న్యూస్ నెట్‌వర్క్‌లు 1809లో కనుగొనబడి ఉంటే, అవి ఒక కథనాన్ని కవర్ చేసేవి: నెపోలియన్ ఆస్ట్రియా అంతటా దావానలంలా తుడిచేస్తున్నాడు. నెపోలియన్ ట్రఫాల్గర్ నుండి వాటర్‌లూకి వెళ్లడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతా నెపోలియన్ గురించే.
సరే, అదే సమయంలో, పిల్లలు పుట్టారు, కానీ ఎవరు పట్టించుకుంటారు? ఎవరో ఒకరు పట్టించుకుని ఉండాలి! 1809లో ప్రపంచాన్ని మార్చే శ్రేణులు తమ మొదటి శ్వాసను తీసుకున్నారు. ఒకసారి వెనక్కి ప్రయాణం చేసి మనమే చూద్దాం.
మొదటిగా మనం ఆగేది: లివర్‌పూల్, ఇక్కడ బిడ్డయైన విలియం ప్రపంచాన్ని కలుస్తున్నాడు. అతను గ్రేట్ బ్రిటన్ ప్రధానమంత్రి అవుతాడని ఎవ్వరూ ఊహించలేదు-ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడు సార్లు కాదు, ఏకంగా నాలుగు సార్లు. విలియం గ్లాడ్‌స్టోన్, 1809.
అట్లాంటిక్‌ను దాటి కేంబ్రిడ్జ్‌కి వెళ్లండి, ఆలివర్ అనే మరో బిడ్డ ఏడుపు మీకు వినబడుతుంది. ఒక అద్భుతవ్యక్తి, ఆలివర్ 16 సంవత్సరాల వయస్సులో హార్వర్డ్‌లోకి ప్రవేశించాడు, 20 సంవత్సరాల కంటే ముందే పట్టభద్రుడైయ్యాడు, అతను వైద్య పట్టా పొందాడు, మెడిసిన్ ప్రాక్టీస్ పెట్టాడు అలాగే డార్ట్‌మౌత్ మరియు హార్వర్డ్‌లో బోధన చేయటం ప్రారంభించాడు. ఈ రోజు, అతని వారసత్వం ఇప్పటికీ గౌరవించబడే పుస్తకాల యొక్క సుదీర్ఘ జాబితాను కలిగి ఉంది. ఆలివర్ వెండెల్ హోమ్స్, 1809.
మీరు బోస్టన్‌కు చేరుకునే వరకు చార్లెస్ నది గుండా ప్రయాణించండి, అక్కడ మరొక బిడ్డ ఎడ్గార్ జన్మించాడు. ఎడ్గార్ తండ్రి త్వరగా అతన్ని విడిచిపెట్టేశాడు; వెంటనే, అతని తల్లి మరణిస్తుంది. అలన్ అనే కుటుంబం ఎడ్గార్‌ను పెంచుకున్నారు మరియు అతను వారి చివరి పేరును తన మధ్య పేరుగా తీసుకున్నాడు. అతను అమెరికన్ చిన్న కథకు పితామహుడయ్యాడు. ఎడ్గార్ అలన్ పో, 1809.
మహాసముద్రానికి అవతల, ష్రాప్‌షైర్‌కు ప్రయాణం చేయండి, అక్కడ ఒక కుటుంబం వారి ఐదవ బిడ్డ, అబ్బాయిని స్వాగతించింది. త్వరలో, వారు తమ చేతుల్లో ఒక యువ శాస్త్రవేత్త ఉన్నాడని తెలుసుకుంటారు. అతను చనిపోయే ముందు, అతను తన పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశాడు. చార్లెస్ డార్విన్, 1809.
లింకన్‌షైర్‌లో, బిడ్డయైన ఆల్ఫ్రెడ్ తన మొదటి శ్వాస తీసుకున్నాడు. అతను పాతిపెట్టబడక ముందు, అతను ఐర్లాండ్ మరియు గ్రేట్ బ్రిటన్ యొక్క ఆస్థానకవి అయ్యాడు, ఇప్పటికీ అత్యంత ఆరాధించబడిన మరియు ఫలవంతమైన కవులలో ఒకడు. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్, 1809.
మనము కెంటకీలోని ఒక-గది మాత్రమే ఉన్న చెక్క గృహమును వదిలివేయలేము, ఇక్కడ థామస్ మరియు నాన్సీ తమ రెండవ బిడ్డను స్వాగతించడంలో పరవశులై ఉన్నారు, అతనికి వారు అతని తాత పేరు పెట్టారు. అంతర్యుద్ధం ద్వారా తమ బిడ్డ దేశాన్ని నడిపిస్తాడని వారు ఊహించలేదు. అబ్రహాం లింకన్, 1809.
వీరంతా 1809లో జన్మించారు . . . కానీ ఎవరు పట్టించుకున్నారు? నెపోలియన్ దండయాత్రలలో ఒకదాన్ని కొంతమంది చారిత్రక ప్రేమికులు జ్ఞాపకం చేసుకోగలరు! చాలా ముఖ్యమైనదిగా అనిపించింది, చివరికి ఆదివారం-మధ్యాహ్నం నిద్ర కంటే పెద్ద ఉత్సాహకరమైనది కాదని నిరూపించబడింది. నిజానికి, ఏదైతే ముఖ్యమైనది కాదనిపించిందో, అదే ఒక క్రొత్త శకానికి నాంది పలికింది.
