కష్టాల గుండా వెళుతున్నప్పుడు దేవుణ్ణి ఎలా అంటుకొనియుండాలి

నాతోపాటు కాలగర్భంలోకి అడుగుపెట్టండి అలాగే సుదూరప్రాంతమైన ఊజుకు కలిసి ప్రయాణం చేద్దాం . . .

అది ఎక్కడ ఉన్నను, ఊజులో ప్రతిఒక్కరి గౌరవాన్ని పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకంటే అతడు యధార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు గలవాడు మరియు పవిత్రముగా జీవించేవాడు. అతనికి 10 మంది పిల్లలు, చాలా పశువులు, పుష్కలంగా భూమి, అనేక మంది సేవకులు మరియు గణనీయమైన నగదు నిల్వ ఉంది. అతను “తూర్పుదిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు” అని ఎవరూ కాదనలేరు (యోబు 1:3). ఎన్నో సంవత్సరాల కష్టం మరియు నిజాయితీగా వ్యవహరించడం వల్లనే అతడు ఈ ఖ్యాతిని సంపాదించాడు.

అతని పేరు యోబు, నీతికి మరియు దైవభక్తికి పర్యాయపదం.

కొన్ని గంటల వ్యవధిలో, ముందస్తు ప్రకటన లేకుండా, కష్టాలు వేగముగా దూసుకొచ్చే బండరాళ్ళ వలె యోబు మీద పడ్డాయి. అతడు తన పశువులను, పంటలను, భూమిని, సేవకులను, అలాగే-మీరు నమ్మగలిగితే-మొత్తం 10 మంది పిల్లలను పోగొట్టుకున్నాడు. కొంతకాలం తర్వాత అతడు జీవనము సంపాదించుకోవడానికి అవసరమైన చివరి మానవ ఆశ అయిన తన ఆరోగ్యాన్ని కోల్పోయాడు.

నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి చదవడం ఆపండి. మీ కళ్ళు మూసుకోండి, మీ ఊహలను స్వేచ్ఛగా ఉంచుకోండి మరియు కష్టాల బరువు కింద నలిగిపోయిన ఆ మంచి వ్యక్తిని అర్థం చేసుకొని అతని భావాలను పంచుకోండి.

ఇప్పుడు యోబు 1:21 వైపు తిరగండి, రాళ్లు పడటం ఆగిపోయిన వెంటనే అతడు తన దినచర్య పుస్తకము‌లో వ్రాసుకున్నది చూడండి. వణుకుతున్న చేతితో మరియు బాధపడే హృదయంతో అతడు ఇలా వ్రాశాడు:

నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని,

దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను;

యెహోవా ఇచ్చెను

యెహోవా తీసికొని పోయెను,

యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

ఈ అద్భుతమైన ప్రకటన తరువాత, లేఖనము ఏమంటున్నదంటే:

ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. (1:22)

ప్రస్తుతం, నేను తల ఊచుచున్నాను. నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను, దుఃఖముతోపాటు వచ్చిన పరీక్షలను అతడు ఈ ప్రపంచంలో ఎలా ప్రశాంతంగా ఎదుర్కోగలిగాడు? అనంతర పరిస్థితులను గురించి ఆలోచించండి: దివాలా, నొప్పి, 10 క్రొత్త సమాధులు . . . మరియు ఆ ఖాళీ గదుల వలన కలిగే ఒంటరితనం. అయినను యోబు దేవుని ఆరాధించినట్లు మనం చదువుతాము; అతడు పాపం చేయలేదు, తన సృష్టికర్తను నిందించలేదు.

హేతుబద్ధమైన ప్రశ్నలు ఏమిటంటే: అతడు ఎందుకు అలా చేయలేదు? అతడు దాని నుండి ఎలా తప్పించుకోగలిగాడు? దుఃఖము లేదా ఆత్మహత్య ఆలోచనల నుండి అతడిని ఏది నిరోధించింది? తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, నేను మూడు ప్రాథమిక సమాధానాలను సూచిస్తున్నాను, ఇవి యోబు పేరుతో ఉన్న పుస్తకమును శోధించడం ద్వారా నేను కనుగొన్నాను.

