మొదటి క్రిస్మస్ వేడుక నుండి, ప్రతి ఒక్కరి పెదవుల నుండి ఒక పదం మిగతా వాటి కంటే ఎక్కువగా జాలువారిందని నేను అనుకుంటున్నాను. అది సంతోషం లేదా ఆనందగీతము లేదా చెట్టు లేదా ఆహారం అనే పదం కాదు. అది బహుమతి అనే పదం. బహుమతులు క్రిస్మస్‌తో చాలా విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయి గనుక మనం ఒకటి లేకుండా మరొకదాని గురించి ఆలోచించలేము. అయితే, మనము ఒక ప్రాధాన్యతను ఏర్పాటు చేసుకోవాలి. క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిపుచ్చుకోవడం జరిగిననూ, మనం మొదట దేవుడు మనకు ఇచ్చిన బహుమానము గురించి ఆలోచించడం సముచితంగా ఉంటుంది.
ఆ బహుమానము ఏమిటి? వాస్తవానికి, అది ఆయన కుమారుడు, యేసు మరియు ఆయనతోపాటు, ఆయన మానవాళికి అందించే రక్షణ. బైబిల్‌లోని గొప్ప క్రిస్మస్ వచనాన్ని పునరావృతం చేయడంలో నేను ఎప్పుడూ అలసిపోను: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16).
ఆ మొదటి రాత్రి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు, జగత్తు పునాది వేయబడకముందే తాను ఏర్పాటు చేసిన ప్రణాళికను అమలులోకి తెచ్చాడు. మరి ఆ ప్రణాళిక ఏమిటి? నిత్యజీవము–అసాధ్యమైన ఈ గొప్ప వరమును మనకివ్వడమే. ఆయన తన కుమారుడైన యేసు ద్వారా ఈ బహుమానాన్ని అందించాడు, మనం దేవుని దగ్గరకు వెళ్లలేము గనుక ఆయనే మన దగ్గరకు వచ్చాడు. మనము ఎంత ప్రయత్నించినా, మనము ఆయనను సమీపించలేకపోయాము-మన పాపం మనల్ని దూరంగా ఉంచింది. ఇప్పుడు, యేసు మూలముగా, మనం దేవుని సన్నిధానమునకు చేరగలము. దేవుడిచ్చిన వరం మనల్ని మరింత దగ్గరికి ఆహ్వానిస్తుంది. అపొస్తలుడైన పౌలు ఈ క్రింది విధంగా ప్రకటించడంలో ఆశ్చర్యమేమీ లేదు, “చెప్ప శక్యము కాని ఆయన వరమునుగూర్చి దేవునికి స్తోత్రము!” (2 కొరింథీయులకు 9:15).
ఆయన బహుమానం ఎంతో గొప్పదైనప్పటికీ, దేవుడు దానిని నిశ్శబ్దంగా మరియు వ్యక్తిగతంగా అందించాడు, బేత్లెహేము కొండపైన ఉన్న ఎవరికిని తెలియని కొంతమంది గొర్రెల కాపరులకు “మహా సంతోషకరమైన సువర్తమానము” ప్రకటించాడు (లూకా 2:10). దేవుడు తన బహుమానమును సామాన్యులకు-పేరులేని గొర్రెల కాపరులకు ప్రకటించాలని ఎంచుకున్నాడు, ఎందుకంటే యేసు మానవజాతి మొత్తానికి సంబంధించిన స్థితిని పరిష్కరించడానికి వచ్చాడు: రక్షకుని కొరకు మన తీరని అవసరం.
“[మీకు] జీవము కలుగుటకును,” మరియు మీకు “అది సమృద్ధిగా కలుగుటకును” యేసు వచ్చాడని యోహాను 10:10 చెప్పుచున్నది. ఈ సమృద్ధి జీవితం మీకు తెలుసా? ఆయన అనుగ్రహించే సమాధానము మీ హృదయంలోకి ప్రవేశించిందా? మీలో మన రక్షకుణ్ణి ఇంకా ఎరుగవలసిన వారికిని మరియు ఆయనను ఎరిగియుండినను, ఈ కాలము యొక్క ఆనందాన్ని కోల్పోతున్న వారికిని నేను దీన్ని వ్రాస్తున్నాను. ఈ నెలలో తరచుగా వచ్చే చిరాకు మరియు బాధాకరమైన రోజుల మధ్య, ఆయన బహుమానమును విప్పడానికి సమయాన్ని వెచ్చించండి. మీరేమీ ఖర్చు చేయవలసిన పనిలేదు-ఇది ఒక వరము, గుర్తుంచుకోండి-ఆయన మీ కోసం చేసిన దానిని మీరు పొందుకుంటే చాలు.
ఈ క్రిస్మస్‌కి దేవుని వరము మీ కోసం వేచి ఉంది. నిశ్శబ్దంగా, మీరు ఆయన కోసం వేచి ఉన్న ప్రకారము మరియు వ్యక్తిగతంగా, ఆయన మీ నిర్దిష్ట అవసరాలకు సమాధానమిచ్చిన ప్రకారముగా–ఆయన దానిని మీ హృదయ ద్వారము నొద్దకు అందజేస్తాడు. సంవత్సరంలోని ఈ సమయంలో మీ అవసరం ఏమైనప్పటికీ, దేవుడు మీకు అత్యంత సమృద్ధిగా ఉన్నదాన్ని-నిశ్శబ్దంగా ఇంకా గొప్ప ఆనందంతో అందజేస్తాడని నమ్మండి.