మనోహరమైన సాక్ష్యం

మా ఇంట్లో రాత్రి భోజనపు బల్ల చుట్టూ సరదాలు మరియు ఆటలు జరగటం నాకు గుర్తుంది. వెఱ్ఱెక్కినట్లు జరిగింది. అన్నింటిలో మొదటిది, ప్రార్థన సమయంలో పిల్లలలో ఒకరు నవ్వారు (అది అసాధారణమైనది కాదు) మరియు ఇదే తర్వాత జరిగినవాటన్నిటికీ ఆరంభం. అప్పుడు పాఠశాలలోని ఒక హాస్య సంఘటన పంచుకోబడింది మరియు ఆ సంఘటన (అది చెప్పబడిన విధానం) బల్ల చుట్టూ బీభత్సాన్ని రేకెత్తించింది. ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు మీరు ఊహించలేనంత బిగ్గరగా, తుంటరిగా, అత్యంత ఆనందదాయకమైన హాస్యం మొదలైంది. ఒకానొక సమయంలో, నా పెద్దకుమారుడు తన కుర్చీలోంచి మూర్ఛవచ్చినట్లు పడిపోవడాన్ని నేను చూశాను, నా చిన్నకుమారుడు కుర్చీలోనుండి ముందుకు పడిపోయాడు, దాంతో తన పళ్ళెంలో ఉన్న మొక్కజొన్న చిప్స్ తన బుగ్గలకు అంటుకున్నాయి . . . అలాగే నా ఇద్దరు కూతుళ్ళు వెనుకకు వంగి, మైమరచిపోయి, దేవుడు మానవాళికి అందించిన అత్యంత అందమైన మరియు ప్రయోజనకరమైన చికిత్సలో నిమగ్నమై ఉన్నారు: నవ్వు.

చాలా అద్భుతమైన విషయం ఏమిటంటే, ప్రతిదీ చాలా తేలికగా మరియు హాయిగా అనిపించింది. చిరాకు, అసహనాన్ని పిలువబడని అతిథుల వలె పట్టించుకోబడలేదు. ఉదాహరణకు, భోజనం సమయంలో పసివాడైన చక్ తన పానీయం రెండుసార్లు పారేశాడు . . . అయితే అది కూడా ఇంటిని నవ్వులతో నింపేసింది. నాకు సరిగ్గా గుర్తున్నట్లైతే, వాడు ఆ రోజు ఆరుసార్లు తన పానీయాన్ని ప్రమాదవశాత్తు పడవేసుకున్నాడు, కానీ ఎవరూ పట్టించుకోలేదు.

ఒక తండ్రి ఆనందించగల అత్యంత ఆహ్లాదకరమైన జ్ఞాపకాలతో నిండిన మరియు పులకించిన అనుభూతి నాకు గుర్తుంది—ఆరోగ్యకరమైన, సంతోషకరమైన, నవ్వుతున్న కుటుంబం. ఎంత గొప్ప నిధి! ప్రతి వారం ఆ సమయంలో నా భుజాలపై తరచుగా బరువుగా ఉండే భారం తేలికగా మరియు అల్పమైనదిగా అనిపించింది. గొప్ప లాభాలను తెచ్చిపెట్టే అవసరమైన స్నేహితుడే ఈ నవ్వు.

నన్ను అడిగినట్లైతే, ప్రార్థనచేయడం . . . బోధించడం . . . సాక్ష్యమివ్వడం ఎంత పవిత్రమో, నవ్వడం కూడా అంతే పవిత్రమైనదని నేను భావిస్తున్నాను. అయితే–పలువిధాలుగా చూసినట్లైతే నవ్వు ఒక సాక్ష్యం. నవ్వు మరియు సరదా అనేవి శరీరానికి సంబంధించినవి లేదా సందేహాస్పదమైనవిగా భావించినట్లయితే మనం వక్రీకృతమైన, అసమతుల్యమైన మనస్సుతో తప్పుదారిలో నడిపించబడ్డాము. ఇది సాతాను యొక్క అత్యంత పదునైన బాణాలలో ఒకటి, అలాగే మన చూపులు మరియు మొహం మీద ముడతలు చూస్తే, మనలో కొందరు చాలాసార్లు వాడిచేత పొడువబడి ఉంటారు. హాస్యాన్ని అరికట్టడంలో మరియు చిరునవ్వులు చిందించకుండా ఉండటానికి చాలా గంటల పాటు సాధన చేయడం ద్వారా పాత బాసెట్ హౌండ్ (పొట్టికాళ్ళతో ఉండే ఒక జాతి శునకం) రూపాన్ని అభివృద్ధి చేసుకున్న కఠినమైన, నిబ్బరమైన క్రైస్తవుని నిజమైన దయనీయమైన స్థితి.

