మరణం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది: ఇది ఎప్పుడు జరుగుతుంది? అది ఎలా ఉంటుంది? ఆత్మ యొక్క గమ్యం ఏమిటి? చక్ స్విండోల్ ఈ చివరి ప్రశ్న గురించి గ్రోయింగ్ డీప్ ఇన్ ది క్రిస్టియన్ లైఫ్ అనే పుస్తకంలో సంబోధించారు:
విశ్వాసి చనిపోయినప్పుడు, శరీరం సమాధిలోకి వెళుతుంది; ప్రాణం మరియు ఆత్మ ప్రభువైన యేసుతో ఉండటానికి వెంటనే వెళ్లిపోయి, అవి శాశ్వతమైన ఆనందంలో దేవునితో ఎప్పటికీ కలిసి ఉండటానికి శరీరం యొక్క పునరుత్థానం కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.1
విచారించవలసిన విషయమేమంటే, చాలామంది తమ ఆత్మలు పరలోకము కొరకు నిరవధికంగా వేచి ఉండాలేమోనని భయపడుచున్నారు. “ఆత్మ నిద్ర”–మరణం తర్వాత అంతిమ పునరుత్థానం వరకు ఆత్మ అపస్మారక స్థితిలో ఉంటుంది లేదా ఉనికిలో ఉండదు అనే నమ్మకం–దాని మూలాలను అది శారీరక మరణమైన “నిద్ర” అనే రూపకంలో కనుగొంటుంది. ఈ రూపకం లేఖనములో కనిపించినప్పటికీ, నిద్ర యొక్క రూపకం మరణం తరువాత భూసంబంధమైన శరీరం యొక్క నిర్జీవ స్థితిని మాత్రమే సూచిస్తుంది గానీ, ఆత్మను కాదు అని క్షుణ్ణమైన అధ్యయనం తెలియజేస్తుంది.
మరణించినప్పుడు వారి ఆత్మల గమ్యాన్ని గూర్చి విశ్వాసులకు లేఖనము హామీ ఇచ్చుచున్నది:
వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించు చున్నంతకాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము. ఇట్లు ధైర్యముగలిగి యీ దేహమును విడిచి పెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. (2 కొరింథీయులకు 5:6-8, ప్రాధాన్యత జోడించబడింది)
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైనయెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది. (ఫిలిప్పీయులకు 1:21-24)
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి–తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. (లూకా 23:46)
యేసు, దేవుని కుమారునిగా, తాను మరణించిన మరుక్షణమే సమాధిలో నిద్రపోకుండా, తండ్రి “చేతుల్లో” ఆత్మీయంగా ఉంటాడని ఆయనకు తెలుసు.
విశ్వాసులకు ఆత్మ నిద్ర లేదు, కానీ మరణం తర్వాత దేవునితో తక్షణ, ఎరిగిన సన్నిధిని కలిగి ఉంటారని ఇతర బైబిల్ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి:
- స్తెఫనుపై రాళ్లు రువ్వుట (అపొస్తలుల కార్యములు 7:54-59)
- రూపాంతరము పొందుట (మత్తయి 17:1–8; మార్కు 9:1–8; లూకా 9:28-36)
- రాహేలు మరణించినప్పుడు ఆమె ప్రాణము పోవుట (ఆదికాండము 35:18)
మరింత విచారణ చేయుటకు మరో రెండు వాక్యభాగములు ఉన్నాయి. మొదటిది, యోహాను 11:23-27:
యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ఆమె–అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను.
తన సహోదరుడు పునరుత్థానంలో మాత్రమే “బ్రదుకును” అనే మార్త యొక్క నమ్మకాన్ని యేసు సరిచేసినట్లు గమనించండి. దీనికి విరుద్ధంగా, విశ్వాసులు చనిపోయినప్పటికీ జీవిస్తారని, వాస్తవానికి, మన శరీరాలు మరణించినట్లుగా వారు ఎన్నటికీ చనిపోరని యేసు బయలుపరచాడు.
