ప్రకటన పఠనం

ప్ర. నేను ప్రకటన గ్రంథాన్ని ఎందుకు అధ్యయనం చేయాలి? ఇది నిజంగా నా జీవితానికి సంబంధించినదేనా?

జ. మొదటిగా, దేవుని నిశ్చలమైన వాక్యము నమ్మదగిన పటము. ప్రకటనలో వ్రాయబడిన మనస్సును కదిలించే దర్శనములను గ్రహించడం ఎంత కష్టమైనప్పటికీ, అది దేవుని వాక్యంలో భాగమని మనం మరచిపోకూడదు. అందుకని, మనం అర్థం చేసుకున్న వాటిని చదవడం, వినడం మరియు పాటించడం ద్వారా స్వాభావికమైన ఆశీర్వాదం ఇందులో ఉంటుంది. మనము గ్రంథమును మరియు దాని సత్యాన్ని కనీసం మొత్తంగా అర్థం చేసుకుంటే, సూక్ష్మ వివరాల గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు.

రెండవదిగా, దేవుని సార్వభౌమ ప్రణాళిక భయాన్ని నిరీక్షణతో భర్తీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మూఢనమ్మకం, తెలియని భయం, భవిష్యత్తు గురించి భయపడటం మరియు ప్రపంచం మొత్తం నియంత్రణలో లేనట్లు విపరీతమైన భావనలో జీవిస్తున్నారు. యుద్ధాలు, కరువులు, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు -ఈ విషాదాలన్నీ గందరగోళం రాజ్యమేలుతున్నాయనడానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా, దేవుడు తన సార్వభౌమ ప్రణాళికను రూపొందిస్తున్నాడని, చెడు ఏదో ఒకరోజు నాశనం అవుతుందని, చివరికి దేవుడు గెలుస్తాడని ప్రకటన తెలియజేస్తుంది! ఈ ప్రాథమిక సత్యం యొక్క జ్ఞానం భయాన్ని నిరీక్షణతో మరియు ధైర్యముతో భర్తీ చేస్తుంది.

మూడవదిగా, దేవుని మహిమగల కుమారుడు ఆరాధనకు యోగ్యుడు. మానవులముగా, మనం అనేకమైన వాటిపై విశ్వాసం ఉంచాలని మరియు వివిధ వ్యక్తులపై ధైర్యం ఉంచాలని అనుకుంటాము. మన పూర్తి, అవిభక్త విశ్వాసానికి ఒక వ్యక్తి మాత్రమే అర్హుడు అని ప్రకటన చెబుతుంది–మర్త్యరూపమెత్తిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పటికీ ఎప్పటికీ, ఆయనే మన ఆరాధనకు కేంద్రం, మన విధేయతకు కేంద్రబిందువు, మరియు మన ఆశీర్వాదమునకు మూలం.

Taken from Charles R. Swindoll, Revelation—Unveiling the End, Act 1: The Heavenly Stage Bible Companion (Plano, Tex.: IFL Publishing House, 2006), 4. Copyright ? 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

ప్ర. ప్రకటన గ్రంథముచేత నేను భయపెట్టబడుచున్నాను. నేను దానిని ఎలా సమీపించగలను?

జ. దేవుని యొక్క బయలుపరచబడిన వాక్యానికి మూలస్తంభంగా, వినయంతో అధ్యయనం చేయడానికి, దాని మార్పులేని సత్యాలను సంయమనంతో కూడిన వ్యాఖ్యానముతో సమతుల్యం చేస్తూ ఆచరణాత్మకంగా అనువర్తనం చేయడానికి ప్రకటన గ్రంథము మనకు ముఖ్యమైనది. ప్రత్యర్థులు కేవలం సాహిత్యం లేదా చలనచిత్రంలో మనకు ఏదైనా అందించిన దానిని పరిశోధించడం ప్రారంభించే ముందు, విపరీతాల నుండి మనల్ని కాపాడుకోవడానికి మనకు కొన్ని ఆచరణాత్మక జ్ఞాపకము‌లు అవసరం.

మొదటిది, మనం అసాధారణమైనదాన్ని ఆశించాలి. ప్రకటన గ్రంథము బైబిల్‌లోని ఇతర పుస్తకాల వంటిది కాదు. కొన్ని పుస్తకాలు-యెహెజ్కేలు, జెకర్యా మరియు దానియేలు వంటివి ఒకే విధమైన సాదృశ్య మరియు దార్శనిక అంశాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రకటనలో మనం కనుగొన్న వాటితో ఏవీ సరిపోల్చబడలేవు. మనలను తరచుగా చిందరవందర చేయు శైలిలో ఉన్న భాష మరియు చిహ్నాలతో మనము కొట్టబడుచున్నాము. చింతించకండి-ఏం పర్వాలేదు! మీరు మొదట అర్ధం కాని విషయాలను ఎదుర్కొన్నప్పుడు, మీరు మంచి సహవాసంలో ఉంటారు.