కఠినంగా మరియు గంభీరంగా కనిపించడం కొత్తేమీ కాదు. మొదటి శతాబ్దంలో అసంతుష్టిగా అసంతోషకరంగా ముఖం చిట్లించడం ప్రారంభమైంది. దాని అధికార సభ్యులు పరిసయ్యులు అని పిలువబడే మతపరమైన ఆడంబరముగల ముఖము చిట్లించే గుంపు. యేసు చెప్పిన కఠిమైన మాటలు వారిని ఉద్దేశించే ఉన్నాయని నేను మీకు గుర్తు చేయనవసరం లేదు. వారి అతి-తీవ్రమైన, ఆచారబద్ధమైన కఠినమైన జీవనశైలి మన ప్రభువుకు వికారం కలిగించింది. ఇది యేసుక్రీస్తును నిత్యం నిశ్చలంగా, తరచుగా అణగారినట్లుగా చిత్రీకరించే కళాకారులతో వివాదానికి దారితీసింది. 33 సంవత్సరాల పాటు వడ్రంగి పనిచేస్తూ పన్నెండు మందికి గురువుగా ఆయన సుదీర్ఘమైన, ఉల్లాసభరితమైన నవ్వును ఎప్పుడూ ఆస్వాదించలేదని మీరు నన్ను ఒప్పించలేరు. యేసు తన సహచరులతో వెనుకకు వంగి, వారితో కొన్ని నిమిషాలు సరదాగా గడిపిన కొన్ని చిత్రాలను చూడటం ఆహ్లాదకరం‌గా ఉండదా? ఖచ్చితంగా ఇది మతభ్రష్టత కాదు!

సంస్కర్తయైన మార్టిన్ లూథర్‌ను మీ మనస్సులో ఊహించుకోండి. మీకేమి కనబడుతోంది? తన జర్మన్ పిడికిలి బిగించి తప్పుకు వ్యతిరేకంగా లేచిన ఒక దృఢమైన ముఖం, ఉక్కు దవడ, ముఖం చిట్లించుకున్న యోధుడినా? తప్పు!

అతని జీవితచరిత్ర రచయితలలో చాలా మంది అతను వంచనలేని, పారదర్శకమైన చిత్తశుద్ధిని . . . నిష్కపటమైన మరియు రమ్యమైన నిజాయితీని . . . సరదా హాస్యం మరియు ఉల్లాసమును పుష్కలంగా కలిగి ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు. తేనె చుట్టూ ఈగలు ముసిరినట్లు అణగారిన, బెదిరింపబడిన ప్రజలను తాను ఆకర్షించడం పెద్దగా ఆశ్చర్యమేమీకాదు. చూడండి, సంస్కర్త నవ్వడానికి భయపడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆశ్చర్యంగా అనిపించినా, లూథర్ ఉల్లాసముగా ఉన్నాడు.

మరొక ప్రసిద్ధ పేరును ప్రయత్నిద్దాం: చార్లెస్ హాడన్ స్పర్జన్, లండన్ యొక్క గొప్ప బోధకుడు. మీకేమి కనిపిస్తున్నది? పాపిష్టమైన ఇంగ్లండ్ బరువును తాడుతో ఈడ్చుకెళ్లిన నెమ్మదిగల, క్రుంగిపోయిన కాపరినా? మళ్లీ ప్రయత్నించండి!

స్పర్జన్ నవ్వుపుట్టించే వ్యక్తి. అతని శైలి ఎంతగా దిగజారిపోయి ఉండేదంటే అతను టాబెర్నాకిల్ పుల్పిట్‌లో పనికి పదే పదే చులకనగా మాట్లాడినందుకు విమర్శించబడ్డాడు. ఆగ్రహపడిన కొంతమంది తోటి మతాధికారులు తన ప్రసంగాలలో హాస్యాన్ని ప్రవేశపెట్టే అతని అలవాటుపై మండిపడ్డారు. కళ్లలో ఆనందముతో, అతను ఒకసారి ఇలా సమాధానమిచ్చాడు:

నేను ఎంత హాస్యాన్నిచెప్పకుండా ఉన్నానో మీకు తెలిస్తే, మీరు నన్ను మెచ్చుకుంటారు. . . . ఈ బోధకుడు అరగంట గాఢ నిద్ర కంటే క్షణమాత్రముండు నవ్వు తక్కువ నేరమని భావిస్తున్నాడు.

