నాకు ఒంటరిగా అనిపించినప్పుడు నేను ఏమి చేయాలి?

ప్రశ్న: నా అపార్ట్‌మెంట్‌కి అంటే నా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు. అది సంతోషంలేని ప్రదేశముగా మరియు చీకటిగా ఉంది. కొన్ని మానవ స్వరాలను వినడానికి టెలివిజన్ ఆన్ చేయడమే నేను చేసే మొదటి పని. నేను ఒంటరిగా తింటాను, ఛానెల్స్‌ను మారుస్తాను, కొంచెంసేపు చదువుతాను, ఆపై పడుకుంటాను. నేను సంబంధాలలో ఉంటూ బయటకు వస్తూ ఉన్నాను మరియు వాటిలో ఏదీ మంచిగా పరిణమించలేదు. నేను మాల్‌లో జంటలు చేయి చేయి కలిపి నడవడం చూస్తున్నాను మరియు నా జీవితాన్ని ఎవరైనా పంచుకోవాలని నా హృదయం కోరుకుంటోంది. ప్రజలు నా కళ్ళల్లోని ఒంటరితనాన్ని చూడగలరని నాకు తెలుసు, మరియు బహుశా అది వారిని తరిమికొడుతుంది. కానీ నేను ఏమి చేయగలను?

సమాధానం: అతికష్టం మీద గడుపుచూ మీరు ఒంటరితనంతో పోరాడుచున్నందున మేము చింతిస్తున్నాము. ప్రతి మానవ హృదయం సాంగత్యం కోసమే రోదిస్తుంది. దేవుడు మనల్ని ఒకరితో ఒకరు సంబంధం కలిగి జీవించేలా రూపొందించాడు మరియు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆత్మలో నొప్పి కలగడం సహజం.

ఎంతమంది క్రైస్తవులు ఒంటరితనంతో పోరాడుతున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. A. W. టోజర్ ఒకసారి ఇలా అన్నాడు, “ప్రపంచంలోని చాలా మంది గొప్ప ఆత్మలు ఒంటరిగా ఉన్నాయి.”1 పరిశుద్ధ గ్రంథంలో ఒంటరిగా ఉన్నామని భావించిన దైవభక్తి గల వ్యక్తుల గురించి ఆలోచించండి మరియు వారి ఒంటరితనానికిగల కారణాలను పరిగణించండి. యోబు తన కష్టాలలో ఒంటరిగా ఉన్నానని భావించాడు (యోబు 6:14-15); యోసేపు, కుటుంబం నుండి తన తిరస్కరణ వలన (ఆదికాండము 37:23-28); ఏలీయా, తీవ్రమైన ఆత్మీయ పోరాటం ఫలితంగా (1 రాజులు 19:10, 14); దావీదు, అతని శత్రువు యొక్క కనికరంలేని దాడుల ఫలితంగా (కీర్తన 25:16); యిర్మీయా, ప్రభువు కొరకు తాను నిలబడిన కారణంగా (యిర్మీయా 15:15-18); మరియు యేసు, గెత్సేమనే తోటలో తన స్నేహితుల అవసరం మెండుగా కావలసినప్పుడు (మత్తయి 26:36-45).

అవును, ఒంటరితనం ఎలా ఉంటుందో దేవుని కుమారునికి కూడా తెలుసు. ఇది ఆదరణనిచ్చే ఆలోచన కాదా? యేసు మనకంటే ముందుగా ఈ లోయలో నడిచాడు. ఆయన అరణ్యంలో ఏకాంతంగా శోధింపబడి సాతాను దాడిని అనుభవించాడు. ఆయన గెత్సేమనే తోట‌లో ఒంటరితనం యొక్క బాధను అనుభవించాడు. మరియు ఆయన మన పాపాన్ని భరించినప్పుడు సిలువపై అంతిమ ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయన మనకంటే ముందుగా వెళ్లాడు గనుక, ఆయన మన నిరీక్షణకు జీవనాధారం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక రచయిత మనకు హామీ ఇస్తున్నాడు,

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. (హెబ్రీయులకు 4:15-16)

యేసు మీ ఒంటరితనంలో అర్థం చేసుకునే మాటతో మరియు దయగల హృదయంతో మిమ్మల్ని కలుస్తాడు.

