నేను అమెరికన్ ఫుట్‌బాల్ యొక్క లాస్ ఏంజిల్స్ రామ్స్ వారి ప్రీగేమ్ చాపెల్ సర్వీస్‌లో మాట్లాడిన సమయం నాకు గుర్తుంది, ఆ తర్వాత రాత్రి, వారు డల్లాస్ కౌబాయ్‌లను ఓడించేశారు. సూపర్ బౌల్ XIV కి ముందు సాయంత్రం, నేను పిట్స్‌బర్గ్ స్టీలర్స్‌తో మాట్లాడాను, మరుసటి రోజు వారు రామ్స్‌ను చీల్చి చెండాడారు. సిన్సినాటి రెడ్స్‌కు వ్యతిరేకంగా ఆడటానికి ముందు నేను బేస్‌బాల్ యొక్క L.A. డాడ్జర్స్‌తో మాట్లాడాను మరియు వారు చితకబాదారు!
ఇప్పుడు నేను బఫెలో బిల్ల్స్, న్యూయార్క్ జెట్స్, శాన్ ఫ్రాన్సిస్కో 49ers, చికాగో కబ్స్ మరియు టెక్సాస్ రేంజర్‌లతో మాట్లాడాలని అడుగుచున్నారు. లేదు, ఊరికే అన్నాను. కానీ మీరు విజయ పరంపరను కొనసాగించినప్పుడు చాలా సరదాగా ఉంటుంది.
ఆటల పోటీలలో విజయ పరంపర సంభవించినప్పుడు, క్రీడా వ్యాఖ్యాతలు దీనిని “అథ్లెటిక్ మొమెంటం” అని పిలుస్తారు-అంటే “ఎటువంటి సందేహం లేదు; మనము దీన్ని గెలవబోతున్నాము!” అనే ఆ భరోసా, ఆ లోతైన విశ్వాసం అంటుంది. నాకు బాగా తెలియకపోతే, నేను నా ప్రీగేమ్-చాపెల్ విజేత పరంపరను “ప్రవచనాత్మక ప్రేరణ” అని పిలవవచ్చు. నాకు అలాంటి వరము ఉందని నమ్మించి నేను జట్లను నడిపించగలను: “మీరు గెలవాలనుకుంటున్నారా? ఆటకు కొన్ని గంటల ముందు నన్ను ఆహ్వానించండి అప్పుడు మీరు తప్పక గెలుస్తారు. నేను మాట్లాడినప్పుడు, మీరు గెలుస్తారు!”
అవును, నిజం.
మనల్ని మనం మోసం చేసుకోవలసిన అవసరం లేదు. దీర్ఘకాలంలో, నేను మీ స్థానిక వాతావరణ నిపుణుడు ఎంత ప్రతిభావంతుడో ప్రవచనాత్మకంగా అంత ప్రతిభావంతుడనవుతాను. మరియు నా వేగం ఉడకబెట్టిన గుడ్డు వలె పెరుగుతోంది. నా మాటలకు మరియు ఒకరి గెలుపుకి మధ్య ఏ సంబంధం ఉన్నా అది పూర్తిగా యాదృచ్ఛికం. ప్రవచనాత్మక ఉచ్చారణ నేను చేయగలిగినది కాదు.
పాత నిబంధన ప్రవక్తలు ఆత్మీయ దిగ్గజాల వలె భూమిపై నడిచారు. వారు ధైర్యంగా ఉన్న పురుషులు మరియు మహిళలు, వారు తమ మనవుల యొక్క సంపూర్ణ సత్యం మీద తమ జీవితాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారు తీర్పులో లోపం జరగటానికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు, మానసిక తప్పుకు కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. మరియు “రేపు, సూర్యుడు ఉదయిస్తాడు,” లేదా, “ఈ రాత్రి, చీకటిగా ఉంటుంది” వంటి స్పష్టమైన వాటిని వారు ఊహించలేదు. లేదు, అసలైన, నిజమైన ప్రవక్తలు ప్రమాదకరమైనవారే. అంటే, కొందరు చాలా భయానకంగా ఉన్నారు! వారి యోగ్యతలు ఆకట్టుకునే గ్రాడ్యుయేట్ పాఠశాలల డిప్లొమాలు లేదా వారి పెరుగుతున్న వయస్సు లేదా సొంత కష్టముతో పైకి ఎదగడం, నెమ్మదిగా గౌరవించే హక్కును సంపాదించడం మీద ఆధారపడిలేవు.
అప్పట్లో, ప్రవక్తను ప్రవక్త అవ్వలంటే అతడు లేదా ఆమె ఒక సరళమైన (అయితే ఖచ్చితమైన) పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి: ఒకవేళ ప్రవక్త చెప్పింది నిజమైతే, అతడు లేదా ఆమె ఏది ఊహించారో, అది జరుగుతుంది. అయితే ఆ ప్రవక్త మోసగాడైతే, ఏమీ జరగదు. మోషే ఆ నియమాన్ని ద్వితీయోపదేశకాండము 18:21–22 లో సాధారణమైన మాటలలో విధించాడు.