స్పర్జన్ జీవితాన్ని ఎంతో ప్రేమించాడు. అతనికి ఇష్టమైన శబ్దం నవ్వు-మరియు తరచుగా అతను పుల్పిట్‌లో వెనుకకు వంగి, అతనికి హాస్యాస్పదంగా అనిపించిన దాని గురించి బిగ్గరగా గర్జించేవాడు. అతను ఉత్సాహ క్రిములు ప్రజలకు సోకునట్లు చేసాడు. ఈ వ్యాధి అంటుకున్నవారు తమ భారం తేలికగా మరియు వారి క్రైస్తవ మతం ప్రకాశవంతంగా ఉన్నట్లు గుర్తించారు. లూథర్ లాగానే, స్పర్జన్ కూడా మనోహరమైనవాడు.

మనోహరత్వము. ఆ ఉపయోగకరమైన, ఆకర్షణీయమైన, తీవ్రంగా ఆకర్షించగల స్వభావం . . . ఆ సమ్మోహనశక్తి . . . లోతుగా నిమగ్నమైనప్పుడు ఆనందం మరియు నిజమైన సంతోషాన్ని కలిగించే సామర్థ్యం కలిగియుండటమే. ఉపాధ్యాయుని వద్ద అది ఉన్నప్పుడు, విద్యార్థులు కోర్సు కోసం క్యూ కడతారు. దంతవైద్యుడు లేదా వైద్యుడు దానిని కలిగి ఉన్నప్పుడు, అతని చేతినిండా పని ఉంటుంది. ఒక సేల్స్‌మ్యాన్ దానిని కలిగి ఉన్నప్పుడు, అతను ఆర్డర్‌లను వ్రాసి చెయ్యి తిమ్మిరెక్కిపోతుంది. ఒక సహాయకుడు దానిని కలిగి ఉన్నప్పుడు, సంఘము స్నేహపూర్వకంగా పరిగణించబడుతుంది. ఒక కోచ్ దానిని కలిగి ఉన్నప్పుడు, జట్టు దానిని చూపుతుంది. తల్లిదండ్రులు దానిని కలిగి ఉన్నప్పుడు, పిల్లలు దానిని పెంచుతారు.

మనోహరత్వము ప్రేరేపిస్తుంది. ఇది రోజువారీ బాధ్యతలతో ముంచివేసే నియంత్రణ యొక్క పట్టును విడుదల చేస్తుంది. ఇది వాస్తవంలోనుండి అసహ్యమైనదాన్ని తీసివేస్తుంది. మనోహరత్వము సులభతరం చేస్తుంది. విషయాలు అకస్మాత్తుగా తక్కువ క్లిష్టంగా . . . తక్కువ తీవ్రమైనవిగా . . . తక్కువ ఇబ్బందికరంగా మారతాయి. సొరంగం చివర ఉన్న రంధ్రం దానికి దారితీసే చీకటి మార్గం కంటే చాలా ముఖ్యమైనది. మనోహరత్వము ప్రోత్సహిస్తుంది. తప్పును విస్మరించకుండా, ప్రయోజనాలు, ఆశలు, సమాధానాలపై మనోహరత్వం దృష్టి పెడుతుంది. అది విపరీతమైన నిరుత్సాహం లేదా తప్పించుకోలేని ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కూడా, మనోహరత్వం ఉన్నతంగా నిలుస్తుంది మరియు అలాంటి చోట్ల ఉండటానికి నిరాకరిస్తుంది.

మనోహరమైన హాస్యం అనేది మిషనరీ జీవితంలో వెల కట్టలేని ఆస్తి. నిజానికి, ఒక మిషనరీకి వైవిధ్యమైన మరియు క్లిష్ట పరిస్థితుల్లో నవ్వడానికి ఏదైనా కారణం కనుగొనలేకపోతే అది చాలా తీవ్రమైన లోపం. అక్కడ చాలా వేడిగా ఉన్నందున మిషనరీగా భారతదేశానికి తిరిగి రావాలనే ఆలోచనను విడిచిపెట్టమని అతని స్నేహితులు ఒక స్వీడన్ దేశస్థుడిని కోరిన సంఘటన గురించి నేను ఇటీవల చదివాను. “మానవుడా,” అని అతను హెచ్చరించబడ్డాడు, “అక్కడ నీడలో 120 డిగ్రీలు ఉంటుంది!” “సరే,” అని స్వీడన్‌ దేశస్థుడు గొప్ప ధిక్కారంతో ప్రతిఘటించాడు, “మనం ఎల్లప్పుడూ నీడలో ఉండాల్సిన అవసరం లేదు, అవునా?”