రెండవ వాక్యభాగం పేతురు యొక్క కలం నుండి వచ్చింది:
ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. (1 పేతురు 3:18)
విశ్వాసులు, రక్షణ పొందిన క్షణంలో, “క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నారు,” అయినను వారు జీవించుచున్నారు (గలతీయులకు 2:20). విశ్వాసి యొక్క భౌతిక శరీరం చనిపోయినప్పుడు, అతను లేదా ఆమె ఆత్మీయంగా జీవిస్తారు. క్రీస్తునందు విశ్వాసం ద్వారా, యేసు ఆత్మలో జీవిస్తున్నట్లుగా విశ్వాసులు ఆత్మలో బ్రదికింపబడ్డారు. క్రీస్తును ప్రకటించు మనము ఆత్మ నిద్ర లేదా సమాధి కొరకు నియమించబడలేదు!
మరణం తరువాత భూసంబంధమైన భౌతిక శరీరం యొక్క నిర్జీవ స్థితిని మరణం తరువాత ఆత్మ యొక్క ఆత్మీయ జీవితమును మరియు దాని స్థితిని శరీరం నుండి వేరుగా ఉంచడం ద్వారా మనం మరణం చుట్టూ అల్లుకున్న అనేక వ్యాఖ్యాన సంఘర్షణలను పరిష్కరించవచ్చు.
దీనికి మద్దతు ఇచ్చే ఒక ముఖ్య లేఖన సంఘటన, కానీ కొన్నిసార్లు ఇది అపార్థం చేసుకోబడినది, అదే సిలువపై ఉన్న దొంగతో యేసు యొక్క సంభాషణ. తన ప్రక్కన చనిపోతున్న దొంగతో ఆ రోజు తమ ఆత్మలు కలిసి, సజీవంగా మరియు స్పృహతో ఉంటాయని యేసు చెప్పారు. లూకా 23:42-43లో విరామచిహ్నాలు (ఆంగ్ల తర్జుమాల్లో) తప్పుగా ఉంచబడ్డాయని కొందరు వాదిస్తున్నారు. “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను” అనేదానికి బదులుగా, “ఈ రోజు నిజంగా నేను నీకు చెప్పుచున్నాను, నీవు నాతో పరదైసులో ఉందువు,” (చదువరులకు సందర్భం అర్థమవుటకు ఆంగ్లంలో ఉన్నదిఉన్నట్లుగానే తర్జుమా చేయబడింది) అని యేసు నిజంగా చెప్పెనని వారు వాదించుచున్నారు. అయితే, “ఈ రోజు నేను నీకు చెప్పుచున్నాను” అని యేసు చెప్పిన ఇతర సందర్భాలు లేఖనములో లేవు. ఇది ప్రతి ఆంగ్ల అనువాదం సూచించినట్లుగా, తాను మరియు దొంగ నేడు పరదైసులో కలిసి ఉంటారనే సమయాన్ని యేసు నొక్కిచెప్పుచున్నాడనే సంభావ్యతను పెంచుచున్నది. అలాగే “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను” అనే యేసు ప్రకటన కూడా, మరణించిన వెంటనే ఆయన దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఉండడాన్ని సూచించుచున్నది.
కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోబడుచున్న మరొక లేఖనాత్మక సంఘటన ఏమిటంటే సౌలు ఏన్దోరులోని కర్ణపిశాచము గల స్త్రీని సందర్శించడం. సౌలు సమూయేలు ఆత్మను పిలిచాడని, సమూయేలు ఆత్మ భూమిలోనుండి పైకి లేచిందని, మరియు తన నిద్రకు భంగం కలిగించినందున సమూయేలు కోపంగా ఉన్నాడని కొందరు నమ్ముతారు. అయితే, ఈ వాక్యభాగంలో నిద్ర గురించి ప్రస్తావించబడలేదు. “నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివి?” (1 సమూయేలు 28:15) అని మాత్రమే ఈ వచనంలో ఉంది. ఇంకా, థామస్ కానిస్టేబుల్ గుర్తించినట్లుగా, “మంత్రగత్తె సమూయేలును మృతులలో నుండి పైకి తీసుకువచ్చినట్లు ఈ వాక్యభాగం చెప్పలేదు. దేవుడు సమూయేలును సౌలునకు బయలుపరచాడు.”2
సమూయేలు కదల్చివేయబడక మునుపు ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ మరుసటి రోజు రాజు మరియు అతని కుమారులు ప్రవక్తతో ఉంటారని ఆయన సౌలుతో చెప్పినట్లు మనకు తెలుసు (28:19). వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మలు నిద్రపోతున్నట్లయితే ఇది అర్థరహితముగా ఉంటుంది. బదులుగా, మరుసటి రోజు వారి ఆత్మలు ఒకరినొకరు కలుసుకోవడం గురించి వారందరికీ అవగాహన ఉంటుందనేది సమూయేలు మాటల్లోని అర్థం.
