రమే యేసు ఫలమును గూర్చి ప్రస్తావించాడు.

మొదటి రెండు గుంపుల జనులు ఆత్మీయ జీవితం లేకుండా ఉన్నారని స్పష్టంగా ఉన్నట్లు నేను భావిస్తున్నాను. వేర్లు లేవు, ఫలాలు లేవు, ఎదుగుదల లేదు, ఎటువంటి మార్పు లేదు. చివరి రెండింటికి వేర్లు ఉన్నాయి . . . ఫల రంగములో తేడా మాత్రమే వాటిమధ్య ఉన్నది. ఒకటి “ఫలింపలేదు,” మరొకటి “ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.” మూడవ గుంపు విన్నారు, కానీ నాల్గవ గుంపు మాత్రమే “వాక్యము విని, దానిని అంగీకరించి,” ఫలితంగా బలముగా, ఆరోగ్యకరముగా ఎదిగినది.

నాకు ఆసక్తి కలిగించేది మూడవ సమూహం. ఈ జనులు నాల్గవ సమూహం వినిన ప్రతిదాన్ని విన్నారు. కానీ ఆ సత్యాలు నిజంగా అంగీకరించబడలేదు, వేళ్ళూనుకొని ఎదగడానికి అవకాశం లభించలేదు. బదులుగా, ముండ్లు “వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును.”

అణచివేసే ముండ్లు? ఏమిటి అవి? యేసు, ఆయన అద్భుతమైన సంభాషణకర్త అయినందున, మనలను చీకటిలో వదిలిపెట్టలేదు. అణచివేసే ముండ్లు ఏవంటే “ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలును” (మార్కు 4:19).

విచారము అనే పదం పాత జర్మన్ పదం వుర్గెన్ నుండి ఉద్భవించింది, దీని అర్థం “అణచివేయడం.” ఏదో ఒకవిధంగా, పొడిగించడం ద్వారా, ఈ పదం “మానసికంగా అణచివేయబడుట” ను సూచించుచున్నది అలాగే చివరకు, ఆందోళనతో వేధించబడే స్థితిని సూచిస్తుంది.

ఆ ముండ్లే మనల్ని బాధిస్తాయి. ఎల్లప్పుడూ ఎదుగుతూ, మన మనస్సులో నుండి “వాక్యమును అణచివేయడానికి” సిద్ధంగా ఉంటుంది. విచారమునే తీసుకోండి (ఎవరో ఒకరు దీనిని కలిగి ఉంటారని నేను అనుకుంటున్నాను!). ఇది ఒక సన్నని ప్రవాహంలా ప్రారంభమవుతుంది, మన మనస్సులలో నెమ్మదిగా బయటపడుతుంది, దీనికి చోటిస్తే, అది ఇతర ఆలోచనలు ప్రవహించే లోతైన కాలువను సిద్ధం చేస్తుంది. “ధనమోసము” విషయంలో కూడా అదే నిజం. ఎంతటి దహించే కోరిక . . . అయిననూ ఎంత నిరర్థకముగా, ఎంత అసంతృప్తిగా ఉంది! అయితే అవి తమకు అంత పట్టింపు కావని చెప్పడం ద్వారా మనము సమర్థించుకుంటాము. “నాకు డబ్బు అంటే ఇష్టం లేదు, కానీ అది నన్ను చింతించకుండా చేస్తుంది” అని నవ్వుతూ చెప్పిన గొప్ప హెవీవెయిట్ చాంప్, జో లూయిస్‌లాగా సమర్థించుకుంటాము. అవును, ఖచ్చితంగా, జో.

కానీ మూడవ జాతియైన ముండ్లే చాలా బాధాకరమైనవి: “మరి ఇతరమైన అపేక్షలును.” దీని గురించి ఆలోచించడం మంచిది. ఇది అసంతృప్తి యొక్క చిత్రం, అన్వేషణ యొక్క తెగులు: బలముతో ముందుకు పోవుచూ, ప్రయాసపడుచూ, పూర్ణప్రయత్నము చేయుచూ, ఎడతెగక బలముగా చేరుకొనుచూ, “చేసిన దానితో సంతృప్తి చెందలేదు,” అనే అబద్ధముతో మన మనస్సులు అణచివేయబడినప్పుడు, అది గొప్ప ముండ్ల ఎరువుగా మారుతుంది. అబ్బా, మనం ఎప్పుడు నేర్చుకుంటాము?

ఆయన గొప్ప సంభాషణకర్త అయినందున, నజరేయుడు అనువర్తనమును చాలామట్టుకు చెప్పకుండా వదిలేశాడు. ఆయన తన శ్రోతలను ఉక్కిరిబిక్కిరి చేయకుండా జాగ్రత్తపడ్డాడు, కానీ ప్రతి వ్యక్తి తన స్వంత నిర్దిష్ట తీర్మానాలను వెలికితీసుకోవడానికి అనుమతించాడు.

“వినుటకు చెవులుగలవాడు వినునుగాక.”

Taken from Charles R. Swindoll, “Things That Strangle Us,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 126–28. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide. Used by permission.

Posted in Jesus-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.