మనం బాగా వెనక్కి, మొదటి శతాబ్దానికి వెళ్దాం. రోమ్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అట్లాంటిక్, యూఫ్రేట్స్, డానుబే మరియు రైన్ మరియు సహారా యొక్క మండుతున్న ఇసుకల సరిహద్దులో ఉన్న రోమా సామ్రాజ్యం విశాలమైనది మరియు దుర్మార్గమైనది. రాజకీయ కుట్రలు, జాతి ఉద్రిక్తత, ప్రబలమైన అనైతికత మరియు అపారమైన సైన్యం అందరి దృష్టిని పొంది ఉండవచ్చు. ప్రజలందరి దృష్టి ఔగుస్తుపైనే ఉంది-జనాభా గణనను ఆజ్ఞాపించిన కైసరు.
నజరేతు నుండి బేత్లెహేముకు 90 మైళ్ల ప్రయాణం చేస్తున్న జంటను ఎవరూ పట్టించుకోలేదు. రోమాలో కైసరు నిర్ణయాల కంటే ముఖ్యమైనవి ఇంకేమి ఉంటాయి?
అయినప్పటికీ, శక్తివంతమైన ఔగుస్తు అనుకోకుండా మీకా యొక్క ప్రవచన నెరవేర్పు కోసం ఒక పనికిమాలిన పిల్లవాడు అయ్యాడు. చరిత్ర సృష్టించడంలో రోమ్ బిజీగా ఉండగా, దేవుడు వేంచేశాడు. ఆయన ఒక దీనమైన బేత్లెహేము పశువుల తొట్టిలో గడ్డిపై తన శారీరకమైన గుడారాన్ని వేసుకున్నాడు. అలెగ్జాండర్, హేరోదు మరియు ఔగుస్తు వంటి మహానుభావుల మేల్కొలుపు నుండి తూలిపడుతూ వచ్చిన ప్రపంచం- యేసును పట్టించుకోలేదు.
అది ఇప్పటికీ అలానే చేస్తుంది. చాలా మంది విశ్వాసులు కూడా అలానే చేస్తున్నారు.
మన కాలం 1809 లేదా మొదటి శతాబ్దం కంటే పూర్తి భిన్నంగా ఏమీ లేదు. రోమా యొక్క కలవరపరిచే జాబితా సుపరిచితముగా అనిపిస్తుంది, కాదా? రాజకీయ కుట్ర. జాతి ఉద్రిక్తత. ప్రబలిన అనైతికత. అపారమైన సైనిక శక్తి. మన సంకుచితమైన దృష్టిని మెరుగుపరచడానికి, మనకు వార్తా యంత్రాంగాలు ఉన్నాయి. ఇవి “ఈ ప్రపంచ” కథలో ప్రతి కొత్త అభివృద్ధి (మరియు దాని గురించి స్నేహితుల అభిప్రాయం) గురించి మనల్ని అప్రమత్తం చేస్తాయి. భయం మరియు ఆందోళనలో చిక్కుకోవడం సులభం.
నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. మన వార్తా ఛానెళ్ళలో వస్తున్న సంఘటనలు ముఖ్యమైనవి. వాటిలో కొన్ని మీపై తీవ్ర ప్రభావం చూపాయి. అవి సామాన్యమైనవి కావు. అయితే అన్యథా ఆలోచించి మోసపోవద్దు-క్రిస్మస్ సందేశం నుండి మిమ్మల్ని సాతాను మరల్చాలనుకుంటున్నాడు. రోమీయుల బలమైన అణిచివేత క్రింద జీవించిన వారికి ఎంత అవసరమో ఈ రోజు మనకు కూడా అంతే అవసరమైన సందేశం ఇది.
ఇదిగో, ఆ సందేశం ఇదే: ఇమ్మానుయేలు—దేవుడు మనకు తోడు.
క్రిస్మస్ అనేది మనతో ఈ అలసిపోయిన ప్రపంచంలో జీవించడానికి దేవుడు దిగి రావడమే. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెస్సీయ చివరకు తన మొదటి ఏడుపును బయటపెట్టాడు. రక్షకుడు, ఆయనను త్రోసివేసే ప్రపంచానికి ఏకైక నిరీక్షణ. ఒక్కసారే తప్పును ఒప్పు చేయడానికి మరలా వస్తున్నాడు, జయశాలి రాజులకు రాజు.
ఆ రాజు మన రాజు!
జీవితం మీ చుట్టూ భగ్గున రేగినప్పుడు, దయచేసి ఆగండి. దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడనే సత్యం యొక్క అనుభూతిని పొందండి. ఆయన వాక్యం మీ భయాన్ని పారద్రోలనివ్వండి మరియు ఆయన నిరీక్షణ మీ హృదయాన్ని బంధించనివ్వండి. ఆయనపైనే మీ దృష్టిని ఉంచండి మరియు మీ రాజును స్వీకరించండి!
Copyright © 2017 by Charles R. Swindoll, Inc. All rights are reserved worldwide.