క్షీణత

నా హైస్కూల్ రసాయనశాస్త్రం తరగతి నుండి నాకు రెండు విషయాలు మాత్రమే గుర్తున్నాయి. మొదటిది, వరుసగా ముప్పై మూడు రోజులు నేను సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పూసుకోవడం ద్వారా నా కుడి చేతి వెనుక ఉన్న మొటిమను వదిలించుకున్నాను. రెండవది, మరపురాని ప్రయోగంలో కప్ప నెమ్మదిగా చనిపోవడాన్ని నేను చూశాను.

నా గురువు నిస్సహాయ జీవిని చల్లటి నీటి బీకర్‌లో ఉంచారు. బీకర్ క్రింద అతను బన్సెన్ బర్నర్‌ను చాలా తక్కువ మంటతో కదిలించాడు, తద్వారా నీరు చాలా నెమ్మదిగా వేడెక్కుతుంది-సుమారు సెకనుకు .017 డిగ్రీ ఫారెన్‌హీట్ చొప్పున వేడెక్కుతోంది. వాస్తవానికి, ఉష్ణోగ్రత ఎంత నెమ్మదిగా క్రమంగా పెరిగిందంటే, కప్పకు మార్పు గురించి తెలియలేదు. రెండున్నర గంటల తర్వాత కప్ప చనిపోయింది. . . ఉడకబెట్టి చంపబడింది. మార్పు ఎంత నెమ్మదిగా జరిగిందంటే, కప్ప బయటకు దూకడానికి ప్రయత్నించలేదు లేదా కాళ్ళు కూడా ఆడించలేదు.

నేను భయంకరమైన ప్రదర్శన పట్ల శ్రద్ధ వహించినందున, నా జీవితాంతం ఆ కప్పను గుర్తుచేసే ఒక లోతైన సూత్రాన్ని నేను చూస్తున్నానని నేను ఎప్పుడూ గ్రహించలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఆ సూత్రం ఏమిటంటే, క్షీణత.

1 రాజులు యొక్క మొదటి పదకొండు అధ్యాయాలు ఒక గొప్ప వ్యక్తి యొక్క క్షీణతను నమోదు చేశాయి, వాస్తవానికి, తన కాలంలో అతనే గొప్పవాడు. రాచరికపు రక్తం మరియు కావలసినంతమంది బుద్ధిగలవారితో ఆశీర్వదించబడిన సొలొమోను దావీదు సింహాసనానికి సరిపోయినవాడు. అతను నాతాను పాదాల వద్ద బోధించబడ్డాడు, బత్షెబ హృదయం ద్వారా తీర్చిదిద్దబడ్డాడు, దావీదు కనుసన్నల్లో మెరుగుపర్చబడ్డాడు మరియు దేవుని హస్తముచేత పరిపక్వం చెందాడు. శ్రేష్ఠత యొక్క గుర్తు అతనిపై ఉంది.

జ్ఞానం, విధేయత, దౌత్యం, విశ్వసనీయత మరియు సమర్థత అనేవి దావీదు యొక్క ప్రతిభావంతుడైన కుమారుని రాజ్యం యొక్క మొదటి కొన్ని సంవత్సరాల పాలనలో అతని వైఖరి మరియు చర్యలను వర్ణించాయి. అన్నింటికంటే ఉత్తమమైనది, “సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను” (1 రాజులు 3:3) మరియు ఆయన మార్గాల్లో జాగ్రత్తగా నడిచాడు. అతని విజయాలు, శక్తి, అంతర్జాతీయ ప్రభావం మరియు సంపద అసాధారణమైనవి:

దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశస్థుల జ్ఞానముకంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటికంటెను అధికమై యుండెను. అతడు సమస్తమైన వారికంటెను . . . జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తి చుట్టునున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. . . . ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనముచేతను జ్ఞానముచేతను భూపతులందరిలో అధికుడై యుండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరును అతని చూడగోరిరి. (1 రాజులు 4:29-31; 10:23-24)

