దీన్ని తేలికగా తీసుకోకండి

వారి వయస్సు నిజమనిపించకపోవు ఈ అద్భుతమైన వ్యక్తులను నేను కలుస్తూ ఉంటాను. వారి ఉత్సాహం అంటుకునేదిగా ఉంటుంది, జీవితం పట్ల వారి ఆసక్తి ఆకర్షించేదిగా ఉంటుంది. వారు ఇంకా ఆలోచిస్తూ, కలలు కంటున్నారు, సరదాగా ఉండటం మానకూడదని నిశ్చయించుకున్నారు. అలాగే వారు తమను తాము ఊగే కుర్చీలో చతికిలబడిపోవడానికి మరియు సూర్యాస్తమయాలను చూడటానికి ఖచ్చితంగా ఆసక్తి చూపరు.

గడచిన థాంక్స్ గివింగ్ డే నాడు, మేము సంఘములో మా వేడుకను ముగించినప్పుడు, మా సంఘమును సందర్శించిన ఒక పెద్దమనిషిని నేను గుర్తించాను. అతను ఇంతకు ముందెన్నడూ కలవని అరడజను మందితో కరచాలనం చేస్తున్నాడు. తర్వాత అతను నా వైపు చూశాడు. ఒక నవ్వు మరియు మెరుపుతో, అతను తన చేతిని ఊపాడు. దశాబ్దాల కఠినమైన శ్రమతో గరుకుగా తయారైన ఆ చేతిమీద మీరు ఒక అగ్గిపుల్లను వెలిగించవచ్చు.

“మీరు జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తిలా కనిపిస్తున్నారు. మీరు జీవించడానికి ఏమి చేస్తారు,” అని నేను అడిగాను.

“నేను? నేను మధ్యపశ్చిమ USA నుండి వచ్చిన రైతుని.”

“నిజంగా? ట్రాక్టర్ టైర్ వంటి చేతులు మీకు ఉన్నందున నేను ఆశ్చర్యపోనక్కర్లేదని నేను ఊహిస్తున్నాను.”

ఆతను నవ్వాడు . . . కొన్ని తెలివైన ప్రశ్నలను నన్ను అడిగాడు, తరువాత యు.ఎస్. రాష్ట్రమైన కాలిఫోర్నియా గుండా ఒంటరిగా ప్రయాణించే తన ప్రణాళికల గురించి నాకు చెప్పాడు.

“గత వారం మీరు ఏమి చేసారు?” అని నేను అడిగాను. అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. “గత వారం నేను 90,000 బుషెల్స్ మొక్కజొన్న కోయడం ముగించాను,” అని అతను చిరునవ్వుతో చెప్పాడు.

అప్పుడు నేను హఠాత్తుగా, “తొంభై వేలా! మిత్రమా, నీ వయసు ఎంత?”

అతను నా ప్రశ్నకు ఏమాత్రం సంకోచించలేదు లేదా ఇబ్బంది పడలేదు. “నాకు కేవలం రెండు నెలల తక్కువ తొంభై యేళ్ళు.” నేను తల అడ్డముగా ఊపుతుంటే అతను మళ్ళీ నవ్వాడు.

అతను నాలుగు యుద్ధాలు, మహా మాంద్యం, పదహారు మంది అధ్యక్షులు, తొంభై మధ్యపశ్చిమ శీతాకాలాల గుండా జీవించాడు. మరియు ఎన్ని వ్యక్తిగత కష్టాలున్నాయో ఎవరికి తెలుసు. ఇంకను అతను తన జీవితాన్ని పరిపూర్ణముగా ఆస్వాదించుచున్నాడు. నేను అతని సుదీర్ఘ మరియు ఫలవంతమైన జీవిత రహస్యాన్ని అడగాను. “కష్టపడటం మరియు చిత్తశుద్ధి” అని అతని శీఘ్ర సమాధానం.

మేము ఎవరి దారిన వాళ్ళం వెళుతున్నప్పుడు, అతను తీక్షణంగా వెనక్కి తిరిగి చూస్తూ, “యువ సహచరుడా, తేలికగా తీసుకోకు. చివరివరకు ఓపికగా ఉండు!”

