క్రొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో తీర్మానాలు, జ్ఞాపకాలు మరియు ప్రబోధాల వెల్లువ వస్తుంది. అవన్నీ ఒకే రకమైన “ఎలా” అంశాలను అనుసరిస్తాయి-మీ సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ప్రతి క్షణాన్ని ఎలా లెక్కించాలి, మీ సమయాన్ని తెలివిగా మరియు ఉత్పాదకంగా ఎలా పెట్టుబడి పెట్టాలి.
సరే, కొంచెం వ్యంగ్యపూరిత వినోదం కోసం, నేను వ్యతిరేక ధోరణిని తీసుకోవాలనుకుంటున్నాను. మీ సమయాన్ని ఎలా వృథా చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. అది నిజం, మీరు ఈ సలహాను అనుసరిస్తే, ఈ సంవత్సరం మీరు ఎటువంటి పురోగతిని సాధించలేరు. హామీ ఇస్తున్నాను!
మొదట, చాలా చింతించండి. ఉదయాన్నే చింతించడం ప్రారంభించండి మరియు రోజు గడిచేకొద్దీ మీ ఆందోళన శక్తిని తీవ్రతరం చేయండి. చింతించవలసిన విషయాలు తక్కువగా ఉన్నాయా? వార్తాపత్రిక, టెలివిజన్ లేదా ఇంటర్నెట్‌ని తనిఖీ చేయండి. రాత్రంతా మీ హృదయాన్ని మరియు మనస్సును మథించడానికి మీకు తగినంత చెడు వార్తలు, అంత్యదినము యొక్క నివేదికలు, మానవ విషాదాలు మరియు అప్పుడే సంభవించిన విపత్తులను గూర్చిన సమాచారాలు ఉంటాయి.
నా వైఫల్యాలు మరియు పొరపాట్లను ప్రతిబింబించేలా చేయడం నా స్వంత ఆందోళన ప్రపంచంలో నాకు ఉపయోగకరంగా ఉంది. మీరు తల్లిదండ్రులు అయితే, మీ పిల్లల కోసం మీరు ఏమి చేయాలో లేదా ఏమి చేసి ఉంటే బాగుండేదో దాని గురించి చాలా సేపు ఆలోచించండి. అది ఎదురుచూస్తున్నటువంటి అపరాధ భావాన్ని వెలిగిస్తుంది. వైవిధ్యాన్ని జోడించినట్లైతే, మీరు చేయకుండా ఉండాల్సిన కొన్ని విషయాలను కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు. విచారము అనేక సృజనాత్మక మార్గాల్లో ఆందోళనను రేకెత్తిస్తుంది.
మకాం వేసుకోవడానికి మీకు మరికొన్ని విభాగాలు కావాలా? మీ వివాహం లేదా మీ ఉద్యోగం గురించి మీకు నచ్చని విషయాలు. కారుతున్న పైకప్పు, ఇబ్బందిపెట్టే కారు మరియు వయస్సు మీదపడటం. మీరు ఈ క్రొత్త సంవత్సరాన్ని మరచిపోకుండా ఉండటానికి మరొక రహస్యం ఏమిటంటే ప్రతికూల వ్యక్తుల చుట్టూ తిరగడం. మీరు వీటన్నింటినీ సరిగ్గా ప్లాన్ చేస్తే, ఫిబ్రవరి రాకముందే మీరు పూర్తి ఆందోళనలతో నిండిపోతారు. ఇప్పుడే మొదలు పెట్టండి! ఆ సంభావ్య అల్సర్లకి తాజా యాసిడ్ అవసరం.
రెండవది, కఠినమైన మరియు వేగవంతమైన అంచనాలను రూపొందించండి. ఎందుకు చేయకూడదు? సరికొత్త సంవత్సరం మీ ముందు ఉంది. మీ తేదీ పుస్తకం ఖాళీగా ఉంది మరియు వివరణాత్మక ప్లాన్‌లతో పూరించడానికి సిద్ధంగా ఉంది. అయితే, మీరు యాకోబు యొక్క నాల్గవ అధ్యాయంలోని చిన్న వాక్యమును విస్మరించవలసి ఉంటుంది:
నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. (13-14, ఉద్ఘాటన జోడించబడింది)
ఈ వాక్యం మరచిపోండి మరియు మీ అంచనాలను ఉలితో రాయిపై చెక్కండి, మీరు అనుకున్నట్లుగానే విషయాలు జరుగుతాయని నచ్చజెప్పుకోండి.
