పునరుత్థానం యొక్క పాటలను కొనియాడుట

నేను సంగీతాన్ని ఇష్టపడుతున్నాను అనేది ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు. బృంద సంగీతం, వాయిద్య సంగీతం, ప్రసిద్ధ సంగీతం, అలాగే శాస్త్రీయ అంశాలు. . . జానపద రాగాలు, జానపద గేయాలు, సరదా పాటలు మరియు గంభీరమైన రచనలు . . . దేశవాళీ పాశ్చాత్య మరియు బ్లూగ్రాస్, అలాగే దేశభక్తి మరియు శృంగారభరితం. నామట్టుకైతే, సంగీతం తప్పనిసరి.

దీనివల్ల నేను గొప్ప కీర్తనలు, కాల పరీక్షను తట్టుకున్న . . . భక్తిగీతముల విద్యార్థినయ్యాను. ఆదివారం నాడు మనం పాడినవి ఆ తర్వాత వారంలో చాలా వరకు నా మదిలో మెదులుతాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వాటిని కూనిరాగం చేస్తుంటాను. తరువాతి రెండు రోజులూ నేను వాటిని స్నానం చేసేటప్పుడు పాడుకుంటాను.

మీలాగే, నాకు కొన్ని ఇష్టమైనవి ఉన్నాయి, కానీ మన సంఘములో మనం ఏది పాడినా నా ఆలోచనలను ఆక్రమించేలా చేయడానికి నేను ఎల్లప్పుడూ కుతూహలం‌గా ఉంటాను. నేను కంఠస్థం చేసిన చాలా కీర్తనలు నా మనసుకు అర్థవంతమైన ఆలోచనలు మరియు వాటితో అనుసంధానించబడిన ముఖ్యమైన సంఘటనలను కలిగి ఉన్న గొప్ప, స్పష్టమైన జ్ఞాపకాలను వెలికితీస్తాయి. నా ఆరాధనలో నేను “ఆశ్చర్యం, ప్రేమ మరియు స్తుతులతో మైమరచిపోయినప్పుడు”1 ఆ విషయాలు మానసిక పునరాలోచనలోకి వెళ్ళిపోతాయి. గంభీరమైన, బలమైన కీర్తనలు నెమ్మదిగా సాహిత్య లక్షణం మరియు వేదాంతపరమైన లోతు లేని నిస్సారమైన వాటితో భర్తీ చేయబడటం దురదృష్టకరమని నేను భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోండి, నేనేమీ స్వార్థపూరితంగా చేయటంలేదు, మన విశ్వాస సందేశం మన మూలాలతో దృఢమైన సంబంధాన్ని కోల్పోయేంత “నవీకరించబడటం” జరుగకూడదనే ఆందోళన మాత్రమే ఉన్నది. నేడు వ్రాయబడుతున్న కొన్ని కీర్తనలు మంచివి మరియు దృఢమైనవి, కానీ, దురదృష్టవశాత్తు, అవి చాలా అరుదు వస్తున్నాయి. మన సంకీర్తనలో సంగీత ఔచిత్యాన్ని అలాగే చారిత్రక గౌరవాన్ని కొనసాగించాలనేది నా మనవి.

ఇటీవల పునరుత్థానం యొక్క అద్భుతమైన సందేశం గురించి ఆలోచిస్తున్నప్పుడు, శతాబ్దాలుగా ఖాళీ సమాధి యొక్క విషయంతో కూడిన సంగీతంతో నేను అమాంతము మునిగిపోయాను. రకరకాల దృశ్యాలు నా మదిలో మెదిలాయి. నేను పుట్టిన దక్షిణ టెక్సాస్ పట్టణంలోని ఒక చిన్న బాప్టిస్ట్ సంఘములో నా తల్లి చేయి పట్టుకున్న బాలుడిలా నన్ను నేను చూసుకున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒకినావా ద్వీపంలో సూర్యోదయ ఆరాధనలో ఒంటరితనం వలని కన్నీళ్లతో పోరాడుతూ కూర్చున్నాను. మరొక ఈస్టర్ కీర్తన నన్ను డల్లాస్ సెమినరీ క్యాంపస్‌లోని షేఫర్ చాపెల్‌కు తీసుకువెళ్లింది, అక్కడ పరిచర్యకు సిద్ధమవుతున్న 350 మంది విద్యార్ధులం ప్రక్కప్రక్కనే నిలబడి మేము త్వరలో ప్రకటించబోయే రక్షకుని గురించి హృదయపూర్వకంగా పాడాము. నా గత స్మృతులను స్పురణకు తెచ్చు ప్రయాణంలో నేను ఇతర భౌగోళిక ప్రదేశాలను తిరిగి సందర్శించాను, అలాగే యోబు మాటలు నావి కూడా అయినందుకు ప్రతిసారీ నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను:

“అయితే నా విమోచకుడు సజీవుడని నేనెరుగుదును.” (యోబు 19:25)

గ్లోరియా మరియు బిల్ గైథర్‌ల అలనాటి కానీ సుపరిచితమైన గీతం ఇప్పటికీ యోబు యొక్క నిరీక్షణకు జీవం పోస్తున్నాయి:

ఆయన జీవించుచున్నందున, నేను రేపటిని ఎదుర్కోగలను;
ఆయన జీవించుచున్నందున, భయమంతా పోయింది.2

