ఇటీవల పలు సందర్భాల్లో నేను సోక్రటీస్ మాటలను ఆలోచిస్తున్నాను: “పరీక్షించబడని జీవితం జీవించడం విలువైనది కాదు.”
ఆ ప్రకటన నిజమైనదే. ఎందుకంటే కాలక్రమేణా విషయాలు క్లిష్టంగా తయారవుతాయి. మనము మన క్రైస్తవ జీవితాన్ని గొప్ప ఆనందంతో మరియు సహజత్వముతో ప్రారంభిస్తాము. సాంప్రదాయం, మతం, ఇతరుల అంచనాలు మరియు చాలా కార్యకలాపాలు అసలు వాటిపై పోగుపడటం ప్రారంభించడంతో, సహజత్వం కోల్పోతుంది.
ఇటీవల నేను పరిశుద్ధ దేశమును సందర్శించినప్పుడు దాని గురించి చాలాసార్లు ఆలోచించాను. యేసు నడిచిన చోట నడవడానికి ప్రజలు ఇశ్రాయేలుకు వస్తారు. వారు తరచుగా తమ మార్గదర్శిని, “యేసు ఇక్కడ నడిచారా?” అని అడుగుతారు. మనస్సాక్షిలేని మార్గదర్శకులు, “ఓహ్, అవును, ఆయన ఆ చర్చిలో ఉన్నాడు మరియు ఆయన బహుశా ఆ భవనాన్ని చూశాడు” అని చెబుతారు. కానీ నిజాయితీగల మార్గదర్శకులు కొంచెం ఆగి, “ఇక్కడికి రండి, నేను మీకు ఒకటి చూపించనివ్వండి” అని అంటారు. మరియు వారు ఒక ఎత్తైన కొండ చరియ చివరకి నడచి, కంచెమీద ఆనుకొని, “ఇరవై ఐదు అడుగుల క్రిందకు చూడండి” అని గైడ్ చెబుతాడు. “మీరు ఆ రాళ్లను చూశారా? యేసు అక్కడ నడిచి ఉండవచ్చు.” శతాబ్దాలు గడిచి, అనేక యుద్ధాలు జరిగిన తరువాత, ఇసుక సమయం గడిచే కొలది నెమ్మదిగా అసలు చోటును పలు అడుగులు పేరుకుపోయినట్లు ప్రయాణికుడు గ్రహించడం ప్రారంభిస్తాడు. తరచుగా, మొదటిసారి వచ్చిన పర్యాటకులు నిరాశ చెందుతారు. ఏదేమైనా, “యేసు ఇక్కడ నడిచాడు” అని మనం ఖచ్చితంగా చెప్పగలిగే స్థలాల కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను.
ఉదాహరణకు, ఆయన గలిలయ సముద్రంలో నడిచాడని మనకు తెలుసు. దానిపై చర్చిని నిర్మించడానికి మార్గం లేదు! ప్రజలు ముద్దు పెట్టుకోవడానికి రాళ్ళుగాని, చెత్త కుప్పలుగాని, శిధిలాల కుప్పగాని లేదు. సాంప్రదాయం మరియు మతపరమైన అన్ని అంశాలు స్పష్టంగా లేవు – ఇది కేవలం నీరు. ఇది యేసు నడిచిన అదే ఉపరితలం. ఎక్కడైతే ఆయన తన శిష్యులలో కొంతమందిని తమ వలలను వదిలి తనను వెంబడించమని పిలిచాడో, అదే తీరాన్ని మీరు అక్కడ చూస్తారు. వారు ఉన్న చోటనే ఉండటం అద్భుతమైన అనుభూతి. వారు చూసినదాన్ని చూడటం కళ్ళు తెరిపించే పులకరింత!
మేము ఇశ్రాయేలు పర్యటనకు వెళ్ళిన ప్రతిసారీ ఆ పడవలన్నింటినీ ఆ సముద్రం మధ్యలో కట్టివేస్తాము. పడవెక్కేటప్పుడు ఒక చిన్న రాయిని తీసుకురావాలని ప్రజలను అడుగుతాను. వారు పర్యటనను ప్రారంభించినప్పుడు వారు తమతో తీసుకువచ్చిన కొంత భారాన్ని ఈ రాయి సూచిస్తుంది. కొంతసేపు ఆరాధన మరియు బోధన తరువాత, నేను మా స్నేహితులతో, “మీరు మీతో తెచ్చిన భారం, అది మీ చేతిలో ఉన్న ఆ రాయికి బదిలీ చేయనివ్వండి. . . మరియు అది సముద్రంలో పడనివ్వండి” అని చెబుతాను. ఇది అర్ధవంతమైన క్షణం. ప్రతి పడవలో అందరూ మౌనంగా ఉంటారు. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టుకొని . . . టప్ . . . ఆపై టప్ . . . టప్ అనే శబ్దాన్ని మీరు వింటారు. ఇది అద్బుతం! భారాలు మునిగిపోతాయి మరియు హృదయాలు తేలికగా ఉంటాయి. మినహాయింపు లేకుండా, సముద్రంలోని సమయం ప్రతి వ్యక్తికి పర్యటనలో ఇష్టమైన భాగంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే మేము అసలు చోట్లలో ఒకదానికి తిరిగి వచ్చాము. ఇది ప్రార్థన మరియు ఆరాధనకు మేము విరామం ఇచ్చే సరళమైన, సంక్లిష్టముకాని ప్రదేశం. సంవత్సరాలుగా పాతిపెట్టబడిన ఏదోయొకటి క్రొత్తదిగా చేయబడి పునరుద్ధరించబడుతుంది.