అతని చివరి వ్యాఖ్య చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక వైద్యుడు చెప్పిన మాటలను గుర్తు చేసింది. అతను నా శారీరక వైద్య పరీక్షలను పూర్తి చేస్తున్నప్పుడు, మేము ఆరోగ్యంగా ఉండాలనే విషయంపై మాట్లాడుకున్నాము మరియు నేను తరచూ గుర్తుచేసుకునే కథను అతను నాకు చెప్పాడు. కొన్ని నెలల క్రితం అతను తన ఎనభైలలో ఉన్న ఒక మహిళను పరీక్షించాడు. ఆమె ఇంకా మంచి శారీరక స్థితిలో ఉండటంతో ఆమె చాలా చురుకుగా ఎలా ఉందోనని ఆమెను అడగటానికి అతను ప్రేరేపించబడ్డాడు. కన్నుకొట్టి ఆమె ఇలా గొప్పగా చెప్పింది, “నేను రోజుకు నాలుగైదు మైళ్ళ దూరం మెల్లగా పరుగెడతాను . . . ప్రతి రోజూ.” ఆశ్చర్యపోయిన అతను, ఆమె దానిని అతిగా చేయాల్సిన అవసరం లేదని చెప్పాడు. “తేలికగా తీసుకోండి” అని అతను సూచించాడు. ఆమె అతని మాటలను శ్రద్ధగా పాటించి, వేగాన్ని తగ్గించుకోవడానికి నిర్ణయించుకుంది. ఆమె తన జాగింగ్‌ను చాలా నెమ్మదియైన నడకకు తగ్గించి, వారానికి మూడు లేదా నాలుగు రోజులకు కుదించింది. అతను కథను ముగించినప్పుడు డాక్టర్ యొక్క విచారకరమైన నిట్టూర్పును నేను ఎప్పటికీ మరచిపోలేను. “ఆమె ఒక నెల క్రితం మరణించింది. ఆమెలాగా చురుకుగా శ్రమపడుచున్న రోగికి మరెన్నడూ కూడా తేలికగా తీసుకోండి అని నేను చెప్పను.”

పరిశుద్ధ గ్రంథము తేలికగా తీసుకోవటానికి నిరాకరించిన వారితో నిండి ఉంది. 85 సంవత్సరాల వయస్సులో, కొండ ప్రదేశములోని అనాకీయుల‌పై దాడి చేసి వారిని విజయవంతంగా తరిమికొట్టిన మన స్నేహితుడైన కాలేబు గుర్తున్నాడా (యెహోషువా 14)? లేదా అబ్రాహాము, “తన వృద్ధాప్యంలో” . . . అతను 100, ఆమె 90 (ఆదికాండము 21) ల్లో ఉన్నప్పుడు ఒక బిడ్డను కన్న (సరే, నిజానికి శారా కన్నది) విషయం గుర్తుందా? లేదా నోవహు లేదా మోషే లేదా సమూయేలు లేదా అన్న, 84 ఏళ్ల ప్రవక్త్రి గుర్తున్నారా . . . అందరూ, ముఖ్యమైన వ్యక్తులే.

వయసు అంటే ప్రాధాన్యతలేనిది. ముడతలు, తెల్ల జుట్టు, మరియు మీ చేతుల మీద మచ్చలు, ఇవన్నీ తక్కువ ప్రాధాన్యతగలవి. దేవుడు మిమ్మల్ని ఈ పాత భూమిపై వదిలివేయాలని ఎంచుకుంటే, మంచిది. మీ పని నుండి వైదొలగడానికి మరియు క్రొత్త సవాళ్లతో క్రొత్త మార్గాలకు వెళ్లడానికి ఆయన మీకు వీలు కల్పిస్తే, అది కూడా చాలా మంచిది. అంతేకాకుండా, మీరు ఏమి చేసినా, దాన్ని తేలికగా తీసుకోకండి!

హమ్మింగ్‌బర్డ్‌లు ఒక కూజా నుండి ఎర్ర రసాన్ని పీల్చుకోవడాన్ని చూడటానికి ఖాళీగా కూర్చోవటం కంటే త్వరగా మీకు విసుగు పుట్టించే విషయాలు తక్కువ ఉంటాయి!

ఒక ముగింపు మాట: “పదవీ విరమణ తరువాత వచ్చే విసుగు కంటే ఏ వ్యాధి కూడా ప్రాణాంతకం కాదు.” (నార్మన్ కజిన్స్)
అనుదిన పఠనం: కీర్తన 90

Excerpt taken from The Finishing Touch by Charles R. Swindoll, copyright 1994, Thomas Nelson. Nashville, Tennessee. All rights reserved.

Posted in Grandparenting-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.