మూడవది, ధనవంతులు కావడంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఈ మైండ్ సెట్‌తో, ఎంట్రప్రెన్యూర్ సెమినార్‌లు మరియు ఉల్లాసమైన సేల్స్ మీటింగ్‌ల నుండి వెల్లువెత్తుతున్న ప్రచారాలకు మీరు సరిగ్గా సూటవుతారు. లౌకిక పుస్తకాల అల్మారాల నుండి డబ్బు గురించి మీరు ఉపాయములను పొందడానికి నిశ్చయించుకోండి మరియు సొలొమోను వంటి వ్యక్తులపైనా, వారు వ్రాసిన వాటిపైనా ఖచ్చితంగా శ్రద్ధ చూపవద్దు:
ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము
నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.
నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును
నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును.
పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. (సామెతలు 23:4-5)
అంటే, డబ్బు మరియు సంతృప్తి మరియు పరిణామాల గురించి సొలొమోనుకు ఏమి తెలుసు?
నాల్గవది, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోండి. ఇది ఖచ్చితంగా సమయాన్ని వృథా చేయటమే. మీరు అహంకారం మరియు నిరుత్సాహం యొక్క విపరీతాల మధ్య కొట్టుమిట్టాడడమే కాకుండా, మీరు ఎవరో తెలియకుండానే మరో సంవత్సరం గడిపేస్తారు.
బాహ్య సౌందర్యం మీకిష్టమైతే, మిమ్మల్ని మీరు తాజా హాలీవుడ్ కండలవీరులతో పోల్చుకోవడం పురుషులకు . . . మరియు వోగ్ (ఫ్యాషన్ గురించిన మాసపత్రిక) పేజీలపై వారు అంటించిన అందమైన మోడల్‌లు మీ మహిళలకు సమయం వృథా చేసుకోవడానికి చక్కగా సహాయం చేస్తాయి. మీరు మీ దృష్టిని ఈ లోకపరమైనవాటిపై ఉంచినంత కాలం తర్వాతి పన్నెండు నెలలు అసాధారణంగా ఉంటాయి. త్వరిత చిట్కా ఏమిటంటే–వాలియంను (ఆందోళనను తగ్గించడానికి ఉపయోగించే మందు) సిద్ధంగా ఉంచుకోండి.
ఐదవది, మీ శత్రువుల జాబితాను పొడిగించండి. నిందించే ఆటను ఆడటం వలన మీ శత్రుత్వాన్ని కొనసాగించవచ్చు. ఈ ఆటలో మీ నైపుణ్యం వయస్సుతో పాటు మెరుగుపడాలి ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ కాలం జీవిస్తారో, మీ వద్ద అంత ఎక్కువ యుద్ధ సామగ్రి ఉంటుంది. అనుమానం, మతిస్థిమితం మరియు పగతో కూడిన పూర్తి ఆయుధశాలతో, మీ జీవితాన్ని దుర్భరంగా చేసిన వారిపై మధనపడేటప్పుడు మీరు మీ ద్వేష భావాలను అభ్యాసం చేస్తూ అంతులేని సాయంత్రాలను వృథాగా గడపవచ్చు.
ఇదిగో చూడండి, సమయాన్ని వృథా చేయగల ఐదు విషయాలు. ఈ సూచనలను అమలులోకి తీసుకురండి అప్పుడు మీ క్రొత్త సంవత్సరపు విలువైన సమయాన్ని వృథా చేయడంలో రికార్డులు సృష్టించవచ్చు.
కానీ, దీన్ని ఎవరు చేయాలనుకుంటారు? ఓటమిని ఎవరూ లక్ష్యంగా పెట్టుకోరు-అది అలా జరిగిపోతుంది అంతే. కాబట్టి, శ్రద్ధ వహిద్దాం. సమయాన్ని వృథా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి! చింతించడానికి బదులు, ఎక్కువగా ప్రార్థించండి. సరళముగా ఉండండి. ఎక్కువగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని సృష్టించిన విధానంతో సంతృప్తిగా ఉండండి. మరియు క్షమాపణ అనే నూనె ఆ పగపై మీ పట్టును సడలించనివ్వండి. మరో మాటలో చెప్పాలంటే, ఈ సంవత్సరాన్ని అత్యంత ఫలవంతమైన సంవత్సరంగా తయారు చేసుకోండి.
Adapted from Charles R .Swindoll, The Finishing Touch: Becoming God’s Masterpiece (Dallas, Tex.: Word, 1994), 14-15. Copyright © 1994 by Charles R. Swindoll, Inc. All rights reserved.