లూకా 16:19-31లో, లాజరు మరియు ధనవంతుడు మరణించిన తరువాత “అబ్రాహాము రొమ్ము” మరియు “పాతాళము” లో ఉన్నారు. అయితే మన ఆత్మలు ఆ “నిరీక్షణ స్థలాలు” వంటి ప్రదేశాలలో పరలోకము కొరకు వేచి ఉండటాన్ని సూచించుచున్నాయని కొంతమంది పాఠకులు భావించుచున్నారు. నిజానికి, యేసు స్వయంగా చెప్పిన ఈ కథ, మరణం తరువాత మరియు శారీరక పునరుత్థానానికి ముందు ఆత్మ నిద్రపోదు కానీ సజీవంగా మరియు స్పృహతో ఉంటుందని బోధిస్తుంది. యాదృచ్ఛికంగా, పరిశుద్ధ గ్రంథములో “అబ్రాహాము రొమ్ము” అనే మాట కనిపించే ఏకైక సందర్భం ఇదే. తన మరణం తరువాత యేసు ఎదురుచూచిన “పరదైసు” ను “అబ్రాహాము రొమ్ము” అనే మాట సూచించుచున్నది.
పరలోకములో మన ప్రియమైన వారిని మనం గుర్తిస్తామా లేదా మన ఆత్మలు దెయ్యం లేదా తేలికపాటి మబ్బుల వలె రూపం లేకుండా ఉంటాయా అని కొందరు ఆశ్చర్యపోతారు, అయితే ఈ వాక్యభాగాలు మనకు శరీర రూపం ఉంటుందని సూచిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథము మనకు వివరాలను ఇవ్వలేదు, కానీ అనేక వాక్యభాగాలు మనం గుర్తించదగిన అసంపూర్ణమైన దేహములను కలిగి ఉంటామని సూచిస్తున్నాయి.
లూయిస్ స్పెర్రీ ఛేఫర్ 2 కొరింథీయులకు 5:1-5 ని సూచిస్తూ, “మరణం మరియు పునరుత్థానం మధ్య ఉండే మధ్యంతర (అసంపూర్ణమైన) శరీరం అనే భావనను” గూర్చి ఇలా వివరించాడు:
ప్రస్తుత కాలంలో విశ్వాసులు “భూమిమీద గుడారములో” ఉన్నారు (v. 1), కానీ వారు తమ “పరలోకమునుండివచ్చు నివాసము” (v. 2) కోసం ఆశపడుతున్నారు. మరణం తర్వాత విశ్వాసులకు సంబంధించిన సూచనలు పునరుత్థానానికి ముందు లాజరుకు మాదిరిగానే వారికి కూడా శరీరం ఉంటుందని సూచిస్తున్నాయి (లూకా 16:19-25). మోషే మరియు ఏలీయా రూపాంతరపు కొండపై క్రీస్తును కలిసినప్పుడు, వారు శరీరాలు కలిగి ఉన్నట్లు వర్ణించబడ్డారు (మత్తయి 17:1-3; మార్కు 9:4; లూకా 9:30). ప్రకటన 6:9–11 [మరియు 7:13-17] లో హతసాక్షులైనవారు . . . వస్త్రములు ధరించుకొని దేవుని సింహాసనము ఎదుట ఉండటం చూపించబడ్డారు. ఈ శరీరాల యొక్క ఖచ్చితమైన లక్షణాలకు సంబంధించి లేఖనములో పూర్తిగా బయలుపరచబడనప్పటికీ, స్పష్టంగా అవి నిత్యత్వానికి సరిపోవు ఎందుకంటే అవి పునరుత్థాన శరీరముల ద్వారా పునఃస్థాపించబడతాయి.3
బైబిల్‌లో ఎన్నడూ కనిపించని మరియు సువార్తకు విరుద్ధమైన భావన, అనగా మరణించిన వ్యక్తి ఆత్మ శుద్ధి పొందే స్థితిలాగా, ఈ ఎరిగియున్న, మధ్యస్థ స్థితి పరలోకము మరియు భూమి మధ్య మధ్యంతర ప్రక్షాళన ప్రదేశం కాదు. బదులుగా, ఇది ఒక తాత్కాలిక శరీరం, మన మరణ సమయం మరియు పునరుత్థానం మధ్య నడిమికాలం, పునరుత్థానము యేసు తిరిగి వచ్చినప్పుడు జరుగుతుంది.