క్రీస్తుతో, మీరు ఒంటరితనం యొక్క విచారాన్ని అనుభవించకుండా ఒంటరిగా ఉండవచ్చు. ప్రస్తుతం, మీ ఒంటరితనం ఉద్వేగభరితమైన ఎడారిలా ఉంది, ఇక్కడ అంతా నిర్మానుష్యంగా ఉంది మరియు సూర్యుని వేడి మరియు సాంగత్యం కోసం భయంకరమైన దాహమునే మీరు అనుభవించుచున్నారు. ఇప్పుడు, ఈ ఎడారి చిత్రాన్ని తోట చిత్రము‌తో పోల్చండి. పక్షుల ఓదార్పు ధ్వనులు మరియు చెట్లలో గాలి యొక్క నెమ్మది దయచేయు లయను వింటూ, తోటలో మిమ్మల్ని మీరు ఒంటరిగా ఊహించుకోండి. తోటలో, మీరు ఏకాంతాన్ని అనుభవిస్తారు-పూర్తిగా భిన్నమైన అనుభూతి. ఏకాంతవాసమనేది ఉల్లాసం, సమాధానం మరియు అర్థాన్ని తెస్తుంది.

మీరు ఎడారిలో లేనట్లుగా మరియు మీరు దేవుని తోటలో ఉన్నట్లుగా ఎలా అనుభూతి చెందుతారు?

మొదట, ప్రార్థన మరియు బైబిల్ పఠనం ద్వారా ప్రభువుకు దగ్గరగా ఉండండి. మీరు అనుభవిస్తున్న ప్రతి విషయాన్ని తనతో పంచుకోమని దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు:

జనులారా, యెల్లప్పుడు ఆయనయందు నమ్మికయుంచుడి
ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి
దేవుడు మనకు ఆశ్రయము. సెలా. (కీర్తన 62:8)

కీర్తనలలో సమయాన్ని వెచ్చించండి-కీర్తనాకారులు తరచుగా ఒంటరితనం నుండి వ్రాసారు, కాబట్టి ఆయన దూరంగా మరియు ఎక్కడో ఉన్నట్లు అనిపించినా, అవి దేవునితో మీ నడకను మరింత లోతుగా చేయడానికి గొప్ప సాధనాలుగా ఉంటాయి. మీతో మాట్లాడే కొన్ని వాక్యభాగాలను లేదా మొత్తం కీర్తనలను కూడా మీరు కంఠస్థం చేయాలనుకోవచ్చు.

రెండవది, స్నేహితుని అవసరం ఉన్న వ్యక్తుల కోసం వెతకండి మరియు వారికి క్రీస్తు ప్రేమను చూపించండి. మీతో కలవగల వ్యక్తులను, మీతో ఉమ్మడి ఆసక్తులను పంచుకునే వ్యక్తులను వెతకండి. తరచుగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఒంటరిగా ఉండి సాంగత్యం కోసం చూస్తూ ఉంటారు. బహుశా మీరు మీ సంఘములో లేదా మీ పరిసరాల్లోని ఇతరులతో కనెక్ట్ కావచ్చు.

మూడవది, స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడానికి సహజంగానే అనుమతించే పరిస్థితుల కోసం చూడండి. అనుకోకుండా స్నేహాలు ఏర్పడటం అనేది చాలా అరుదుగా జరుగుతాయి–అవి తరచుగా ఉమ్మడి గుర్తింపు ఉన్న సమూహంలోని సభ్యుల నుండి అభివృద్ధి చెందుతాయి. క్రీడలు లేదా వినోద బృందాలు, రీడింగ్ క్లబ్‌లు లేదా ప్రత్యేక-ఆసక్తి సమూహాలు అన్నీ ఈ రకమైన సమూహానికి ఉదాహరణలు. బహుశా మీ అభిరుచులు లేదా నైపుణ్యాలు సమూహ వాతావరణంలో ఉపయోగించబడవచ్చు. మీరు భాగస్థులై ఆనందించే సమూహాల గురించి ఆలోచించండి అలాగే అటువంటి వాటిల్లో ఒకటి లేదా రెండింటిలో చేరండి. ఫలితాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు.

