ఇంకా బ్రతికేవున్నాను: ఆత్మహత్య తర్వాత దుఃఖించడం

డిస్క్లైమర్: మీరు మిమ్మల్ని బాధపెట్టడం గురించి ఆలోచిస్తుంటే లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉండవచ్చని విశ్వసిస్తే, ఇప్పుడే 1800-599-0019 నంబర్‌కు సమారిటన్స్‌కు కాల్ చేయండి.

నేను యుక్తవయసులో ఉన్నప్పుడు, నా యూత్ గ్రూప్ తోటివారిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. అతనికి దాదాపు 18 సంవత్సరాలు. తర్వాత, ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘములో నేను సేవ చేశాను. అదే సంఘములో, అత్యంత గౌరవప్రదమైన మరియు డిమాండ్ ఉన్న లే కౌన్సెలర్లలో ఒకరు తన ప్రాణాలను తీసుకున్నారు. నేను పనిచేసిన మరొక లే కౌన్సెలర్ ఆత్మహత్య వలన తన భర్తను కోల్పోయింది. నేను హాజరైన సెమినరీలో, చాప్లిన్ ఒకప్పుడు బాలునిగా తన తండ్రి ఆత్మహత్యను చూసిన వ్యక్తి. ఇది అతను ప్రతిరోజూ ఎదుర్కోవాల్సిన గాయం.

ఆత్మహత్యల కంటే కుటుంబాన్ని మరే విషాదమూ అంధకారానికి లేదా దిగ్భ్రాంతికి గురిచేయదు. నేను ఎదుర్కొన్న ప్రతి కేసులోనూ పూర్తిగా విభ్రాంతి మరియు నిరాశయే పరిణమించాయి. ముందస్తు నిరీక్షణ లేదు మరియు పునరాలోచన ద్వారా ఆత్మశోధన లేదు. ఆత్మహత్య దిగ్భ్రాంతికరమైనది, అవును సూటిగా చెప్పాలంటే దిగ్భ్రాంతికరమైనదే. ఈ వ్యక్తుల గురించి, వారి జీవిత భాగస్వాములు మరియు పిల్లలు మరియు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ నేను చాలా చలించిపోయాను.

ఇది భయానకంగా మరియు హృదయ విదారకంగా ఉంది.

దురదృష్టవశాత్తూ, క్రైస్తవేతర కుటుంబాల మాదిరిగానే ఆత్మహత్యలు క్రైస్తవ కుటుంబాలను క్రమం తప్పకుండా వేధిస్తున్నాయి; విశ్వాసులు మరియు అవిశ్వాసులు ఇద్దరూ తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. అయినప్పటికీ, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి క్రైస్తవుడు కాలేడని కొందరు చెప్పుచున్నారు, అందువల్ల, బ్రతికున్నవారు చాలా మంది తమ ప్రియమైనవారి శాశ్వతమైన గమ్యాన్ని గూర్చి అనుమానం కలిగియున్నారు. అయితే, ఈ అభిప్రాయానికి బైబిల్ మద్దతు చాలా బలహీనంగా ఉంది. క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి నిజమైన క్రైస్తవులను ఏదీ ఎడబాపలేదని పరిశుద్ధ గ్రంథము వాగ్దానం చేస్తుంది (రోమా 8:38-39).

ఆత్మహత్యను వేదాంతపరంగా ఎదుర్కోవాలంటే, ఆత్మహత్య అంటే ఏమిటి మరియు అది ఎలా జరుగుతుంది అనే విషయంలో మనం మొదట నిజాయితీగా ఉండాలి. చక్ స్విండాల్ ఈ ప్రశ్నలను సంబోధించారు:

ఆత్మహత్య అంటే ఏమిటి? ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరి ప్రాణాన్ని తీసుకునే స్వచ్ఛంద చర్య. ఆత్మహత్య అనేది దేవుడు లేని వారి అనుభవాలకే పరిమితం కాదు. తమ జీవితాలను తీసుకున్న విశ్వాసులు, అలాగే అవిశ్వాసులను గూర్చి లేఖనము గ్రంథస్థము చేసింది. ఈ ప్రతి సంఘటనలో భయంకరమైన బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయి.