ఒక ప్రవక్త ఈ పరీక్షలో రెండు గ్రేడ్‌లను మాత్రమే చేయగలడు: 100 లేదా 0. జయమొందాలి, లేదా తడబడి పడిపోవాలి. దానికంటే ఘోరంగా, ఊహించిన విషయాలు జరగకపోతే ప్రజలు అబద్ధ ప్రవక్తపై రాళ్లు రువ్వుతారు (ద్వితీయోపదేశకాండము 13). కానీ దేవుని హస్తము ఆ ప్రవక్తపై ఉంటే . . . ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా యెహోవా “గొంతు” అయితే . . . ప్రజలు భయపడాలి. ఊహించినది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రవచనాత్మక ప్రేరణ అద్భుతంగా ఉంది. మరియు అద్భుతంగా ఉందనేదే నా ఉద్దేశ్యం! ఆ నిజమైన ప్రవక్తలలో ప్రతి ఒక్కరూ దైవ సన్నిధి యొక్క పాఠశాలలో అత్యుత్తమ స్థానంలో ఉత్తీర్ణత సాధించి పట్టభద్రులైనారు. వారు గందరగోళం చేయలేదు. వారు ఎన్నడూ గురి తప్పలేదు.
మోషే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆమోజు యొక్క అద్భుతమైన కుమారుడైన యెషయాను తీసుకోండి. క్రీస్తుపూర్వం 710 లో, బలమైన అష్షూరు సైన్యం యెరూషలేమును ముట్టడించింది. మంచి రాజైన హిజ్కియా తన ప్రజలు ఎలా భయపెట్టబడ్డారో మరియు భయంతో అశక్తులైపోయారో విన్నప్పుడు, అతడు విడుదల కోసం ప్రార్థించమని యెషయాను వేడుకున్నాడు. యెషయా చక్కగా ప్రార్థన చేశాడు. యెరూషలేము మీద దాడి చేయకుండా అష్షూరుకు తిరిగి వెళ్లిపోవడానికి కారణమయ్యే ఒక పుకారు-అష్షూరు రాజైన సన్హెరీబు ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఒక పుకారు వింటాడని అతడు ఊహించాడు. మీరు సరిగ్గానే ఊహించారు. సరిగ్గా అదే జరిగింది (యెషయా 37:5-7, 36-38).
అలాగే “కన్యక” ఏదోయొక రోజు “కుమారుని కని” ఆ బిడ్డకు “ఇమ్మానుయేలు,” అను పేరు పెట్టునని యెషయా మాట్లాడినప్పుడు, అది యాదృచ్ఛికము కాదు (యెషయా 7:14). ఎనిమిది వందల సంవత్సరాల తరువాత, బేత్లెహేములోని పశువుల తొట్టిలో, అద్భుతమైనది అత్యున్నత స్థాయికి చేరుకుంది. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా, దేవుని అసలైన స్వరం చిన్న మానవ స్వరపేటిక నుండి వినిపిస్తుంది.
ఇది ప్రవచనాత్మక ప్రేరణ, ప్రజలారా.
అయితే, నేడు, అదే రకమైన ప్రవచనాత్మక ఖచ్చితత్వం పూర్తిగా పతనమైపోయింది. వాస్తవానికి, చాలామంది నేను “డేటింగ్ గేమ్” అని పిలిచేదాన్ని చేపట్టారు-క్రీస్తు రెండవ రాకడను గూర్చి సరిగ్గా ఆలోచించకుండా గుర్తించడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనలన్నీ ఎప్పుడు జరుగుతాయో తండ్రికి మాత్రమే తెలుసు అని యేసు స్వయంగా చెప్పినప్పటికీ, ఈ అంచనాలన్నీ వేశారు, గుర్తుంచుకోండి (మత్తయి 24:36).
కాలములను నిర్దేశించకుండా జాగ్రత్త వహించండి మరియు అలా చేసేవారిని అనుసరించవద్దు. Y2K గుర్తుందా? అన్ని కంప్యూటర్లు క్రాష్ అవుతాయి మరియు కాలిపోతాయి అని మనకు చెప్పబడింది. మెల్లగా అంతా ఆగిపోతుంది. ఏమీ జరగలేదు. ఆ తప్పుడు అంచనా ఆధారంగా తమ పరిచర్యను ఆధారం చేసుకున్న వ్యక్తులు నాకు తెలుసు. కొందరు దాని గురించి పుస్తకాలు కూడా రాశారు. నేను ఒప్పుకుంటున్నాను . . . నేను రచయితలకు వ్రాసి ఇలా అడిగాను “హే, మీ పుస్తకం ఎలా అమ్ముడవుతోంది? . . . మరి ఇప్పుడు జనవరి 2 వచ్చేసిందిగా?” తేదీలను నిర్దేశించవద్దు. క్రీస్తు రాకడను గూర్చిన ఖచ్చితమైన సమయాన్ని ఎవరో ఒకరు ఊహించారు గనుక, వారి బోధ “లోతైనది” అని అనుకోకండి. యేసు ఇలా చెప్పాడు, “వాటిని తెలిసికొనుట మీ పనికాదు” (అపోస్తలుల కార్యములు 1:7). తండ్రికి మాత్రమే తెలుసు. అది ఎప్పటికీ మరచిపోవద్దు!
యెషయా వంటి ప్రవక్తలు యూదాలోని కొన్ని జట్ల కోసం దైవాదీనమని చెప్పి ప్రీగేమ్ చాపెల్ ప్రోగ్రామ్‌లను నిర్వహించిన క్రొత్త వ్యక్తులు కాదు. వారు అసలు సిసలైనవారు, విశ్వసించదగిన మరియు గౌరవించదగినవారుగా ఉండటానికి దేవునిచేత పంపబడి అభిషేకించబడ్డారు.
వారికి ప్రవచనాత్మక ప్రేరణ ఉన్నది.