సంబంధాలను పెంపొందించుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మీ సంఘములో సేవ చేయడం. చాలా సంఘాలు సేవ చేయడానికి డజన్ల కొద్దీ అవకాశాలను అందిస్తాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి మిమ్మల్ని ఇతరులతో కలుసుకునేలా చేస్తుంది. స్వచ్ఛంద సేవ అనేది ఇతర వ్యక్తులతో బంధాన్ని పెంచే ఉత్తమ నేపథ్యములలో ఒకటి. మీ సంఘము పనిదినాన్ని నిర్వహించే ప్రతిసారీ, అక్కడ ఉండండి. మీకు కమిటీలు లేదా నాయకత్వ బృందాలలో సేవ చేయడానికి అవకాశాలు వస్తే, వాటిని సద్వినియోగం చేసుకోండి. అవసరమైన వారికి సహాయపడే సేవా బృందంలో చేరడానికి మీకు సందర్భం దొరికితే, అలా చేయండి. ఇతర విశ్వాసులతో కలిసి పనిచేయడం త్వరగా ఐక్యత మరియు స్నేహాన్ని పెంపొందిస్తుంది. మీకు తెలుసుగా, ఆదివారం ఉదయం మాత్రమే సంబంధాలను నిర్మించుకోవడం చిరాకును కలిగిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆతురుతలో ఉంటారు.

గృహ బైబిలు అధ్యయనాలు కూడా సహవాసానికి అనుకూలమైన నేపథ్యాన్ని అందిస్తాయి. మీ సంఘములో అలాంటి సమూహాలు ఉంటే, ఒకదానిలో చేరండి. మీరు మీ ఇంటిలో అలాంటి సమూహాన్ని ఏర్పాటు చేయాలనుకోవచ్చు.

చర్చి రిట్రీట్‌లు కూడా సంబంధాలను నిర్మించుకోవడానికి గొప్ప ప్రదేశాలు. బయటకు వెళ్లడం అనేది సిటీ పార్క్‌లో గ్రూప్ పిక్నిక్ అయినా లేదా వారాంతమున పర్వతాలలో అయినా, బహిరంగ కార్యకలాపాలు పరస్పర క్రియకు అనేక అవకాశాలను అందిస్తాయి.

మీకు డేటింగ్‌తో ఉన్న చిరాకును మీరు ప్రస్తావించారు. క్రైస్తవ కౌన్సెలర్లు తరచుగా తమ ఒంటరితనం తమను మరింత బలహీనపరుస్తుందని భావించే వ్యక్తులకు ఈ క్రింది చిట్కాలను అందిస్తారు. జాగ్రత్త; మీ ఒంటరితనాన్ని ఉపశమింపజేసుకోవడానికి సంబంధాలలోకి దిగకుండా చూసుకోండి. మనము అత్యంత సంతృప్తి మరియు స్థిరంగా ఉన్న సమయాల్లో ఉత్తమ సంబంధాలు ఏర్పడతాయి. హాస్యాస్పదమేమిటంటే, మీరు తక్కువ నిరాశకు గురైనప్పుడు, మీరు ఆరోగ్యకరమైన సంబంధాలను కనుగొంటారు, ఎందుకంటే మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు గనుక.

క్రిస్టియన్ కౌన్సెలర్, పాస్టర్ లేదా మంచి స్నేహితునితో ఈ పాయింట్ల గుండా వెళ్ళండి.