ఏదోయొక తెలివైన ఆత్మ, ముఖం చిట్లించి దీనిని చదువుతూ ఇలా అంటుంది, “సరే, ఎవరైనా పని చేయాలి. జీవితమంటే ఉల్లాసంగా సాగడం కాదు. పాఠశాల విద్యార్థినులకు నవ్వడం సరైనది-కాని పెద్దలు, ముఖ్యంగా క్రైస్తవ పెద్దలు, వారు నిర్వర్తించడానికి చాలా గంభీరమైన పని ఉన్నది.” సరే, మిత్రమా, ఇది తీవ్రమైనది. కాబట్టి అదంతా జోక్ కాదు. జీవితానికి దాని డిమాండ్లు ఉన్నాయని మరియు పరిపక్వతలో క్రమశిక్షణ మరియు బాధ్యత ఉంటుందని ఎవరూ కాదనరు. కానీ దేవుడు మనకు ఇచ్చిన పాత్రను నెరవేర్చే ప్రక్రియలో మనకు అల్సర్ వచ్చినప్పుడు మనల్ని మనం (మరియు ఒకరినొకరం) పరధ్యానానికి గురిచేసుకోవాలని ఎవరు చెప్పారు?

సరదాగా గడపడం మానేసి, కనికరంలేని బాధ్యతల క్రూరమైన చేతుల్లో పావుగా మారి, విశ్రాంతి తీసుకొని నవ్వే సామర్థ్యం కోల్పోయి “తప్పుచేసి” పశ్చాత్తాపం లేకుండా విచ్ఛిన్నం అంచున ఉన్న వ్యక్తి కంటే తక్కువ సామర్థ్యం లేదా అసమర్థుడు ఎవరూ లేరు. ముఖ్యమైన సంగతులను గూర్చే గాని అనవసరమైన వాటి గురించి మాట్లాడవద్దనే జీవిత తత్వాన్ని అనుసరించిన బాధితులతో–మన ఆసుపత్రులు నిండిపోయాయి-అక్షరాలా కిక్కిరిసిపోయాయి. మరి ఈ రోజున, చాలా స్పష్టంగా చెప్పాలంటే, వారు నిజంగా సమాజానికి లేదా క్రీస్తు ఉద్దేశానికి పెద్ద ఆస్తి కాదు. ఇది విమర్శ కాదు-ఇది వాస్తవం.

హాస్యాస్పదంగా, నేను అసహ్యకరమైన, అనుచితమైన, అసభ్యకరమైన హాస్యాస్పదమైన లేదా సమయానుకూలముకాని, అభ్యంతరకరమైన మరియు వ్యూహరహితమైన మూర్ఖపు మరియు వెర్రి మాటలను సూచించడం లేదు. నా ఉద్దేశ్యంలో తెలివికి అవసరమైన పదార్ధం-ఆహ్లాదకరమైన, సంతోషకరమైన వ్యక్తీకరణలు లేదా ఆలోచనలు-ఇది మన ఉత్సాహాన్ని పెంచుతుంది మరియు మన రోజును తేలికపరుస్తుంది.

మన ఇళ్లలో మరియు మన ఇతర పరిచయాల మధ్య అటువంటి మనోహరత్వం ఎలా పెంపొందించబడుతుంది మరియు అందించబడుతుంది? మనల్ని కష్టాల నుండి బయటపడేయడానికి ఎలాంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు? నేను మూడు నిర్దిష్ట ప్రణాళికలను సూచిస్తున్నాను:

1. ప్రతి రోజు ఆహ్లాదకరమైన పదాలతో ప్రారంభించండి. మీ కుటుంబ సభ్యులే ముందుగా ప్రయోజనం పొందుతారు (గ్లిజరిన్ మాత్రలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది). హాస్యగాడైన బోజో వలె నాట్యం చేయాల్సిన అవసరం లేదు లేదా మీ నిద్రలో ఉన్న సహచరుని చెవుల్లో జోకులు వేయాల్సిన అవసరం లేదు. మీ వ్యాఖ్యలలో ఆహ్లాదకరంగా ఉండండి, మీ శుభాకాంక్షలలో ఉల్లాసంగా ఉండండి. మీరు మంచం మీద నుండి లెగుస్తున్నప్పుడు, దేవుని ప్రేమకు . . . ఈ కొత్త రోజు ఆయన నియంత్రణలో ఉందని ఆయన ప్రశాంతమైన, తాజా రిమైండర్‌లకు కృతజ్ఞతలు చెప్పండి. ప్రోత్సాహకరమైన సత్యాన్ని నిశ్శబ్దంగా చెప్పండి: దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు.

