యెరూషలేములోని రెండవ అంతస్థు మేడగదిలో ఒక చీకటి రాత్రి, యేసు తన శిష్యులతో కలిసి తన “చివరి విందు” భుజించారు. అక్కడ, ఆయన తన మరణం కొన్ని గంటల దూరంలోనే ఉన్నదనే భయపెట్టే సత్యాన్ని వెల్లడించాడు. “నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళబోవుచున్నాను. నేను నా తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళుచున్నాను,” అని ఆయన చెప్పే మాటలు తమ చెవులు వినకూడదని పదకొండుమంది కోరుకున్నారు.
పరలోకము, మన శాశ్వతమైన భవితవ్యం, వాస్తవమైనది. ఇది మన ఊహ లేదా మానసిక స్థితి కాదు; ఇది ఒక వాస్తవికత. పరలోకము అనేది యేసు తన సొంతవారి కోసం సిద్ధపరచుచున్న నిజమైన స్థలం. ఆయన యోహాను 14:3 లో అలా చెప్పాడు! ఆయన ఇలా అంటున్నాడు, “మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.” అది ఆయన పెదవుల నుండి వచ్చిన స్పష్టమైన వాగ్దానం. ఈ శిష్యులు ఎప్పుడూ వినని ఎత్తబడుట గురించి కూడా ఇదే మొదటి ప్రస్తావన.
ఈ విధమైన బోధ శిష్యులను నిర్ఘాంతపరచి ఉంటుంది. యేసు భూసంబంధమైన రాజ్యాన్ని తక్షణమే స్థాపించాలని వారు ఊహించారు. తమ తరము ముగిసేలోపు యెరూషలేములో రాజులకు రాజుగా మరియు ప్రభువులకు ప్రభువుగా యేసు పరిపాలించాలని వారు ఆశించారు. ఆయన రాజ్యం యొక్క ఆస్థానంలో వారు తమ్మును తాము ఉన్నత స్థాయి పాలకులుగా ఊహించుకున్నారు. ఇశ్రాయేలు యొక్క క్రూరమైన అణచివేతదారుడైన రోమాను పడగొట్టడాన్ని తాము చూస్తామని వారు చాలా సంతోషంతో భావించారు. కానీ క్రీస్తు వాటన్నింటినీ ప్రక్కనబెట్టి, తన ప్రస్తుత ఆత్మీయ రాజ్యం వినయము మరియు ప్రేమతో గుర్తించబడుతుందని వారికి బోధించాడు. కొంతసమయం తర్వాత, యేసు సిలువ యొద్దకు వెళ్లాడు. ఆయన మరణించాడు మరియు సమాధిలో ఉంచబడ్డాడు. కానీ మూడు రోజుల తరువాత, ఆయన సమాధి నుండి శారీరక రూపంలో ఉద్భవించాడు, మరణంపై విజయం సాధించాడు.
క్రీస్తు రాకడకు మన సంసిద్ధతను మూడు విధాలుగా వెల్లడించవచ్చు.
- మొదటిది, మనం విశ్వాసమునుబట్టి నడచుకుంటాము గానీ చూచే దానిబట్టి కాదు.
- రెండవది, , మన భవిష్యత్తు విషయమై, మనం భయాందోళనలకు గురికాకుండా, ప్రశాంతంగా జీవిస్తాము.
- మూడవది, మన భవిష్యత్తు కొరకు దేవుని వాగ్దానం మీదనున్న మన నిరీక్షణపై ఆధారపడతాము.
ఏదోయొక రోజున, యేసు మనకోసం తిరిగి రానున్నాడు. మీరు ఆయనను కలవడానికి ఆత్మీయంగా సిద్ధంగా ఉంటే, ఆయన రాకను గురించిన ఆలోచన మీకు ఓదార్పునిస్తుంది-శాంతిని తెస్తుంది. మీరు సిద్ధంగా లేకుంటే, ఆయన రాకను గురించిన ఆలోచన మీకు చాలా భయం మరియు అనిశ్చితిని కలిగిస్తుంది. నిత్యజీవము యొక్క రహస్యం ఏమిటంటే, సమాధిని ఓడించగల శక్తి గలవానిని మీరు ఖచ్చితంగా తెలుసుకొనియుండటం. ఆయన రాకడ ఖచ్చితంగా ఉంటుంది―మీరు సిద్ధమేనా?
Adapted from Growing Deep in the Christian Life: Essential Truths for Becoming Strong in the Faith Workbook (Plano, Tex.: Insight for Living, 2005), 162, 169. Copyright © 2005 by Insight for Living.