  • మీ భావాలను దినచర్య పత్రికలో పొందుపరచండి.
  • ఒంటరితనం యొక్క చరిత్రను లేదా బహుశా మీ ఒంటరితనం యొక్క కాలక్రమాన్ని వ్రాయండి. వేర్వేరు సమయాల్లో ఒంటరితనం ఎలా ఉంటుందో చిత్రీకరించడానికి మీరు మ్యాగజైన్ చిత్రాలను చేర్చవచ్చు. (మీరు సంబంధంలో ఉన్నప్పుడు కూడా, మీరు ఒంటరిగా ఉన్నానని అనిపించి ఉండవచ్చు. ఆ సమయాలను కూడా చేర్చండి.)
  • మీ ఒంటరితనాన్ని ఉపశమింపజేసేందుకు డేటింగ్ సంబంధాన్ని కొనసాగించాలని మీరు శోధించబడినప్పుడు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, “నేను ఒంటరిగా మరియు బలహీనతలో ఉన్నందున ఈ వ్యక్తి నా పట్ల ఆసక్తి కలిగి ఉన్నారా?” అవతలి వ్యక్తి యొక్క నిజమైన స్వభావాన్ని అస్పష్టం చేసే ఆశావాదమును తీసివేయండి.
  • మీరు మీ ఒంటరితనంతో వ్యవహరించేంత వరకు క్రొత్త సంబంధాన్ని ప్రారంభించవద్దు. ఒంటరి భావాలు మిమ్మల్ని స్పష్టంగా ఆలోచించకుండా లేదా ప్రమాదాన్ని గ్రహించకుండా అడ్డుపడతాయి.
  • ఒంటరితనం నుండి పారిపోవడానికి ప్రయత్నించవద్దు. నొప్పిని ఆలింగనం చేసుకోండి. కన్నీళ్లను ప్రవహించనివ్వండి. చీకటి లోయ నుండి పరిగెత్తడం లేదా తప్పించుకోవడం కంటే దాని గుండా నడవండి. మీరు ఒంటరిగా ఉండి ప్రభువులో సంతృప్తిని అనుభవించగలిగినప్పుడు మీరు నిజమైన సంబంధానికి సిద్ధంగా ఉన్నారని మీకు తెలుస్తుంది.
  • ఒంటరితనం నిరాశకు దారితీస్తుందని గుర్తుంచుకోండి, కాబట్టి మీరు వైద్యుడిని సంప్రదించవలసిన సంకేతాల కోసం చూడండి-ఆహారం మరియు నిద్ర అలవాట్లలో మార్పులు, బరువు తగ్గడం లేదా పెరగడం, మరణం గురించి ఆలోచించడం, రెండు వారాల పాటు కొనసాగే విచారకరమైన లేదా నిరుత్సాహకరమైన భావాలు, ఆహ్లాదకరమైన కార్యకలాపాలను ఆస్వాదించలేకపోవడం లేదా ఏకాగ్రత లేకపోవడం మరియు అలసట.
  • దేవుడు ఎడారులను తోటలుగా మార్చగలడు. ఆయన నిజంగా చేయగలడు. మీ ఒంటరి ప్రదేశంలో మీరు ఆయన సమాధానమును కనుగొందురుగాక.
  1. A. W. Tozer, The Best of A. W. Tozer: 52 Favorite Chapters, compiled by Warren W. Wiersbe (Harrisburg, Pa.: Christian Publications, 1978), 198.
Posted in Death-Telugu, Divorce-Telugu, Encouragement & Healing-Telugu, Friendship-Telugu.

Biblical Counselling Ministry

View posts by Biblical Counselling Ministry

The Insight for Living Biblical Counselling department comprises seminary-trained pastors and women’s counsellors who help meet the spiritual needs of Insight for Living’s listeners around the world through biblical counselling and training others for ministry. Our confidential biblical counselling includes a ministry of prayer, comfort, spiritual direction, and instruction to promote growth in Christ. We accomplish that mission by developing educational and counselling content that is fashioned into letters, Web articles, and other printed products.

ఇన్సైట్ ఫర్ లివింగ్ బైబిల్ కౌన్సెలింగ్ విభాగంలో సెమినరీ-శిక్షణ పొందిన పాస్టర్లు మరియు మహిళా సలహాదారులు ఉన్నారు. బైబిల్ కౌన్సెలింగ్ ద్వారా మరియు పరిచర్య కోసం ఇతరులకు శిక్షణ ఇచ్చుట ద్వారా వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్సైట్ ఫర్ లివింగ్ శ్రోతల యొక్క ఆత్మీయ అవసరాలను తీర్చడంలో సహాయపడుతున్నారు. మా విశ్వసనీయమైన బైబిల్ కౌన్సెలింగ్‌లో ప్రార్థన, ఆదరణ, ఆత్మీయ మార్గము మరియు క్రీస్తులో వృద్ధిని ప్రోత్సహించడానికి సూచనలు ఉన్నాయి. ఉత్తరాలు, వెబ్ వ్యాసాలు మరియు ఇతర ముద్రిత ఉత్పత్తులుగా రూపొందించబడిన విద్యా మరియు కౌన్సిలింగ్ కంటెంట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా మేము ఆ లక్ష్యాన్ని సాధిస్తాము.