లేఖనము మన ఆత్మల గమ్యం గురించి మాత్రమే స్థిరముగా చెప్పడం లేదు; ఎత్తబడి పునరుత్థానం చేయబడే మన భూసంబంధమైన, భౌతిక శరీరాల భవిష్యత్తుపై కూడా దేవుని వాక్యం అంతర్దృష్టిని అందిస్తుంది. “మన దేహముయొక్క విమోచనముకొరకు కనిపెట్టుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి,” అని పౌలు వ్రాశాడు (రోమా 8:23-24). దౌర్భాగ్యముగా, ఆత్మ నిద్రయందు నమ్మకముంచే చాలామంది మన భూసంబంధమైన శరీరాల పునరుత్థానాన్ని మరియు మరణం తర్వాత ఆత్మీయ జీవాన్ని గందరగోళపరిచారు. భూసంబంధమైన శరీరం మరియు మరణం తర్వాత దాని ప్రాముఖ్యత గురించి, లేఖనము ఇలా చెబుతున్నది, “మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము” (1 యోహాను 3:2). దానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఒక మర్మముగా మిగిలిపోతాయి; అయితే, మనము ఎత్తబడి శారీరకంగా పునరుత్థానమవుతామని మనకు తెలుసు (యోహాను 5:29; అపొస్తలుల కార్యములు 24:15; 1 థెస్సలొనీకయులకు 4:13-18). మన ప్రస్తుత శరీరాల కంటే పునరుత్థానమైన మన శరీరాలు కొన్ని విధాలుగా భిన్నంగా ఉంటాయని (1 కొరింథీయులకు 15:45-49) మరియు నిత్యత్వానికి తగినవి అని కూడా మనకు తెలుసు.
యేసు పునరుత్థానం తర్వాత ఆయన శరీరాన్ని పరిగణలోకి తీసుకోవడం ద్వారా మన పునరుత్థాన శరీరముల గురించి మనం తెలుసుకోవచ్చు. యేసు తిన్నాడని మరియు త్రాగాడని, శిష్యులు ఆయనను తాకగలిగారని మరియు ఆయనకు మాంసము మరియు ఎముకలు ఉన్నాయని అయినను భౌతిక పరిమితులు లేకుండా ఇష్టానుసారంగా కదలగలిగాడని మనకు తెలుసు. “నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పెట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పెను” (లూకా 24:39). యేసు యొక్క పునరుత్థాన శరీరం ఈ పనులన్నింటినీ చేయగలిగితే, మన పునరుత్థాన శరీరాలు కూడా చేయగలవు.
మరణం గురించి భయాలు మరియు ప్రశ్నలు సహజం, కానీ బైబిల్ శాంతిని అందిస్తుంది. “ఆత్మ నిద్ర” అని పిలవబడేదానికన్నా, మరణం తర్వాత దేవుడు మనకు అందించే విశ్రాంతి చాలా గొప్పదని తెలుసుకోవడంలో విశ్వాసులు ధైర్యం పొందవచ్చు. మరణం బాధాకరమైనది మరియు నొప్పి కలుగజేసేది అయినప్పటికీ, క్రీస్తును ఎరిగిన వారికి, మరణమును అధిగమించిన సమయం అద్భుతమైన నిరీక్షణను కలిగి ఉంటుంది. క్రైస్తవులకు, మరణం అంటే మనం చివరకు, వెంటనే మన తండ్రితో ముఖాముఖిగా ఉండటమే.
- Charles R. Swindoll, Growing Deep in the Christian Life: Essential Truths for Becoming Strong in the Faith (Grand Rapids: Zondervan, 1995), 308.
- Thomas L. Constable, Notes on 1 Samuel (Dallas: Sonic Light, 2013), 115, http://www.soniclight.com/constable/notes/pdf/1samuel.pdf (accessed May 28, 2013).
- Lewis Sperry Chafer, Systematic Theology, vol. 2, abr. ed. (Wheaton, Ill.: Victor, 1988), 507.
Copyright © 2013 by Insight for Living Ministries. All rights reserved worldwide.