అతని వార్షిక ఆదాయం లక్షల్లోకి చేరిందని రుజువైంది. పురాతన ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటైన సొలొమోను ఆలయ రూపకల్పన మరియు నిర్మాణం అతని జీవితంలో అసమానమైన విజయం. అనుమానాస్పదంగా ఉన్న షేబ రాణి తన మనస్సును సంతృప్తి పరచుకోవడానికి అతని రాజ్యాన్ని సందర్శించడానికి వచ్చిన తర్వాత, ఆమె విన్నదంతా అతిశయోక్తి కాదని ఆమె వినయంగా అంగీకరించింది:

అయినను నేను వచ్చి కన్నులార చూడకమునుపు ఆ మాటలను నమ్మకయుంటిని; ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని యిప్పుడు నేను తెలిసికొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి. (1 రాజులు 10:7)

నిక్కచ్చిగా, సొలొమోను సమస్తమును కలిగి ఉన్నాడు.

అయితే, పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభించాయి. అతను మనిషి మరియు దేవుని యొక్క పాండిత్యాన్ని దాదాపుగా పొందినట్లుగా, అతను రాజీ మరియు తప్పు యొక్క పగ్గాలను చేపట్టాడు మరియు వ్యభిచారం, అహంకారం, కామం మరియు విగ్రహారాధనతో ఎటువైపు పయనిస్తున్నాడో తెలియకుండా తనను తాను నడిపించుకున్నాడు. తరువాతి చరిత్రలో పిచ్చివాడైన నీరో వలె, సొలొమోను అహేతుకంగా, కామాతురతగలవాడుగా మరియు అతను ఒకప్పుడు విలువైనవిగా ఎంచినవాటిపై కూడా సందేహాస్పదంగా తయారయ్యాడు.

ఇప్పుడు చక్రవర్తి తన దృష్టిని మరొక ప్రాజెక్ట్ వైపు మళ్లించాడు గనుక, అతను నిర్మించిన గంభీరమైన ఆలయంలో దుమ్ము పొరలు పేరుకుపోయాయి: అతను మరియు అతని వింత భార్యలు ఇప్పుడు సేవ చేస్తున్న వింత దేవతల కోసం వింత భవనాల నిర్మాణం చేపట్టారు. సొలొమోను (అనేకమందిలో ఒకనిగా నిరంకుశమైన చక్రవర్తిలాగా, సూపర్ సేల్స్‌మ్యాన్‌లాగా, గొప్ప వ్యాపారవేత్తలాగా, తన్నుతాను ఎక్కువగా ఊహించుకొనే ఆటగానిలాగా లేదా సుఖాన్ని కొరుకునే సినిమా స్టార్‌లాగా) చాలా వేగంగా ముందుకు సాగి చాలా దూరం ప్రయాణించాడు. అతని స్వంత దుర్బలత్వం యొక్క రాబందులు శీఘ్రమే అతని ఐహిక సంబంధమైన మృతదేహాన్ని గుర్తించాయి మరియు అతని ముఖ్య భాగాలను మేయడం ప్రారంభించాయి. ఇప్పుడు అతని ఫలింపులేని జీవితం యొక్క ముగింపు ముందుగానే వచ్చేసింది.

దావీదు కుమారుడు ఒక నీచమైన, దుర్బలమైన నిరాశావాది‌గా మరణించాడు, భౌతికవాదంతో ఎంత సంతృప్తి చెందాడంటే, జీవితం అంతా “వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది” (ప్రసంగి 2:26) అని అన్నాడు. అతను గందరగోళంలో, సంఘర్షణలోనున్న, మరియు త్వరలో అంతర్యుద్ధం కారణంగా విచ్ఛిన్నమయ్యేందుకు సిద్ధంగానున్న ఒక దేశాన్ని వదిలిపెట్టి వెళ్లాడు.