ఆత్మహత్య ఎలా జరుగుతుంది? అబద్ధమునకు జనకుడు, సాతాను— “ఆదినుండి వాడు నరహంతకుడై” ఉన్నాడని యేసు చెప్పాడు (యోహాను 8:44)—మనసులో నిరాశాజనకమైన, విధ్వంసకర ఆలోచనలను నాటుతాడు. బలహీనమైన స్థితిలో, విశ్వాసులు కూడా చాలా బాధకు గురవుతారు, మానసికంగా కలత చెందుతారు, వారు అపవాది యొక్క చెడు ప్రోత్సాహకంపై చర్య తీసుకుంటారు . . . మరియు తమను తాము చంపుకుంటారు.

ఆత్మహత్య గురించి మనం ఖచ్చితంగా చెప్పగలిగేది ఏమిటి? ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ వ్యక్తి అతనికి లేదా ఆమెకు చెందని హక్కును నేరపూరిత పద్ధతిలో ఉల్లంఘించారు. ప్రాణమివ్వడం ఎలాగైతే తనకున్న విశేషాధికారమో, అలాగే ప్రాణం తీసే హక్కు కూడా దేవునికి మాత్రమే ఉన్నది.

కార్ల్ బార్త్ ఆత్మహత్య స్వభావాన్ని ఇలాగే వివరించాడు:

స్వీయ-విధ్వంసం అనేది మనిషి అపహరించిన సార్వభౌమాధికారాన్ని తనపై ప్రయోగించుకున్నప్పుడు, అది పనికిమాలిన, ఏకపక్ష మరియు నేరపూరితంగా ఆజ్ఞను ఉల్లంఘించడం మరియు అందువల్ల స్వీయ-హత్య అని మనం నిస్సందేహంగా చెప్పగలం. మనిషి జీవితాన్ని హరించడం అనేది దానిని ఇచ్చిన వ్యక్తికి సంబంధించినదేగాని మనిషికి సంబంధించినది కాదు.1

ఆత్మహత్య చేసుకోవడం పాపం, విడిచిపెట్టబడిన ప్రేమించినవారికి చెప్పలేని దుఃఖాన్ని కలిగిస్తుంది. అయితే ఆత్మహత్య అంటే ఏది కాదో దాని విషయమై మనం నిజాయితీగా ఉండాలి.

యేసు రక్షించే కృప కంటే ఆత్మహత్య శక్తివంతమైనది కాదు. ఆత్మహత్య తండ్రి చేతిలో నుండి ఎవరినీ అపహరించలేదు (యోహాను 10:27-30). రక్షణకు మనం చేసే పనులతో సంబంధం లేదు-మనం దానిని ధర్మబద్ధమైన పనుల ద్వారా సంపాదించలేము మరియు పాపపు పనుల ద్వారా దానిని కోల్పోలేము. ఇది విశ్వాసం ద్వారా వస్తుంది. (ఎఫెసీయులకు 2:8-9). కాబట్టి, ఒక విశ్వాసి యొక్క చివరి చర్య ఆత్మహత్య అనే పాపమైనప్పటికీ, ఆ వ్యక్తి జీవితంలో దేవుని విమోచించే, నూతనపరిచే క్రియ జరుగక మానదు. యేసుక్రీస్తుపై విశ్వాసం ఉంచిన వారిని దేవుడు తిరస్కరించడు. అది రక్షణ స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది.

ఆత్మహత్య గురించి ఆలోచించేవారు తరచుగా అంతరంగిక విషాదమునకు గురవుతారు. వారి నిర్ణయము చాలా మసకమసకగా ఉంటుంది, సత్యము అలాగే తప్పొప్పులు కూడా బాధ చేత ముంచివేయబడతాయి. డైట్రిచ్ బోన్‌హోఫర్ వ్రాసినట్లుగా:

ఆత్మహత్య అంచున ఉన్న వ్యక్తికి ఆజ్ఞలు లేదా నిషేధాలు వినబడవు; . . . నిరాశలో ఉన్న వ్యక్తి తన స్వంత బలానికి విజ్ఞప్తి చేసే ధర్మశాస్త్రము ద్వారా రక్షించబడడు; . . . తన స్వంత శక్తితో కాకుండా దేవుని కృపతో జీవించే క్రొత్త జీవితాన్ని అందించుటకు, జీవితం పట్ల నిరాశతో ఉన్న వ్యక్తికి మరొకరి రక్షణకార్యము ద్వారా మాత్రమే సహాయం చేయవచ్చు.2

అందువల్ల, ఆత్మహత్య అంటే ఏమిటో మరియు ఏమి కాదో అని తెలుసుకోవడం ద్వారా, మీరు దేవునికి మొఱ్ఱపెట్టుకోవచ్చు మరియు ఆత్మహత్య ద్వారా ఎవరినైనా కోల్పోయిన దుఃఖం నుండి మిమ్మల్ని నడిపించడానికి ఆయనపై ఆధారపడవచ్చు.

మీరు దుఃఖిస్తున్నప్పుడు, మీకు కలిగిన నష్టం గురించి మీ భావాలను మీకిష్టమైన రీతిలో వ్యక్తీకరించడానికి మీరు గణనీయమైన సమయాన్ని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి: దుఃఖాన్ని అంచనా వేయలేము; దీనికి ఒక నిర్దేశితమైన సూచిక లేదు. మనుష్యులు అంత తేలికగా నష్టము నుండి “కోలుకోలేరు” లేదా “ముందుకు కొనసాగలేరు.” దేవుని కృపచేత, నష్టం చివరికి రోజువారీ జీవితంలో అలాగే ఒకరినొకరు ప్రేమించడం మరియు శ్రద్ధ వహించడంలో కలిసిపోవచ్చు. కానీ, చాలా సంవత్సరాల తర్వాత కూడా, ఒక జ్ఞాపకం మరణం ఇప్పుడే జరిగినట్లుగా భావాలను రేకెత్తిస్తుంది.

ప్రతి ఆత్మహత్య ప్రియమైనవారి హృదయాలలో మరియు మొత్తం కుటుంబంలో ఒక శూన్యమును మిగుల్చుతుంది. ఇది చాలా, చాలామందికి సన్నిహితంగా తెలిసిన పోరాటం. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు భావించవచ్చు. కానీ వాస్తవానికి, ప్రతి సంవత్సరం U.S.లో వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరియు వారి ప్రియమైనవారిలో చాలామంది నిశ్శబ్దంగా బాధపడుచున్నారు.

తరచుగా, శోకంలో మునిగినవారు అపరాధభావం మరియు అవమానాన్ని అనుభవిస్తారు, వారు ఆత్మహత్యను నిరోధించలేకపోయినందున తాము విఫలత చెందామని నమ్ముతారు. ఏమి జరిగిందో ఊహించడం వల్ల కలిగే నొప్పి చాలా ఘోరమైనది, అది తీవ్ర నిరాశ, కోపం మరియు ఆగ్రహంగా పెరుగుతుంది. వ్యక్తులు మరియు కుటుంబాలకు, ముఖ్యంగా వివాహిత జంటలు మరియు జీవించి ఉన్న పిల్లలకు సహాయక బృందాలు కీలకం. కుటుంబాల్లో గాయం అలలను పుట్టిస్తుంది, మరియు అలాంటి నష్టాన్ని నిర్వహించడానికి ప్రజలు సిద్దంగా లేరు కాబట్టి, ఆత్మహత్యలు విడాకులకు మరియు ఇతర సమస్యలకు దారితీస్తాయి. అందువల్ల, జ్ఞానము కలిగిన సంరక్షకుల నుండి నిష్కాపట్యము మరియు సహాయం ఉండాలి.

శోకాన్ని అభ్యాసం చేయడంలో మరియు మీ కుటుంబాన్ని కాపాడుకోవడంలో సహాయపడే ఉత్తమ మార్గాలలో ఒకటి సహాయక బృందానికి హాజరు కావడం. నేను GriefShareని సిఫార్సు చేస్తున్నాను, ఇది శోకములో మునిగినవారి సహాయం, శోకం ప్రక్రియలో మార్గదర్శకత్వం మరియు దేవునిపై ఆధారపడటం నేర్చుకోవడంలో సహాయం అందించే క్రైస్తవ సమూహం. మరింత తెలుసుకోవడానికి, www.griefshare.org కి వెళ్లండి.

