మధ్యస్థముగా నడచుకోండి

పిల్లలు ఎంతో సమయం కష్టపడి అట్టతో తమకొరకు ఒక గుడిసెను తయారుచేసుకున్నారు. ఇది ఒక ప్రత్యేక ప్రదేశం- క్లబ్‌హౌస్, అంటే అక్కడ వారందరూ కలుసుకుంటారు, ఆడుకుంటారు మరియు సరదాగా గడుపుతారు. క్లబ్‌హౌస్‌కు నియమాలు ఉండాలి కాబట్టి, వారు మూడింటితో ముందుకు వచ్చారు:

ఎవరూ గొప్పవారుగా ప్రవర్తించకూడదు.
ఎవరూ తక్కువవారుగా ప్రవర్తించకూడదు.
అందరూ మధ్యస్థంగా నడచుకోవాలి.

చెడ్డ వేదాంతమేమీ కాదు!

వైవిధ్యమైన మాటలలో, దేవుడు ఇదే విషయాన్ని చెప్పాడు:

నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు
పరులే నిన్ను పొగడదగును. (సామెతలు 27:2)

మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను; మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను. (మత్తయి 20: 26-27)

ఘనతవిషయములో ఒకని నొకడు గొప్పగా ఎంచుకొనుడి. (రోమా 12:10)

ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి. (గలతీయులకు 5:13)

యొకనినొకడు తన కంటె యోగ్యుడని యెంచుచు. (ఫిలిప్పీయులకు 2:3)

“మధ్యస్థంగా నడచుకోండి” అంతే. నమ్మదగినదే. నిజాయితీగా, మనిషిగా, ఆలోచనాపరులుగా ఒదిగి ఉండాలి. మీ ఉన్నత స్థానం లేదా లభించిన అధిక గౌరవాలు లేదా వరుస డిగ్రీలు లేదా అంతులేని విజయాల జాబితాతో సంబంధం లేకుండా, వాస్తవికంగా ఉండండి. మీరు బాగా చేసిన పని కోసం మీరు ఒక రకమైన గొప్ప గుర్తింపును పొందేందుకు అర్హులు అనేటువంటి ఆలోచన ఏదైనా ఉంటే దానిని చెత్తబుట్టలో పారవేయండి. అయినా మీరు దానిని ఎవరి కోసం చేశారు? మీరు దానిని దేవుని కోసం చేసినట్లయితే, మీకు ప్రతిఫలమివ్వడానికి ఆయనకు అంతులేని అనేక మార్గాలు ఉన్నాయి. మీరు మనుష్యుల మెప్పు కోసం దీన్ని చేస్తే, మీరు మెప్పును కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు! ఆ మెప్పును మీరు లాక్కోవడం చాలా సులభం, కాదా? ఈ పురాతనమైన అహం అనేది కపటమైనది.

“మధ్యస్థంగా నడచుకోండి” అంతే.

సొలొమోను ఏమి చెప్పాడు? “నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు . . .
పరులే నిన్ను పొగడదగును.”

అంటే అర్థమేమిటి? ఏదో ఆశించదగిన సాధనకు స్వీయ-ప్రస్తావన లేకపోవడమని అర్థం. పొగిడించుకోవాలనే దురద పుట్టినప్పుడు అలా చేయకుండా ఉండటమని అర్థం. ప్రశంసను సృష్టించి మోసపుచ్చకుండా ఉండటమని అర్థం. చప్పట్లు కొట్టినప్పుడు యథార్థమైన ఆశ్చర్యం కలిగి ఉండటమని అర్థం.

ఇతర ప్రముఖులతో కలిసి ప్లాట్‌ఫారమ్‌పైకి వెళుతున్న ఒక ఆంగ్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడైన అసమానమైన ప్రిన్సిపాల్ కెయిర్న్స్ లాగా. ఆయన ఎక్కుతుండగానే, ప్రేక్షకుల నుండి అప్రయత్నంగా చప్పట్లు వెల్లువెత్తాయి. నిరాడంబరతతో, వెనుక ఉన్న సహోద్యోగికి దారిస్తూ . . . కైర్న్స్ వెనక్కి తగ్గి ఆ వ్యక్తిని ప్రశంసించడం ప్రారంభించాడు.

“మధ్యస్థంగా నడచుకోండి” అంతే.

కానీ ఒక చివరి హెచ్చరిక: మోసగించడానికి ప్రయత్నించవద్దు. తప్పుడు వినయం పచ్చి గర్వం కంటే దారుణంగా దుర్వాసన వెదజల్లుతుంది.

సమాధానమనేది పనికిరానివానిగా లేదా “బలహీనుని”గా కనిపించడానికి ప్రయత్నించడంలో లేదు. ఇతరుల విజయాలను నిలకడగా గమనించడం, ఇతరుల నైపుణ్యాలు మరియు తోడ్పాటును గుర్తించడంలో. . . అలాగే అలా చెప్పడంలో సమాధానం ఉంటుంది. దానినే ప్రేమతో ఇతరులకు సేవ చేయడమని అంటారు. మరియు క్రీస్తు చేసినది అదే.

నియమాలు గుర్తుపెట్టుకున్నారా?

“ఎవరూ గొప్పవారుగా ప్రవర్తించకూడదు. ఎవరూ తక్కువవారుగా ప్రవర్తించకూడదు.
అందరూ మధ్యస్థంగా నడచుకోవాలి.”

తాము బోధించే వాటిని ఆచరించడంలో మంచివారైన పిల్లలతో నిండిన క్లబ్‌హౌస్ నుండి ఇటువంటి మంచి సలహాలు వచ్చాయి.

Adapted from Charles R. Swindoll, “Act Medium,” in The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas: Word, 1994), 560-61. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved. Used by permission.

Posted in Christian Living-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.