మొదట, యోబు దేవుని ప్రేమగల సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు. ఇచ్చిన ప్రభువుకు తీసుకునే హక్కు ఉందని అతడు నమ్మాడు (1:21). తన సొంత మాటలలో, యోబు ఇలా పేర్కొన్నాడు:

మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. (2:10)

అతడు పైకి చూసాడు, తన జీవితాన్ని పరిపాలించడానికి తన ప్రభువు యొక్క హక్కును అంగీకరించాడు. దేవునికి మన మట్టికి ఇసుకను లేదా మన పాత్రలకు గుర్తులను లేదా ఆయన నైపుణ్యమునకు నిప్పును కలిపే హక్కు లేదని చెప్పే మూర్ఖుడు ఎవడు? పరలోకం వైపు మట్టి పిడికిలిని ఎత్తడానికి మరియు కుమ్మరివాని ప్రణాళికను ప్రశ్నించడానికి ఎవరు ధైర్యం చేయగలరు? యోబు కాదు! దేవుని సార్వభౌమత్వం ఆయన ప్రేమతో ముడిపడి ఉందని అతనికి తెలుసు.

రెండవది, దేవుని పునరుత్థాన వాగ్దానం మీద విశ్వాసం కలిగియున్నాడు. అతని యొక్క మరణంలేని మాటలు గుర్తున్నాయా?

అయితే నా విమోచకుడు సజీవుడనియు,

తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత

శరీరముతో నేను దేవుని చూచెదను. (19:25-26)

యోబు ముందు గతి చూశాడు, రాబోవు జీవితంలో అన్నింటినీ ప్రకాశవంతంగా మరియు అందంగా తీర్చిదిద్దుతాననిన తన ప్రభువు యొక్క వాగ్దానం మీద విశ్వాసం కలిగియున్నాడు. చివరికి అన్ని బాధలు, దుఃఖాలు, కన్నీళ్లు, కష్టాలు మరియు మరణాలు తొలగిపోతాయని అతనికి తెలుసు. “నిరీక్షణ సిగ్గుపరచదు” అని ఎరిగినవాడై, యోబు రేపటి అందాన్ని ఊహించడం ద్వారా నేటి విరిగి నలిగిన స్థితిని భరించాడు.

మూడవది, యోబు తన స్వంత అవగాహన లేమిని ఒప్పుకున్నాడు. ఇది ఎంత ఉపశమనం కలిగిస్తుంది! ఇది ఎందుకు జరిగిందో వివరించడానికి యోబు బాధ్యత వహించలేదు. అతని నిజాయితీగల ఒప్పకోలును వినండి:

నీవు సమస్తక్రియలను చేయగలవనియు

నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని. . . .

ఆలాగున వివేచనలేనివాడనైన నేను

ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులనుగూర్చి మాటలాడితిని. (యోబు 42:2–3)

అతడు ఆత్మపరీక్ష చేసుకొని, అన్నింటినీ అర్థం చేసుకోలేననే తన అసమర్థతను ఒప్పుకున్నాడు. ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలనే ఒత్తిడి లేకుండా అతడు దేవునితో తన వైరమునకు విశ్రాంతినిచ్చాడు.

యోబు యొక్క కథ మనం క్రమం తప్పకుండా సంబంధం కలిగియుండే అనేక ఇన్‌సైట్ ఫర్ లివింగ్ శ్రోతలను గుర్తు చేస్తుంది-వీరు ఎంతో సహించారు మరియు విపత్తు వచ్చినప్పుడు తమకు అవసరమైన దృఢమైన, బైబిల్ పునాదిని నిర్మించడంలో సహాయపడినందుకు మాకు కృతజ్ఞతలు తెలియజేయుటకు వ్రాస్తారు. ముఖ్యంగా, జాన్ మరియు లిన్ హాంప్టన్ గుర్తుకు వస్తారు. ఈ విశ్వాసులు దేవుని “నీతియను దక్షిణహస్తము” (యెషయా 41:10) నుండి బలాన్ని పొందుకోవడం ద్వారా విపరీతమైన కష్టాల నుండి బయటపడ్డారు.

బహుశా మీరు రాళ్లు పడటం ద్వారా గాయపడటం ప్రారంభించుచున్నారు. బహుశా బండరాళ్ళు ఇప్పటికే పడిపోయి ఉండవచ్చు . . . బహుశా పడియుండకపోవచ్చు. మారుమూలనున్న ఊజు దేశమువలె, కష్టాలు 10,000 మైళ్ల దూరంలో ఉన్నాయని అనిపించవచ్చు. అతడు సమస్తమును కోల్పోవడానికి కొన్ని నిమిషాల ముందు యోబు ఇలానే భావించాడు.

కాబట్టి, ఎందుకైనా మంచిది . . . ఈ రాత్రి నువ్వు లైట్లు ఆపేటప్పుడు ఈ ఆలోచనలను సమీక్షించు, నా మిత్రమా. యోబు జీవితంలో ఏ దేవుని శక్తి ఉన్నదో అదే శక్తిని నీ జీవితంలోను వినియోగించుకోవచ్చు.

Copyright © 2016 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.

Posted in Crisis-Telugu, Death-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.