మీరు సుఖాంతమైన కథలను ఇష్టపడేవారైతే, మీరు క్రైస్తవ్యాన్ని ఇష్టపడతారు. మన విశ్వాసం యొక్క గొప్ప ఇతివృత్తాలలో ఒకటి జయకరమైన నిరీక్షణ-అన్నీ సరిగ్గా ముగుస్తాయనే అచంచలమైన అభయము. పోరాటాలు మరియు తుఫానులు, యుద్ధాలు మరియు పరీక్షల మధ్య, మనము ప్రస్తుత క్షణానికంటే ముందు గతి మీద దృష్టి పెడతాము మరియు మనము విజయాన్ని చూస్తాము. మనము ఉపశమనాన్ని చూస్తాము, ఎందుకంటే చివరికి, దేవుడు గెలుస్తాడు!
అపొస్తలుడైన పౌలు “అంత్యదినముల” జీవన పరిస్థితులను “అపాయకరమైన కాలములు” గా వర్ణించాడు, దీనిలో ప్రజలు “క్రూరులు సజ్జనద్వేషులు” గా ఉంటారు (2 తిమోతికి 3:1, 3). “అపాయకరమైన కాలముల” కు గ్రీకు భాషలో అర్థమేమిటంటే, “భయంకరమైనది, కఠినమైనది, వ్యవహరించడానికి కష్టమైనది, క్రూరమైనది.” ఇది మన కాలములను సరిగ్గా వివరించుచున్నది-కాదా?
లోకము చాలా ప్రమాదకరమైన ప్రదేశము. కొంచెం రెచ్చగొడితే చాలు కోపం శారీరక హింసకు దారితీస్తుంది. విచారము మరియు ఒంటరితనం హత్యకు దారితీస్తాయి. అణు యుద్ధం అంచున దేశాలు తడబడుచూ ఉన్నాయి. జనులు కంప్యూటర్‌లో నుండి అపరిచితులపై మరియు స్నేహితులపై, వారి రాజకీయ దృక్పథం విషయమై కోపంతో నిండుకొని విరుచుకుపడతారు.
ఈ చీకటి నడుమ, ఏకైక కిరణం ప్రకాశించుచున్నది: క్రీస్తు తప్పకుండా తిరిగి వస్తాడని మరియు అన్నిటినీ సరిచేస్తానని వాగ్దానం చేశాడు. ఆయన “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము” (1 కొరింథీయులకు 15:25-26). ఆయన మరణము మీద కూడా జయము పొందుతాడు–అది మన చీకటియు, కనికరంలేనిదియునైన శత్రువు!
విశ్వాసులు క్రీస్తునందు దేవునితో ఉన్నారు గనుక, మనము కూడా తప్పక గెలుస్తాము. ఆలోచించండి! అన్ని భూసంబంధమైన కష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు, భావోద్వేగ గాయాలు, శారీరక వైకల్యాలు, గృహ సంఘర్షణలు, అంతర్జాతీయ యుద్ధాలు, సాతాను యొక్క అణచివేత–అదంతయు ముగిసిపోవును. దేవుడు తన చేతుల్లో విజయం యొక్క దోపుడుసొమ్మును మోయును: సామరస్యం, ఆనందం, స్తుతి మరియు సంతోషము. మనము మార్చబడతాము అనేది సత్యము. మనకు క్రొత్త స్వభావాలు, మనసులు మరియు శరీరాలు ఉంటాయి. మన దేవుని ఆరాధిస్తూ ఎప్పటికీ జీవించే ఆనందం మనకు లభిస్తుంది మరియు చెడు ఒక్కసారిగా నిర్మూలించబడుతుంది.
చివరికి, దేవుడు గెలుస్తాడు! యేసు తిరుగులేని అసహాయశూరుడు! ఆయన కథే సుఖంగా ముగిసే కథ . . . అలాగే మనం విశ్వసించినప్పుడు ఆయన కథ మన కథ అవుతుంది. ఆయనే మానవజాతి యొక్క నిరీక్షణ మరియు ఈ అద్భుతమైన సందేశమును మనం తప్పకుండా పంచుకోవాలి!