పతనం ఎప్పుడూ ఆకస్మికంగా జరుగదు. ఏ తోటలోనూ “అకస్మాత్తుగా” ముళ్ళు పెరగవు. ఏ సంఘమూ “అకస్మాత్తుగా” చీలిపోదు. ఏ భవనమూ “అకస్మాత్తుగా” కూలిపోదు. ఏ వివాహమూ “అకస్మాత్తుగా” విచ్ఛిన్నం కాదు. ఏ దేశమూ “అకస్మాత్తుగా” తక్కువ శక్తిగలదిగా మారదు. ఏ వ్యక్తి “అకస్మాత్తుగా” అధమస్థాయికి వెళ్ళడు. నెమ్మదిగా, దాదాపు అస్పష్టంగా, ఒకప్పుడు తిరస్కరించబడిన కొన్ని విషయాలు అంగీకరించబడతాయి. ఒకప్పుడు బాధాకరంగా భావించే విషయాలు ఇప్పుడు రహస్యంగా సహించబడుతున్నాయి. ప్రారంభంలో ఇది ప్రమాదకరంగా అనిపించదు, బహుశా ఉత్తేజకరమైనదిగా అనిపిస్తుంది, కానీ అది తీసుకువచ్చే చీలిక అనేది ఆత్మీయ క్షీణతతో నైతిక క్షీణత చేతులు కలిపినందున విస్తృతంగా పెరిగే అంతరాన్ని ఏర్పరుస్తుంది. అంతరం లోయగా మారుతుంది. “సరియైనదిగా కనబడు మార్గము” వాస్తవానికి “మరణమునకు త్రోవ” అవుతుంది. అది సొలొమోను రాశాడు. అతనికి తెలిసుండాలి.

నిలుచున్నవారలారా, జాగ్రత్తగా ఉండండి; మీరు పడిపోకుండా జాగ్రత్త వహించండి! మీ కోరికలకు అనుగుణంగా మీ ప్రమాణాలను మార్చుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. మీ స్వంత ప్రాముఖ్యతను గూర్చిన ఆలోచనలతో ఉబ్బిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఐశ్వర్యం మరియు విజయం యొక్క ఆపదల పట్ల అప్రమత్తంగా ఉండండి. దేవుడు ధనము, కీర్తి మరియు విజయాన్ని ప్రసాదిస్తే, భయపడవద్దు లేదా అపరాధ భావనతో పారిపోవద్దు. సంతులితంగా ఉండండి. వివేకముగల వ్యక్తినుండి వ్యర్థమైన మూర్ఖుడి స్థాయికి అనతికాలంలోనే దిగజారిన సొలొమోను‌ను గుర్తుంచుకోండి.

1951లో నేను చూసిన రసాయనశాస్త్రం తరగతిలోని ప్రయోగానికి నేను ఇప్పుడు కృతజ్ఞుడను. ఆ సమయంలో నేను “ఎందుకింత సాగదీస్తున్నారు” అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఇక అలా అనుకోను. ఆ కప్ప యొక్క జ్ఞాపకం నన్ను చాలా వేడి నీళ్ళ నుండి దూరంగా ఉంచింది.

Taken from Charles R. Swindoll, “Erosion,” in Devotions for Growing Strong in the Seasons of Life (Grand Rapids: Zondervan, 1983), 105-107.

Posted in Christian Living-Telugu, Sin-Telugu.

Accuracy, clarity, and practicality all describe the Bible-teaching ministry of Charles R. Swindoll. Chuck is the chairman of the board at Insight for Living and the chancellor of Dallas Theological Seminary. Chuck also serves as the senior pastor of Stonebriar Community Church in Frisco, Texas, where he is able to do what he loves most—teach the Bible to willing hearts. His focus on practical Bible application has been heard on the Insight for Living radio broadcast since 1979.

ఖచ్చితత్వం, స్పష్టత మరియు ఆచరణాత్మకత అన్నీ చార్లెస్ ఆర్. స్విన్డాల్ యొక్క బైబిల్-బోధనా పరిచర్యను వివరిస్తాయి. చక్ ఇన్సైట్ ఫర్ లివింగ్ కు బోర్డు ఛైర్మన్ మరియు డల్లాస్ థియోలాజికల్ సెమినరీకి ఛాన్సలర్. చక్ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని స్టోన్‌బ్రయర్ కమ్యూనిటీ చర్చ్ యొక్క సీనియర్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు, అక్కడ ఆయన చాలా ఇష్టపడేదాన్ని చేయగలుగుతున్నాడు-ఇష్టపడే హృదయాలకు బైబిల్ నేర్పిస్తున్నారు. ఆచరణాత్మక బైబిల్ అనువర్తనంపై ఆయన దృష్టి 1979 నుండి ఇన్సైట్ ఫర్ లివింగ్ రేడియో ప్రసారంలో వినబడుచున్నది.