ఆత్మహత్యల వలన శోకములో మునిగినవారి కోసం సంస్థలు మీ ప్రాంతంలోని ఇతర సహాయక సమూహాల వైపు మీకు దారి చూపించగలవు. ఖచ్చితంగా, వారు సహాయక సాధన సామగ్రిని మరియు సమాచారాన్ని పంపించగలరు.

సహాయక బృందానికి హాజరుకావడంతో పాటు, కుటుంబ సభ్యులు క్రైస్తవ సలహాదారుని చూడాలని నేను గట్టిగా సిఫార్సు చేస్తున్నాను.

చివరగా, దేవుని కృపను నిజంగా అర్థం చేసుకునే మీకు సమీపంలో ఉన్న ప్రేమగల సంఘ సహవాసానికి వెళ్ళండి.

మీరు ఏమి చేసినా, ఒంటరిగా ఈ స్వస్థత మార్గంలో ప్రయాణించవద్దు. ఇది నిజంగా ఊహించడానికే అత్యంత కఠినమైన దారి. ఆ ఘటనలో వెతుక్కోవడానికి ఓదార్పు లేదు, ఆశ లేదు–చాలా విషయాలు చెప్పబడలేదు, చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. ఆత్మీయంగా, ఆదరణ మొదట్లో అసాధ్యం కావచ్చు. బైబిలు వాగ్దానముల యొక్క ఆదరణ మీకు ఏదో ఒకరోజు చాలా అర్థవంతంగా ఉండవచ్చు, కానీ కొంతకాలం వరకు అవి వినడానికి చేదుగా ఉండవచ్చు. అంతిమంగా ఆ వాగ్దానాల ద్వారా మరియు సువార్త యొక్క శక్తివంతమైన భరోసా ద్వారా మనం ఒకరినొకరు బలపరచుకుంటాము. నిరాశకు లోనుకాకూడదని మనము నిశ్చయించుకుంటాము అలాగే దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన జీవిత వరమునకు తిరిగి సమర్పించుకొనుమని మనకు ప్రియమైన వారిని కూడా ప్రోత్సహిస్తాము.

మన భూసంబంధమైన ఉనికికి సంబంధించి మనం సహజంగా జీవితాన్ని ఎలా అనుభవిస్తున్నాము మరియు సంభావితం చేస్తున్నాము అని నేను ఆలోచించినప్పుడు, మోషే గుర్తుకు వస్తాడు. అతని అవిధేయత కారణంగా, వాగ్దాన దేశంలోకి ప్రవేశించకుండా దేవుడు మోషేను అడ్డుకున్నాడు. కానీ అతను అప్పటికే విధేయతతో అన్నీ చేసిన తర్వాత, అది మనకు న్యాయంగా అనిపించదు. అయితే, తరువాత మోషే రూపాంతరంలో యేసుతో కనిపించాడని మనకు గుర్తుంది (లూకా 9:29-33).

నిస్సందేహంగా, మోషే దేవుని సన్నిధిలో నిత్యత్వాన్ని ఆస్వాదిస్తూ భూసంబంధమైన వాగ్దాన భూమిని మరచిపోయాడు. యేసు తన మహిమలో మోషే మరియు ఏలీయాతో కనిపించడం పేతురు, యోహాను, మరియు యాకోబులు చూసారు. నిరర్థకమైన ఆదరణ కొరకు ఇది కేవలం కల్పన కాదు! మోషే దేవుని సన్నిధిలో నివసిస్తున్నాడు. కనుక క్రీస్తునందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు ఇది జరుగుతుంది (2 కొరింథీయులకు 5:1-9). అక్కడ ఆయన సన్నిధిలో మనకు శాశ్వతమైన ఆదరణ మరియు స్వస్థత లభిస్తుంది:

అప్పుడు–ఇదిగో దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడై యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన యైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు–ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు–ఈ మాటలు నమ్మకమును నిజమునై యున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. (ప్రకటన 21:3–5)

ఈ భూసంబంధమైన జీవితంలో, మన ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం లభించకపోవచ్చు, కానీ మన దుఃఖం నుండి మనకు సహాయం చేయమని ప్రభువును అడగవచ్చు. మనం ఆశించే సమాధానాలను ఆయన అందించకపోయినప్పటికీ, మన భయంకరమైన భారాన్ని దయతో భరించేందుకు ఆయన మనలను బలపరుస్తాడు. ఆయన ఆత్మహత్య యొక్క విచారాన్ని కూడా అర్థం చేసుకునే ఒక గొర్రెల కాపరి మరియు దుఃఖించే వారందరితో పాటు దానిని భరించడానికి జీవించుచున్నాడు.

సిఫార్సు చేయబడిన వనరులు

డిస్క్లైమర్: ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ ఏదైనా ఇతర సంస్థలు లేదా ప్రచురణల యొక్క కంటెంట్‌లు లేదా విశ్వసనీయతకు బాధ్యత వహించదు. బైబిల్ వెలుపల ఉన్న అన్ని వనరులను జ్ఞానం మరియు వివేచనతో పరిగణించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

ఆన్‌లైన్ వనరులు

పై ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్ యొక్క కథనాలు “ప్రోత్సాహం & స్వస్థత

అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ కౌన్సెలర్స్: http://www.acc-uk.org

అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ సూయిసిడాలజీ: www.suicidology.org 

Books

Grieving a Suicide: A Loved One’s Search for Comfort, Answers and Hope by Albert Y. Hsu

No Time to Say Goodbye: Surviving the Suicide of a Loved One by Carla Fine

  1. Karl Barth, Church Dogmatics: The Doctrine of Creation, vol. 3, part 4 (New York: T&T Clark, 1961), 404, accessed on Google Books http://books.google.com/books?id=GT695Y2JwqcC&printsec=frontcover&source… (accessed May 22, 2013).
  2. Dietrich Bonhoeffer, Ethics (New York: Touchstone, 1995), 168, accessed on Google Books http://books.google.com/books?id=djM15pn4yOsC&printsec=frontcover&source… (accessed May 22, 2013).

Copyright © 2013 by Insight for Living Ministries. All rights are reserved worldwide.

Posted in Death-Telugu.

Brian Leicht received a master of theology degree in Pastoral Ministries from Dallas Theological Seminary. As director of the Biblical Counseling team at Insight for Living Ministries, he provides biblical guidance to listeners through written and verbal correspondence. He has also pastored in single adult, marriage reconciliation, and missions ministries for 20 years. Brian also holds a master’s degree in Trumpet Performance, and he, his wife Bonnie, and their three sons enjoy participating in worship ministry and local theater.

బ్రయాన్ లెయిక్ట్ డల్లాస్ థియోలాజికల్ సెమినరీ నుండి పాస్టోరల్ మినిస్ట్రీస్‌లో మాస్టర్ ఆఫ్ థియాలజీ డిగ్రీని అందుకున్నారు. ఇన్‌సైట్ ఫర్ లివింగ్ మినిస్ట్రీస్‌లో బైబిల్ కౌన్సిలింగ్ టీమ్ డైరెక్టర్‌గా, ఆయన లిఖిత మరియు మౌఖిక ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా శ్రోతలకు బైబిల్ మార్గదర్శకత్వం అందిస్తారు. ఆయన సింగిల్ ఎడల్ట్, వివాహంలో సమాధానం మరియు మిషన్స్ పరిచర్యలలో 20 సంవత్సరాలు పాస్టర్‌గా ఉన్నాడు. బ్రయాన్ ట్రంపెట్ పెర్ఫార్మెన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నాడు, అలాగే ఆయన, ఆయన భార్య బోనీ మరియు వారి ముగ్గురు కుమారులు ఆరాధన పరిచర్య మరియు స్థానిక నాటకశాల‌లో పాల్గొనడాన్ని ఆనందిస్తారు.