ఎంత గొప్ప వారసత్వం మనది! మనము తగినంతగా సంతోషించకుండా మరియు మన నిరీక్షణను ప్రకటించకుండా ఈస్టర్‌ను అనుమతించే ధైర్యం చేయలేము. యేసుక్రీస్తు—అద్భుతంగా పునరుత్థానుడైన దేవుని కుమారుడే—మన ఆరాధనకు యోగ్యునిగా మరియు మన స్తుతికి కారణభూతునిగా నిలిచిపోతాడు. 1787లో అతను వ్రాసినప్పుడు, శామ్యూల్ స్టెన్నెట్ సరిగ్గా చెప్పాడు:

ఆయనకు నా ప్రాణం మరియు ఊపిరి రుణపడి ఉన్నాయి,
మరియు నేను కలిగి ఉన్న అన్ని ఆనందాలు;
ఆయన నన్ను మరణంపై విజయం సాధించేలా చేస్తాడు,
మరియు నన్ను సమాధి నుండి రక్షిస్తాడు.3

ఆ నిరీక్షణే విశ్వాసులను చీకటి ప్రదేశాల్లో బలంగా ఉంచింది. మీ పరిస్థితి ఆ బెడ్‌ఫోర్డ్ జైలులో తగరపు పనిచేసేవాని కుమారునిలాగా భయంకరంగా ఉండకపోవచ్చు, కానీ మీ విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేయడానికి బహుశా అతని మాటలు మీకు కావాలి. క్రైస్తవుని వీపు మీద నుండి పాపపు మూట పడిపోయినప్పుడు, జాన్ బన్యన్ యొక్క కాలాతీతమైన స్వభావము ఆశ్చర్యపరిచింది:

ఇంతవరకు నేను నా పాపముతో వచ్చితిని;
అలాగే నేను పడిన దుఃఖాన్ని తగ్గించుకోలేకపోయాను,
నేను ఇక్కడికి వచ్చే వరకు: ఏమిటి ఈ స్థలం!
నా ఆనందానికి నాంది ఇక్కడే ఉండాలా?
ఇక్కడ భారం నా వీపు నుండి పడిపోతుందా?
దీనిని నాకు తగిలించిన తీగెలు ఇక్కడే తెగిపోవాలా?
దివ్యమైన సిలువ! దివ్యమైన సమాధి! నాకొరకు
అవమానించబడిన వ్యక్తి ఆశీర్వదించబడునుగాక!4

ఈస్టర్ గొప్ప సంగీత సమయం. ఈస్టర్ నిరీక్షణ యొక్క పునరుజ్జీవన సమయం. ఈస్టర్ అనేది క్రీస్తును ఘనపరచే సమయం. అది ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు . . . కానీ కొందరికి కలిగిస్తుంది.

చాలా మందికి, ఈస్టర్ అనేది కొన్ని కొత్త బట్టలు కొనుక్కునే సమయం . . . లేదా చర్చికి వెళ్ళే సమయం తప్ప మరేమీకాదు. వారు ఆశ్చర్యపడటానికి సిద్ధముగా ఉన్నారా! కాబట్టి మీరూ నేనూ పాడుచూ మరియు శ్రద్ధతో ఆలోచించుచున్నప్పుడు, మనం ప్రార్థన కూడా చేద్దాం. ఈస్టర్ ఆదివారం నాడు, ఈస్టర్ అనేది భారమును-పడవేసే సమయం అని కొందరు కనుగొంటారు.

  1. Charles Wesley, “Love Divine, All Loves Excelling,” Public Domain.
  2. Gloria Gaither and William J. Gaither, “Because He Lives,” in The Celebration Hymnal: Songs and Hymns for Worship (Nashville: Word/Integrity, 1997), hymn no. 358.
  3. Samuel Stennett, “Chief among Ten Thousand; or, the Excellencies of Christ,” in The Works of Samuel Stennet (London: Thomas Tegg, 1824), 539, www.books.google.com (accessed February 1, 2013).
  4. John Bunyan, The Pilgrim’s Progress (Westwood, N.J.: Barbour and Co., 1985), 36.

Copyright © 2013 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Easter-Telugu.

Pastor Charles R. Swindoll has devoted his life to the accurate, practical teaching and application of God’s Word. He is the founding pastor of Stonebriar Community Church in Frisco, Texas, but Chuck’s listening audience extends far beyond a local church body. As a leading programme in Christian broadcasting since 1979, Insight for Living airs around the world. Chuck’s leadership as president and now chancellor emeritus at Dallas Theological Seminary has helped prepare and equip a new generation of men and women for ministry.

పాస్టర్ చార్లెస్ ఆర్. స్విండాల్ దేవుని వాక్యాన్ని నిర్దిష్టంగా, ఆచరణాత్మకంగా బోధించడానికి మరియు అన్వయించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చి వ్యవస్థాపక కాపరియై ఉన్నారు, అయితే చక్ యొక్క శ్రోతలు స్థానిక సంఘ పరిధి దాటి వ్యాపించి ఉన్నారు. 1979 నుండి క్రైస్తవ ప్రసరణలో ప్రముఖ కార్యక్రమంగా, ఇన్‌సైట్ ఫర్ లివింగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతోంది. డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంటుగా, అలాగే ఇప్పుడు ఛాన్సిలర్ ఎమెరిటస్‌గా చక్ యొక్క నాయకత్వం క్రొత్త తరం స్త్రీపురుషులను పరిచర్య కొరకు సిద్ధపరచడంలో సహాయపడింది.