క్రీస్తుతో మీ నడక పాతిపెట్టబడిందా? అది చేయడానికి సమయానికి ఒక మార్గం ఉంది (గుర్తుంచుకోండి, సమయం విషయాలను క్లిష్టతరం చేస్తుంది). హృదయ విదారక అనుభవాలు, అధిక అవరోధాలు మరియు తప్పు నిర్ణయాల తర్వాత, మీ మార్గాన్ని కోల్పోవడం సులభం. అందువల్ల క్రమానుగతంగా మన జీవితాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది – మరియు ప్రాథమిక విషయాలకు తిరిగి రావాలి.
దారి తప్పిన ప్రపంచంలో మరియు సత్యానికి దూరంగా ఉన్న సంస్కృతిలో, బైబిల్ యొక్క సంక్లిష్టముకాని ఆజ్ఞకు తిరిగి రావడం ఎంతో సహాయకరముగా ఉంటుంది, “కావున మీరు ప్రభువైన క్రీస్తుయేసును అంగీకరించిన విధముగా ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు . . . ” (కొలొస్సయులకు 2:6–7). పౌలు మాటల క్రమాన్ని గమనించండి; ఇది ఉద్దేశపూర్వకంగా ఉంది: “ఆయనయందు వేరుపారినవారై, యింటివలె కట్టబడుచు . . .”
మన ఆత్మీయ మూలాలు లోతుగా పెరిగే వరకు మనం క్రైస్తవ జీవితంలో ఎదగలేము. మరియు లోతుగా పెరగడం అంటే ప్రాథమిక విషయాలకు తిరిగి రావడం. నా యాభై సంవత్సరాలు పైబడిన పరిచర్యలో ఒక నమూనాను నేను గమనించాను. క్రైస్తవ జీవితంలో విజయం సాధించిన ప్రతి ఒక్కరూ ప్రాథమిక విషయాలలో విజయం సాధిస్తారు. విఫలమైన ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సమయంలో, ప్రాథమిక విషయాలను జారిపోనిచ్చారు. అలా చేయటం చాలా సులభం.
నా జీవితంలో ఎక్కువ కాలం, క్రైస్తవ సత్యాలు నా నోటినుండి సునాయాసముగా వచ్చాయి. నేను దేవుని పుస్తకంలో క్రమం తప్పకుండా గడపడం మొదలుపెట్టే వరకు అవి ఎప్పుడూ వేరుపారలేదు. నేను బైబిల్ గురించి లేదా మంచి క్రైస్తవ విషయాల గురించి ఒక పుస్తకాన్ని చదవడం గురించి ప్రస్తావించడంలేదు. రోజూ మీ కళ్ళను మీ బైబిల్ పేజీలలోకి చూడటం గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు వ్రాయబడిన దేవుని వాక్యాన్ని మీ మార్గదర్శిగా స్వీకరించినప్పుడు, మీరు భిన్నంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇశ్రాయేలులోని పురాతన ప్రదేశాల మాదిరిగా, మీ నడక కూడా పునరుద్ధరించబడింది. మరియు అన్నింటికన్నా ఉత్తమమైనది ఏమిటంటే, మీరు బాగా జీవిస్తారు.
క్రీస్తుతో మన నడకను వెలికి తీయడానికి లేఖనము మనకు ఒక వాగ్దానాన్ని-ప్రేరణను ఇస్తుంది: “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” (యాకోబు 4:8). దయచేసి మళ్ళీ గట్టిగా మెల్లగా దాన్ని చదవండి. మీరు ఉద్దేశపూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నారా? క్రీస్తు జీవితాన్ని నా జీవితంలోకి బదిలీ చేసుకోవడమే క్రైస్తవ జీవితం అని నేను కనుగొన్నాను. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన నా దగ్గరికి వస్తాడు. ఇది అద్బుతం!
మీ బైబిల్ నుండి దుమ్మును దులిపివేయడానికి మరియు క్రీస్తుతో మీ నడకను పాతిపెట్టిన శిథిలాలను తొలగించడానికి యిదే ఆ రోజు. వాక్యంలో సమయం మరియు ప్రార్థనలో సమయం గడపడం వంటి ప్రాథమిక విషయాలను సరికొత్త, సరళమైన నిబద్ధతతో ప్రారంభించండి. మిమ్మల్ని వెనక్కి నెట్టిన వాటిని పక్కన పెట్టండి – ఆ శిధిలాలన్నింటినీ వదిలించుకోండి!
శిథిలాలన్నీ తొలగిపోయిన తర్వాత యేసు నడిచిన చోట మీరు నడుస్తూ ఉండటం మీకు మీరుగా చూస్తారు. వాస్తవానికి, మీరు ఆయనతో అడుగులో అడుగు వేయటం మీకు మీరుగా చూస్తారు.
Copyright © 2013 by Charles R. Swindoll, Inc. All rights reserved worldwide.