రెండవది, మనం మన ఊహలను నిగ్రహించుకోవాలి. ప్రకటన అత్యంత సాదృశ్యమైనది, మరియు కొంతమంది వ్యక్తులు పుస్తకంలోని ప్రతి వివరము నుండి ఏదో ఒక విధమైన వ్యాఖ్యానాన్ని బలవంతంగా చొప్పించాలనుకుంటున్నారు. ప్రకటనలో లేదా బైబిల్‌లోని ఇతర భాగాలలో మనకు స్పష్టంగా వివరించబడిన విషయాలను మనం స్వీకరించాలి మరియు అస్పష్టంగా ఉన్న చిహ్నాల విషయంలో అస్పష్టత లేదా అనిశ్చితితో సంతృప్తి చెందాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపించిన అలంకారిక భాష మనకిష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యానించడం కాదు (2 పేతురు 1:20). మనం లేఖనాన్ని లేఖనముతో పోల్చినప్పుడు బైబిల్ దానంతట అదే వ్యాఖ్యానిస్తుంది. ఈ వ్యాఖ్యాన పద్ధతిని బట్టి, అలంకారిక భాషను కూడా ఉన్నదున్నట్లుగా పరిగణించాలి. అంటే, అలంకారిక భాష దేనిని సూచిస్తుందో మనం అర్థం చేసుకున్న తర్వాత, దాని అర్థాన్ని ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకోవాలి. లేకపోతే, అంత్యదినములకు సంబంధించిన సాహిత్యం యొక్క మొత్తం ప్రయోజనం ఆచరణ సాధ్యంకానిదిగా మిగిలిపోతుంది.

మూడవది, పరిశీలన (“ఇది ఏమి చెబుతుంది?”), వివరణ (“దీని అర్థం ఏమిటి?”), సహసంబంధం (“ఇది ఎలా సరిపోతుంది?”) మరియు అనువర్తనం (“అది ఎలా పనిచేస్తుంది?”) అనే సాధారణ బైబిల్-అధ్యయన పద్ధతులను మనం అనుసరించాలి. ప్రకటన విషయానికి వస్తే, కొన్నిసార్లు మన ఉత్సుకతని తగ్గించుకుని “ఇది ఏమి చెబుతుంది?” అనే దానితో సంతృప్తి చెందాలి. యోహాను దర్శనాలలోని కొన్ని అంశాలు అతని మనస్సుకు కూడా అర్థం కాలేదు (ప్రకటన 7:13-14). చాలాసార్లు సందర్భాన్నిబట్టి, ఇతర లేఖన భాగాలతో చేసే పోలికనుబట్టి, అలాగే ప్రకటన గ్రంథములో ఉన్న వ్యాఖ్యానం ఆధారంగా వాక్యభాగం యొక్క అర్థమేమిటో మనం గ్రహించగలుగుతాము. ఒకసారి మనం సరైన అర్థాన్ని గ్రహిస్తే, దాని సత్యాన్ని మన స్వంత పరిస్థితికి అన్వయించుకోవచ్చు. కొన్నిసార్లు అనువర్తనం చాలా నిర్దిష్టంగా మరియు వ్యక్తిగతంగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఇది మరింత వేదాంతపరముగా మరియు సాధారణమైనదిగా ఉంటుంది. ఎలాగైనా, మనం వాటిని అర్థం చేసుకోవడమే కాకుండా, ప్రకటన యొక్క దర్శనముల ద్వారా మనం మార్పు చెందడానికి సిద్ధంగా ఉండాలి.

Taken from Charles R. Swindoll, Revelation—Unveiling the End, Act 1: The Heavenly Stage Bible Companion (Plano, Tex.: IFL Publishing House, 2006), 10-11. Copyright ? 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

ప్ర. కాబట్టి, ప్రకటన గ్రంథానికి మరియు సాధారణంగా ప్రవచనానికి నేను ఎలా ప్రతిస్పందించాలి?