2. తరచుగా నవ్వండి. చిరునవ్వును సరిచేసుకునే సందర్భాల గురించి నేను ఆలోచించలేను. ఉల్లాసమైన ముఖాన్ని పెంపొందించుకోండి. చిట్లించుకొనే ముఖం దూరం చేస్తుంది. చిరునవ్వు ఆకర్షిస్తుంది మరియు దగ్గరకు తీసుకొస్తుంది. ప్రోత్సాహాన్ని ప్రసరింపజేసే ఈ బహుమతిని దేవుడు మీకు ఇచ్చాడు. దానిలో కంచె వేయవద్దు. . . విప్పండి, ఆ దృఢమైన ముసుగుని పగలగొట్టండి-నవ్వండి.

3. రోజులో మీతో ఉన్న ప్రతి వ్యక్తికి కనీసం నిజాయితీగా ఒక ప్రశంసను లేదా ప్రోత్సాహకరమైన వ్యాఖ్యను తెలియజేయండి. క్రైస్తవునిగా, మీరు క్రీస్తు ప్రేమను పంచుకోవాలనుకుంటున్నారు. మీరు బరువెక్కిన హృదయాలను పైకి ఎత్తాలనుకుంటున్నారు. బలాలను గుర్తించండి-వాటిని గూర్చి చెప్పండి. ఇతరుల బలహీనతలను ఎత్తిచూపడం మానేయండి. మీ పనుల్లో మీరు నిమగ్నమై ఉండటానికి బదులుగా ఇతరులపై మీకు నిజమైన ఆసక్తిని కలిగించమని ప్రభువును అడగండి. రిస్క్ తీసుకోవడానికి మరియు అందుకోవడానికి మిమ్మల్ని అనుమతించమని ఆయనను అడగండి. మీ ద్వారా ఆయన మనోహరమైనవాడు అవ్వాలని అడగండి.

మన గురించి అస్పష్టమైన మరియు గంభీరమైన నేపథ్యాలు ఉన్నప్పటికీ, సొలొమోను సలహా యొక్క ఇంకో మంచి మోతాదు మనకు అవసరమని నేను గట్టిగా నమ్ముతున్నాను. దావీదు యొక్క తెలివైన కుమారుడు చెప్పింది వినండి:

సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును.
మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును. . . .
బాధపడువాని దినములన్నియు శ్రమకరములు
సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
(సామెతలు 15:13, 15)

సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.
నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
(సామెతలు 17:22)

నిజంగా ఇప్పుడు . . . మీ హాస్యం ఎలా ఉంది? మనము జీవించే కాలం మీకు-మీ వైఖరి, మీ ముఖం, మీ దృక్పథం గురించి చెప్పడం ప్రారంభించిందా? మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీ నీడన నివసించే వారిని అడగండి; వారు మీకు చెబుతారు! సొలొమోను కూడా సూటిగా మాట్లాడతాడు. జీవితాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని కోల్పోయిన వారి జీవితంలో మూడు విషయాలు జరుగుతాయని అతను (పరిశుద్ధాత్మ నడిపింపుతో) చెప్పాడు: (1) విరిగిన హృదయం, (2) లోలోపల స్వస్థత లేకపోవడం మరియు (3) ఎండిపోయిన ఎముకలు. నమ్మిన బంజరు చిత్తరువు! ఏమిటి ఈ ఫలింపులేని విశ్వాసి యొక్క చిత్తరువు!

మీరు ఒక చేదు, అసహనం, విమర్శనాత్మక క్రైస్తవునిగా మారడం ప్రారంభించారా? మీ కుటుంబం స్థానిక మార్చురీలో ఉద్యోగులను పోలి ఉండటం ప్రారంభించిందా? ప్రభువు ఒక శ్రేష్ఠమైన మార్గాన్ని సూచించాడు-ఆనందభరితమైన మనోహరమైన మార్గం. “సంతోషముగల మనస్సు” మనకు అవసరం . . . అలాగే అది మనకెప్పుడైనా అవసరం ఉందంటే, అది ఇప్పుడే.

Taken from Charles R. Swindoll, “The Winsome Witness,” Insights (September 2003): 1-2, 4. Copyright © 2003 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.

Posted in Christian Living-Telugu, Humour-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.