జ. మనము ప్రవచనాత్మక సత్యము యొక్క శక్తిని గ్రహించినప్పుడు, అది మన దైనందిన జీవితములపై మన దృక్పథాన్ని మారుస్తుంది. అతను దేవుని యొక్క సింహాసనపు గదిలో ఉన్నప్పుడు, యోహాను తన తదుపరి భోజనమును గూర్చి, ఎఫెసు‌లోని తన సొంత సంఘములో అసంపూర్తిగా వదిలిపెట్టిన పనులను గూర్చి లేదా అతను అనుభవించిన హింసకు సంబంధించిన శ్రమలు మరియు కష్టాలను గూర్చి ఏమీ పట్టించుకోలేదు. అతడు టోస్టర్‌ని ఆన్ చేసాడో లేదో, అతని శాఖ పనిచేస్తుందా, లేదా అతని పిల్లలు ఎప్పటికైనా ప్రభువు వద్దకు వస్తారా అనే దాని గురించి అతడు చింతించలేదు. అతని ప్రతిస్పందన మనలను మూడు కాలాతీత సత్యాలకు దారి తీస్తుంది, అవి జీవిత దృక్పథాన్ని శాశ్వతమైన వెలుగులో ఉంచుతాయి.

మొదటిది, భవిష్యత్తును నిర్లక్ష్యం చేయవద్దు. తప్పనిసరిగా జరగాల్సిన సంఘటనలు వస్తున్నాయి (ప్రకటన 4:1). దేవుడు తన చేతుల్లో అంత్య కాలము యొక్క సమయాన్ని మరియు క్రియలను అధీనంలో ఉంచుకున్నట్లైతే, వాటికి దారితీసే అన్ని సంఘటనలను కూడా ఆయన నియంత్రిస్తాడు. “ఆదియు అంతమునైయున్న” వానిగా, ఈ మధ్యలో జరుగు ప్రతిదానిపై కూడా ఆయనకు పూర్తి అధికారం ఉంది. మనము భవిష్యత్తు వైపు నిరంతరం కదులుతున్నాము మరియు మన స్వంత జీవితాలపై ఆయన ప్రణాళిక ప్రభావాన్ని అలక్ష్యం చేయటం నిరుత్సాహానికి మరియు నిరాశకు దారితీస్తుంది.

రెండవది, పరలోకంపై మీ అంచనాలను అతిగా సరళీకరించవద్దు. పరలోకము యొక్క ప్రతి చిత్రీకరణ, ప్రతి పెయింటింగ్ మరియు జనాదరణ పొందిన చిత్రం మరియు ప్రతి పురాతన చిహ్నం వాస్తవికతకు దగ్గరగా రావటంలో విఫలమయ్యాయి. పరలోకం గురించి యోహాను యొక్క దృష్టి-దాని చిహ్నాలు మరియు వివరించలేని ఆకస్మిక కలయికలతో-పరలోకం యొక్క సంక్షిప్తమైన కానీ అఖండమైన దృష్టిని మనకు అందిస్తుంది.

మూడవది, మీ మీద దృష్టి పెట్టుకోవద్దు. బూరలు మరియు పాత్రలను గురించి ఆలోచిస్తూ, “అంత్యదినముల జ్వరము” పట్టుకోవడం ఎంత సులభమో. మేము తరచుగా చిన్న పిల్లలను పోలి ఉన్నాము, వారు ఇంకా సూచించే భావనను గ్రహించలేదు. మన నాన్న గాని అమ్మ గాని ఏదో అద్భుతమైనది చూపిస్తారు, కానీ మనము ఆ మనోహరమైన వ్రేలునే తేరిపార చూస్తాము! ప్రకటన మనల్ని దేవుని వైపు చూపిస్తుంది. మన స్వంత ఆసక్తులు, ప్రాధాన్యతలు మరియు కోరికల వెలుగులో మనం ప్రకటన గ్రంథముపై దృష్టి పెడితే, మనం పరలోక మరియు భూసంబంధమైన ఉనికిని కోల్పోతాము: దేవుని యొక్క మహిమ.

 

Taken from Charles R. Swindoll, Revelation—Unveiling the End, Act 1: The Heavenly Stage Bible Companion (Plano, Tex.: IFL Publishing House, 2006), 127-8. Copyright © 2006 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Bible-Telugu, End Times-Telugu.

Insight for Living Ministries is committed to excellence in communicating the truths of Scripture and the person of Jesus Christ in an accurate, clear, and practical manner so that people will come to an understanding of God’s plan for their lives, as well as their significant role as authentic Christians in a needy, hostile, and desperate world.

లేఖనములోని సత్యాలను మరియు యేసుక్రీస్తు అను వ్యక్తిని గూర్చి ఖచ్చితమైన, స్పష్టమైన మరియు ఆచరణాత్మక పద్ధతిలో తెలియపరచడంలోను, తద్వారా ప్రజలు తమ జీవితాల కోసం దేవుని ప్రణాళికను, అలాగే లేమిలోవున్న, ప్రతికూలమైన మరియు నిరాశతో కూడిన ప్రపంచంలో ప్రామాణికమైన క్రైస్తవులుగా తమ ముఖ్యమైన పాత్రను అర్థం చేసుకోవటానికి ఇన్సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఎంతో ఉత్కృష్టతతో రాణించటానికి కట్టుబడి ఉంది.